
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో కార్మికుల తలపెట్టిన సమ్మెకు బ్రేక్ పడింది. కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె ఆలోచనను విరమించుకుంటున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ జేఏసీ ఒత్తిడి వల్లే కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ దిగి వచ్చారని జేఏసీ నేతలు పేర్కొన్నారు. సీఎం ఇచ్చిన తూతూ మంత్రపు ప్రకటనలకు టీఎంయూ ఒప్పుకోవడం దారుణమన్నారు.
ఇంకా ముఖ్యమైన డిమాండ్లు సాధించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు గుర్తింపు సంఘం టీఎంయూ భయపడిందని ఆరోపించారు. టీఎంయూ ఒంటెద్దు పోకడలు పోతోందని మండిపడ్డారు. ప్రభుత్వ గుర్తింపు సంఘమైన టీఎంయూ సమ్మె విరమించడం వల్ల తాము కూడా ప్రస్తుతానికి సమ్మె విరమిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. తాజా డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడం ఆర్టీసీ జేఏసీ విజయమేనని తెలిపారు. నేటి (శనివారం) రాత్రి అన్ని డిపోల దగ్గర ఆర్టీసీ జేఏసీ సమావేశాలు నిర్వహించి.. ప్రభుత్వం కార్మికులను ఎలా మోసం చేసిందో వివరిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment