
ఉగాది పండగ పూట, పేదల ఆకలి తీర్చాలని ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాతి అని మరోసారి రుజువు చేసుకుంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నుండి ప్రజా పంపిణీ విధానంలో ఇకనుండి పేద ప్రజలందరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందించే చరిత్రాత్మక పథకానికి స్వీకారం చుట్టింది ప్రభుత్వం. తెలంగాణ మొత్తం జనాభాలో 3.10 కోట్ల (84%) మంది ప్రజలకు, శ్రీమంతులు తినే సన్నబియ్యాన్ని ఉచితంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలనే సంక ల్పానికి యావత్ తెలంగాణ హర్షం వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు పేదలకు రూ. 1.90 లకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభిస్తే, తెలంగాణ ఏర్పాటైన 11 ఏళ్లకు రేవంత్ రెడ్డి సీఎంగా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు సన్నబియ్యం అందించే బృహత్తర కార్యక్రమం అమలు చేస్తోంది. గతంలో దొడ్డు – నాసిరకం బియ్యం పంపిణీ చేయడంతో పేదవాడి ఆకలి తీర్చాలనే ప్రజాపంపిణీ వ్యవస్థ లక్ష్యం నీరుగారింది. నెలకురూ. 10,600 కోట్లు ఈ బియ్యం పంపిణీపై ఖర్చు చేసినా ఫలితం పేదలకు అందలేదు. రైసు మిల్లర్లకు, దళారులకు, అవినీతి పరులకు మంచి ఆదాయ వనరుగా రేషన్ బియ్యం మారి పోయాయి. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, తిరిగి ప్రభుత్వానికి లాభకరమైన ధరకు అమ్మి మిల్లర్లు గత ప్రభుత్వ కాలంలో దోపిడీకి పాల్పడి నట్లు ఆధారాలు బయటపడ్డాయి.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కేసీఆర్ 10ఏళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సంకల్పించింది. వెంటనే అందుకు సంబంధించిన కార్యా చరణ మొదలుపెట్టింది. రాష్ట్రంలో సన్న వడ్ల సాగును ప్రోత్సహించి, సన్న వాటిని సాగు
చేసిన రైతులకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్‌గా అందించింది. తద్వారా, సన్న బియ్యాన్ని సమీకరించి తెలుగువారి నూతన సంవత్సరం (ఉగాది పండుగ) పర్వదినాన అశేష ప్రజానీకం సాక్షిగా తెలంగాణ ప్రజలందరికీ సన్న బియ్యం అందించే బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టినం. ఇప్పుడున్న 90.42 లక్షల రేషన్ కార్డులకు అదనంగా పది లక్షల రేషన్ కార్డులు కొత్తగా జారీ చేస్తూ లబ్ధిదారులందరికీ సన్న బియ్యం అందేలా పక్కా ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ మంచి పని చేస్తే మమ్మల్ని అభినందించాల్సింది పోయి, బీజేపీ కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయం మొదలుపెట్టింది. పండుగ రోజు కూడా పచ్చి అబద్ధాలతో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి ఒకరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించారు. రేషన్ షాపులలో మోదీ ఫోటో పెట్టాలని ఆయన వితండవాదం చేస్తున్నారు. బీజేపీ భాగస్వామిగా ఉన్న పక్క రాష్ట్రంలోనూ కేవలం ముఖ్యమంత్రి ఫొటో మాత్రమే ఉంది కాని ప్రధాని మోదీది లేదనే విషయం తెలియనిది కాదు. మరి తెలంగాణలో మోదీ ఫోటో ఎందుకు పెట్టాలో వారే చెప్పాలి. కాంగ్రెస్ తన పథకాల ద్వారా ప్రజలకు మరింత చేరువ అయితే తమ పార్టీని ప్రజలు దూరంగా పెడతారని బీజేపీవారు భావించడం వల్లనే ఇటువంటి అర్థం పర్థం లేని డిమాండ్లతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
చదవండి: మనిషిని మార్చే సాన్నిధ్యం
ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణలో ఉన్న ప్రతి పేద ఇంటికీ నెల నెలా సన్నబియ్యం అందించే యజ్ఞానికి సబ్బండ వర్గాలు సహక రిస్తాయి. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలను ప్రజలే తిప్పికొడతారు. సమాజంలోని మేధా వులు, కవులు, కళాకారులు ప్రజా సంక్షేమం కొరకు చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తూ అండగా నిలబడాలని కోరుతున్నాం.
-డా. కొనగాల మహేష్
(కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి)