పీసీ ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్‌లో రామగుండం సీఈ అంగీకారం
తక్కువ వ్యవధి, వ్యయంతో నిర్మించవచ్చనే బరాజ్ నిర్మాణంలో సికెంట్ పైల్స్ వాడినట్టు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తయ్యాక కాఫర్ డ్యామ్, షీట్‌పైల్స్‌ను పూర్తిగా తొలగించకపోవడంతో వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి బరాజ్ దెబ్బతిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వ్యాఖ్యానించింది. ఇందుకు నీటిపారుదల శాఖ, నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం కారణం కాదా? అని అధికారులను ప్రశ్నించగా ‘పాక్షికంగా నిజమే’నని కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం సీఈ కె.సుధాకర్‌రెడ్డి అంగీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా శనివారం ఆయన్ను కమిషన్ సుదీర్ఘంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.
ఒప్పందం ప్రకారం బరాజ్ కట్టాక నిర్మాణ సంస్థ కాఫర్ డ్యామ్‌ను ఎందుకు పూర్తిగా తొలగించలేదని నిలదీసింది. ఈ పనుల వ్యయాన్ని తొలి సవరణ అంచనాల్లో రూ. 61.21 కోట్లకు పెంచారని.. ఆ డబ్బును మిగుల్చుకోవాలని ఉద్దేశపూర్వకంగానే ఒప్పందాన్ని ఉల్లంఘించారని తప్పుబట్టింది. 2019లో వచ్చిన వరదలతో దెబ్బతిన్న మేడిగడ్డ బరాజ్‌ను నిర్మాణ సంస్థ నిర్వహించలేదని సుధాకర్‌రెడ్డి బదులిచ్చారు.
2020 వరదల్లో బరాజ్ దిగువన కాంక్రీట్ దిమ్మెలు కొట్టుకుపోగా పునరుద్ధరించాలని నిర్మాణ సంస్థను కోరారా? అని కమిషన్ ప్రశ్నించగా అప్పట్లో తానక్కడ లేనని బదులిచ్చారు. బరాజ్‌ల నిర్మాణం జరిగి అవి వినియోగంలోకి వచ్చినట్లు ధ్రువీకరించుకున్నాకే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లపై కౌంటర్ సంతకం చేశానని సమర్థించుకున్నారు. ఈ సర్టిఫికెట్ల జారీకి విధివిధానాలేవి లేవని ఆయన తెలపగా, కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విధివిధానాలు లేకున్నా రబ్బర్ స్టాంపులాగా సర్టిఫికెట్ల జారీకి మీ అంతరాత్మ ఎలా ఒప్పుకుందంటూ నిలదీసింది. మిమ్మల్ని మీరు ఇరకాటంలో పడేసుకుంటున్నారని మండిపడింది.
సికెంట్ పైల్స్‌పైనే కమిషన్ గురి..
దేశంలో జలాశయాల నిర్మాణంలో సికెంట్ పైల్స్ వినియోగించరని, అలాంటిది మేడిగడ్డ బరాజ్‌కు ఎందుకు వాడారని కమిషన్ ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని, వాటి డిజైన్లను సీఈ సీడీఓ ఇచ్చారని సుధాకర్‌రెడ్డి తెలియజేశారు. బరాజ్ కుంగిపోవడానికి మరో కారణంగా పునాదుల కింద సికెంట్ పైల్స్‌ను నిట్టనిలువుగా, క్రమబద్ధంగా నిర్మించలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ పేర్కొన్న విషయాన్ని కమిషన్ గుర్తుచేయగా ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన బదులిచ్చారు.
సీఈ సీడీఓ డయాఫ్రమ్ వాల్ డిజైన్లు ఇచ్చినా దానికంటే తక్కువ వ్యవధి, వ్యయంతో నిర్మించవచ్చనే సికెంట్ పైల్స్‌కు మొగ్గు చూపినట్టు తెలిపారు. డీవాటరింగ్‌కు అంచనాల కంటే 49.6 శాతం అధిక చెల్లింపులను నిబంధనల ప్రకారమే చేశామని సుధాకర్ రెడ్డి తెలియజేశారు.
టెండర్లు లేకుండానే డీపీఆర్ తయారీనా?
టెండర్లు లేకుండానే నామినేషన్‌పై కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించినట్టు సుదాకర్‌రెడ్డి తెలిపారు. టెండర్లు పిలవొద్దని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా క్షేత్రస్థాయి పరీక్షల రికార్డులను వ్యాప్కోస్‌కు ఇవ్వాలని నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారని సుధాకర్‌రెడ్డి వివరించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు మరో ప్రశ్నకు బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment