పై-లీన్ పంజా | Cyclone Phailin hits Odisha | Sakshi
Sakshi News home page

పై-లీన్ పంజా

Published Sun, Oct 13 2013 1:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

Cyclone Phailin hits Odisha

గోపాల్‌పూర్/శ్రీకాకుళం/విశాఖపట్నం, సాక్షి: ప్రళయ భీకర పెనుగాలులతో.. ఉవ్వెత్తున ఎగసిపడే రాకాసి అలలతో.. ఎడతెగని కుంభవృష్టితో.. పెను తుపాను పై-లీన్ తూర్పు తీరంపై పంజా విసిరింది. నింగినీ నేలనూ ఏకం చేస్తూ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద శనివారం రాత్రి 9:12 గంటలకు ఈ ‘ఇంద్రనీలం’ తుపాను తీరం దాటింది. ఇల్లూ వాకిలీ వదిలి తీరం నుంచి ముందుగానే దూరంగా తరలిపోవటంతో ప్రజల ప్రాణాలు దక్కాయి. కానీ.. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ప్రచండ గాలులు, ఆకాశానికి చిల్లుపడ్డట్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాతో పాటు, ఒరిస్సాలోని గంజాం, పూరి, కేంద్రపడ, ఖుర్దా, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి.
 

మహా వృక్షాలు కూకటి వేళ్లతో కూలిపోతున్నాయి. పూరిళ్లు గడ్డిపరకల్లా ఎగిరిపోతున్నాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి. విద్యుత్ లైన్లు, టెలిఫోన్ లైన్లు తెగిపోయాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. రోడ్డు, రైలు, వాయు, జల మార్గాల్లో రవాణా స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తుపాను ప్రభావిత ప్రాంతమంతటా అంధకారం అలముకుంది. తుపాను తాకటానికి ముందు భారీ గాలులకు ఒడిషాలో చెట్లు కూలి ముగ్గురు వ్యక్తులు మరణించటం మినహా.. అర్థరాత్రి వరకూ ఎలాంటి ప్రాణనష్టం వార్తలు రాలేదు. ఒడిశాలో ఐదు లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మందికి పైగా సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయితే.. తుపాను తీరం దాటినప్పటికీ ఇంకా ఆరేడు గంటల పాటు తీవ్ర తుపానుగానే ఉంటుందని.. పెనుగాలులు, భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తుపాను సృష్టించే బీభత్సం ఎంతగా ఉంటుందన్నది ఆదివారం కానీ అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు రాత్రంతా భయాందోళనలతో గడుపుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు సహాయ దళం, కేంద్ర రిజర్వు పోలీసు దళంతో పాటు.. త్రివిధ సైనిక బలగాలు రంగంలోకి దిగాయి.
 
 తీరం దాటేందుకు గంట సమయం...
 
 ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలోని సముద్ర తీర ప్రజలను నిలువునా వణికించిన పెను తుపాను పై-లీన్ శనివారం రాత్రి 9:12 గంటలకు.. కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్) - పారాదీప్ (ఒడిశా)ల మధ్య గంజాం జిల్లా గోపాల్‌పూర్ వద్ద తీరాన్ని తాకింది. దాదాపు 15 కిలోమీటర్లు విస్తరించివున్న తుపాను నేత్రం (సైక్లోన్ ఐ) తీరం దాటడానికి గంట సమయం పట్టిందని వాతావరణ శాఖ తెలిపింది. కళింగపట్నం నుంచి పారాదీప్‌ల మధ్య ప్రాంతంలో పెను విధ్వంసం జరిగే అవకాశముందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. తుపాను తీరం దాటిన గంజాం జిల్లాతో పాటు.. ఇటువైపు ఉన్న శ్రీకాకుళం జిల్లా, అటువైపు ఒడిశాలోని ఖుర్దా, పూరి, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల్లోనూ దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచే మొదలైన వర్షాలు, ఈదురు గాలులు శనివారం క్రమక్రమంగా పెరుగుతూ తుపాను తీరం దాటే సమయానికి కుంభవృష్టిగా, పెను గాలులుగా మారాయి. తుపాను తీరం దాటేటపుడు, దాటిన తర్వాత గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రంలో మూడు మీటర్ల నుంచి ఐదు మీటర్ల ఎత్తుకు అలలు ఉప్పొంగుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో 300 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకూ సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ జిల్లాలతో పాటు గజపతి, నయాగఢ్, కటక్, భద్రక్, కేంద్రపర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
 
 ఐదు లక్షల మందికి పైగా సహాయ శిబిరాలకు...
 
 ఒడిశాను అతలాకుతలం చేసి దాదాపు పది వేల మంది ప్రాణాలను బలిగొన్న 1999 నాటి పెను తుపాను తర్వాత.. మళ్లీ అంతటి తీవ్రస్థాయిలో ముంచుకొచ్చిన పై-లీన్ తుపానును ఎదుర్కొనేందుకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ముందు నుంచే సహాయ చర్యలు చేపట్టాయి. ఒడిశాలో 4.25 లక్షల మందిని సహాయ శిబిరాలకు తరలించారు. తుపాను నేపథ్యంలో ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి శనివారం విమానాలు, రైలు సర్వీసులను రద్దు చేశారు. హౌరా - విశాఖపట్నంల మధ్య రైళ్ల రాకపోకలన్నిటినీ నిలిపివేశారు. ఒడిశా తీర ప్రాంతంతో పాటు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
 
 రాత్రంతా కొనసాగనున్న తుపాను..
 
 పై-లీన్ పెను తుపాను తీరం దాటేసినా మరో ఆరు గంటల పాటు దాని తీవ్రత కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ప్రస్తుతం 200 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు, అత్యంత భారీ వర్షాలు కొనసాగుతాయని.. శ్రీకాకుళం జిల్లా వాసులు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనరు డాక్టర్ టి.రాధ సూచించారు. తుపాను ప్రభావం ఆదివారం కూడా కొనసాగే అవకాశాలున్నాయని, తీర ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని విశాఖ వాతావరణ విభాగం తెలిపింది. తుపాను తీరం దాటేసినా దానిని అంటిపెట్టుకుని ఉన్న ‘వాల్ ఐ క్లౌడ్’ ప్రభావంతో మరో 24 గంటలు వర్షాలు, గాలులకు అవకాశం ఉంటుందన్నారు.

 

తుపాను తీరం దాటిన ఆరు గంటల తర్వాత మరో ఆరు గంటల పాటు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఆ తర్వాత మరో ఆరు గంటల పాటు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయని వాతావరణ శాఖ వివరించింది. రాబోయే 48 గంటల్లో గంజాం, పూరి, గజపతి, ఖుర్దా, జగత్‌సింగ్‌పూర్, నయాగడ్, కటక్, భద్రక్, కేంద్రపర జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్ని బట్టి కళింగపట్నం, భీమునిపట్నం తీరాల్లో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 8వ నంబరు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం ఉదయం నుంచి పెను తుపాను క్రమంగా బలహీనపడి తొలుత తుపానుగా తర్వాత వాయుగుండంగా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
 
 పై-లీన్ కుండపోత తీవ్రత తగ్గేదిలా..
 

పై-లీన్ తీరాన్ని దాటిన మొదట్లో ఆకాశం చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం కురుస్తోంది. గంటలు గడిచేకొద్దీ పెనుతుపాను బలహీనపడుతుంది. బలహీనపడే కొద్దీ వర్షం తీవ్రత దశలవారీగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వర్షపాతం నాలుగు దశల్లో క్రమంగా తగ్గే అవకాశం ఉందంటున్నారు.
 
 బంగాళాఖాతంలో తీవ్ర తుపానులు
 
 2008 మేలో సంభవించిన నర్గీస్ తుపాను మయన్మార్‌లో బీభత్సం సృష్టించింది. ఏకంగా.. 1,38,000 మందిని బలిగొన్న ఈ తుపాను మిగిల్చిన నష్టం 60 వేల కోట్లకు పైమాటే. భారీ భవనాలు సహా వేల సంఖ్యలో ఇళ్లు నామరూపాల్లేకుండా పోయాయి.
 
 1999 లో ఒడిశాను పెను తుపాను కుదిపేసింది. ఏకంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన ఈ తుపాను.. పదివేల మందిని పొట్టనబెట్టుకొంది. దాదాపు 15 లక్షల ఇళ్లు నేలమట్టమయ్యాయి.
 
 1991 ఏప్రిల్‌లో వచ్చిన భయంకరమైన తుఫానుకు బంగ్లాదేశ్‌లో 1,39,000 మంది మరణించారు. గంటకు 225 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు ఎనిమిది మీటర్ల ఎత్తుతో అలలు ఎగిసిపడ్డాయి.
 
 1977 నవంబర్‌లో భారీ తుపాను దివిసీమను కబళించి, దాదాపు 50,000 మందిని బలిగొంది. దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిలించింది.
 
 1970 నవంబర్‌లో సంభవించిన భారీ తుపాను మిగిల్చిన నష్టం ఊహాతీతం. గంటకు 224 కి.మీ. వేగంతో గాలులు, పది మీటర్ల ఎత్తై అలలతో విరుచుకుపడ్డ ఈ తుపాను 3,00,000 మందిని బలిగొంది.
 
  ఎక్కడివారు అక్కడే..
 
 పై-లీన్ తుపాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఒడిశా తీర ప్రాంతమంతటా వాహనాలు నిలిచిపోయాయి. భారీ సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. కోల్‌కతా నుంచి చెన్నైని కలి పే ఐదో నంబరు జాతీయ రహదారిపై భువనేశ్వర్ నుంచి గోపాల్‌పూర్‌వరకూ రాకపోకలు ఆగాయి. రా ష్ట్రం నుంచి ఒడిశా కు, పశ్చిమబెంగాల్‌కు రవాణా ఆగింది. కిలోమీటర్ల కొద్దీ వా హనాలు నిలిచి పోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement