
విడుదల కాని రూ.650 కోట్ల బకాయిలు
శనివారంతో ఆర్థిక సంవత్సరం చివరి పనిదినం పూర్తి... ఇక ఆ నిధులు మురిగిపోయినట్లేనన్న అనుమానాలు
సాక్షి, హైదరాబాద్: మహిళల ఉచిత ప్రయాణాలకు సంబంధించి ఆర్టీసీకి రీయింబర్స్ చేయాల్సిన మొత్తంలో దాదాపు రూ.650 కోట్లను తెలంగాణ ప్రభుత్వం బకాయిపెట్టింది. ఆర్థిక సంవత్సరం ముగియటానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆది, సోమ, మంగళవారాలు వరుస సెలవులు. శనివారం పనివేళలు ముగిసే సమయానికి ఆ మొత్తం విడుదల కాలేదని తెలిసింది. దీంతో ఇక అవి మురిగిపోతాయన్న ఆందోళన ఆర్టీసీలో వ్యక్తమవుతోంది. ఆర్టీసీకి గతేడాది బడ్జెట్‌లో రూ.4,084 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో దాదాపు రూ.800 కోట్లు బకాయి ఉండగా, వారం క్రితం రూ.156 కోట్లు విడుదలయ్యాయి. మిగతావి అలాగే పేరుకుపోయి ఉన్నాయి.
గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులు మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) వరకు మాత్రమే సరిపోతాయి. ఇతరత్రా అభివృద్ధి పనులకు, రాయితీ బస్‌పాసుల సర్దుబాటుకు సరిపోవు. ఇప్పుడు బడ్జెట్ నిధులు కూడా పూర్తిగా విడుదల కాని పక్షంలో, మహాలక్ష్మి భారాన్ని కూడా ఆర్టీసీ (TGSRTC) మోయాల్సి వస్తుంది. బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగినందున.. మహాలక్ష్మి కేటాయింపులను రూ.5,500 కోట్లకు పెంచాలని బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్టీసీ కోరింది. కానీ, సర్కారు రూ.4,400 కోట్లే కేటాయించింది.
గతంలోనూ అంతే..
2023 బడ్జెట్‌కు సంబంధించి కూడా గతేడాది చివరలో కొన్ని నిధులు విడుదల కాలేదు. నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1,500 కోట్లు బడ్జెట్‌లో చూపగా, చివరికి రూ.500 కోట్ల వరకు చేతికి అందకుండా పోయాయి. మరోసారి అదే దుస్థితి ఎదురుకావటం ఆర్టీసీకి ఇబ్బందిగా మారబోతోంది. శనివారం ఆలస్యంగానైనా నిధులు విడుదలై, తదుపరి పనిదినం రోజు ఖాతాలోకి చేరే అవకాశం కూడా ఉందన్న ఆశతో ఆర్టీసీ ఉంది.
చదవండి: టెన్త్.. జవాబు పత్రాలు చిందర వందర