కాళేశ్వరం లిఫ్టులపైనా విచారణ! | Investigation on Kaleshwaram lifts | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం లిఫ్టులపైనా విచారణ!

Published Sun, Jul 7 2024 4:35 AM | Last Updated on Sun, Jul 7 2024 4:36 AM

Investigation on Kaleshwaram lifts

బరాజ్‌లపై విచారణకు మాత్రమే జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

అనుబంధ అంశంగా పంప్‌హౌస్‌లపై విచారణ చేపట్టిన కమిషన్‌!

8న విచారణకు హాజరుకావాలని పంప్‌హౌస్‌ల ఇంజనీర్లకు ఆదేశం

ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్‌ తుది నివేదికలు సత్వరం సమర్పించాలని కోరిన కమిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కన్నెపల్లి (మేడిగడ్డ), సిరిపురం(అన్నారం), గోలివాడ (సుందిళ్ల) పంప్‌ హౌస్‌ల నిర్మాణంపై సైతం జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజ్‌ల నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలు, లోపాలపై విచారణ నిర్వహించే బాధ్యతలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌కు అప్పగించగా, విచారణలో అనుబంధ అంశాలుగా పంప్‌హౌస్‌లను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. 

కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లతో పాటు పంప్‌ హౌస్‌లపై సైతం విచారణ జరిపించాలని పలువురు కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌–1 ప్యాకేజీలో భాగంగా ఈ పంప్‌హౌస్‌ల నిర్మాణం జరిగింది. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) నుంచి చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) స్థాయి వరకు.. పంప్‌హౌస్‌ల నిర్మాణంలో భాగస్వాములైన అధికారులందరూ సోమవారం విచారణకు హాజరు కావాలని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ తాజాగా ఆదేశించడం చర్చనీయాంశమైంది. 

పంప్‌హౌస్‌ల నిర్మాణానికి జారీ చేసిన పరిపాలన అనుమతులు, సాంకేతిక పరిశీలనలు, ఏ మేరకు నీటిని పంపింగ్‌ చేయడానికి వీటికి అనుమతినిచ్చారు? చేసిన పంపింగ్‌ ఎంత? వీటి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎన్నిసార్లు అంచనాలు సవరించారు? గత ఐదేళ్లుగా పంప్‌ హౌస్‌ల పరిస్థితి ఏంటి? అనే అంశాలపై కమిషన్‌ ఆరా తీయనున్నట్టు సమాచారం. మూడేళ్ల కింద గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లు నీట మునగడంతో భారీ నష్టం వాటిల్లింది. ఇదిలా ఉండగా, శనివారం జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ తన కార్యాలయంలో కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీతో సమావేశమై చర్చలు జరిపారు. సత్వరంగా నివేదిక సమర్పించాలని వారిని కోరారు. 

ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక సమర్పించాలి
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ తుది నివేదికను సత్వరం సమర్పించేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ చంద్రఘోష్‌ ఆదేశించారు. ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌తో ఆయన శనివారం ఫోన్‌లో మాట్లాడారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లపై విచారణ ప్రక్రియలో ఈ నివేదిక కీలకమని స్పష్టం చేశారు. తుది నివేదిక కోసం కమిషన్‌ తరఫున ఎన్డీఎస్‌ఏకు లేఖ రాయాలని నీటిపారుదల శాఖ అధికారులను సైతంఆయన ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ నిర్వహిస్తున్న విచారణకు సంబంధించిన తుది నివేదికను కూడా సత్వరం తెప్పించుకోవాలని ఆయన సూచించారు.
 
త్వరలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌
జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ త్వరలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇప్పటికే విచారణకు హాజరైన అధికారులందరినీ అఫిడవిట్‌ రూపంలో తమ వద్ద ఉన్న సమాచారాన్ని, వాదనలను సమర్పించాలని కమిషన్‌ ఆదేశించింది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన అనంతరం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులకు సైతం నోటీసులు జారీ చేసి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియకు హాజరు కావాలని ఆదేశించే అవకాశముంది.

ఇదిలా ఉండగా కమిషన్‌ను తప్పుదోవపట్టించే క్రమంలో కొందరు అధికారులు పరస్పర విరుద్ధమైన సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో సమర్పించినట్టు తెలిసింది. దీంతో వీరిని సైతం మళ్లీ క్రాస్‌ఎగ్జామినేషన్‌కు కమిషన్‌ పిలవనుంది. ఇక బరాజ్‌లు దెబ్బతినడానికి కారణాలేంటో తెలుసుకోవాలని కమిషన్‌ ఓ అధికారిని పుణెలోని సెంట్రల్‌ పవర్‌ అండ్‌ వాటర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌)కు పంపించింది. 

విచారణ ముగింపులో బహిరంగ విచారణను సైతం కమిషన్‌ నిర్వహించనుందని సమాచారం. తొలుత అఫిడవిట్ల పరిశీలన, ఆ తర్వాత నోటీసుల జారీ, క్రాస్‌ ఎగ్జామినేషన్‌ అనంతరం బహిరంగ విచారణ ఉంటుందని కమిషన్‌ వర్గాలు తెలిపాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement