పాపం బ్రెజిల్‌.. ఎటు చూసినా వరదలే.. | Brazil Devastated Due To Heavy Rains And Floods | Sakshi
Sakshi News home page

పాపం బ్రెజిల్‌.. వరదలకు లక్షల మంది చెల్లాచెదురు

Published Fri, May 10 2024 5:15 PM | Last Updated on Fri, May 10 2024 6:17 PM

Brazil Devastated Due To Heavy Rains And Floods

రియోడిజెనెరియో: బ్రెజిల్‌లో భారీ వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయి. ఈ వర్షాలతో బ్రెజిల్‌ అతలాకుతలం అవుతోంది. దక్షిణ బ్రెజిల్‌లో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో రియో గ్రాండేలో వరదలు పోటెత్తాయి. బ్రెజిల్‌ గత 80 ఏళ్లలో ఎప్పుడూ చూడని వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి ఇప్పటివరకు 100 మందిపైగా చనిపోట్లు అధికారికంగా ప్రకటించారు.

వరదల్లో వందల మంది గల్లంతయ్యారు. లక్షల మంది చెల్లాచెదురయ్యారు. తాగునీరు, కరెంటు లేకుండా పోయాయి. టెలికమ్యూనికేషన్స్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఇంటర్నెట్‌ సర్వీసులు పనిచేయడం లేదు. వీధులు నదుల్లా మారిపోయాయి. రెస్క్యూ సిబ్బంది బోట్లలో వెళ్లి ఇళ్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు ఇళ్లు విడిచి రావడానికి ఇష్టపడటం లేదు.

తమ ఇళ్లలో దోపిడీ జరుగుతుందేమో అన్న భయంతో వారు పునరావాస కేంద్రాలకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా  గ్యూబా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. మొత్తం ఐదు డ్యామ్‌లలో నీటి నిల్వలు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి.

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో  మరిన్ని భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.  

స్పందించిన బిలీయనీర్‌ ఎలాన్‌ మస్క్‌...
బ్రెజిల్‌ రియో గ్రాండేలో పోటెత్తిన భీకర వరదలపై టెస్లా అధినేత, పాపులర్‌ బిలియనీర్‌ ఎలాన్‌మస్క్‌ స్పందించారు. స్టార్‌లింక్‌కు చెందిన 1000 టర్మినల్స్‌ను విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచార వ్యవస్థ కోసం ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. బ్రెజిల్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

ఇంటి మీదకు ఎక్కిన గుర్రం.. వీడియో వైరల్‌ 
రియో గ్రాండేలోని పోర్టో అలెగ్రెలోని కానోస్‌ పట్టణంలో పోటెత్తిన వరదల నుంచి తప్పించుకోవడానికి ఒక గుర్రం ఏకంగా ఇంటిపైకి ఎక్కి నిల్చుంది. ఈ గుర్రాన్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. కారామెలో అని నిక్‌నేమ్‌తో నెటిజన్స్‌ పిలుచుకుంటున్న  గుర్రాన్ని ఫైర్‌ ఫైటర్స్‌ కాపాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కారామెలో వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోంది. 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement