telangana rtc
-
తెలంగాణ బస్సు పేరు మారింది..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బస్సు పేరు మారింది.. ఇక మీదట TSRTC కాదు.. TGSRTCగా యాజమాన్యం పేరు మార్చింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు పేరు మార్పు చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో పలు కీలక మార్పులు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్(TS)ను తెలంగాణ(TG) మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే టీఎస్ఆర్టీసీ ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీగా లోగో మార్పులు చేసి కొత్త లోగోను ప్రకటిస్తామని ఆర్టీసీ సంస్థ అధికారులు స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు టీఎస్ ఆర్టీసీ పేరును టీజీఎస్ ఆర్టీసీగా మార్చడం జరిగిందని.. సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాల పేర్లను తెలియజేశారు. ఇకపై @tgsrtcmdoffice, @tgsrtchq గా సంస్థ మార్చిందన్నారు. ప్రయాణీకులు, ప్రజలు తమ విలువైన సలహాలు, సూచనలతో పాటు ఏవైనా ఫిర్యాదులు ఉంటే మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి సమాచారం తీసుకురావాలని విజ్ఙప్తి చేశారు. తెలంగాణ ఆర్టీసీ అందిస్తోన్న సేవల గురించి తెలుసుకునేందుకు @tgsrtcmdoffice, @tgsrtchq అనే ఎక్స్ ఖాతాలను ఫాలో అవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ముఖ్య గమనిక: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చడం జరిగింది. ఆ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాలైన @tgsrtcmdoffice, @tgsrtchq లను సంస్థ మార్చింది. మీ విలువైన సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని… pic.twitter.com/vwwnklHttw— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) May 22, 2024 -
తెలంగాణ ఆర్టీసీ ఇక ప్రభుత్వంలో విలీనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఐదుగంటలకు పైగా జరిగిన సమావేశం అనంతరం.. కేబినెట్ భేటీ సారాంశాన్ని మీడియాకు వివరించారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఇక నుంచి 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని, ఈ మేరకు కేబినెట్ భేటీలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విలీనం, విధివిధానాలు నిర్ణయించేందుకు ఒక కమిటీని(సబ్ కమిటీ) ఏర్పాటు చేయనున్నట్లు, త్వరలోనే అసెంబ్లీలో బిల్లు తేనున్నట్లు తెలిపారాయన. ► హైదరాబాద్‌లో మెట్రో రైలును విస్తరిస్తాం. రూ. 60వేల కోట్లతో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. Lb నగర్ పెద్ద అంబర్ పేట వరకు, ఉప్పల్ నుంచి బీ బీ నగర్ వరకు, ఉప్పల్ నుంచి ECIL దాకామెట్రో నిర్మాణం చేపడుతున్నాం. మూడు-నాలుగేళ్లలో మెట్రో విస్తరణ పూర్తవుతుంది. ప్యాట్నీ నుంచి కండ్లకోయ ORR వరకు, అలాగే.. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ మెట్రో రహదారి.. ఆపైనే మెట్రో నిర్మాణం ఏర్పాటు చేస్తాం. ► పది జిల్లాల్లో వరద నష్టం తీవ్రంగా ఉంది. వరదలు వచ్చినప్పుడు కేంద్రం ఏనాడూ ఆదుకోలేదు. నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వమే ఆదుకుంటోంది. ► ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేసేలా గవర్నర్ వ్యవస్థ ఉంది. చట్టపరంగా ఆమోదించిన బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారు. తిరిగి పంపిన మూడు బిల్లులను అసెంబ్లీలో మరోసారి పాస్ చేస్తం. రెండోసారి పాస్ చేశాక.. గవర్నర్ ఆమోదించాల్సిందే. ► గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను కేబినెట్ ఎంపిక చేసింది. ఎస్టీ కేటగిరి కుర్రా సత్యనారాయణ, బీసీ కేటగిరీలో దాసోజు శ్రవణ్‌ను ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తున్నాం. ఎమ్మెల్సీల ఎంపికలో గవర్నర్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదని అనుకుంటున్నాం. ► నిమ్స్‌లో కొత్తగా 2వేల పడకల ఏర్పాటుకు నిర్ణయం. ► వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు 253 ఎకరాలు కేటాయింపు. ► బీడీ టేకేదార్లకు పెన్షన్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ► తెలంగాణలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పాటు ► సౌత్ ఇండియా కాపు సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం. ► అనాథ పిల్లల కోసం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం ► హకింపేట్ ఎయిర్‌పోర్ట్‌ను పూణే తరహాలో పౌరవిమానయాన సేవలకు వినియోగించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదన పంపుతున్నాం. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే కేంద్రం లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అందులో బీఆర్ఎస్ కీలకంగా వ్యవహరిస్తుంది. -
తెలంగాణ ఆర్టీసీ స్లీపర్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తోంది. లహరి పేరుతో రోడ్డెక్కుతున్న ఈ బస్సుల్లో తొలుత 10 సర్వీసులను సోమవారం ఉదయం ప్రారంభిస్తోంది. మరో ఆరు బస్సులను రెండు మూడు రోజుల్లో నడపనున్నారు. ఇప్పటికే అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న సర్వీసులతో పాటు సొంతంగా కొన్న బస్సులను ప్రారంభిస్తోంది. టెండర్ ద్వారా అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఈ బస్సులను కొన్నారు. ఈ స్లీపర్ బస్సులను తొలుత హైదరాబాద్ నుంచి ఐదు నగరాలకు తిప్పనున్నారు. మియాపూర్, ఎంజీబీఎస్ల నుంచి బెంగళూరుకు, హుబ్లీకి, బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్ల నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు నడుపుతారు. గరుడ ప్లస్ కంటే ఈ బస్సుల్లో టికెట్ ధర 30 శాతం వరకు ఎక్కువగా ఉండనుంది. రైలు మూడో ఏసీ శ్రేణి టికెట్ ధరకు ఇంచుమించు సమంగా వీటి టికెట్ ధరలను ఖరారు చేశారు. లహరి స్లీపర్ బస్సుల్లో 30 బెర్తులు ఉంటాయి. మంచినీటి సీసా హోల్డర్, మొబైల్ చార్జింగ్ సాకెట్‌తోపాటు ఉచిత వైఫై వసతి ఉంటుంది. ఈ బస్సుల్లో మూడు సీసీ కెమెరాలు, పానిక్ బటన్, రేర్ వ్యూ కెమెరా, ఎల్ఈడీ సూచిక బోర్డులుంటాయి. ప్రారంభోత్సవ ఆఫర్.. ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత కొన్ని రోజుల పాటు టికెట్ ధరల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్ ధరలను తగ్గించనున్నారు. డైనమిక్ ఫేర్ విధానం ప్రారంభం.. డైనమిక్ టికెట్ ఫేర్ విధానాన్ని కూడా సోమవారం నుంచే ఆర్టీసీ ప్రారంభిస్తోంది. తొలిసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తరహాలో డిమాండ్ ఆధారంగా టికెట్ ధరలను సవరిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో టికెట్ ధర ఎక్కువగా, డిమాండ్ లేని సమయాల్లో తక్కువగా ఉంటుంది. గరిష్టంగా 25 శాతానికి మించకుండా పెంచుతారు, కనిష్టంగా 20 శాతానికి తగ్గకుండా ధరలు తగ్గిస్తారు. తనంతట తానుగా పరిస్థితి ఆధారంగా సిస్టమే ధరలను మార్చుకునే సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. ఇందుకు ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ డెవలపింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత ఆ విధానం సిద్ధం కావటంతో సోమవారం నుంచి దాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో టికెట్ ధరలు ఇక గంటగంటకు మారనున్నాయి. లహరి స్లీపర్ సర్వీసుల్లో కూడా ఇదే విధానం అమలుకానుంది. -
తెలంగాణ ఆర్టీసీ కొత్త ప్రయత్నం.. ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు
-
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్
-
‘డైనమిక్’గా టీఎస్ఆర్టీసీ.. డీజిల్ ధర తగ్గితే బస్సు చార్జీలు తగ్గిస్తారా?
సాక్షి, హైదరాబాద్: డైనమిక్ ఫేర్ విధానం.. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు చార్జీలు పెంచుకోవడం ఎయిర్‌లైన్స్ సంస్థల్లో చూస్తుంటాం. పండుగల సమయాల్లో చార్జీలు రెట్టింపు చేసి వసూలు చేయటం ప్రైవేటు బస్సు ఆపరేటర్లకూ కొట్టినపిండే. ఇప్పుడు డీజిల్ ధరల విషయంలో ఆ తరహా విధానాన్ని అనుసరించే దిశలో టీఎస్ఆర్టీసీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే డీజిల్ సెస్ కొత్త చార్జీల పెంపు విధానాన్ని ఆర్టీసీ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. టికెట్‌పై బస్సు కేటగిరీ వారీగా రూ.5, రూ.10 చొప్పున సెస్ విధించింది. ఇప్పుడు ఇందు లో ‘డైనమిక్’ విధానాన్ని తేవాలని భావిస్తోంది. డీజిల్ ధర భారీగా పెరిగినప్పుడల్లా ఈ సెస్‌నూ తదనుగుణంగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో డీజిల్ ధర స్థిరంగా ఉంది. కొద్దిరోజుల క్రితం వారంలో మూడునాలుగు పర్యాయాలు పెరిగింది. మళ్లీ ఆ పరిస్థితి వస్తే డీజిల్ సెస్‌ను సవరించే లా ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. చదవండి👉 ఆల్‌నైన్ నెంబర్ @ రూ.4.49 లక్షలు సెస్‌ను ఎంత పెంచాలన్న విషయంలో నిర్ణ యం కూడా తీసుకునట్లు తెలుస్తోంది. నిజానికి ఆర్టీసీ కొనే బల్క్ డీజిల్ ధర రూ.119కి చేరింది. కొద్ది రోజుల్లోనే రిటైల్ ధర దానికి చేరువవుతుందన్న హెచ్చరికలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా డైనమిక్ ఫేర్ విధానంలో డిమాండ్ లేనప్పుడు టికె ట్ధర తగ్గించడం కూడా భాగమే. మరి డీజిల్ ధర లు తగ్గితే సెస్‌ను ఆర్టీసీ తగ్గిస్తుందేమో చూడాలి. చదవండి👉🏼 గుడ్‌న్యూస్.. సిటీబస్సు @ 24/7 -
TSRTC: కథ ముగిసిపోయిందన్నారు.. కానీ పడిలేచిన కెరటంలా..
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా నాలుగు నెలల క్రితం.. ఆర్టీసీ ఉద్యోగులకు 23 రోజులు ఆలస్యంగా జీతాలు అందాయి. ఆర్టీసీ చరిత్రలో ఇంత ఆలస్యంగా జీతాలు చెల్లించటం అదే తొలిసారి. ఇది ఆర్టీసీ పతనావస్థలో ఉందని చెప్పే ఉదంతం. అప్పటి వరకు ప్రభుత్వం ప్రతినెలా నిధులు కేటాయిస్తే తప్ప జీతాలు చెల్లించలేని దుస్థితి. కానీ ఇప్పుడు ఠంఛన్‌గా ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నారు. గతంలో మాదిరి ప్రతినెలా జీతాలపై ప్రభుత్వంపై ఆధారపడటం లేదు. ఇప్పుడు రోజువారీ టికెట్ ఆదాయం రూ.13 కోట్లకు చేరింది. ఇది రెండున్నర ఏళ్ల తర్వాత నమోదవుతున్న గరిష్ట మొత్తం. దశాబ్దాలపాటు ప్రజలకు సేవలందించి.. ‘ఎర్రబస్సు’గా ఆప్యాయతను చూరగొన్న ఆర్టీసీ కథ దాదాపు ముగిసిపోయిందని, దాన్ని నడిపే పరిస్థితి లేక ప్రభుత్వం మూసేయబోతోందన్న వ్యాఖ్యలు సైతం వినిపించాయి. అలాంటి స్థితి నుంచి ఆర్టీసీ పడిలేచిన కెరటం మాదిరి శక్తిని కూడగట్టుకుంటోంది. ప్రగతి రథ చక్రాలు మళ్లీ సొంత శక్తితో పరుగు మొదలుపెట్టాయి. ఈ సంవత్సరం ముగింపులో ప్రజారవాణా సంస్థకు ప్రాణం పోస్తూ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. చదవండి: ఈ ఏడాది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ ఏంటో తెలుసా? బకాయిలు.. నష్టాలు.. రూ.మూడు వేల కోట్ల అప్పులు.. రూ.రెండు వేల కోట్ల నష్టాలు.. చమురు సంస్థలకు బకాయిలు.. గత వేతన సవరణ తాలూకు బకాయిలు.. ఇలాంటి తరుణంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్‌ను ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా నియమించింది. ఆర్టీసీ తిరిగి పుంజుకునేందుకు ఈ నియామకం దోహదపడుతుందన్న అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ► తొలుత సిబ్బందికి ఒకటో తేదీనే జీతాలు ఇస్తామన్న నిర్ణయాన్ని వెల్లడించి దానికి కట్టుబడటం ద్వారా వారిలో సంస్థ పట్ల విశ్వాశాన్ని పాదుగొల్పే ప్రయత్నం చేశారు. ► ఈ ఉద్యోగం చేయలేం వీఆర్ఎస్ ఇవ్వండి అంటూ కొంతకాలంగా వేడుకుంటూ వస్తున్న సిబ్బందిలో ఇప్పుడు ఆ ఆవేదన కొంతమేర తగ్గింది. సంక్షోభానికి ముందులాగా ఉత్సాహంగానే డ్యూటీలకు వస్తున్నారు. పాత బకాయిల విషయంలో మాత్రం ఆగ్రహం అలాగే ఉంది. చదవండి: TS: పబ్స్, హోటళ్లు, క్లబ్‌లు న్యూఇయర్ గైడ్ లైన్స్ పాటించాలి ► ఒకప్పుడు ఆసియాలోనే మంచి సహకార సంఘాల్లో ఒకటిగా వెలుగొందిన ఆర్టీసీ సహకార పరపతి సంఘం నాలుగేళ్లుగా చిక్కుల్లో పడింది. దాదాపు రెండేళ్లుగా సరిగా రుణాలు రావటం లేదు. ఏడాది కాలంగా పూర్తిగా కుంటుపడింది. 10 వేలకుపైగా దరఖాస్తులు పేరుకుపోయి ఉన్న తరుణంలో ఇప్పుడిప్పుడు మళ్లీ రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ► ప్రస్తుతం బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 66 శాతానికి చేరుకుంది. ఇది రెండేళ్లలో గరిష్టం. ఇక రోజుకు 35 లక్షల కి.మీ. గరిష్ట స్థాయిలో బస్సులు తిరుగుతున్నాయి. గతంతో పోలిస్తే వేయి బస్సులు తగ్గినా దాన్ని అందుకోవడం విశేషం. ► కొత్త బస్సులు కొనే ప్రసక్తే లేదని కొంతకాలం క్రితం తేల్చి చెప్పిన ఆర్టీసీ.. ఇప్పుడు తీరు మార్చుకుంటోంది. కొత్త బస్సుల అవసరాన్ని గుర్తించి కొనేందుకు సిద్ధమైంది. ► ఆదాయం కోసం బస్సులపై అడ్డదిడ్డంగా ప్రకటనలు వేయించుకుని అందవిహీనంగా మారిన బస్సులు ఇప్పుడు మళ్లీ ఆర్టీసీ బస్సుల్లాగా మారాయి. ఆదాయం కూడా వదులుకుని ప్రకటనలను నిషేధించి బస్సులకు కొత్తగా రంగులద్దడం విశేషం. ► మందులకు, సాధారణ వైద్యానికి కూడా కొరగాకుండా పోయిన హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీస్థాయికి చేరుకుంటోంది. ఇప్పుడు అక్కడ డయాలసిస్‌తోపాటు చాలా రకాల వైద్యం అందుతోంది. -
ఆర్టీసీకా.. రుణమివ్వలేం!
సాక్షి, హైదరాబాద్: మొండి బకాయిల జాబితాలోకి చేరటంతో ఆర్టీసీ ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఆదాయం బాగా క్షీణించిపోవటం, నష్టాలు తీవ్రం కావటం, ఇతరత్రా ఆదాయం నామమాత్రమే కావటంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి చూసి బ్యాంకులు వెనకాడుతున్నాయి. దీంతో ఆ సంస్థకు రుణం ఇచ్చేందుకు జంకుతున్నాయి. ఫలితంగా నిధులు లేక ఆర్టీసీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఏ విధమైన చెల్లింపులు జరపలేక అంతా గందరగోళంగా మారింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామం దీనికి అద్దం పడుతోంది. అసలే ఆర్థిక ఇబ్బందులు, నష్టాలతో సతమతమవుతున్న తరుణంలో కోవిడ్ మహమ్మారి ఆర్టీసీని పూర్తిగా కుంగదీసింది. జీతాల చెల్లింపు, డీజిల్ బిల్లులు, మృతిచెందిన ఉద్యోగులకు బెనిఫిట్స్, ఆర్టీసీ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు, సహకార పరపతి సంఘం బకాయిలు, పీఎఫ్ బకాయిలు, అద్దె బస్సుల యజమానుల బిల్లుల చెల్లింపు.. ఇలా అన్నీ పెండింగులో పడిపోయాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్లో కేటాయించిన నిధుల్లోంచి సాయం చేయాల్సిందిగా ఆర్టీసీ అధికారులు రెండు నెలల క్రితం ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం రూ.వేయి కోట్లకు పూచీకత్తు (గ్యారంటీ) ఇస్తూ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాల్సిందిగా సూచించింది. దానికి ఓ ప్రధాన బ్యాంకు స్పందించింది. అయితే, గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో రూ.180 కోట్లు బకాయిగా ఉండటంతో ఎన్పీఏగా ముద్రపడిందని, ఆ మొత్తం చెల్లిస్తే రుణం ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో ప్రభుత్వ సాయంతో దాన్ని తీర్చేసి మళ్లీ రుణం కోసం వెళ్లింది. రీజినల్ స్థాయి బోర్డు సమావేశంలో బ్యాంకు దీనికి ఓకే చేసింది. కానీ కేంద్ర స్థాయిలో బోర్డు మోకాలొడ్డింది. అసలే ఆర్టీసీ పరిస్థితి ఏమాత్రం బాగోలేనందున ఒకేసారి ఏకంగా రూ.వెయ్యి కోట్ల రుణం ఇవ్వటం సరికాదని ఆ ప్రతిపాదనను తిరస్కరించి కేవలం రూ.500 కోట్లకు ఓకే చెప్పింది. అయితే ఈ రుణం ఇప్పుడు ఆర్టీసీ అవసరాలకు ఏమాత్రం సరిపోదు. ప్రస్తుతం ఆర్టీసీ అవసరాలకు రూ.2 వేల కోట్లు కావాలి. కనీసం రూ.వెయ్యి కోట్లు అందినా సగం సమస్య తీరేది. ప్రభుత్వ పూచీకత్తులో మిగిలిన రూ.500 కోట్ల కోసం ఇప్పుడు అధికారులు ఇతర బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా.. వారికి నిరాశే ఎదురవుతోంది. -
మరోసారి సత్తా చాటిన టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపులో తెలంగాణ ఆర్టీసీ మరోసారి సత్తా చాటింది. డీజిల్ వినియోగంలో పొదుపు పాటించి మైలేజీలో మెరుగుదల సాధించటం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ ఆర్టీసీ రెండో స్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్–2020 సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ ఢిల్లీలో బుధవారం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 4,001 కంటే ఎక్కువ బస్సులున్న రవాణా సంస్థల కేటగిరీలో ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. 2019లో ఆర్టీసీ సగటు మైలేజీ (కిలోమీటర్ పర్ లీటర్–కేఎంపీఎల్) 5.16 ఉండగా, 2020లో 5.28కి పెరిగింది. అంటే 0.12 మేర మెరుగుపడింది. ఏయేటికాయేడు కేఎంపీఎల్‌ను మెరుగుపరుచుకుంటూ వస్తున్న ఆర్టీసీ, జాతీయ స్థాయిలో ఇంధన పొదుపులో ఉత్తమ సంస్థగా మొదటి రెండు స్థానాల్లో నిలుస్తు వస్తోంది. తాజాగా మరోసారి దాన్ని నిలబెట్టుకుంది. చదవండి: హమ్మయ్యా! బ్యాటరీ బస్సు ఆశలు సజీవం ఈ మెరుగుదల ఆధారంగా సంవత్సర కాలంలో ఆర్టీసీ 24 లక్షల లీటర్ల ఇంధనాన్ని పొదుపు చేసినట్టయింది. ప్రసుతం బహిరంగ మార్కెట్లో ఉన్న డీజిల్ ధర ప్రకారం చూస్తే ఈ పొదుపు మొత్తం విలువ దాదాపు రూ.19 కోట్లు అవుతుంది. జనవరి 16న వర్చువల్ పద్ధతిలో జరిగే సమావేశంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలంగాణ ఆర్టీసీ ఎండీకి ఈ పురస్కారాన్ని అందించనున్నారు. పురస్కారంతోపాటు రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని హయత్‌నగర్–1, ఉప్పల్, దిల్సుఖ్నగర్ డిపోలు ఇంధన పొదుపులో ఉత్తమ డిపోలుగా నిలిచాయి. కేంద్రమంత్రి ఈ మూడు డిపోలకు కూడా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. నగదు ప్రోత్సాహకం కింద ఒక్కో డిపోకు రూ.50 వేల చొప్పున అందించనున్నారు. చదవండి: సంస్కృతి కళ్లకు కట్టేలా నాగోబా ఆలయం -
టీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీసులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ పార్సిల్, కొరియర్ అండ్ కార్గో సర్వీసులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీలో ప్రైవేట్ సేవలు రద్దు చేశామని.. కార్గో, పార్సిల్ విభాగానికి కృష్ణకాంత్‌ను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు. కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాయని... ఇక ఈరోజు నుంచి పార్సిల్ సేవలను కూడా మొదలుపెడుతున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీలో ప్రయాణానికి మంచి స్పందన ఉందని.. అలాగే వస్తువుల రవాణాపై కూడా నమ్మకం ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా రూ. 180- 200 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ సిబ్బందిని ఈ సేవల్లో వాడుకుంటామని.. త్వరలోనే మొబైల్ యాప్ కూడా తీసుకొస్తామని పువ్వాడ తెలిపారు. అన్ని బస్స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. అదే విధంగా.. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా బుకింగ్‌లు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే జీవో తీసుకురానున్నట్లు వెల్లడించారు.(తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు) సంస్థ ఖర్చులతో వైద్యం బస్సుల ద్వారా కరోనా వ్యాప్తి జరగడం లేదని పువ్వాడ అన్నారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో మే 19 నుంచి తెలంగాణలో బస్సులు నడుపుతున్నామని... ఆర్టీసీ బస్సుల్లో అందరూ ధైర్యంగా ఎక్కవచ్చన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జాబ్ సెక్యూరిటీపై త్వరలోనే జీవో తీసుకువస్తామని తెలిపారు. ఆర్టీసీ కష్టకాలంలో ఉందని.. అందుకే అవసరం మేరకే బస్సులు తిప్పుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రతిరోజు ఆర్టీసీకి రూ. 12 కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నా.. ప్రస్తుతం కేవలం రూ. 4 కోట్లు మాత్రమే వస్తుందని తెలిపారు. అదే విధంగా.. ఆర్టీసీ ఉద్యోగులకు 50శాతం జీతం ఇస్తున్నామని.. కరోనా లక్షణాలు ఉన్న సిబ్బందికి.. సంస్థ సొంత ఖర్చులతో పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు.(‘డిజిటల్’ ప్రయోగాలే శరణ్యం) కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు ఆర్టీసీలో కొనసాగుతున్న ప్రైవేట్ పార్సిల్ ఏజెన్సీల ఒప్పందాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో సేవలందించిన కార్గో బస్సులు.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల మధ్య నిత్యావసర వస్తువులు, అంగన్వాడీ వస్తువులను సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీ పార్సిల్, కొరియర్ అండ్ కార్గో సర్వీసులు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఆర్టీసీకి మంచి ఆదాయం ఉంటుందన్నారు. దశల వారీగా పార్సిల్, కొరియర్ సర్వీసులను తీసుకొస్తామని తెలిపారు. -
వచ్చేస్తున్నాయి బ్యాటరీ బస్సులు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో కాలుష్యం సంగతి మనకు తెలిసిందే.. వాహనాల సంఖ్య 60 లక్షలు దాటింది.. మెట్రో రైలు వచ్చాక.. వ్యక్తిగత వాహనాల వినియోగం కాస్త తగ్గినా.. అది ఆశించిన స్థాయిలో లేదు.. నెమ్మదిగా ఈ పరిస్థితి మారనుంది. ఎందుకంటే.. మరో నెల రోజుల్లో సిటీ రోడ్లపై 309 ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. దీని వల్ల వాతావరణ కాలుష్య స్థాయి కొంత తగ్గుతుందని భావిస్తున్నారు.. 334లో 309 నగరానికే.. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ఎలక్ట్రిక్ బస్సులను గరిష్ట సంఖ్యలో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించి ఇటీవల రాయితీలను ప్రకటించింది. తాజాగా ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా(ఫేమ్)’ పథకం రెండోదశలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ పంపిన ప్రతిపాదనల మేరకు కేంద్రం 334 బ్యాటరీ బస్సులను మంజూరు చేసింది. గతంలో ఇదే పథకం కింద నగరానికి వంద బ్యాటరీ బస్సులను మంజూరు చేసినా.. 40 మాత్రమే వచ్చాయి. అన్నీ ఏసీవే కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి నడుపుతున్నారు. ఇప్పుడు వచ్చే 334 బస్సుల్లో 309 బస్సులను జంటనగరాల్లో సిటీ బస్సులుగా వాడతారు. మిగిలినవాటిని వరంగల్‌లో నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. ఆర్టీసీకి కూడా ఊరట.. ఆర్టీసీ కొంతకాలంగా కొత్త బస్సులు కొనటం లేదు. నిధులు లేకపోవటం వంటి సమస్యలు ఉన్నాయి. దాదాపుగా మనంతే జనాభా ఉన్న బెంగళూరులో 6,500 బస్సులుంటే, సిటీలో వాటి సంఖ్య 3,600. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సుల రాకతో పరిస్థితి కొంచెం మెరుగుపడనుంది. ఏసీ బస్సులకు పెద్దగా ఆదరణ లేని నేపథ్యంలో నాన్ ఏసీ బస్సులనే తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. తొలిసారిగా నగరంలో నాన్ ఏసీ బ్యాటరీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. ఇంతకుముందులాగే ఈసారి కూడా అద్దె ప్రాతిపదికనే తీసుకోనున్నారు. ఖరీదు రూ. 1.75 కోట్లు.. ఒక్కో బ్యాటరీ బస్సు ధర రూ.1.75 కోట్లు. గతంలో తీసుకున్న ఏసీ బస్సు ధర రూ.2.50 కోట్లు. అప్పట్లో కేంద్రం ఒక్కో బస్సుకు రూ.కోటి (33 శాతం ధర) చొప్పున రాయితీ ప్రకటించింది. ఇప్పుడు తీసుకోబోయే నాన్ ఏసీ బస్సుకు రూ.50 లక్షల చొప్పున రాయితీ ఇస్తోంది. ఆర్టీసీ వద్ద నిధులు లేకపోవటంతో ఖరీదైన ఈ బస్సులను కొనటం కష్టంగా మారింది. దీంతో ఆ రాయితీని ప్రైవేటు సంస్థలకు మళ్లించి వాటి నుంచి అద్దె ప్రాతిపదికన బస్సులను సమకూర్చుకుంటోంది. ఫలితంగా వాటి నిర్వహణ, డ్రైవర్ ఖర్చులన్నీ ప్రైవేటు సంస్థనే భరిస్తుంది. కి.మీ.కు నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లిస్తుంది. -
బస్సుల పోదాం చలో చలో..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదకరంగా వేళ్లాడుతూ ఆటోలు, జీపుల్లో ప్రయాణించేవారు క్రమంగా బస్సుల వైపు మొగ్గుచూపుతున్నారు. గతేడాదిలో 4 శాతం మంది ప్రయాణికులు అదనంగా బస్సుల్లో ప్రయాణించినట్లు అధికారులు తేల్చారు. ఏడాది కింద తెలంగాణ ఆర్టీసీ సగటు ఆక్యుపెన్సీ రేషియో 69 శాతం ఉండగా, గతేడాది కాలంలో సగటు 73 శాతమని తేలింది. పదేళ్ల తర్వాత ఈ రికార్డు నమోదైనట్లు చెబుతున్నారు. దీంతో ఆర్టీసీకి రూ.174 కోట్ల మేర అదనపు ఆదాయం పెరిగింది. ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో బస్సు సర్వీసుల పనితీరును పర్యవేక్షిస్తూ, చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. ఏం చేశారు.. చాలా డిపోల పరిధిలో ఎప్పుడో రూపొందించిన షెడ్యూల్ ప్రకారమే బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ను పట్టించుకోకుండా తిరుగుతున్నాయి. ఫలితంగా ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉన్నా.. బస్సుల్లో ఆక్యుపెన్సీ సగటున 69 శాతాన్ని దాటట్లేదు. దీంతో కొందరు ఉన్నతాధికారులు ఓ సాఫ్ట్వేర్ రూపొందించి, దీనికి డిపోలను అనుసంధానించారు. ఏ బస్సు ట్రిప్పులో ఎంత ఆక్యుపెన్సీ ఉంటుందో.. తక్కువ మంది ప్రయాణికులు ఉండే రూట్లు, ఎక్కువ మంది ప్రయాణికులు వస్తున్న మార్గాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సంబంధిత సమాచారాన్ని సదరు డిపోలకు ఇచ్చి మార్పులు చేస్తూ వచ్చారు. చాలా ప్రాంతాల్లో ముఖ్య సర్వీసులను ప్రధాన రోడ్లపైనే తిప్పుతున్నారు. కొత్త ట్రిప్పులను కూడా వాటికే జత చేశారు. కొత్త మార్గాలపై దృష్టి పెట్టలేదు. దీంతో బస్సు ట్రిప్పులు వృథా అవుతున్నాయని గుర్తించి కొన్ని సర్వీసుల మార్గాలు మార్చి మిగతావాటి వేళలు సవరించారు. పాఠశాల విద్యార్థులు, సాధారణ ప్రయాణికుల సర్వీసులను వేరు చేసి వేళలు మార్చి నడిపారు. తక్కువ మంది ప్రయాణికులుండే మార్గాలను మార్చి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్న ఇతర మార్గాలతో అనుసంధానించారు. ఆ రెండు కేటగిరీల్లోనే ఎక్కువ ఆర్టీసీ మొత్తం ప్రయాణికుల్లో 55 శాతం మంది పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనే ప్రయాణిస్తుంటారు. వీటిపై ఎక్కువ దృష్టిపెట్టారు. ఫలితంగా 2018–19లో ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఓఆర్ 75 శాతం నుంచి 78 శాతానికి, పల్లెవెలుగు ఓఆర్ 72 శాతం నుంచి 76 శాతానికి పెరిగింది. ఏయే రూట్లలో ఆర్టీసీకి ఆదరణ ఎక్కువ ఉంది.. ఏయే మార్గాల్లో ఆటోలు, జీపుల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉంటున్నారనే విషయంలో సర్వే చేశారు. ఉదాహరణకు గజ్వేల్ నుంచి జగదేవ్‌పూర్ మండల కేంద్రానికి గతంలో ప్రత్యేక సర్వీసులు ఉండేవి కావు. భువనగిరికి వెళ్లే బస్సుల్లోనే జనం వెళ్లాల్సి వచ్చేది. కానీ ఆ మార్గం దూరం కావటంతో జనం ఆటోల్లో వెళ్లేవారు. ఈ విషయంపై గతంలో ‘సాక్షి’కథనం కూడా ప్రచురించింది. అలాంటి మార్గాలపై దృష్టిపెట్టి డిపో అధికారులకు ప్రత్యేక సూచనలు చేసి కట్ ట్రిప్స్ పెంచారు. -
చక్రం తిరుగుతోంది చందాలతోనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) పరిస్థితి అత్యంత దయ నీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కార్మికులకు జీతాలు ఇవ్వడానికే దిక్కులు చూస్తున్న సంస్థ.. ఏవైనా పనులు చేయించాలంటే వారి వద్దే చేయి చాస్తోంది. కార్మికులు తమ జేబులో నుంచి డబ్బులు తీస్తే తప్ప.. సంస్థలో అభివృద్ధి పనులు జరగని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ ఏర్పడిన తర్వాత 8 దశాబ్దాల్లో ఎన్నడూ ఇంతటి గడ్డు పరిస్థితి లేదు. నష్టాలు వచ్చినప్ప టికీ.. సిబ్బంది వేతనాలు, ఇతరత్రా అభివృద్ధి పనులకు అంతగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా మారింది. సంస్థ వద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో కొత్త బస్సులు కొనలేక డొక్కు బస్సులతోనే నెట్టు కొస్తోంది. కార్మికుల కోసం డిపోల పరిధిలో ఏవైనా పనులు చేయాల్సి వస్తే ‘బస్ భవన్’ నిస్సహాయంగా చూస్తోంది. దీంతో కార్మికులే చందాలు వేసుకుని పనులు చేసుకుంటున్నారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు... వరంగల్ రీజియన్ పరిధిలోని కార్మికులందరి చేతిలో ‘క్లినిక్ డిస్పెన్సరీ డెవలప్మెంట్ ఫండ్’ కూపన్లే కనిపిస్తున్నాయి. హన్మకొండలో ఆర్టీసీ కార్మికుల కోసం విశాలమైన డిస్పెన్సరీ ఉంది. వరంగల్–1 డిపో మేనేజర్ కార్యాలయం ఉన్న భవనం రెండో అంతస్తులో దీనిని ఏర్పాటు చేశారు. అయితే, దీనికి లిఫ్టు వసతి లేదు. కనీసం ర్యాంపు కూడా లేకపోవడంతో అత్యవసర చికిత్స కోసం వచ్చే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పైకి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల డిమాండ్ మేరకు డిస్పెన్సరీని రీజినల్ మేనేజర్ కార్యాలయం ఉన్న భవనంలో కింద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.లక్షల్లోనే ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ, ఆ నిధులు ఇచ్చేందుకు ఆర్టీసీ వద్ద ఎలాంటి ఫండ్ లేదు. ఏరోజుకారోజు టికెట్ల రూపంలో వచ్చే డబ్బులు తప్ప ఆర్టీసీ వద్ద ఎలాంటి నిధులూ లేవు. కార్మికుల భవిష్యనిధి, ఆర్టీసీ పరపతి సహకార సంఘం, పదవీ విరమణ, చనిపోయిన కార్మికులకు ఇచ్చే థ్రిఫ్ట్ అండ్ బెన్వలెంట్ ఫండ్‌ను కూడా వదలకుండా వాడేసుకుంటున్న దుస్థితి నెలకొంది. దీంతో ఇలాంటి అభివృద్ధి పనులకు ఇవ్వడానికి నయా పైసా కూడా సంస్థ వద్ద లేదు. ఆర్టీసీ కేంద్ర కార్యాలయం నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేకపోవటంతో వరంగల్ రీజియన్ అధికారులు స్థానిక కార్మిక సంఘాలతో సమావేశమై చందాలు వేసుకుని ఈ పని చేయించుకోవాలని నిర్ణయించారు. వరంగల్ రీజియన్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు రూ.50 చొప్పున చెల్లించే విధంగా రశీదు పుస్తకాలు ముద్రించారు. వాటిని డిపోలకు పంపిణీ చేసి చందాలు వసూలు చేస్తున్నారు. లక్కీ డ్రా తీసి విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామంటూ కూపన్లపై ముద్రించారు. దీంతో కొందరు కార్మికులు పది వరకు కూపన్లు తీసుకుంటున్నట్టు తెలిసింది. డిస్పెన్సరీ చాలా ఉపయోగకరమైంది కావటంతో కొంతమంది స్వచ్ఛందంగా అదనంగా చందాలు రాస్తున్నారు. ఇలా వసూలు చేస్తున్న మొత్తంతో కొత్త డిస్పెన్సరీ పనులు చేయిస్తున్నారు. డ్రైవర్డేకు చందాలే దిక్కు... కార్మికుల సంక్షేమం, ఇతర ప్రత్యేక రోజులకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహించటం ఆనవాయితీ. డ్రైవర్ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ఆ రోజు డ్రైవర్ల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవటంతోపాటు వారికి బహుమతులు ఇచ్చి, ఉత్తమ డ్రైవర్లను సన్మానిస్తారు. ఇలాంటి కార్యక్రమాలకు ఆర్టీసీనే ఖర్చు భరిస్తుంది. కానీ నిధులు లేక ఇటీవల కార్మికులే చందాలు వేసుకుని ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వరంగల్ రీజియన్‌లో ఇలా రూ.50, రూ.100 చొప్పున చందాలు వేసుకుని అన్ని డిపోల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఎండలు తీవ్రం కావడంతో అన్ని డిపోల్లో మంచినీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇందుకోసం చాలాచోట్ల భారీ ట్యాంకులు ఏర్పాటు చేసి కార్మికులకు మంచినీటిని అందుబాటులో ఉంచుతున్నారు. అయితే, ట్యాంకులు కొనడానికి నిధులు లేకపోవటంతో చాలాచోట్ల కార్మికులే చందాలు వేసుకున్నట్టు సమాచారం. అవినీతికి ఆస్కారం కాదా? అభివృద్ధి పనుల పేరుతో కార్మికుల నుంచి చందాలు వసూలు చేయటాన్ని కొందరు తప్పుపడుతున్నారు. అది అవినీతికి దారి తీస్తుందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికుల నుంచి చందాలు వసూలు చేసి పనులు పూర్తి చేసిన తర్వాత, భవిష్యత్తులో ఆ ఖర్చు తాలూకు బిల్లులు పెట్టి ఆర్టీసీ నిధుల నుంచి వసూలు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. తమ భాగస్వామ్యంలో ఇలాంటి పనులు జరగడం సంతోషంగా ఉందని అనేవారూ ఉన్నారు. గతంలో తమ జీతాల నుంచి కొంత మొత్తం మినహాయించి కొత్త బస్సులు కొన్నారని, ఇప్పటికీ అవి తిరుగుతున్నాయని, వాటిని చూస్తే ఆనందం కలుగుతుందని పేర్కొంటున్నారు. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి నిర్మాణ సమయంలో కూడా తాము చందాలు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలేం చేస్తున్నారు..? వాస్తవానికి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు తమ అభివృద్ధి నిధులను కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం గతంలోనే ఎమ్మెల్యేలకు ఆర్టీసీ లేఖలు రాసింది. గత ప్రభుత్వ హయాంలో ఈటల రాజేందర్, మధుసూదనాచారి, మహేందర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ సహా పది పన్నెండు మంది మాత్రమే కొంతమేర ఆర్టీసీకి నిధులిచ్చారు. మిగిలినవారు ఎవరూ స్పందించలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఒక్కరు కూడా ఆర్టీసీకి నిధులు కేటాయించలేదు. కొన్ని చోట్ల అధికారులు విన్నవించినా ఎమ్మెల్యేలు స్పందించలేదు. -
హైదరాబాద్ రవాణాకు 'లండన్ మోడల్'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ నష్టాల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణ ఆర్టీసీకి తిరిగి జవసత్వాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కీలక సూచన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల నిర్వహణ ఒక సంస్థే పర్యవేక్షిస్తే అది ఎప్పటికీ బాగుపడదని, హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను విడిగా చూసినప్పుడే పరిస్థితి మెరుగుపడుతుందని కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఇందుకోసం లండన్ మోడల్‌ను తెరపైకి తెచ్చింది. హైదరాబాద్ సిటీ వరకు లండన్ మోడల్‌ను నిర్వహిస్తే సిటీలో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతోపాటు ఆర్టీసీపై సిటీ భారం తొలగిపోయి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో బస్సుల నిర్వహణ గాడిలో పడుతుందని కమిటీ తన సిఫారసులో ఖరారు చేసినట్లు తెలిసింది. త్వరలో దీన్ని ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమైంది. ఏమిటీ లండన్ మోడల్...? ప్రపంచ పట్టణ రవాణాలో లండన్ నగరాన్ని ఉత్తమంగా పేర్కొంటారు. అక్కడ సిటీ బస్సులు, ట్రామ్ సర్వీసులు, మెట్రో రైలు వ్యవస్థతోపాటు ఇతర రవాణా వ్యవస్థలు ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయి. వాటన్నింటినీ నగర మేయర్ పర్యవే క్షిస్తారు. లండన్ ప్రజలు మంచినీటి సరఫరా కంటే రవాణా వ్యవస్థకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. రవాణా వ్యవస్థ గాడి తప్పితే మేయర్ సీటులో ఉన్న వ్యక్తి చీత్కారాలు ఎదుర్కోవాల్సిందే. వెరసి అక్కడ రవాణా వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది. హైదరాబాద్ సిటీలో కూడా అదే తరహా వ్యవస్థ అవసరమని కమిటీ సిఫారసులో పేర్కొంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 3,800 సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ఇటీవలే రెండు కారిడార్ల మెట్రో రైలు సేవలు మొదలయ్యాయి. దాదాపు దశాబ్దంన్నర నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు పరుగుపెడుతున్నాయి. కానీ ఈ మూడు ప్రధాన రవాణా సాధనాలు మూడు సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇలా కాకుండా వాటిని ఒకే సంస్థ పర్యవేక్షించేలా చూడాలని, ఆ బాధ్యత ఆర్టీసీ కాకుం డా హైదరాబాద్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ తరహాలో ఓ వ్యవస్థ పర్యవేక్షించాలని కమిటీ తేల్చింది. ఒకే పరిధిలో ఉండటం వల్లే సమస్యలు... హైదరాబాద్ సిటీలో బస్సుల నిర్వహణకు, జిల్లాల్లో బస్సుల నిర్వహణకు చాలా తేడా ఉంటుంది. వాటిని ఒకేలా పర్యవేక్షిస్తుండటంతో ఆర్టీసీకి సమస్యలు వస్తున్నాయని కమిటీ తేల్చింది. జిల్లా బస్సు సర్వీసులు పకడ్బందీగా కొనసాగాలంటే ఆర్టీసీపై సిటీ బస్సుల నిర్వహణ భారం ఉండరాదని తేల్చింది. ప్రస్తుతం కర్ణాటకలో బెంగళూరు మహానగర ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ) పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఉంది. సిటీ బస్సులను అదే నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని ముఖ్య నగరాలతో పోలిస్తే బెంగళూరులో సిటీ బస్సుల నిర్వహణ మెరుగ్గా ఉంది. దీనికి ఈ ప్రత్యేక వ్యవస్థే కారణం. హైదరాబాద్‌లో కూడా అలాంటి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి మెట్రో రైలు, ఎంఎంటీఎస్ రైళ్లను దాని పరిధిలోకి తీసుకోవాలనేది కమిటీ అభిప్రాయం. అమలు కష్టమే.. నిపుణుల కమిటీ చేసిన సిఫారసు అమలు ఎంతవరకు సాధ్యమనే విషయంలో సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థ కనుసన్నల్లో కొనసాగుతోంది. దాన్ని ప్రభుత్వం తీసుకోవడం అంత సులభం కాదు. ఇక ఎంఎంటీఎస్ రైళ్లను రైల్వేశాఖ పర్యవేక్షిస్తోంది. వాటిని రైల్వే నుంచి విడదీసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్రం అంగీకరించాల్సి ఉంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి తదనుగుణంగా ప్రయత్నిస్తే అది అసాధ్యం కాదని కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. -
గరుడ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
సాక్షి, విజయవాడ : తెలంగాణ ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరిగినప్పుడు బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం అధికారులు వారిని వేరే బస్సులో తరలించారు. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలక్ట్రికల్ వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముక్కుతూ మూలుగుతూ వస్తున్న ఆర్టీసీ ప్రయాణికులు!
సాక్షి, హైదరాబాద్ : దసరా సెలవులు ముగిశాయి. శనివారం నుంచి అంతా తిరుగు ప్రయాణాల్లో ఉన్నారు. కానీ, శనివారంతో పోలిస్తే ఆదివారం రద్దీ రెండింతలుగా ఉంది. దీంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. దసరా సెలవుల సందర్భంగా ఆర్టీసీ 4,480 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వీటిలో 50% అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. దసరా, ఆ మరుసటి రోజు రద్దీ బాగా తగ్గినా, శనివారం నుంచి తిరిగి ఊపందుకుంది. ఆదివారం ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడటం మొదలైంది. రిజర్వేషన్ చేయించుకున్న వారి పరిస్థితి పర్వాలేదుగానీ, రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పాత ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు సీట్లు దొరక్క నానా ఇబ్బందులు పడ్డారు. 50% అదనంగా డబ్బులు చెల్లించినా వేలాడాల్సి రావడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. డొక్కు బస్సుల్లో కుక్కిపంపుతున్నారు, కనీస శుభ్రత పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ అన్నబోర్డు పెట్టి 50% అధిక చార్జీలు వసూలు చేయడం దారుణమని వాపోతున్నారు. సెలవులు ముగియడంతో.. సోమవారం నుంచి బడులు, కాలేజీలు తిరిగి తెరుచుకుంటున్న నేపథ్యంలో ఊళ్లకు వెళ్లిన వారంతా ఆదివారం ఒక్కసారిగా బస్సు ప్రయాణాలను ఎంచుకోవడంతో రద్దీతో బస్సులన్నీ కిటకిటలాడాయి. చాలామంది ప్రయాణికులు బస్సుల్లో నిలుచుని, మరికొందరు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఈ రద్దీ బుధవారం వరకు ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రైళ్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సువిధ రైళ్లు మినహా తిరుగు ప్రయాణంలోనూ ఎలాంటి ప్రత్యేక సర్వీసులు నడపకపోవడంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోయాయి. రోజుకు 50వేలమంది అధికంగా ప్రయాణం చేస్తున్నా.. అధికారులు ప్రత్యేక రైళ్లు నడపకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోల్గేట్ల వద్ద రద్దీ.. తెలంగాణలో ముంబై, విజయవాడ, బెంగళూరు, పుణే, వరంగల్ జాతీయ రహదారులు, నార్కట్‌పల్లి– అద్దంకి, రాజీవ్ రహదారిపై కలిపి దాదాపు 18 టోల్గేట్లు ఉన్నాయి. ఈ టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో గంటల తరబడి వాహనదారులు అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. మరోవైపు ఈ మార్గంలో ప్రయాణించే స్థానికులు, ఆర్టీసీ ప్రయాణికులు కూడా ట్రాఫిక్‌జామ్‌ల కారణంగా ఇబ్బందులు పడ్డారు. టోల్గేట్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించినప్పటికీ రాత్రి వరకు రద్దీ కొనసాగింది. -
ప్రైవేటుకిద్దాం.. కమీషన్ కొట్టేద్దాం!
సాక్షి, హైదరాబాద్: మీరు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు ఏం చేస్తారు. ఆదాయం పెంచుకునేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. రూపాయికి రూపాయి చేర్చి ఇబ్బందులను దూరం చేసుకుని ఆదాయాన్ని పెంపు చేసుకుంటారు. కానీ... ఆర్టీసీ దీనికి భిన్నం. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు తంటాలు పడుతున్న వేళ.. మంచి ఆదాయమార్గాన్ని కాలదన్నుకుంది. భారీగా ఆదాయంపొందే అవకాశం ఉన్నా, కమీషన్ల మత్తులో మునిగిపోయిన కొందరు అధికారులు దాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించి నామమాత్రపు ఆదాయంతో సరిపెట్టేందుకు తెరదీశారు. సంస్థ కంటే సొంతజేబు నింపుకునేందుకే ఓ ఉన్నతాధికారి తెరవెనుక చక్రం తిప్పినట్టు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు రెట్లు ఆదాయం పొందే వీలున్నా... దేశంలో తెలంగాణ ఆర్టీసీకి మంచి పేరుంది. దాదాపు 10,500 బస్సులతో 9 వేల గ్రామాలు, అన్ని పట్టణాలతో అనుసంధానమై ఉంది. ఇదే సమయంలో తక్కువ మోతాదు సరుకు రవాణాలోనూ ఆర్టీసీ బస్సులు కీలక భూమిక నిర్వహిస్తున్నాయి. ప్రైవేటు పార్సిల్ సర్వీసు ధరలతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో సరుకు తరలింపు తక్కువ ఖర్చుతో కూడుకున్నది, సురక్షితం కూడా కావటంతో చాలామంది దీనివైపు మొగ్గుతున్నారు. ఇప్పటివరకు ఈ సరుకు రవాణా బాధ్యతను ఆర్టీసీ ప్రైవేట్ సంస్థకు కట్టబెడుతూ వస్తోంది. ఆర్టీసీ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి కొనసాగింది. విడిపోయిన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ సొంతంగా నిర్వహిస్తూ ఆదాయాన్ని పెంచుకున్నా, తెలంగాణ ఆర్టీసీ మాత్రం సొంతంగా నిర్వహించే ఆలోచనను పక్కనపెట్టి ప్రైవేటుకు అప్పగించేందుకే మొగ్గు చూపుతోంది. ఇటీవలి వరకు ఓ ప్రైవేటు సంస్థ ఆ బాధ్యతను చూసింది. ప్రస్తుతం దాని గడువు తీరిపోవటంతో తాజాగా ఆర్టీసీ మళ్లీ టెండర్లు పిలిచింది. ప్రస్తుతం ప్రైవేటు సంస్థ ఆర్టీసీకి సంవత్సరానికి రూ.కోటిన్నర మాత్రమే చెల్లిస్తోంది. కానీ సరుకు రవాణాను ఆర్టీసీనే సొంతంగా నిర్వహిస్తే ఆ మొత్తం రూ.20 కోట్లకు చేరుతుందని ఓ అంచనా. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున సొంతంగా సరుకు రవాణా నిర్వహిస్తూ ఆదాయాన్ని పెంచుకోవాలని యాజమాన్యానికి సూచనలు అందుతూనే ఉన్నాయి. నెల రోజుల క్రితం అప్పటి ఉన్నతాధికారి ఒకరు ప్రైవేటు సంస్థలతో సమావేశం ఏర్పాటుచేసి సరుకు రవాణాకు టెండర్లు పిలుస్తామని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు. శనివారం టెండర్లు ఆహ్వానించారు. కమీషన్ల దందాయే కారణమా? ఈ వ్యవహారం వెనక కమీషన్ల దందా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీలో కీలక బాధ్యత నిర్వహించిన ఓ ‘అధికారి’కమీషన్లకు అలవాటుపడి సంస్థ ఆదాయాన్ని సొంత జేబులోకి మళ్లించాడన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఆ అధికారి నిర్వాకం వల్లనే ఆర్టీసీ నష్టాలు మూటగట్టుకున్నదన్న వాదనా ఉంది. ఇప్పుడు మరోసారి టెండర్ల వ్యవహారంతో ఆ విషయం చర్చనీయాంశమైంది. గతంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష సందర్భంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేం దుకు ఆయన సూచన మేరకు రెవెన్యూ విభాగాన్ని ఏర్పాటుచేసి ఈడీ స్థాయి అధికారికి అప్పగించారు. కానీ సీఎం ఆదేశాలను ధిక్కరించి సరుకు రవాణా రూపంలో భారీ ఆదాయం వచ్చే వీలున్నా... ప్రైవేటు సంస్థకు కట్టబెట్టి మరోసారి ఆర్టీసీ ఖజానాపై దెబ్బకొట్టేందుకు సిద్ధమయ్యారు. ఐఏఎస్/ఐపీఎస్‌కు అప్పగించాలి ఆర్టీసీని అస్తవ్యస్త విధానాలతో తీవ్ర నష్టాలపాలు జేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రూ.2,500 కోట్ల నష్టాలు వచ్చి పడ్డాయి. కానీ బాధ్యులను గుర్తించలేదు. ఇకనైనా బాధ్యులను గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆదాయం వచ్చే మార్గాలను కూడా కమీషన్ల కోసం మళ్లిస్తున్నవారిని వదలొద్దు. ఆర్టీసీని బాగుచేయాలంటే వెంటనే మంచి పేరున్న ఐఏఎస్ అధికారికి గానీ, ఐపీఎస్ అధికారికిగానీ అప్పగించాలి. కనీసం కార్మికులకు యూనిఫామ్ ఇచ్చే స్థితిలో కూడా లేని సంస్థను వెంటనే గాడిలో పెట్టాల్సిన అవసరముంది. – ఎన్ఎంయూ నేత నాగేశ్వరరావు -
ప్రభుత్వం దిగిరావడం ఇది మా విజయమే!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో కార్మికుల తలపెట్టిన సమ్మెకు బ్రేక్ పడింది. కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె ఆలోచనను విరమించుకుంటున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ జేఏసీ ఒత్తిడి వల్లే కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ దిగి వచ్చారని జేఏసీ నేతలు పేర్కొన్నారు. సీఎం ఇచ్చిన తూతూ మంత్రపు ప్రకటనలకు టీఎంయూ ఒప్పుకోవడం దారుణమన్నారు. ఇంకా ముఖ్యమైన డిమాండ్లు సాధించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు గుర్తింపు సంఘం టీఎంయూ భయపడిందని ఆరోపించారు. టీఎంయూ ఒంటెద్దు పోకడలు పోతోందని మండిపడ్డారు. ప్రభుత్వ గుర్తింపు సంఘమైన టీఎంయూ సమ్మె విరమించడం వల్ల తాము కూడా ప్రస్తుతానికి సమ్మె విరమిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. తాజా డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడం ఆర్టీసీ జేఏసీ విజయమేనని తెలిపారు. నేటి (శనివారం) రాత్రి అన్ని డిపోల దగ్గర ఆర్టీసీ జేఏసీ సమావేశాలు నిర్వహించి.. ప్రభుత్వం కార్మికులను ఎలా మోసం చేసిందో వివరిస్తామని చెప్పారు. -
ఆర్టీసీలో సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఈ నెల 8న చర్చలకు రావాలని ఆర్టీసీ గుర్తింపు సంఘం, జేఏసీ సహా అన్ని కార్మిక సంఘాలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. సమ్మె ఆగాలంటే వెంటనే కార్మికుల వేతనాలు పెంచాలని, వేతన సవరణ చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా వేతన సవరణకు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో సమ్మె చేపట్టనున్నట్టు గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 11న తెల్లవారుజామున తొలి బస్సును నిలిపేయటం ద్వారా సమ్మె ప్రారంభిస్తామని టీఎంయూ వెల్లడించింది. దీనికి సన్నాహకంగా ఈ నెల 7 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని సంఘం ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి వెల్లడించారు. 7వ తేదీన అన్ని డిపోల ఎదుట ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన చేపడతామని, 8వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తామని చెప్పారు. వేతన సవరణ గడువు ముగిసి 14 నెలలు దాటినందున వెంటనే 50 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ జరపాలని డిమాండ్ చేశారు. -
‘ఆర్టీసీ నష్టాలకు అధికారులే బాధ్యులు’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాలకు కార్మికుల పనితీరుకు ఏమాత్రం సంబంధం లేదని ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం నేతలు తేల్చి చెప్పారు. అధికారుల పనితీరు సరిగా లేకపోవటం, గతంలో తీసుకున్న అప్పులకు ఇప్పటికీ వడ్డీలు చెల్లిస్తుండటం, భారీగా పెరిగిన డీజిల్ ధరల వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉందని, దానికి కార్మికులను బాధ్యులను చేయటం సరికాదని స్పష్టంచేశారు. వాస్తవాలను దాచి అధికారులు తప్పుడు లెక్కలతో సీఎంనే తప్పుదారి పట్టించారని ఆరోపించారు. బుధవారం ఆర్థిక మంత్రి ఈటల అధ్యక్షతన మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో మరోసారి ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ప్రతినిధులతో భేటీ అయింది. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో జీతాల కోసం పట్టుపట్టడం, సమ్మె నోటీసు ఇవ్వటం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం, ఆర్టీసీ అధికారులతో చర్చ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాటి సమావేశంలో గుర్తింపు సంఘం నేతలు దానికి కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులను బాధ్యులను చేయటం ఏమాత్రం సరికాదని, నష్టాల బూచి చూపి వేతన సవరణ నుంచి తప్పించుకునే ప్రయత్నం సరికాదని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ సిబ్బంది వేతనాలు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల కంటే తక్కువగా ఉన్నాయని సీఎం అన్న మాటలను ఖండించారు. మహారాష్ట్ర లాంటి చోట్ల ఆర్టీసీ కార్మికుల బేసిక్ తక్కువగా ఉన్నా అలవెన్సులు మనకంటే చాలా ఎక్కువని, మొత్తంగా చూస్తే వారి వేతనాలు తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది వేతనాల కంటే ఎక్కువే ఉంటాయని వివరించారు. ‘‘ఢిల్లీ, హరియాణ లాంటి చోట్ల ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? కావాలంటే ఆర్టీసీ అధికారులతో కలసి తాము అధ్యయనానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉద్యమంలో ముందున్న ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకోవాల్సిందే’’అని పేర్కొన్నారు. జాప్యమైతే 25% ఐఆర్ ప్రకటించండి వేతన సవరణ ఇవ్వటం సాధ్యం కాదనుకుంటే ఇంటీరియమ్ రిలీఫ్ (ఐఆర్) 25 శాతం ప్రకటించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. హరీశ్‌పై గుర్రు: టీఎంయూ గౌరవాధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీశ్‌రావు బుధవారం నాటి సమావేశానికి హాజరయ్యారు. కానీ ఆయన తమకు అనుకూలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాము డి మాండ్లపై మొత్తుకుంటున్నా ఏమీ పట్టనట్టు కూర్చున్నారని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాదనతో మంత్రులు ఏకీభవించారని, వేతన సవరణ విషయంలో సీఎంతో మరోసారి చర్చిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని సమావేశానంతరం ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణరావు, సంఘం ప్రతినిధులు తిరుపతి, థామస్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మె చేస్తామంటే చేసుకోమనండి ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ఉదంతం ఎప్పుడైనా ఉందా? మా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని తరహాలో కార్మికులు అడిగినదాని కంటే ఎక్కువ ప్రకటిస్తే.. ఇప్పుడు ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేస్తారా? వేతన సవరణ చేయకుంటే సమ్మె చేస్తామని హెచ్చరిస్తారా? అదీ రూ.750 కోట్ల మేర వార్షిక నష్టాలున్నప్పుడు... ఏమనుకుంటున్నారు..? చేస్తామంటే చేసుకోమనండి.. చేస్తే అట్నుంచి అటే పోతే?’’అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయన వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. బుధవారం రాత్రి మంత్రివర్గ ఉప సంఘం, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెరసి కార్మిక సంఘాల డిమాండ్‌కు తగ్గట్టు వేతన సవరణ జరగదనే స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయినా ఈ అంశం మంత్రివర్గ ఉపసంఘం పరిశీలనలో ఉందని, సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ‘‘నేను ఓ దినమంతా ఆర్టీసీ సమీక్షలో గడిపాను. వేల ఆటోలు, బైకులు రోడ్డుమీదకు వచ్చిన తరుణంలో ఆర్టీసీ ఎలా మనుగడ సాగించాలో స్పష్టంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని చెప్పాను. ఆర్టీసీని రక్షించేందుకు రూ.3,400 కోట్ల మొత్తాన్ని విడుదల చేశాం. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు పెట్టాం. అయినా ఇంకా డిమాండ్లు చేస్తే ఏమనాలి? సమ్మె చేస్తామంటే చేసుకోమనండి. కార్మికులు, యాజమాన్యం అంతా కలిసి మునుగుతారు’’అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లాంటి కొన్ని రాష్ట్రాల్లో అసలు ఆర్టీసీలే లేవని, కేరళలో బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుంటే వారు పట్టించుకోకుండా సమ్మెకు పోతామంటే చేసేదేముంటుందని ప్రశ్నించారు. అధికారులు తనకు ఇచ్చిన లెక్కలు తప్పులని, నన్ను తప్పుదోవ పట్టించారని కార్మిక సంఘాలు అనడం తప్పన్నారు. ఓ ముఖ్యమంత్రికి తప్పుడు లెక్కలు ఎలా ఇవ్వగలుగుతారని, వాస్తవ పరిస్థితిని తనకు అధికారులు వివరించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ విషయంలో పూర్తి సానుకూలత వ్యక్తం చేయటమే కాకుండా ఉద్యోగుల పనితీరుపై అభినందనల వర్షం కురిపించిన సీఎం.. అదే వేదికపై ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై విమర్శల వర్షం కురిపించటం విశేషం. -
రాయితీ బస్సు కోట్లు మేసింది!
జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద కేంద్రం ఆర్టీసీకి బస్సులు ఇచ్చింది. వీటి వ్యయంలో 35% నాటి యూపీఏ ప్రభుత్వం భరించింది. వాటి విలువను లెక్కకడితే ఒక్కో బస్సుపై ఆ మొత్తం రూ.7 లక్షల వరకు అవుతుంది. అంటే అంతమేర ఆర్టీసీకి ఆదా అయినట్లే. కానీ ఒక్కో బస్సు వల్ల తెలంగాణ ఆర్టీసీకి ఇప్పుడు రూ.9 లక్షల చిల్లు పడింది. కేంద్రం సహకరిస్తే ఆర్టీసీ లాభాల బాట పట్టాల్సింది పోయి ఈ నష్టమేంటన్న అనుమానం, ఆశ్చర్యం కలగడం సహజం. ఈ కథ వెనక మర్మం తెలియాలంటే ఆర్థికమాంద్యం నాటి పరిస్థితిలోకి తొంగి చూడాలి. అలా చూస్తే ఓ కుంభకోణం కనిపిస్తుంది. దాని మూల్యం ఆర్టీసీకి భారీ నష్టం.. దాదాపు రూ.80 కోట్ల వరకు నష్టం ఉంటుందని అంచనా. 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద రాష్ట్రాల రవాణా సంస్థలకు సబ్సిడీపై బస్సులు అందించాలని నిర్ణయించింది. పథకం తొలి విడతలో హైదరాబాద్‌కు 600 బస్సులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం వ్యయంలో కేంద్రం 35 శాతం, రాష్ట్రప్రభుత్వం 15 శాతం భరించాల్సి ఉండగా మిగతా 50 శాతం ఆర్టీసీ వ్యయం చేయాల్సి ఉంది. సగం ఖర్చుతో అన్ని బస్సులు రావటం ఆర్టీసీకి బాగా కలిసొస్తుందని అప్పట్లో భావించారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. సంవత్సరం తిరిగే సరికి వాటి అసలు రూపం బయటపడటంతో ఆర్టీసీ బెంబేలెత్తాల్సి వచ్చింది. బస్‌బాడీ మొత్తం ఎక్కడికక్కడ ఊడిపోవడం మొదలైంది. కొన్ని బస్సుల ఇంజిన్లలో సరైన నాణ్యత లేక కాస్త ఎత్తు రోడ్డు వచ్చేసరికి బస్సు ఫెయిల్ కావటం సాధారణమై పోయింది. దీంతో వాటి నిర్వహణ దినదినగండంగా మారింది. ఆక్యుపెన్సీ రేషియో కూడా పడిపోయింది. సాధారణంగా సిటీ బస్సులు లీటర్ డీజిల్‌కు 5 కి.మీ. వరకు తిరిగితే ఇవి 3 కి.మీ. ఇవ్వటం కూడా గగన మైంది. ఈ బస్సులు ఇక నడవలేని స్థితిలోకి రావటంతో వాటికి కొత్త బాడీ రూపొందించటం మినహా పరిష్కారం లేదని నిపుణులు తేల్చటంతో ఆ పని ప్రారంభించింది. ఆర్థికమాంద్యం పేరుతో మోసం.. 2010లో దేశం ఆర్థిక మాంద్యం దెబ్బకు విలవిల్లాడింది. ఆ సమయంలో చాలా కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో కొందరు ఢిల్లీ స్థాయి బడా నేతలు రంగప్రవేశం చేశారు. ఆర్థికమాంద్యంతో దెబ్బతిన్న కంపెనీలకు ప్రభుత్వం చేయూతనందించాలని, ఇందుకు ప్రత్యేక చర్యలు అవసరమని కేంద్రాన్ని నమ్మించారు. ఆ క్రమంలోనే ఈ బస్సుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ కొనుగోలు వ్యవహారం అంతా లోపాలపుట్టగా మారింది. ఏమాత్రం నాణ్యత లేని బస్సులను అంటగట్టేశారు. కేంద్రం భారీ సంఖ్యలో బస్సులను కొన్న ఈ వ్యవహారంలో నేతలు మధ్యవర్తులుగా వ్యవహరించి పెద్దమొత్తంలో కమీషన్లు దండుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో నాణ్యతలేని బస్సులను సరఫరా చేసి కొన్ని కంపెనీలు ఆర్థికమాంద్యం నష్టాన్ని పూడ్చుకున్నాయని చెబుతున్నారు. - సిటీ బస్సులకు ఆర్టీసీ అల్యూమినియం బాడీలను వాడుతోంది. కానీ జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు ఎంఎస్ (స్టీల్) బాడీతో రూపొందించారు. - ఆర్టీసీ డిపోల్లో బస్సులను క్రమం తప్పకుండా కడుగుతారు. బస్సును కడిగాక ఆరబెట్టే ఏర్పాట్లు లేవు. అల్యూమినియం బాడీతో సమస్య ఉండదు. స్టీల్ బాడీలపై తడి నిలిచి తప్పు పడుతోంది. అసలే నాణ్యత లేని రేకులు కావటం, తుప్పు పట్టడంతో జాయింట్లు ఊడిపోతున్నాయి. - సూపర్‌లగ్జరీ బస్సులకు ఎంఎస్ బాడీ వాడుతున్నారు. 8 లక్షల కిలోమీటర్లు తిరిగాక పాత బాడీ తొలగించి అల్యూమినియంతో కొత్త బాడీ నిర్మించి వాటిని పల్లెవెలుగు బస్సుల్లాగా తిప్పుతున్నారు. - ఈ బస్సుల కొనుగోలులో 15% భరించాల్సిన రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేయటంతో ఆ మొత్తాన్ని కూడా ఆర్టీసీనే భరించాల్సి వచ్చింది. ఈ రూపంలో నష్టం మరింత పెరిగింది. రోజుకో బస్సు రీమోడలింగ్ మియాపూర్‌లో ఉన్న ఆర్టీసీ సొంత బస్‌బాడీ యూనిట్లో బస్సుకు కొత్త బాడీ తయారు చేసి ఇంజిన్ ఓవర్‌హాలింగ్ చేసి వాటికి కొత్త రూపునిస్తోంది. ఇలా ఒక్కో బస్సును పూర్తి స్థాయిలో మార్చేందుకు ఆర్టీసీకి దాదాపు రూ.9 లక్షల వరకు ఖర్చవుతోంది. ఇలా ఏడాదిగా 250 బస్సులకు కొత్త రూపునిచ్చింది. మరో 350 బస్సులను ఇంకో ఏడాదిలో సిద్ధం చేయాలని నిర్ణయించింది. మొత్తం ప్రాజెక్టు కోసం ఆర్టీసీ రూ.50 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ఈ బస్సులను అందించినప్పుడు కేంద్రం రూ.40 కోట్ల మేర భరించగా, ఇప్పుడు ఆర్టీసీ రూ.50 కోట్లకుపైగా నష్టపోతోంది. ఇన్నేళ్లు వాటి నిర్వహణ కోసం చేసిన ఖర్చు మరో రూ.30 కోట్ల వరకు అయి ఉంటుందని అంచనా. కంపెనీలు, రాజకీయ నేతలు మిలాఖత్ అయితే ఎలా ఉంటుంది.. కమీషన్ల నీడలో కోరుకున్న పనులు చకచకా జరిగిపోతాయి. ఆ కోవలోదే ఈ బస్సు కథ. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం).. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఉదాత్త పథకం. కానీ కమీషన్ల ముఠా దీన్నీ వదల్లేదు. ఆ పథకంలో ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకుని అందినంత దండుకుంది. – సాక్షి, హైదరాబాద్ -
దసరా రద్దీ వేళ.. సర్వర్ డౌన్
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగను సొంతూళ్లలో జరుపుకునేందుకు లక్షలాది మంది ప్రయాణాలకు సిద్ధమైన వేళ.. బస్సులన్నీ కిటకిటలాడుతూ సీట్లు దొరకని పరిస్థితి.. ఇలాంటి సమయంలో తెలంగాణ ఆర్టీసీ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా బస్సు టికెట్లు రిజర్వేషన్ చేయించుకునేందుకు సిద్ధపడిన వారికి కంప్యూటర్ స్క్రీన్‌పై ‘అనేబుల్ టు కనెక్ట్’అన్న పదాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో చాలా మంది ఏపీఎస్ ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో టికెట్లు తీసుకున్నారు. సాధారణంగా ఆర్టీసీకి ఏడాది పొడవునా వచ్చే ఆదాయం ఒక ఎత్తయితే, దసరా లాంటి రద్దీ వేళల్లో వచ్చే ఆదాయం మరో ఎత్తు. ఈ రద్దీ సమయాన్ని ‘క్యాష్’చేసుకునేందుకు ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇలాంటి వేళ ఉన్నట్టుండి తెలంగాణ ఆర్టీసీ సర్వర్ చేతులెత్తేస్తోంది. గత ఏడాది దసరా.. దీపావళి.. సంక్రాంతి సమయాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ ప్రభావం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ కిందిస్థాయి అధికారులే ఇలాంటి ఆరోపణలు చేస్తుండటం విశేషం. గురువారం ఉదయం నుంచే ఫిర్యాదులు గురువారం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ అధికారులు సర్వర్ పనిచేయడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా సాయంత్రం పొద్దుపోయే వరకు పరిస్థితిలో మార్పు రాలేదు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనా అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ పనిచేయలేదు. గతానుభవాల నేపథ్యంలో కూడా సమస్య పునరావృతం కావటాన్ని చూస్తే కొందరు కావాలనే సర్వర్‌ను పనిచేయకుండా చేస్తున్నారన్న అనుమానాలకు తావిస్తోంది. గత సంక్రాంతి సమయంలో మూడు రోజుల పాటు ‘దిస్ సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్’అని స్క్రీన్‌పై కనిపించింది. దీంతో ఆ మూడు రోజులు తెలంగాణ ఆర్టీసీ ఆన్లైన్ రిజర్వేషన్ నిలిచిపోయింది. ఫలితంగా పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. గురువారం కూడా అదే పరిస్థితి కనిపించింది. ఆర్టీసీ బస్సు ఎక్కాల్సిన ప్రయాణికులను తమవైపు తిప్పుకునే క్రమంలో ప్రైవేటు ఆపరేటర్లు కుట్ర చేసి ఉంటారనే అనుమానాలను కొందరు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రద్దీ ఎక్కువ ఉండటం వల్ల సమస్య తలెత్తిందన్న ఉన్నతాధికారుల మాటలతో వారు ఏకీభవించటం లేదు. అలాంటప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ సర్వర్లు కూడా షట్‌డౌన్ కావాలి కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. -
అంతర్రాష్ట్ర సర్వీసు ఇక ఆదాయమే బాసు!
అంతర్రాష్ట్ర సర్వీసులతో ఆర్టీసీకి అదనపు ఆదాయం - రోజూ సగటున రూ.1.10 కోట్ల మేర పెరిగిన రాబడి - డిసెంబర్ నాటికి మరో 200 కొత్త సర్వీసులు ప్రారంభం - వార్షికాదాయం రూ.900 కోట్ల మేర పెరుగుతుందని అంచనా - ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లకు భారీగా సర్వీసులు సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర పర్మిట్లు, సర్వీసులను పట్టించుకోకుండా ఇంతకాలం భారీగా ఆదాయాన్ని చేజార్చుకున్న తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పుడు ‘కొత్తబాట’పట్టింది. డిమాండ్ ఉన్న అన్ని అంతర్రాష్ట్ర మార్గాల్లో బస్సు సర్వీసులు నిర్వహించడంపై దృష్టి పెట్టింది. దాదాపు నాలుగు నెలలుగా చేసిన కసరత్తుతో ఏకంగా 10% ఆదాయాన్ని పెంచుకుంది. రోజుకు సగటున రూ.1.10 కోట్ల అదనపు రాబడిని అందుకుంటోంది. ఈ అదనపు రాబడిని డిసెంబర్ నాటికి రూ.2.50 కోట్లకు పెంచుకునే దిశగా మరిన్ని అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తంగా వార్షికాదాయం రూ.900 కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఇంతకాలం ఏపీ ఆర్టీసీ దూకుడు ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీ రెండుగా విడిపోయిన తర్వాత ఏపీ ఆర్టీసీ దూకుడుగా వ్యవహరించింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని ప్రధాన ప్రాంతాలకు విస్తృతంగా బస్సు సర్వీసులు నిర్వహిస్తూ ఆదాయం పొందింది. అదే సమయంలో టీఆర్టీసీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. బాగా డిమాండ్ ఉండే మార్గాలైన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి చోట్లకూ నామమాత్రంగా సర్వీసులు నిర్వహించింది. ఇటీవల ఆర్టీసీ పరిస్థితి మరింతగా దిగజారుతుండటంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఏపీ సహా ఇతర పొరుగు రాష్ట్రా ల్లోని పట్టణాలు, డిమాండ్ ఉన్న మార్గాల్లో అంతర్రాష్ట్ర సర్వీసులను మొదలుపెట్టారు. ఏపీలోని విజయవాడ, తిరుపతి, వైజాగ్, గుంటూరు, శ్రీశైలం, ఒంగోలు, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, కర్నూలు, పులివెందుల, పోలవరం, పుట్టపర్తి, ఆదోని, అనంతపురం, ఉదయగిరి, తాడిపత్రి, వింజమూరు, మచిలీప ట్నం, నంద్యాల, నెల్లూరు, పలమనేరు, చిలకలూరిపేట.. ఇలా అన్ని ప్రధాన ప్రాంతాలకు కొత్త సర్వీసులు మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా ఆర్టీసీ ఆదాయం పెరిగింది. ఇతర పొరుగు రాష్ట్రాలకు కూడా.. మరోవైపు కొత్తగా డిమాండ్ ఉన్న మార్గాలపై (రూట్) సర్వే చేసిన ఆర్టీసీ అధికారులు... మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు కూడా బస్సు సర్వీసులు ప్రారంభించారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు బస్సు సౌకర్యం లేదు. దాంతో ప్రయాణికులు ఏపీ బస్సులపై ఆధారపడేవారు. తాజాగా హైదరాబాద్ నుంచి రాయ్‌పూర్‌కు ప్రతిరోజూ నడిచేలా గరుడ ప్లస్ సర్వీసు ప్రారంభించారు. దానికి మంచి ఆదరణ రావటంతో... తాండూరు నుంచి హైదరాబాద్ మీదుగా దంతెవాడ డీలక్స్ బస్సు సర్వీసు ప్రారంభించారు. హన్మకొండ నుంచి మహారాష్ట్రలోని సిరోంచకు రోజు ఎనిమిది బస్సు సర్వీసులు మొదలుపెట్టారు. ఇక బెంగళూరుకు నడిపే సూపర్ లగ్జరీ బస్సుల స్థానంలో కొత్తగా ఏడు రాజధాని ఏసీ బస్సులను ప్రవేశపెట్టారు. ఇక మహారాష్ట్రలోని పండరీపూర్, అమరావతి, బారామతి, చంద్రాపూర్, వార్ధా, సతారాలకు సర్వీసులు నడపటంతోపాటు నాగ్‌పూర్‌కు మరిన్ని గరుడ ప్లస్ బస్సు సర్వీసులు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పాతబడిన 25 గరుడ బస్సు లను మార్చి కొత్తవి తీసుకోనున్నారు. నాలుగు నెలల్లో 122 కోట్లు ‘‘అంతర్రాష్ట్ర అదనపు సర్వీసులతో కేవలం నాలుగు నెలల్లో రూ.122 కోట్ల అదనపు ఆదాయం సాధించాం. ఇది ఇక్కడితో ఆగదు. ఒక్క ఏపీకే కొత్తగా మరో 150 బస్సులు నడపాలని నిర్ణయించాం. ఇవి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లకు సర్వీసులు విస్తరిస్తాం. డిమాండ్ ఉన్న అన్ని ప్రాంతాలకు నడుపుతాం. ఇందుకోసం కొత్త బస్సులు సమకూర్చుకుంటున్నాం. మెరుగైన సేవల కోసం పాత బస్సుల స్థానంలో కొత్తవి తీసుకువస్తున్నాం..’’ – ఆర్టీసీ ఎండీ రమణారావు -
తెలంగాణ ఆర్టీసీకి ఇంధన పొదుపు పురస్కారం
ఢిల్లీలో అవార్డు అందుకున్న ఎండీ రమణరావు సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపులో తనకు తిరుగులేదని మరోసారి తెలంగాణ ఆర్టీసీ నిరూపించింది. 4 వేల నుంచి 10 వేల బస్సులున్న రవాణా సంస్థల కేటగిరీలో రాష్ట్ర ఆర్టీసీ ఉత్తమ ఇంధన పొదుపు రవాణా సంస్థగా నిలిచింది. ఢిల్లీలోని కన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) 61వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ అవార్డును సంస్థ ఎండీ రమణరావు అందుకున్నారు. ఏఎస్ఆర్టీయూ అధ్యక్షుడు సంజయ్‌మిత్ర ఈ అవార్డును అందజేశారు. 2015–16 సంవత్సరానికి 5.5 కేఎంపీఎల్ సాధించినందుకు ఈ అవార్డును పొందింది. మెరుగైన కేఎంపీఎల్ ద్వారా 9.4 లక్షల లీటర్ల ఇంధనాన్ని, తద్వారా రూ.6.05 కోట్లు ఆదా చేసినట్లు రమణరావు పేర్కొన్నారు. -
తెలంగాణలో పనిచేయాలని ఉంది: మహిళా డ్రైవర్
హైదరాబాద్ : దేశంలోని మొదటి మహిళా డ్రైవర్ సరిత తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డిని సచివాలయంలో శుక్రవారం కలిశారు. ఆమె స్వస్థలం నల్గొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం. ప్రస్తుతం ఆమె ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆటో డ్రైవర్‌గా కెరీర్ ప్రారంభించిన సరిత గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా విమెన్స్ అచీవర్స్‌తో సహా పలు అవార్డులు అందుకున్నారు. దేశంలో మొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీ చేతుల మీదుగా సరిత విమెన్ ఆఫ్ పవర్ అవార్డును కూడా అందుకున్నారు. కాగా, తాను తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తానని, తనకు తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసే అవకాశం ఇవ్వాలని మంత్రిని కోరింది. పేద కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితో ఎదుగుతున్న తనకు ప్రభుత్వం ఆసరాగా నిలవాలని కోరారు. సరిత విజ్ఞప్తికి మంత్రి మహేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. -
పండగ చార్జీలు 50 శాతం అదనం
హైదరాబాద్: సంక్రాంతి పండగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సెలవులకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం మొత్తం 2,430 బస్సులను ఏర్పాటు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 750 బస్సులను వేసింది. అయితే, 200 కిలోమీటర్ల దూరం దాటితే 50శాతం చార్జీ అదనంగా వసూలు చేయనున్నట్లు పేర్కొంది. -
ఆర్టీసీ డ్రైవర్.. ‘ది గైడ్’..!
- కొత్త ఏసీ మినీ బస్సుల్లో టీఎస్ఆర్టీసీ వినూత్న ప్రయోగం - బస్సు వెళ్లే ప్రాంతాల ప్రత్యేకతలను స్పీకర్ ద్వారా వివరించనున్న డ్రైవర్లు - హైదరాబాద్-వరంగల్ -నిజామాబాద్ మధ్య మినీ బస్సుల సంచారం - విషయ పరిజ్ఞానం ఉన్న డ్రైవర్లను గుర్తించి శిక్షణ ఇస్తున్న ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: ‘ఇది హుస్సేన్‌సాగర్.. భాగ్యనగర నిర్మాణంతోనే రూపుదిద్దుకున్న ఈ చెరువు నగరానికి తొలి మంచినీటి వనరు.. ఆ తర్వాత సాగునీటికీ వినియోగించారు.. ప్రస్తుతం ఇలా ఉంది..’ ‘ఇది ఏకశిలా నగరం.. ఇప్పుడు మనం వరంగల్ అంటున్నాం. కాకతీయుల పరాక్రమానికి నిలువుటద్దమిది. తెలంగాణలో రాజధాని తర్వాత పెద్ద నగరం’ ఇవన్నీ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు స్పీకర్ల ద్వారా వినిపిస్తున్న విశేషాలు. ఆయా ప్రాం తాల చారిత్రక, ప్రస్తుత అంశాల సమాహారం. ఇది రికార్డు చేసింది కాదు, బస్సు నడుపుతున్న డ్రైవర్ స్వయంగా స్పీకర్లో అప్పటికప్పుడు చెప్పే మాటలవి. బస్సు ఏయే ప్రాంతాల మీదుగా సాగుతుందో, ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను ఇలా వినిపిస్తుంటాడు. అంటే.. ఇదేదో టూరిస్టు బస్సు ప్రత్యేకత అనుకోకండి. తెలంగాణ ఆర్టీసీ చేస్తున్న వినూత్న ప్రయోగం. ప్రయోగాత్మక పరిశీలన.. తెలంగాణ ఆర్టీసీ కొత్తగా మినీ బస్సులను రోడ్లపైకి తెస్తోంది. ఇందులో ప్రయోగాత్మకంగా వంద ఏసీ బస్సులు నడపబోతోంది. ఇవి హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నిజామాబాద్ మధ్య నడుస్తాయి. ప్రయాణికులు మొబైల్ యాప్ ద్వారా అప్పటికప్పుడు కూడా వీటిల్లో సీట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. వీటికి సాధారణ బస్సుల్లాగా నిర్ణీత మార్గం అంటూ ఉండవు. ప్రయాణికులు ఏయే ప్రాంతాల్లో ఎక్కుతారో బస్సు ఆయా ప్రాం తాల మీదుగా నడుస్తుంది. ఎక్కువ మంది ప్రయాణికులు ఒకేచోట ఉంటే నేరుగా వారి ఇళ్లకు చేరువగా కూడా వెళ్తుంది. ఇది ఇప్పటికి మదిలో ఉన్న ఆలోచన. ట్రాఫిక్ చిక్కులు, ప్రయాణ సమయం, ఇతర ప్రయాణికుల నుంచి వచ్చే వ్యతిరేకత.. తదితరాల ఆధారంగా దీన్ని యథాతథంగా అమలు చేయటం అసాధ్యమనే భావన అధికారుల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఆలోచనను ఆర్టీసీ దృష్టికి తేవడంతో దాన్ని ఎలాగైనా ఆచరణలోకి తెచ్చి ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఆర్టీసీ నిర్ణయించింది. మారుమూల గ్రామాలకు మినీ బస్సులు ఇక మరో వంద నాన్ ఏసీ మినీ బస్సులను మారుమూల గ్రామాలకు నడపనున్నారు. రోడ్డు వసతి సరిగ్గా లేకపోవటం, ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం, ఇతర కారణాలతో చాలా గ్రామాలకు బస్సులు వెళ్లటం లేదు. దీంతో వాటికి మినీ బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ ప్రయోగం అనుకూల ఫలితాలనిస్తే క్రమంగా బస్సుల సంఖ్యను పెంచుతారు. డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ.. ఈ బస్సు డ్రైవర్లకు ‘గైడ్’ తరహా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ నగరాలకు సంబంధించిన ప్రత్యేకతలపై వారికి అవగాహన కల్పించనున్నారు. బస్సు బయలుదేరిన తర్వాత ఆయా ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు డ్రైవర్లు వాటి ప్రత్యేకతలను వివరిస్తారు. ఆ మాటలు బస్సులోని స్పీకర్ల ద్వారా ప్రయాణికుల చెవినపడతాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీల్లో వాటిని వివరించేలా డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై, కాస్త భాషా పటుత్వం, విషయ పరిజ్ఞానం ఉన్న డ్రైవర్లను గుర్తించారు. దసరా నుంచి ఈ బస్సులను అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కొత్త బస్సులకు ఆర్డర్ ఇచ్చారు. -
ఆర్టీసీకి 1,391 కొత్త బస్సులు
► కొత్తగా 750 గ్రామాలకు రవాణా సౌకర్యం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ రికార్డు స్థాయిలో కొత్త బస్సులను రోడ్డెక్కించబోతోంది. ఈ ఏడాది 1,391 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. రూ.350 కోట్లను ఇందుకోసం ఖర్చు చేయనుంది. ఇప్పటికే కొనుగోలు ఆర్డర్లను కూడా జారీ చేసింది. రాష్ట్రంలో 1,100 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లటం లేదు. కొత్త బస్సులతో మొత్తం 750 గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించబోతోంది. అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి భాగ్యనగరానికి ‘రాజధాని’ ఏసీ బస్సులు నడిపేందుకు అదనంగా 95 ఏసీ బస్సులను సమకూర్చుకోబోతోంది. తొలిసారిగా 236 మినీ బస్సులను కూడా కొంటోంది. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందన్న ఉద్దేశంతో గతంలో చాలా ఊళ్లకు బస్సులను నిలిపివేసింది. ఆ సమస్యకు మినీ బస్సులతో చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇక ఇందులో 100 వరకు ఏసీ బస్సులుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక సందర్భాల్లో ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇవ్వటంతోపాటు, నగరాల్లోని కాలనీల నుంచి వేరే ప్రాంతాలకు నడిపేందుకు వాటిని వాడతారని పేర్కొంటున్నారు. ఇవి కాకుండా 386 సూపర్ లగ్జరీ బస్సులు, 600 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 74 పల్లెవెలుగు బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. -
టీఎస్ఆర్టీసీకి ‘ఇండియా బస్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపు, తక్కువ ప్రమాదాలు నమోదు చేసిన సంస్థగా ఇటీవల జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్న తెలంగాణ ఆర్టీసీ ఇండియా బస్ అవార్డును కూడా కైవసం చేసుకుంది. అశోక్ లేలాండ్, అబిబస్లాంటి సంస్థలు ఏర్పాటు చేసిన ఇండియా బస్ అవార్డుల్లో ఉత్తర రోడ్డు రవాణాసంస్థగా జాతీయ స్థాయిలో టీఎస్ఆర్టీసీ నిలిచింది. గోవాలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ రమణారావు గోవా రవాణాశాఖ మంత్రి సుధీర్ దవాలికర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా రవాణా బస్సులను ఉత్తమంగా నిర్వహిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్న కేటగిరీకి గాను అన్ని ఆర్టీసీలతోపాటు ప్రైవేటు సంస్థలు కూడా పోటీ పడ్డాయి. నామినేషన్లను పరిశీలించిన కమిటీ తుదకు తెలంగాణ ఆర్టీసీని ఎంపిక చేసింది. -
అవినీతిలో పెద్దపల్లిదే అగ్రస్థానం
టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ఆరోపించారు. మిషన్‌కాకతీయ పెద్దపల్లిలో కమీషన్ కాకతీయగా మారిందని విమర్శించారు. పెద్దపల్లిలో శుక్రవారం పార్టీ మండలాధ్యక్షుడు ఎడెల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాసమస్యలు పక్కన పెట్టిన స్థానిక ఎమ్మెల్యే కోట్ల రూపాయల మిషన్ కాకతీయ పనులను బినామీలకు అప్పగిస్తూ కాంట్రాక్టర్ అవతారమెత్తారని ఆరోపించారు. ఈ ప్రాంతం నుంచే గోదావరిజలాలు హైదరాబాద్ తీసుకెళ్తానన్న సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గానికి నీటిని తరలించుకుపోతున్నా ఇక్కడి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. సుల్తానాబాద్‌లో పైపును తొలగించి చెరువు నింపింది తానేనని చెప్పినా.. కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. తాము పైపులను ధ్వంసం చేయడం వల్లే అప్పన్నపేట వద్ద సంపులోకి గోదావరి జలాలు వదిలే ఏర్పాట్లు చేస్తున్నారని విజయ్ అన్నారు. 42 కిలోమీటర్ల పైపులైన్ ఇక్కడి భూముల నుంచే వెళ్తోందని, ఎల్లంపల్లి నీటిని అప్పన్నపేట, పెద్దపల్లి, గర్రెపల్లి, సుల్తానాబాద్ చెరువుల్లోకి వదలాలని డిమాండ్ చేశారు. నష్టాల్లో ఉందంటూ తెలంగాణ ఆర్టీసీని మూసేస్తామని సీఎం ప్రకటించడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని, డ్రైవర్, కండక్టర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణిస్తామని హామీ ఇచ్చిన సీఎం మాట మార్చడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సమావేశంలో నగరపంచాయతీ వైస్‌చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, నాయకులు ఉప్పురాజు, బొడ్డుపల్లి శ్రీను, సంపత్, అశోక్, కుమారస్వామి, కోనేరు వినాయకరావు, జగదీశ్, అక్కపాక తిరుపతి, రంగయ్య, కొమ్ము శ్రీనివాస్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు
♦ ఫైల్‌పై సంతకం చేసిన కేసీఆర్ ♦ వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ♦ అధికార భాషా సంఘం చైర్మన్‌గా దేవులపల్లి ప్రభాకర్‌రావు ♦ బుద్ధవనం ప్రాజెక్టు స్పెషలాఫీసర్‌గా మల్లెపల్లి లక్ష్మయ్య సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి ముందే నామినేటెడ్ పదవుల వడ్డన మొదలైంది. మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామకంతో పదవుల పంపిణీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం మరో నలుగురికి కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను నియమించారు. ఈ మేరకు ఫైల్‌పై సంతకం చేశారు. అలాగే తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్ (మిషన్ భగీరథ) వైస్ చైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని నియమించి కేబినెట్ హోదా కల్పించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సీఎంకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. అందుకే కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మిషన్ భగీరథ కార్పొరేషన్‌కు స్వయంగా సీఎం చైర్మన్‌గా ఉన్నారు. కొత్తగా నియమించిన వైస్ చైర్మన్ పదవీ కాలం మూడేళ్లు ఉంటుం దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ప్రముఖ రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకర్‌రావును తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించారు. కేబినెట్ హోదాతో పాటు ఈ పదవీ కాలం ఏడాదిపాటు ఉంటుందని సాధారణ పరిపాలనా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బుద్ధవనం ప్రాజెక్టు స్పెషలాఫీసర్‌గా సీనియర్ జర్నలిస్టు, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కో-ఆర్డినేటర్ మల్లేపల్లి లక్ష్మయ్యను నియమిస్తూ పర్యాటక సాంస్కృతిక యువజనాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులను ఆకర్షించేలా బౌద్ధవనం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు స్పెషలాఫీసర్‌తో పాటు పాలకవర్గ కమిటీ ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వంతో చర్చలు, సంప్రదింపులతో ఈ కమిటీని నియమించే బాధ్యతను మల్లేపల్లి లక్ష్మయ్యకు అప్పగించింది. తమకు బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ప్రభాకర్‌రావు సచివాలయం లో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. -
భారతీయ సంస్కృతి గొప్పది
అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజ్కోవా హైదరాబాద్: భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్కోవా పేర్కొన్నారు. ఆదివారం కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఉగాది పురస్కారాలు అందించారు. అరుణాచల్‌ప్రదేశ్‌ను చిన్నచూపు చూడొద్దని, వేషధారణ చూసి అక్కడి ప్రజలను చైనీయులుగా చూడటం సరికాదన్నారు. ధనమే కేంద్రబిందువుగా ప్రస్తుత సమాజం నడుస్తోందని, దీంతో కుటుంబ, మానవ విలువలు నశిస్తాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ అభివృద్ధిలో ప్రజలు పాలుపంచుకోవాలని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ జేఎండీ రమణారావు, సన్‌షైన్ హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ నాగరాజు, టీవీ నారాయణరావు, హర్షిత హాస్పిటల్ ఎండీ డాక్టర్ కృష్ణ ప్రశాంతికి ఉద్యోగ భారతి పురస్కారాలు, శేఖర్‌రెడ్డి (రియల్ ఎస్టేట్), పాలపర్తి సంధ్యారాణి (సాహిత్యం), వెంకట్ (ఫైన్ ఆర్ట్స్), రాంబాబు (సామాజికవేత్త), నర్సింహమూర్తి (వాస్తు పండితులు), హరిప్రసాద్, హరిత (మీడియా)కు విశ్వ ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెలుగు అకాడమీ చైర్మన్ మోహన్‌కందా తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో ఉమ్మడి పాలక మండలి
♦ తెలంగాణ బోర్డు ఏర్పాటుకు అనుమతించని కేంద్రం ♦ ఏపీ అధీనంలోని బోర్డులోకి తెలంగాణ సభ్యులు ♦ రవాణా, ఆర్థిక, కార్మిక శాఖల కార్యదర్శులు, ఆర్టీసీ జేఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్లకు అవకాశం సాక్షి, హైదరాబాద్: పాలనాపరంగా తెలంగాణ, ఏపీ ఆర్టీసీలు వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నా... మరికొంతకాలం పాటు ఒకే ‘పాలక మండలి’ కింద పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్తులు, అప్పుల విభజన సహా సాంకేతికంగా విడిపోయే వరకూ కూడా ఒకే పాలకమండలి ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సాంకేతికంగా ఈ రెండు రవాణా సంస్థలు ఇప్పటికీ ఒకటిగానే కొనసాగుతున్నాయి. బస్సుల నిర్వహణ, ఆదాయ వ్యయాలు వేటికవేగా ఉన్నా... ఆస్తులు-అప్పుల విభజన పూర్తికాలేదు. ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. అయితే ఈ అంశం తేలకున్నా ఇప్పుడే విడివిడిగా పాలక మండళ్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతివ్వాలన్న తెలంగాణ అభ్యర్థనను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ పరిధిలో ఉన్న పాలకమండలిలో తెలంగాణ రాష్ట్రం సభ్యులను నియమించేందుకు సిద్ధమైంది. తెలంగాణ పక్షాన ఐదుగురు సభ్యులను ప్రభుత్వం నియమించబోతోంది. రవాణా శాఖ, ఆర్థిక శాఖ, కార్మిక ఉపాధి కల్పన శాఖల కార్యదర్శులు, టీఎస్ఆర్టీసీ జేఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇక ఇప్పటివరకు పదిమంది సభ్యులు ఏపీ నుంచి ఉండగా ఆ సంఖ్య ఎనిమిదికి తగ్గనుంది. ఈ బోర్డుకు ఏపీ రవాణాసంస్థ ఎండీ చైర్మన్‌గా ఉంటారు. చైర్మన్ వస్తే ఎలా..? ప్రసుతం పాలకవర్గాలను నియమించేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీకి కూడా చైర్మన్‌ను నియమించాలని భావిస్తోంది. మిగతా కార్పొరేషన్లతోపాటు ఆర్టీసీ చైర్మన్ పోస్టును భర్తీ చేస్తే కొత్త సమస్య రావటం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా కార్పొరేషన్ చైర్మన్ పాలకమండలికి నేతృత్వం వహిస్తారు. సాంకేతికంగా ఆర్టీసీ విడిపోనందున... తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ ఉమ్మడి బోర్డుకు నేతృత్వం వహించే అవకాశం ఉండదు. అప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ హోదాలో ఎండీ దాన్ని నిర్వహిస్తే తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ దానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోమారు బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలి. కానీ 2014 అక్టోబరు తర్వాత బోర్డు సమావేశం కాలేదు. తెలంగాణ నేతలు, ఏపీ ఎండీ మధ్య అప్పట్లో తీవ్ర విభేదాలుండటంతో ఈ సమావేశాలు జరగలేదు. కానీ బోర్డు చేసిన ఓ తీర్మానం సమావేశాలు జరగకున్నా న్యాయపరమైన చిక్కులు లేకుండా చేసింది. చైర్మన్ లేని సమయంలో ఆర్టీసీ ఎండీ ఆ బాధ్యతను నిర్వహించేందుకు వెసులుబాటు కల్పిస్తూ తీర్మానించింది. ప్రస్తుతం కీలక నిర్ణయాలను కూడా బోర్డుతో సంబంధం లేకుండా ఎండీలే కానిచ్చేస్తున్నారు. నిజానికి తెలంగాణ ఆర్టీసీకి ఎండీ లేనట్టే. సాంకేతికంగా ఏపీ ఎండీనే తెలంగాణ-ఆంధ్రలకు చైర్మన్‌గా వ్యవహరించాలి. కానీ టీఎస్ ఆర్టీసీ జేఎండీగా రమణారావును నియమించిన తరుణంలో ఆయనకు ఎండీ అధికారాలను కూడా కట్టబె ట్టడంతో ఆయన ఎండీ హోదాలో చైర్మన్‌తో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి బోర్డులో తెలంగాణ సభ్యులను నియమించబోతున్నందున బోర్డు సమావేశమయ్యే అవకాశం ఉంది. -
పెన్షనర్ల ప్రయోజనాలు కాపాడాలి:ఎన్ఎంయూ
సాక్షి, హైదరాబాద్: తరచూ నిబంధనలు మారుస్తూ కార్మికుల భవిష్య నిధితో ఆటలాడుకోవటం సరికాదని, పీఎఫ్ పింఛనుదారుల ప్రయోజనాల కోసం కేంద్రం ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎన్ఎంయూ కోరింది. కార్మికులు దాచుకున్న భవిష్య నిధి భవితవ్యాన్ని గందరగోళం చేయటం తగదని సంఘ నేతలు నాగేశ్వరరావు, మౌలానా, రఘురాం, లక్ష్మణ్ ఓ ప్రకటనలో తెలిపారు. కనీస పీఎఫ్ పెన్షన్‌ను రూ.వెయ్యి నుంచి రూ.7 వేలకు పెంచాలని, పెరుగుతున్న డీఏను పెన్షన్‌కు వర్తింపచేయాలని, భవిష్య నిధిలోని రూ.30 వేల కోట్ల అన్క్లెయిమ్డ్ మొత్తాన్ని పెన్షన్ స్కీమ్‌కు తరలించాలని, పీఎఫ్ మీద పన్ను రద్దు చేయాలని, ధర్మకర్తల మండలి అధికారాన్ని పెంచాలని కోరారు. -
పీఎఫ్ చెల్లించకుంటే ఉద్యమిస్తాం: ఎన్ఎంయూ
సాక్షి, హైదరాబాద్: కార్మికుల మూల వేతనం, కరువు భత్యం కలిపి రూ.15 వేలు మించితే పీఎఫ్ జమకట్టే బాధ్యత నుంచి వైదొలగాలనే ఆర్టీసీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎన్ఎంయూ పేర్కొంది. ఇలాంటి కార్మిక వ్యతిరేక చర్యలకు ఉపక్రమిస్తే ఉద్యమిస్తామని యూనియన్ నేతలు శంకర్‌రెడ్డి, రమేశ్, మహమూద్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. గతంలో పీఎఫ్ సొమ్మును వాడుకున్న ఆర్టీసీ యాజమాన్యం ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని, దీనిపై కేంద్ర మంత్రి దత్తాత్రేయకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
మేడారానికి అదనపు బస్సులు
వరంగల్ జిల్లా మేడారంలో జరగనున్న జాతరకు సికింద్రాబాద్ నుండి 500 బస్సులను నడుపుతున్నట్లు సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ కొమురయ్య తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 16 నుండి ప్రారంభం అవుతున్న మేడారం జాతరకు ఈ నెల పది నుండే బస్సులను నడుపుతున్నట్లు ఆర్ఎం తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుండి బస్సులను మేడారానికి నడపనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ, చార్జీల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని కొమురయ్య వెల్లడించారు. ఆయా కాలనీల్లో బస్సుకు సరిపడా ప్రయాణికులు ఉంటే వారికి అనుకూలంగా రాను పోను బస్సును నడపనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని తెలంగాణా ఆర్టీసీ అధికారులు కోరారు. -
నష్టాలు తగ్గుముఖం పట్టాయి
తెలంగాణ ఆర్టీసీ నష్టాలు తగ్గు ముఖం పట్టాయని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. గతేడాది రూ.10 కోట్ల నష్టంతో ఉన్న ఆర్టీసీ, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన చర్యలతో రూ.9 కోట్లకు దిగి వచ్చిందని అన్నారు. మంత్రి శనివారం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తూ నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి టీఎస్ఎస్పీ ఏడో బెటాలియన్‌లో ఆగారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 బస్‌డిపోలు ఉండగా 22 డిపోలు లాభాలను సాధించేలా కృషి చేశామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణ పనులకు రూ.10వేల కోట్లు, పంచాయతీరాజ్ రోడ్ల కు రూ.5వేల కోట్లు మంజూరు చేశారని తెలిపారు. రోడ్డు లేని గ్రామాలకు స్థానిక ఎమ్మెల్యేలు నిధులు మంజూరు చేస్తే బస్సులు నడుపుతామన్నారు. సీఎం కేసీఆర్ కొత్త బస్సుల కొనుగోలుకు రూ.150 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఈ నిధులతో 400 పల్లె వెలుగు బస్సులు, 100 ఏసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. -
ఒకే దూరానికి వేర్వేరు చార్జీలు!
♦ ఏపీ బస్సుచార్జీల పెంపుతో గందరగోళం ♦ తెలంగాణ బస్సుల్లో తక్కువ చార్జి... ఏపీ బస్సుల్లో ఎక్కువ సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం బస్సు చార్జీలు పెంచడంతో రెండు రాష్ట్రాల మధ్య తిరిగే టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ చార్జీల విషయంలో గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల రవాణా సంస్థలు ఒకే చార్జీని వసూలు చేస్తూ వచ్చాయి. సరిహద్దు దాటి వెళ్లినా చార్జీలు సమానంగానే ఉన్నాయి. తాజా గా ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంచడంతో పరిస్థితి మారింది. రెండు రాష్ట్రాల మధ్య తిరిగే బస్సులకు సంబంధించి ఏపీ బస్సుల్లో ఎక్కువ, తెలంగాణ బస్సుల్లో తక్కువ చార్జీ ఉండనుంది. తెలంగాణ బస్సుల్లో చార్జీలు తక్కువగా ఉండటంతో వీటిల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు పోటెత్తే పరిస్థితి ఉంది. ఇదే జరిగితే సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య రవాణా సంస్థ పూర్తిగా విడిపోకపోవడంతో ఇప్పటి వరకు పర్మిట్ లెక్కలు తేల్చలేదు. ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య దూర ప్రాంత సర్వీసుల్లో మూడొంతుల బస్సులు ఏపీఎస్ఆర్టీసీ చేతిలోనే ఉండిపోయాయి. తెలంగాణ సర్వీసులు చాలా తక్కువగా ఉన్నాయి. తక్కువ ఉన్న తెలంగాణ సర్వీసులకు ప్రయాణికులు ఎగబడితే.. తమ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు పడిపోతుందని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ గందరగోళం పోవాలంటే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో రేట్లు సవరించాలని వారు ఒత్తిడి చేస్తున్నారు. అంతర్రాష్ట ఒప్పందం లేకపోవడంతో.. సాధారణంగా ఆయా రాష్ట్ర పరిస్థితులకు తగ్గట్లుగా ప్రభుత్వాలు ఆర్టీసీ రేట్లు సవరిస్తుంటాయి. ఒప్పందం ఉంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య తిరిగే బస్సుల్లో ఒకే రకమైన చార్జీలు ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య ఇదే ఒప్పందం ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సులో తెలంగాణ ఆర్టీసీ చార్జీ, కర్ణాటక భూభాగంలోకి రాగానే ఆ రాష్ట్ర చార్జీని రెండు రాష్ట్రాల రవాణా సంస్థలు స్థిరీకరించి వసూలు చేస్తాయి. కానీ ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య ఇలాంటి ఒప్పందం లేదు. దీంతో చార్జీలను సమం చేసే పరిస్థితి లేనందున ఏపీఎస్ఆర్టీసీలో ఎక్కువ చార్జీ, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో తక్కువ చార్జీ వసూలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. -
తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందాం
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ: ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని బలపరచాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం హన్మకొండలో జరిగిన ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయోత్సవ సభలో కడియం శ్రీహరి మాట్లాడారు. కార్మికులు ఊహించని విధంగా సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని చెప్పారు. ఇది కేసీఆర్ అందించిన తెలంగాణ కానుక అని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఆర్టీసీ కార్మికులు భాగస్వాములు కావాలని సూచించారు. తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందామన్నారు. తెలంగాణను అడ్డుకొన్న శక్తులే.. ఏర్పాటైన రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు జేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. పాలమూరు బంద్‌కు టీఎంయూ మద్దతు.. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడాన్ని నిరసిస్తూ మహబూబ్‌నగర్ జిల్లాలో ఈనెల 10వ తేదీన చేపట్టనున్న బంద్‌కు ఆర్టీసీ టీఎంయూ సంపూర్ణ మద్దతు ఇస్తోందని టీంఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి చెప్పారు. బంద్‌లో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటారన్నారు. టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డికి.. టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను, టీఎంయూను విమర్శించే హక్కు లేదన్నారు. రాజిరెడ్డీ నువ్వెంత, నీ సెజైంత? నీ దమ్మెంత.. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి నీది కాదు.. అని మండిపడ్డారు. -
టీఎస్ఆర్టీసీ జోన్లకు టీ అధికారులే బాధ్యులు
* కీలక నిర్ణయం తీసుకున్న జేఎండీ రమణారావు * ఏపీకి చెందిన జయరావుకు ‘గ్రేటర్’ జోన్ బాధ్యతల తొలగింపు * విభజనను వాయిదా వేసిన ఎండీ చర్యకు కౌంటర్? సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో మళ్లీ విభజన చిచ్చు రాజుకుంది. స్థానికత ఆధారంగా ఏ రాష్ట్రానికి చెందిన అధికారులను ఆ రాష్ట్ర ఆర్టీసీకి కేటాయిస్తూ సిబ్బంది విభజన పూర్తి చేయాల్సిన తరుణంలో దాన్ని ఎండీ సాంబశివరావు వాయిదా వేయడాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎండీ నిర్ణయానికి పరోక్షంగా కౌంటర్ ఇస్తూ ఆర్టీసీ జేఎండీ రమణారావు ఈడీలకు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో భౌగోళికంగా ఏపీకి చెంది ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ పరిధి లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా పనిచేస్తున్న జయరావు విధుల్లో కోత పెట్టారు. ఏపీఎస్ ఆర్టీసీ ఇంజనీరింగ్ విభాగం ఈడీగా పనిచేస్తున్న జయరావుకు అదనంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ బాధ్యత కూడా ఉంది. దాన్ని తొలగిస్తూ టీఎస్ ఆర్టీసీ జేఎండీ ఉత్తర్వు జారీ చేశారు. ప్రస్తుతం కరీంనగర్ ఈడీగా ఉన్న పురుషోత్తం నాయక్‌కు ఆ బాధ్యతను అదనంగా అప్పగించారు. ఇటీవలే విజయవాడ నుంచి టీఎస్ఆర్టీసీకి వచ్చిన ఈడీ నాగరాజుకు హైదరాబాద్ జోన్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఈ జోన్‌ను పురుషోత్తం నాయక్ పర్యవేక్షిస్తున్నారు. వెరసి తెలంగాణ ఆర్టీసీ పరిధిలోని జోన్లకు తెలంగాణ అధికారులే ఉండేలా రమణారావు వ్యవహరించ టం విశేషం. వాస్తవానికి గురువారం నాటికి అధికారుల కేటాయింపు పూర్తి కావాలి. ఈ తరుణంలో ఆప్షన్ల అంశాన్ని తెరపైకి తెస్తూ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు దాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. టీఎస్ఆర్టీసీకి జేఎండీగా ఉన్న రమణరావుకు ఎండీ అధికారాలను తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కట్టబెట్టింది. కానీ ఆయన ప్రమేయం లేకుండానే ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మెమో జారీ చేయడాన్ని తెలంగాణ అధికారులు ఏకపక్ష నిర్ణయమంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలిసిన పోలవరం ముంపు ప్రాంతానికి చెందిన జయరావు తెలంగాణలోనే పనిచేస్తానని ఆప్షన్ ఇచ్చినా ఆయన్ని తెలంగాణ జోన్ బాధ్యతల నుంచి తప్పించడం విశేషం. ఈడీ నాగరాజు మస్టర్ రోల్ క్లోజ్ చేయడంపై ఆగ్రహం స్థానికత ఆధారంగా తెలంగాణకు చెందిన ఈడీ నాగరాజు విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తెలంగాణ అధికారులు భగ్గుమంటున్నారు. ఇటీవలి వరకు ఆయన విజయవాడ జోన్ ఈడీగా బాధ్యతలు నిర్వహించారు. పది రోజుల క్రితం ఆ పరిధిలో జరిగిన ఓ ప్రమాద బాధితులకు ఆసుపత్రిలో చికి త్స అందించే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అక్కడి రవాణామంత్రికి సమాచారం అందింది. దీనిపై ఈడీ నాగరాజును ప్రశ్నించగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాధానమిచ్చారు. కానీ ఉన్నట్టుండి ఆయన మస్టర్ రోల్‌ను క్లోజ్ చేసి టీఎస్ ఆర్టీసీకి పంపారు. ఆయన ఎలాగూ తెలంగాణకే రావాల్సి ఉంది. తాత్కాలిక విభజనలో దీన్ని ఎండీ ఖరారు చేశారు. ఆ రూపంలో పంపకుండా.. శాఖాపరమైన చర్య రూపంలో పంపటాన్ని తెలంగాణ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తాజాగా ఆయనకు హైదరాబాద్ జోన్ ఈడీ బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ జేఎండీ రమణరావు నిర్ణయం తీసుకోవటం విశేషం. -
'సీమాంధ్రోళ్లు పోవాలే.. తెలంగాణోళ్లు రావాలే'
హుస్నాబాద్ రూరల్: దేశంలోనే తెలంగాణ ఆర్టీసీనీ నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతామని టీఎంయూ వ్యవస్థాపక కార్యనిర్వాహక అధ్యక్షుడు, కార్మికశక్తి అవార్డు గ్రహీత థామస్‌రెడ్డి అన్నారు. ఈ నెల 28లోగా సీమాంధ్ర ఆర్టీసీ ఉద్యోగులు అక్కడికి వెళ్లిపోవాలని, అక్కడ పనిచేసే తెలంగాణ ఉద్యోగులు ఇక్కడకు రావాల్సిందేనన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని సీమాంధ్ర నేతలు కోరుతున్నారని, ఇక్కడి ఆస్తుల్లో అంగుళం కూడా ఇవ్వబోమని చెప్పారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్ విలువ ప్రకారం విభజించి వాటా ఇస్తామన్నారు. ఆర్టీసీ బోర్డులో 17మంది సభ్యులకు ఇద్దరే తెలంగాణకు వాళ్లు ఇద్దరే ఉన్నారని, ఇందులో అత్యధికంగా తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న నిర్వహించే బోర్డు సమావేశాన్ని వాయిదా వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఆర్టీసీ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
ఆర్టీసీకి రోజుకు రూ.కోటి నష్టం
హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె వల్ల రోజుకు రూ. కోటి నష్టం వస్తోందని రాష్ట్ర రోడ్డు, రవాణా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ రూ.400 కోట్ల నష్టంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా కార్మిక సంఘాలు ఒప్పుకోవటం లేదని మంత్రి మహేందర్ రెడ్డి మండిపడ్డారు. -
ఆర్టీసీ బస్సు చార్జీల మోత
-
ఇక ఆర్టీసీ మోత!
* 15 శాతం వరకు చార్జీలు పెంచేందుకు ఆర్టీసీ కసరత్తు * రూ. 450 కోట్ల వరకు భారం పడే అవకాశం * సిబ్బంది వేతన సవరణ కోసం టికెట్ ధరల పెంపు యోచన * వ్యాట్, ఎంవీ ట్యాక్స్ రీయింబర్స్ చేయాలని సర్కారును కోరనున్న ఆర్టీసీ * త్వరలో ముఖ్యమంత్రిని కలిసి ప్రతిపాదించనున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీల మోత మోగనుంది.. దాదాపు 15 శాతం వరకు చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉద్యోగులకు వేతన సవరణను అమలు చేయడానికి, నష్టాలను తగ్గించుకోవడానికి చార్జీలు పెంచడమే శరణ్యమని ఆ సంస్థ భావిస్తోంది. వేతన సవరణ రూపంలో ఎదురయ్యే భారాన్ని భరిం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరనుంది. ఇందుకు సర్కారు ముందుకు రాని పక్షంలో చార్జీలు పెంచుకొనేందుకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది. సోమవారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ బహిరంగసభ జరుగనున్న నేపథ్యంలో.. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ మేరకు ప్రతిపాదనను ఆయన దృష్టికి తీసుకురానుంది. దీనికి సీఎం ఆమోదిస్తే.. త్వరలోనే ఆర్టీసీ బస్సు చార్జీలు పెరగనున్నాయి. వేతనాల పెంపు కోసం.. ఆర్టీసీలో వేతన సవరణ గడువు 2013 మార్చితో ముగిసింది. అప్పటి నుంచి పీఆర్సీ పెండింగ్‌లో ఉంది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో... వారితో సమంగా తమ వేతనాలనూ సవరించాలని ఆర్టీసీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. దీనికి అంగీకరిస్తే తెలంగాణ ఆర్టీసీపై రూ.700 కోట్ల వరకు భారం పడనుంది. అయితే అంత భారం మోయలేమని కార్మిక సంఘం నేతలకు ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో కార్మిక నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ సాంబశివరావు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు భారీగా సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన నేపథ్యంలో ప్రభుత్వానికి ఇప్పటికే నిధుల సమీకరణ కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల మొత్తాన్ని భరించాలంటే సర్కారుకు ఇబ్బందే. దీంతో ఆర్టీసీ చార్జీల పెంపు మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. సిబ్బందికి 33% వరకూ ఫిట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా తమకూ 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నా.. 33 శాతంలోపే స్థిరీకరించే దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకోసారి వేతన సవరణ జరుగుతుంది. కానీ ఆర్టీసీలో అది నాలుగేళ్లకోసారే జరుగుతుంది. ఈ లెక్కన 33 శాతం ఫిట్మెంట్ సరిపోతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఇలా అయినా కూడా రూ.450 కోట్ల వరకు భారం పడుతుంది. ఆదుకోవాలని విజ్ఞప్తి.. ప్రస్తుతం ఆర్టీసీ డీజిల్‌పై 22.5 శాతం చొప్పున వ్యాట్ చెల్లిస్తోంది. దీనిని ప్రభుత్వం రీయింబర్స్ చేయాలని ఆర్టీసీ కోరుతోంది. సర్కారు అంగీకరిస్తే రూ.250 కోట్లు మిగులుతాయి. ఇక అయితే ఇటీవల ఆటోలు, వ్యవ సాయ ట్రాక్టర్లకు ఇచ్చినట్లుగానే ఆర్టీసీ బస్సులకు ఈ పన్ను మినహాయింపు ఇవ్వాలని యాజమాన్యం కోరనుంది. దీనికి ప్రభుత్వం అంగీకరిస్తే రూ.275 కోట్ల వరకు భారం తగ్గుతుంది. అలాగే వరుసగా మూడేళ్ల పాటు ఏటా వెయ్యి బస్సుల చొప్పున కొనేందుకు ప్రభుత్వం సాయం చేయాలని.. ఇందుకు ఏటా రూ.250 కోట్లు చొప్పున గ్రాంట్ ఇవ్వాలని కోరనుంది. కనీసం 15 శాతం.. 15 శాతం వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించాలని సీఎంను కోరాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు సమాచారం. ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా 25 శాతం చార్జీల పెంపును ప్రతిపాదించాలని అధికారులు భావించారు. కానీ అంత భారీ పెంపునకు అనుమతి లభించదనే ఉద్దేశంతో 15 శాతానికి తగ్గకుండా పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్టు తెలిసింది. 15% పెంచితే సాలీనా ప్రజలపై దాదాపు రూ.450 కోట్ల వరకు భారం పడనుంది. చార్జీల పెంపునకు ప్రభుత్వం ఓకే చెబితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆర్టీసీ చార్జీలు పెంచినట్లు అవుతుంది. 2004 నుంచి 2009 వరకు వైఎస్ సీఎంగా ఉండగా చార్జీలు పెంచలేదు. ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు చార్జీలు పెంచారు. విభజన జరిగిన 2014లో మాత్రం చార్జీలు పెంచలేదు. -
మళ్లీ నష్టాల్లో ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన అనంతరం గత జూన్ నెల ఆదాయపులెక్కలను చూసి లాభాలు వచ్చాయని సంబరపడిన ఆర్టీసీ అధికారులు, తాజాగా జూలై నెల లెక్కలను చూసి ఖంగుతిన్నారు. అధికారుల లెక్కల ప్రకారం గత జూలైలో తెలంగాణ ఆర్టీసీకి రూ.31.6కోట్లు నష్టం రాగా, ఏపీఎస్ఆర్టీసీకి ఏకంగా రూ.72.4కోట్లు నష్టం వచ్చినట్లు తేల్చారు. జూలై నెలలో రద్దీ తక్కువగా ఉన్నందున ఆదాయం తగ్గడం సహజమే అయినప్పటికీ ఇంత భారీస్థాయిలో నష్టాలు రావడం అధికారులను నివ్వెరపరిచింది. తాజా నష్టాలతో టీఎస్ఆర్టీసీ నష్టాలు 1,100 కోట్లకు చేరగా, ఏపీఎస్ఆర్టీసీ నష్టాలు 2,800కోట్లు దాటాయి. దీంతో వెంటనే ఏదో ఒక దిద్దుబాటు చర్య చేపట్టక తప్పదని అధికారులు యోచిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో ఈ లెక్కలు రెండురాష్ట్రాల ఉన్నతాధికారులకు చేరనున్నాయి. -
ఆ నిధులు వెంటనే ఇవ్వాలి : ఆర్టీసీ ఈయూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీకి రూ.250 కోట్ల గ్రాంటును ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వాటిని వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఇంతేమొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీకి విడుదల చేసినందున తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరగా స్పందించాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు. కార్మికులకు దసరా అడ్వాన్స్, సీసీఎస్ రుణాల అందజేత వంటివాటిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. -
టీఎస్ఆర్టీసీ లోగో తయార్
జమ్మికుంట టౌన్: జమ్మికుంట పట్టణానికి చెందిన రాంపెల్లి విజయభాస్కర్ టీఎస్ఆర్టీసీ లోగోను రూపొందించారు. కమలాపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విజయభాస్కర్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లోగోను రూపొందించారు. ఈ లోగోను మరి కొద్దిరోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొంతమంది టీజీఆర్టీసీగా రూపొందిస్తున్నారని, తాను రూపొందించిన దానిలో తెలంగాణ ఆర్టీసీ అనే అర్థం వస్తుందని వివరించారు.