
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు భద్రాచలం రాములవారి కల్యాణానికి రావాలని ఆహ్వానిస్తూ కల్యాణ పత్రికను సీఎంకు అందజేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రం సంక్షేమం దిశగా దూసుకెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌కు గుర్తింపు ఉండాలి. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ ఇందులో భాగమే. శాంతి భద్రతలు అదుపులోకి ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. నేను, భట్టి విక్రమార్క జోడెద్దుల్లా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నాం. దేశ ప్రజలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలి. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలి. ఫ్యూచర్ సిటీని నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ రూపకల్పన జరుగుతుంది. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం’ అని తెలిపారు.
భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితం. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చాం. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నింటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించాం. దేశంలోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ను తీసుకొచ్చి పేదలకు ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు పేదలకు సన్నబియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నాం.

దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు భాగంలో నిలిచింది. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నాం. ఆదాయం పెంచాలి.. పేదలకు పెంచాలన్నది మా ప్రభుత్వ విధానం. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు.. ఇది అభివృద్ధి చేసే సందర్భం. మా ఆలోచనలో, సంకల్పంలో స్పష్టత ఉంది. తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతాం’ అని చెప్పుకొచ్చారు.

అంతకుముందు.. ఉగాది వేడుకల్లో భాగంగా రవీంద్రభారతిలో పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఈ ఏడాది పరుగులు పెడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఏడాది ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారు. తెలంగాణలో వర్షాలకు ఇబ్బంది లేదు. శాంతి భద్రతల విషయంలో నిరంతరం పోలీసులు పనిచేస్తారు’ అని చెప్పుకొచ్చారు.