ఎనర్జీ డిస్సిపేషన్ ఏర్పాట్లు లేకనే నష్టం.. మోడల్ స్టడీలో నిర్ధారణ
పరిష్కారంగా దిగువన టెయిల్‌పాండ్ నిర్మాణం
ఐఐటీ రూర్కీతో డ్రాయింగ్స్, డిజైన్ల రూపకల్పన
పనులకు ఎన్డీఎస్‌ఏ అనుమతి ఇప్పించాలని కోరిన రామగుండం సీఈ
సాక్షి, హైదరాబాద్: పీడన శక్తి విడుదల(ఎనర్జీ డిస్సిపేషన్)కు సరైన ఏర్పాట్లు లేకపోవడంతోనే మేడిగడ్డ బరాజ్ కుంగిందని నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’జరిపించిన ఓ మోడల్ స్టడీలో తేలింది. దీంతో తాత్కాలిక రక్షణ చర్యల్లో భాగంగా ఆ మేరకు ఏర్పాట్లు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్‌ఏ) నుంచి అనుమతులను ఇప్పించాలని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రామగుండం చీఫ్ ఇంజనీర్ కె.సుధాకర్‌రెడ్డి తాజాగా నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్)కు లేఖ రాశారు. మళ్లీ వర్షాకాలం రాకకు ముందు మిగిలి ఉండే సమయంలో ఈ పనులు చేయాల్సి ఉందని తెలియజేశారు.
జలాశయాల గేట్లు ఎత్తినప్పుడు విడుదలయ్యే వరద దిగువన తాకే సమయంలో నేల కోతకు గురై గుంతలు ఏర్పడతాయి. ఎందుకంటే గేట్ల నుంచి నీళ్లతో నిండే ఉండే జలాశయాల నుంచి విడుదలయ్యే వరదలో తీవ్రమైన పీడన శక్తి ఉంటుంది. వరద నేలను తాకే చోట తగిన పరిమాణంలో నీటి నిల్వలతో టెయిల్ ఉండేలా ఏర్పాట్లు చేయాలి. దీంతో టెయిల్‌పాండ్ నిల్వలో గేట్ల నుంచి వరద వచ్చి పడినా పీడన శక్తి నిర్వీర్యమై దిగువ ప్రాంతంలో ఎలాంటి నష్టాన్ని కలిగించదు.
మేడిగడ్డ బరాజ్ దిగువన తగిన నీటినిల్వలతో టెయిల్‌పాండ్ నిర్మించకపోవడంతోనే అక్కడ నేల కోతకు గురై భారీ గుంతలు ఏర్పడ్డాయని, క్రమానుగుణంగా గుంతలు పెద్దగా మారి బరాజ్ పునాదుల కింద ఇసుక జారిపోవ డానికి కారణమైందని ఎల్‌అండ్‌టీ నిర్వహించిన మోడల్ స్టడీస్‌లో తేలింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బరాజ్ దిగువన ఎనర్జీ డిస్సిపేషన్ కోసం టెయిల్‌పాండ్ సామర్థ్యం పెంపు చర్యలను తీసుకోవాలని భావిస్తున్నారు.
ఐఐటీ రూర్కీకి డిజైన్ల తయారీ అప్పగింత
టెయిల్‌పాండ్ పనులకు సంబంధించిన మోడ ల్ స్టడీస్‌ను ఐఐటీ రూర్కీతో నీటిపారుదల శాఖ చేయించింది. ఈ పనులకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సైతం అదే సంస్థ ఇవ్వనుంది. నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈతో ఈ డిజైన్లకు ఆమోదం తీసుకొని పనులు ప్రారంభించేందుకు ఎన్డీఎస్‌ఏ నుంచి అనుమతి పొందాలని రామగుండం చీఫ్ ఇంజనీర్ ఈఎన్‌సీకి విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డ బరాజ్‌కు శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక సమర్పించే వరకు వేచిచూడకుండా ఈ మేరకు పనులు చేసేందుకు ఆయన అనుమతి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment