
తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు
టాస్క్ కార్యాలయంలో 90 రోజులు పాఠాలు
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా ఇంజనీరింగ్ రంగం(Data engineering sector)లో రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ(government training) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ శిక్షణ కార్యక్రమం వివరాలతో ఐటీ, పరిశ్రమల శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నేటి డిజిటల్ యుగంలో డేటా ఇంజనీరింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. డేటాను విశ్లేషించేందుకు, నిర్వహించేందుకు నైపుణ్యమున్న మానవ వనరుల కోసం పరిశ్రమలు అన్వేషిస్తున్నాయి. ఈ రంగంలోని ఉపాధి అవకాశాలను తెలంగాణ యువత అందిపుచ్చుకునేలా వారిని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), శ్రీసత్యసాయి సేవాసంస్థ సంయుక్తాధ్వర్యంలో డేటా ఇంజనీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పేరిట ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నాం. ప్రోగ్రామింగ్ అండ్ డేటా అనాలసిస్, డేటా ఇంజనీరింగ్ టూల్స్, క్లౌడ్ టెక్నాలజీస్, డేటా విజువలైజేషన్, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై పట్టభద్రులకు 90 రోజులు శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులో 25 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవమున్న అధ్యాపకుల పర్యవేక్షణలో 120 గంటలు క్లాస్‌రూం కోచింగ్, 360 గంటల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది.
ప్రత్యేకంగా కెరీర్ కౌన్సెలింగ్ ఇస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. 2021–2024 మధ్య బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణులైన పట్టభద్రులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని టాస్క్ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షకు మార్చి ఒకటోలోగా దరఖాస్తు చేసుకోవాలి’ అని ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇతర వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం https:// task. telangana. gov. in/ ను సందర్శించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment