RTC JAC
-
నేడు గవర్నర్‌తో ఆర్టీసీ జేఏసీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లుపై చర్చించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో మంగళవారం ఉదయం 8 గంటలకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భేటీ కానుంది. కొద్దిరోజుల క్రితమే సచివాలయం నుంచి బిల్లు రాజ్‌భవన్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే గవర్నర్ ప్రకటించారు. అసెంబ్లీ ఆమోదం పొంది నెలపైనే గడిచినందున వీలైనంత తొందరలో బిల్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదించి పంపాలని జేఏసీ కోరనుందని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వంలో విలీనం కంటే ముందే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అంశాలను ప్రభుత్వం పరిష్కరించేలా చూడాలని కూడా వారు కోరనున్నట్టు తెలిసింది. రెండు వేతన సవరణలుసహా మొత్తం 30 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్‌కు సమర్పించనున్నారు. -
ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదు
-
సీఎం ఆదేశాలు అమలు కావట్లేదు : అశ్వత్థామ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ప్రజాస్వామ్య దేశంలో డిపోల్లో రెండేళ్ల వరకు ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదంటూ అశ్వత్థామ రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ తరపున ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల డ్యూటీల విషయంలో సీఎం ఆదేశాలను అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కొన్ని బస్సులను రద్దు చేస్తున్నారని, సమ్మె కాలంలో కొందరు అధికారులు చేసిన నిధుల దుర్వినియోగంపై ఏసీబీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొందరు అధికారుల కోసమే రిటైర్మెంట్ వయసు పెంచారని, ప్రస్తుతం ఏ ఒక్క కార్మికుడు కూడా తృప్తిగా పని చేయడం లేదన్నారు. లేబర్ కమిషన్ చెప్పినా మా సంఘాలు వద్దని చెబుతున్నారని, ఆర్టీసీలో యూనియన్లను గుర్తించాలని కోరారు. ఎన్నికలు జరిగేవరకు ప్రస్తుత గుర్తింపు సంఘాలను గుర్తించాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు -
రెండేళ్ల వరకు గుర్తింపు సంఘం ఎన్నికలొద్దు
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం... కార్మికులంతా సంఘటితంగా ఉద్యమించి డిమాండ్ల సాధనకు దీక్షగా సమ్మెలో పాల్గొన్నారు. విధుల్లో చేరండంటూ ముఖ్యమంత్రి మూడు సార్లు పిలిచినా స్పందించకుండా కార్మిక సంఘ నేతల సూచనలకే పెద్ద పీట వేశారు. ఇప్పుడు తీరు మారిపోయింది. రెండేళ్ల వరకు తమ కార్మిక సంఘాలకు ఎన్నికలే వద్దంటూ ఇప్పుడు ఆ కార్మికుల సంతకాలతోనే మూకుమ్మడి లేఖలు లేబర్ కమిషనర్‌కు అందుతున్నాయి . గత ఆదివారం సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో, రెండేళ్ల వరకు యూనియన్లే అవసరం లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిపోల వారీగా ఓ నిర్దేశిత పత్రం సిద్ధం చేసి దానిపై కార్మికుల సంతకాలు తీసుకుని లేబర్ కమిషనర్ కార్యాలయానికి పంపుతున్నారు. దీనిపై మళ్లీ కార్మిక సంఘాల జేఏసీ స్పందించింది. ఇది వేధించటమేనని పేర్కొంటూ నిరసనగా శుక్రవారం డిపోల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చింది. ‘వెల్ఫేర్ కౌన్సిళ్లపై నమ్మకం ఉన్నందునే...’ డిపో స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం వెల్ఫేర్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలని ఆత్మీయ సమ్మేళనంలో సీఎం సూచించారు. ప్రతి డిపో నుంచి ఇద్దరు చొప్పున ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని, ఆ కమిటీలే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాయన్నారు. రెండేళ్ల వరకు ఇక కార్మిక సంఘాలతో పని ఉండదని, అప్పటి వరకు గుర్తింపు సంఘం ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన పనిలేదని ఆయన వివరించారు. రెండేళ్ల తర్వాత యూనియన్లు అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైతే అప్పుడు చూద్దామని ముక్తాయించారు. దీనికి అనుగుణంగా అధికారులు చర్య లు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి లేఖల కార్యక్రమం మొదలైంది. కార్మికుల సమస్యను తక్షణం పరిష్కరించేందుకు ‘వెల్ఫేర్ కౌన్సిళ్లు’కృషి చేస్తాయన్న నమ్మకం తమకు ఉందని, రెండేళ్ల వరకు గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు అవసరం లేదని ఏ డిపోకు ఆ డిపోగా ఓ నమూనా సిద్ధం చేసి కార్మికులందరితో సంతకాలు తీసుకుంటున్నారు. జేఏసీ నేతలు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కార్మికులకు ఇష్టం లేకపోయినా, అధికారులు బలవంతంగా వారితో సంతకాలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరోసారి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో మంగళవారం ప్రారంభమైన ఈ సమీక్షా సమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నివేదికపై ఈ సమీక్షా సమావేశంలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నివేదికను గురువారం జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రూట్లను ప్రైవేటీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీకి సంబంధించిన తాజా పరిణామాలను సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. చదవండి: ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం? అత్యంత సుదీర్ఘంగా 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ సోమవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వం అవునన్నా.. కాదన్నా మంగళవారం నుంచి కార్మికులు విధులకు హాజరుకావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అయితే, కార్మికులు సమ్మె విరమించినా.. విధుల్లోకి తీసుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందంటూ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే..మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేఏసీ చెప్పడాన్ని ప్రకటనలో తప్పుబట్టారు. ఈ క్రమంలో మంగళవారం విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు పెద్దసంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు కార్మికులను అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఆర్టీసీ కార్మికుల పోరాటం.. తీరని విషాదం
సాక్షి, నిజామాబాద్/ సంగారెడ్డి : అత్యంత సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించినప్పటికీ ప్రభుత్వం విధుల్లోకి చేర్చుకునేందుకు నిరాకరించడంతో తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సమస్యలు పరిష్కరించాలని సమ్మెలోకి వెళ్లినందుకు ఇప్పుడు ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు తమను విధుల్లోకి చేర్చుకోవాలని వేడుకుంటున్నారు. ఉద్యోగం కోసం కంటతడి పెడుతూ.. కార్మికులు పలుచోట్ల ప్రభుత్వాన్ని, అధికారులను ప్రాధేయపడుతున్నారు. డిపోల మందు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేందర్ (55) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమ్మె విరమించినా ప్రభుత్వం తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకపోవడంతో రాజేందర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఈ క్రమంలో ఇంటివద్ద ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని, గుండెపోటుతో రాజేందర్ మృతి చెందారని కార్మికులు తెలిపారు. రాజేందర్‌ది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్‌పాడ్ గ్రామం. నురగలు కక్కుతూ పడిపోయిన ఆర్టీసీ కార్మికుడు సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్లోనూ విషాద ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న భీమ్లా మంగళవారం ఉదయం తిరిగి విధుల్లోకి చేరేందుకు సంగారెడ్డి డిపోకు వచ్చాడు. అయితే, అతన్ని విధుల్లోకి తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. ఈ క్రమంలో పోలీసులు భీమ్లాను అరెస్టు చేసి.. ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భీమ్లా నురగలు కక్కుతూ ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో ఆయనను తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగం పోతుందన్న ఆందోళనతో భీమ్లాకు గుండెపోటు వచ్చిందని తోటి కార్మికులు తెలిపారు. మేనేజర్ కాళ్ళు మొక్కిన కార్మికులు విధుల్లో చేరేందుకు నిజామాబాద్ డిపో 1కు ఆర్టీసీ కార్మికులు మంగళవారం భారీగా తరలివచ్చారు. తమను విధుల్లో చేర్చుకోవాలని డిపో మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అయితే, వారిని విధుల్లోకి చేర్చుకోలేమని డిపో మేనేజర్ తేల్చి చెప్పారు. దీంతో ఆందోళన చెందిన కార్మికులు మేనేజర్ కాళ్ళు మొక్కి డ్యూటీలో చేర్చుకోవాలని వేడుకున్నారు. -
ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ.. ఆశలన్నీ సీఎంపైనే
సాక్షి, హైదరాబాద్: కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమకు అనుకూలంగా సీఎం నిర్ణయం తీసుకుంటారా? లేక ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటారా అనేది ఆసక్తికరంగా మరాంది. రెండు నెలలుగా వేతనాలు లేకుండా సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని జేఏసీ ప్రతిపాదించింది. దీంతో విధుల్లో చేరతామంటూ గురువారం రాష్ట్రంలోని వివిధ డిపోలకు కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి కూడా డిపోల వద్ద ఇదే పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి తీసుకోవద్దని, విధుల్లో చేరేందుకు సిద్ధమంటూ లేఖలు ఇచ్చినా కూడా తీసుకోవద్దని డిపో మేనేజర్లకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదని మేనేజర్లు వారికి చెప్పి పంపించేస్తున్నారు. మరోవైపు ఆర్టీసిని నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలని, అంత శక్తి ప్రభుత్వ వద్ద లేదని సీఎం చేసిన వ్యాఖ్యలు కార్మికుల్లో కలవరం రేపుతున్నాయి. దీంతో వారి ఆశలన్నీ సీఎం తీసుకునే నిర్ణయంపైనే ఉన్నాయి. మరోవైపు ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇస్తూ ఆర్టీసీ రూట్లను కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ కొనసాగనుంది. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ సందర్భంగా సమ్మె విరమణ ప్రతిపాదనపై చర్చించి తన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, సమ్మెకు సంబంధించిన అంశం కార్మిక న్యాయస్థానంలోనే తేల్చాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో, అది తేలిన తర్వాతే వారిని విధుల్లోకి చేర్చుకునే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని కార్మికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
ఆర్టీసీ సమ్మె విరమణ పేరిట మోసం..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విరమణ విషయంలో కార్మిక సంఘాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే.. సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ బుధవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జేఏసీ ప్రకటనపై టీజేఎంయూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినా.. జేఏసీ-1 సమ్మె విరమించేది లేదని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. సమ్మెలో ఇప్పటివరకు 29మంది ఆర్టీసీ కార్మికులు మరణించారని ఆయన తెలిపారు. మరణించిన కుటుంబాలను ఎవరూ ఆదుకోలేదని తెలిపారు. దీనికితోడు సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని పలు డిపోల పరిధిలో కార్మికులపై కేసులు కూడా నమోదయ్యాయని, వాటిపై ఏం మాట్లాడకుండా సమ్మె విరమిస్తున్నామని జేఏసీ చెప్పడం.. కార్మికులను మోసం చేయడమేనని హనుమంతు మండిపడ్డారు. ఇలా విరమించాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడే సమ్మె విరమిస్తే సరిపోయేదని, కార్మికులను బలి పశువులను చేస్తూ జేఏసీ సమ్మె విరమణ ప్రకటన చేసిందని ఆయన అన్నారు. ఆర్టీసీ జేఏసీ కేవలం మూడు కార్మిక సంఘాలను కలుపుకొని మాత్రమే ముందుకు వెళ్తోందన్నారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అసమర్థత వల్లే ఆర్టీసీలో సమస్యలు పేరుకుపోయాయని పేర్కన్నారు. ఆర్టీసీ కార్మికులు చాలావరకు పేద వాళ్ళు అని, ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయకుండా కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ తమను పిలిచి కార్మికుల సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుతున్నామని అన్నారు. -
సాయంత్రం ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ఆర్టీసీపై సమీక్ష జరపనున్నారు. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదన, హైకోర్టులో కేసు, ఇతర అంశాలపై ఆయన చర్చించనున్నారు. కాగా ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పలు అంశాలపై అక్టోబర్ 4న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. కాగా న్యాయస్థానంలో కూడా కార్మికులకు ఊరట లభించలేదు. దీంతో విలీన ప్రతిపాదనను పది రోజుల క్రితమే ఆర్టీసీ జేఏసీ పక్కన పెట్టింది. తాజాగా ఎలాంటి షరతులు లేకుండా తమ సూచనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమణకు సిద్ధమని, లేనిపక్షంలో సమ్మె కొనసాగిస్తామని జేఏసీ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ ప్రకటనతో పలుచోట్ల కార్మికుల్లో అయోమయం నెలకొంది. సమ్మె విరమణపై కార్మికులు తర్జనభర్జన పడుతున్నారు. చదవండి: ఆర్టీసీ సమ్మె విరమణ..! సమ్మెపై సాయంత్రానికి స్పష్టత తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ... ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే ఏం చేయాలనే అంశంపై చర్చించనున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఎలాంటి షరతులు ఉండాలి, భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై చర్చించి, అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లనున్నారు. ఇక సమ్మె విరమిస్తే విధుల్లోకి చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఆదేశాల కోసం కార్మికులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వ స్పందన?!
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఆర్టీసీ కార్మికులు 47 రోజులపాటు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె ఎట్టకేలకు ముగిసింది. గత అక్టోబర్ 4వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన సమ్మెలో దాదాపు 50వేలమంది కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం విధుల్లో చేరాలని రెండుసార్లు గడువు విధించినప్పటికీ.. కార్మికులు పెద్దగా చలించలేదు. కొంతమంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. ఆర్టీసీ కార్మికుల్లో ఎక్కువశాతం దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. వారు నెలన్నరకుపైగా తమకు వచ్చే జీతాలను సైతం పణంగా పెట్టి సమ్మె చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం ముందుకు, సమాజం ముందుకు తీసుకురాగలిగారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా.. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, నిత్యావసరాల ఖర్చులు ఇలా అనేక సమస్యలు వెంటాడినా కార్మికులు మూకుమ్మడిగా నిలబడి ఉద్యమం చేశారు. ఈ సమ్మెకాలంలో పలువురు కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోయి.. ఆత్యహత్యలు చేసుకున్నారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులు తమ సమ్మెను విరమణకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, మళ్లీ సమ్మెకు పూర్వం ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం కల్పించాలని, విధుల్లోకి చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. సుదీర్ఘ సమ్మె నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమించి.. తిరిగి విధుల్లోకి చేరేందుకు సమ్మతించిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ సమ్మె విషయంలో ఒకింత చురుగ్గా వ్యవహరించారు. పలుమార్లు సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కాపాడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవంటూ ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను అంగీకరించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, వెంటనే విధుల్లోకి చేరాలని సీఎం కేసీఆర్ గతంలో రెండుసార్లు కార్మికులకు డెడ్‌లైన్ విధించారు. ఆ డెడ్లైన్లకు పెద్దగా కార్మికుల నుంచి స్పందన రాలేదు. కానీ, హైకోర్టు ఉత్తర్వులు, మారిన పరిస్థితుల నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమణకు ఒప్పుకోవడంతో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందని ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం కోరినట్టు బేషరతుగా విధుల్లోకి చేరేందుకు కార్మికులు ముందుకొచ్చారు. అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను సైతం కార్మికులు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత ఇరకాటంలో నెట్టింది. ప్రజలు కూడా ఇబ్బందుల పాలయ్యారు. ముఖ్యంగా దసరా పండుగ సమయంలో సమ్మె చేపట్టడం.. పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవ్వడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. అయితే, 50వేలమంది కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు వారికి విధుల్లో చేరేందుకు గడువు ఇచ్చింది. తాజాగా కూడా ప్రభుత్వం కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కార్మికులను బేషరతుగా ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంటుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. -
ఆర్టీసీ సమ్మె విరమణ..!
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింది. 47 రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. బేషరతుగా కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. సమ్మె విరమించి మళ్లీ విధుల్లోకి చేరుతామని ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. విధుల్లో చేరిన కార్మికులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, సమ్మెకు ముందున్న పరిస్థితులను సంస్థలో మళ్లీ కల్పించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు లేకుంటేనే కార్మికులు మళ్లీ విధుల్లోకి చేరుతారని, కార్మికులు విధుల్లో చేరితే డ్యూటీ చార్జ్‌ల మీద మాత్రమే సంతకాలు పెడతారని ఆయన తెలిపారు. సమ్మె కొనసాగింపుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు నిన్నటినుంచి తీవ్ర తర్జనభర్జనలకు లోనైన సంగతి తెలిసిందే. సమ్మె అంశాన్ని హైకోర్టు లేబర్ కోర్టుకు నివేదించడంతో.. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు పునరాలోచనలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ బుధవారం కూడా సమావేశమైంది. సమ్మె విషయమై లేబర్ కమిషన్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సమావేశంలో నేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. మరోవైపు కొనసాగింపు కార్మికుల్లో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. గత 47 రోజులుగా సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా సమ్మె కొనసాగించడం సమంజసం కాదని, ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడటంతో సమ్మె విరమణకే జేఏసీ మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. అయితే, ఉద్యోగ భద్రతపై కార్మికుల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికులు సమ్మె విరమణకు ఓకే చెప్పడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
ఆర్టీసీ సమ్మెపై సందిగ్ధం!
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలా వద్దా అనే అంశంపై విషయంలో కార్మిక సంఘాల జేఏసీ సందిగ్ధంలో పడింది. కేసు కార్మిక న్యాయస్థానానికి చేరడం, డిమాండ్లకు సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగింపు విషయంలో కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో మంగళవారం జేఏసీ ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయింది. హైకోర్టు నుంచి అందిన తుది ఉత్తర్వు ప్రతిని పూర్తిగా పరిశీలించి బుధవారం న్యాయవాదులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. అప్పటివరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. విడివిడిగా సమావేశాలు... ఒకటిగా సమాలోచనలు.. సమ్మెకు సంబంధించి హైకోర్టులో వాదనలు దాదాపు పూర్తయిన నేపథ్యంలో మంగళవారం కార్మికుల్లో కలకలం మొదలైంది. ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు వస్తాయన్న ఆశతో ఉన్న కార్మికులు... తాజా పరిణామాలతో కొంత ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం మాత్రం సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నందున, ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకొని సమ్మె విషయాన్ని తేలిస్తే బాగుంటుందంటూ జేఏసీ నేతలపై ఒత్తిడి వచ్చింది. దీంతో జేఏసీలోని కార్మిక సంఘాలు విడివిడిగా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. డిపోలవారీగా కమిటీ ప్రతినిధులను ఆహ్వానించి అభిప్రాయ సేకరణ జరిపాయి. టీఎంయూ, ఈయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, సూపర్వైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కార్మికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమ్మె విషయంపై చర్చిస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలు కొందరు అలా.. మరికొందరు ఇలా 46 రోజులపాటు ఉధృతంగా సమ్మె కొనసాగించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం, ఇప్పటికే రెండు నెలలపాటు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన నేపథ్యంలో సమ్మెను విరమించి విధుల్లో చేరడం ఉత్తమమని పెద్ద సంఖ్యలో కార్మికులు అభిప్రాయపడ్డారు. అయితే ఇన్ని రోజులు సమ్మె చేసి ఒక్క డిమాండ్‌కు కూడా ప్రభుత్వం అంగీకరించకపోయినా విధుల్లో చేరితే భవిష్యత్తులో కనీసం ఉద్యోగ భద్రత కూడా ఉండదని, తాడోపేడో తేలేంత వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని కూడా ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. సమ్మెను కొనసాగిస్తే ఉద్యోగ భద్రత కరువైందన్న ఆందోళనతో మరికొందరు మరణించే ప్రమాదం ఉన్నందున ఈ విషయాన్ని కూడా పరిగణించాలని కొందరు సూచించారు. సూపర్వైజర్ల సంఘం భేటీలో మాత్రం ఎక్కువ మంది సమ్మెను విరమించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా భిన్న వాదనలు వినిపించడంతో కార్మిక సంఘాలు ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయాయి. అనంతరం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత జేఏసీ భేటీ అయింది. అప్పటివరకు సంఘాలుగా కార్మికుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ఇందులో చర్చించారు. జేఏసీలో కూడా మళ్లీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం మొండిపట్టుతో ఉన్నందున కార్మికులు కూడా సమ్మెను కొనసాగించాలంటూ ఓ సంఘానికి చెందిన నేతలు పేర్కొన్నారు. సమ్మె విరమించాక ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకుంటే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. సమ్మె విరమించి వస్తే విధుల్లోకి తీసుకుంటామని ప్రభుత్వం నుంచి స్పష్టత కోరి దానిపై నిర్ణయం తీసుకుంటే మంచిదంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం మధ్యవర్తిత్వం నెరపడం సరికాదని మరొకరు పేర్కొన్నారు. వెరసి మరికొంత సమ యం తీసుకొని తుది నిర్ణయానికి రావాలని తీర్మానించారు. ఇందుకు న్యాయవాదులతో కూడా చర్చించాలని నిర్ణయించారు. కోర్టు పేర్కొన్న విషయాలపైనా కూలంకషంగా చర్చించాలని, ఇం దుకు న్యాయవాదులతో మాట్లాడాలని నిర్ణయించి తుది నిర్ణయాన్ని బుధవారానికి వాయిదా వేశారు. జేఏసీ నిర్ణయానికి కార్మికులు కట్టుబడతామన్నారు: అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ జేఏసీ తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డిపోలకు సంబంధించిన కమిటీల ప్రతినిధులు తేల్చిచెప్పారని సమావేశానంతరం అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం న్యాయవాదులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఇప్పటివరకు మరణించిన కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకుంటామన్నారు. మరోవైపు బుధవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన జేఏసీ–1, ఎన్ఎంయూ నేతలు తుది నిర్ణయం వెల్లడించనున్నారు. ఆ సంఘాలకు సంబంధించిన కార్మికుల్లో ఎక్కువ మంది సమ్మె కొనసాగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. -
ముగిసిన ఆర్టీసీ జేఏసీ భేటీ.. కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సమ్మె కొనసాగించాలా? వద్దా? అని దానిపై ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం ముగిసింది. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె కొనసాగింపుపై కార్మికుల అభిప్రాయం తీసుకున్నామని, ఆర్టీసీ జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికుల హామీ ఇచ్చారని వివరించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తమకు అందలేదని, కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రేపు హైకోర్టు తుది తీర్పు ప్రకటించిన తరువాత సమ్మెపై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందని, కోర్టు తీర్పు తరవాత రెండు రోజుల్లో ఆర్టీసీ జేఏసీ నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. జేఏసీ తుది నిర్ణయం తీసుకునేవరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందన్నారు. ఎల్బీనగర్ హిమగిరి ఫంక్షన్ హాల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. కార్మికుల సమ్మె అంశంతోపాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించిన అనంతరం కార్మిక సంఘాల నేతలు కీలక నిర్ణయం వెలువరించే అవకాశముంది. అంతకుముందు కార్మిక సంఘాల నేతలు విడివిడిగా సమావేశమై.. తెలంగాణవ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను డిపోలవారీగా సేకరించారు. ఎల్బీనగర్లోని హిమాగిరి ఫంక్షన్ హాల్లో టీఎంయూ నేతలు, కేకే గార్డెన్‌లోని ఈయూ నేతలు, సీఐటీయూ కార్యాలయంలో ఎస్టీఎఫ్ నేతలు, టీజేఎంయూ కార్యాలయంలో ఆ సంఘం నేతలు సమావేశమై చర్చించారు. జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఉద్యోగ భద్రతపై గ్యారెంటీ ఏది? 46 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం వాదన ఏమిటి, కార్మికుల తరఫున ఏ వాదన వినిపించారు, కోర్టులు ఏం చెప్పాయి అన్నది చర్చించారు. అయితే, సమ్మె విరమణ విషయంలో కార్మికుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేవని, ఇంకా సమ్మె కొనసాగిస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయని, లేబర్ కోర్టులో ఈ అంశం తేలడానికి చాలా సమయం పడుతుందని కొంతమంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది ఎన్ని రోజులైనా ప్రభుత్వం దిగొచ్చేవరకు సమ్మె కొనసాగించాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. ఉన్నపళంగా సమ్మె విరమిస్తే ఉద్యోగ భద్రత ఏమిటని కార్మికులు నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. సమ్మెను విరమిస్తే ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకుంటుందో లేదా అన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. కనీసం లేబర్ కోర్టులో తేలేవరకైనా సమ్మె కొనసాగించాలని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఈయూ సమావేశంలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం. బ్యాలెట్ పెట్టి కార్మికుల అభిప్రాయం తీసుకోవాలని, ప్రభుత్వం నుంచి ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ పొందిన తర్వాత సమ్మె విరమించాలని పలువురు కార్మికులు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. లేబర్ కమీషన్‌కు హైకోర్టు ఇచ్చిన 15 రోజుల సమయం వరకు వేచిచూద్దామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని కార్మికుల్లో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సమ్మెపై తర్జనభర్జన ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర తర్జనభర్జనలకు లోనవుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించడం.. సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు నివేదించడంతో ఇరకాటంలో పడిన కార్మిక సంఘాల నేతలు.. సమ్మె కొనసాగింపుపై పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 46రోజులుగా కొనసాగిస్తున్న ఆర్టీసీ సమ్మెను విరమించే అవకాశముందని సమాచారం. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశమై.. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింపుపై తుది ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. సమ్మె నేపథ్యంలో చోటుచేసుకున్న 24 మంది ఆర్టీసీ కార్మికుల మరణాలపైనా కార్మిక నేతల మధ్య చర్చ జరిగింది. కార్మికులు సమ్మె విరమించి.. బేషరతుగా విధుల్లోకి చేరేందుకు ముందుకొస్తే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కార్మికులు విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం రెండు గడువు విధించింది. ఈ డెడ్లైన్లకు అప్పట్లో పెద్దగా స్పందన రాని విషయం తెలిసిందే. -
హైకోర్టు తీర్పుకాపీ అందేవరకూ ఆందోళనలు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే.. అవి దొందూ దొందే అన్న చందంగా మారాయనే విషయం స్పష్టమవుతోందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ నాయకుడు లింగమూర్తి మూడు రోజులుగా రాంనగర్లో చేస్తున్న నిరాహార దీక్షను సోమవారం రాత్రి అఖిలపక్షం నేతలు ప్రొఫెసర్ కోదండరాం, చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం, వినోద్‌రెడ్డి, మందకృష్ణ మాదిగ, కె.గోవర్ధన్, కె.రమ తదితరులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తికరంగా లేదన్నారు. గత 45 రోజులుగా ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి కోర్టు అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటికీ సమ్మెను చట్ట వ్యతిరేకంగా గుర్తించడానికి కోర్టు అంగీకరించలేదని, కార్మికులను బిడ్డలుగా చూడాలి తప్ప అణచివేసే ధోరణి మంచిదికాదని మొదటి నుంచీ చెబుతోందని తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీ చూసేవరకు ఆందోళనలు ఆపకుండా యథావిధిగా కొనసాగుతాయని, నేడు తలపెట్టిన సడక్ బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో ప్రధాన డిమాండ్లు సాధ్యమవుతున్నప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో సాధ్యం కాకపోవడానికి కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టాలనే స్వార్థ బుద్ధే అసలు కారణమనే విషయాన్ని తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోందన్నారు. హైకోర్టు సాక్షిగా దాఖలు చేసిన పిటిషన్, కేసీఆర్ మాటలు ఒకేరకంగా ఉన్నాయన్నారు. కార్మికుల సమ్మె పట్ల కేసీఆర్ దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల 45 రోజుల సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకట్, సుధాభాస్కర్, డి.జి. నర్సింగ్‌రావు, న్యూడెమోక్రసీ నాయకులు హన్మేష్, ఎస్.ఎల్. పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె.. లేబర్ కోర్టే తేలుస్తుంది
సాక్షి, హైదరాబాద్ : ‘ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని తేల్చే అధికారం కన్సిలియేషన్ అధికారి అయిన కార్మిక శాఖ జాయింట్ కమిషనర్‌కు లేదు. సమ్మె చర్చలు విఫలమైనట్లుగా ప్రభుత్వానికి తెలియజేసే అధికారం మాత్రమే కన్సిలియేషన్ అధికారికి ఉంటుంది. సమ్మె చట్టవిరుద్ధమో కాదో తేల్చాల్సిన అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంది. సమ్మె చట్ట విరుద్ధమంటూ అక్టోబర్ 5న కన్సిలియేషన్ అధికారి ఇచ్చిన నివేదికకు అనుగుణంగా కార్మిక శాఖ కమిషనర్ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకం. ఈ విషయాన్ని తేల్చే అధికారం పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంది. మేం జారీ చేస్తున్న ఈ ఉత్తర్వుల ప్రతి అందిన రెండు వారాల్లోగా సమ్మె వ్యవహారంపై కార్మిక శాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకుని లేబర్ కోర్టుకు నివేదించాలి. ఒకవేళ ఏ నిర్ణయాన్ని తీసుకోనట్లయితే అందుకు కారణా లను వివరిస్తూ ఆర్టీసీ సమ్మె కేసులోని వాదప్రతివాదులందరికీ కూడా తెలియజేయాలి. ఈ దశలోనూ కన్సిలియేషన్ అధికారి తీసుకున్న నిర్ణయానికి ఎవరూ ప్రభావితం కారాదు. దానిని పూర్తిగా విస్మరించాలి. సమ్మె చట్టవిరుద్ధమో కాదో తేల్చడం మా పరిధిలో లేదు’అని హైకోర్టు స్పష్టంచేసింది. తాము పనిచేసే చోట మెరుగైన పరిస్థితులు కోసమే కార్మికులు సమ్మెలోకి వెళతారని, సమ్మెలోకి వెళ్లడమంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవడమని భావించడం తప్పు అని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేసింది. ఆర్టీసీ యాజమాన్యం/ప్రభుత్వం అలాంటి ముగింపునకు రావడం న్యాయసమ్మతం కాదని గుర్తుంచుకోవాలని సూచించింది. ‘ఇది ఆర్టీసీ యాజమాన్యానికో లేదా కార్మికులకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. ఉద్యోగం నుంచి తొలగిస్తే 48 వేల మంది కాకుండా లక్షల్లో ఉండే వారి కుటుంబ» సభ్యులను రోడ్డున పడేసినట్లు అవుతుంది. ఇలాంటి పరిస్థితులు వస్తే ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. లక్షలాది మంది కుటుంబ సభ్యులను అనాథలుగా చేయడం న్యాయమా అనే కోణంలో ప్రభుత్వం/ఆర్టీసీ సంస్థ ఆలోచించుకోవాలి. నిరుద్యోగం రాజ్యమేలుతున్న తరుణంలో ఉద్యోగ అర్హత వయసు మీరిన వాళ్లకు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి. అందుకే ఈ విషయాన్ని ఇటు ప్రభుత్వం అటు ఆర్టీసీ యాజమాన్యానికి వదిలేస్తున్నాం. వారు ఆదర్శనీయంగా వ్యవహరించాలి. విశాల హృదయంతో చర్యలు ఉండాలి. మానవీయతతో స్పందించాలి. అపరిష్కృతంగా ఉన్న సమ్మె వ్యవహారాన్ని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది’అని పేర్కొంటూ ఆర్టీసీ సమ్మెపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలని, సిబ్బంది డిమాండ్ల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు సోమవారం ముగిశాయి. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. సమ్మె చేస్తున్నవారికి జైలుశిక్ష వేయొచ్చు: ఏఏజీ విచారణ సందర్భంగా తొలుత ఆర్టీసీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదిస్తూ.. సమ్మె చట్ట వ్యతిరేకమని, ఈ మేరకు కన్సిలియేషన్ అధికారి కూడా ప్రకటించారని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సమ్మె చట్టవ్యతిరేకమని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించాల్సిన అవసరం కూడా లేదని, చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తున్న వారికి నెలరోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి వరకు జరిమానా విధించేందుకు చట్టంలో వీలుందని పేర్కొన్నారు. అదే చట్టంలోని 22 (1) సెక్షన్‌లోని ఎ, బి, సి, డి ప్రకారం సమ్మెలోకి వెళ్లినవారిపై చర్యలు తీసుకునే వీలుందని చెప్పారు. ఇక ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల వ్యవహారాన్ని లేబర్ కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన సిండికేట్ బ్యాంక్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించగా.. ధర్మాసనం కల్పించుకుని ఆ తీర్పు ఇక్కడి కేసులో వర్తించదని చెప్పింది. సమ్మె చట్ట వ్యతిరేకమని ఆ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పలేదని.. వాదప్రతివాదనలు, తమ వద్ద ఉన్న పత్రాల ఆధారంగా లేబర్ కోర్టు తేల్చుతుందని పేర్కొంది. తాము ముందు సమ్మె చట్ట వ్యతిరేకమా కాదా, ఈ మేరకు ప్రకటన చేసే అధికారం ఏ అధికారికి ఉంది.. అనే విషయాలనే తేల్చుతామని తెలిపింది. అయినా ఇప్పటి వరకూ ఆర్టీసీ ఈ విషయం గురించి కార్మిక శాఖ కమిషనర్‌కు ఎందుకు నివేదిక ఇవ్వలేదని ప్రశ్నించింది. హైకోర్టులో కేసు ఉన్నందున కోర్టు ధిక్కారం అవుతుందని ఏఏజీ చెప్పగా.. తామేమీ స్టే ఉత్తర్వులు ఇవ్వలేదని ధర్మాసనం గుర్తు చేసింది. హైకోర్టు పట్ల గౌవరంతో కమిషనర్‌కు నివేదించలేదని ఏజీ చెప్పారని తెలిపింది. నిజం ఎక్కడుందో తెలియడంలేదు.. యూనియన్ తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్‌రెడ్డి వాదిస్తూ.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసే విస్తృతాధికారం సెక్షన్ 89 ప్రకారం హైకోర్టుకు ఉందని చెప్పారు. వాదప్రతివాదుల్లో ఏఒక్కరు కమిటీ ఏర్పాటుకు అంగీకరించినా అందుకు అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వొచ్చునని రామానుజశర్మ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘కమిటీ ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందని ఆశించాం. ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఈ దశలో మా విస్తృతాధికారాలను వినియోగించి కమిటీ వేసినా ఆ తర్వాత కూడా అదే పరిస్థితులు ఉంటాయనే అనిపించింది. రాజ్యాంగంలోని 226 అధికరణ ప్రకారం మాకు ఆకాశమే హద్దు. అయితే మా ప్రయత్నాలు నిర్ధకం అయ్యాయి. ఇసుక రేణువంత ఆశ ఉన్నా మాకున్న విస్తృతాధికారాల అస్త్రాన్ని సంధించేవాళ్లం’అని నిస్సహాయత వ్యక్తంచేసింది. తిరిగి ప్రకాష్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ, టీఎస్ఆర్టీసీ 2016 అక్టోబర్‌లో ఏర్పడితే అంతకుముందే 2015 డిసెంబర్ 1నే ఆర్టీసీని అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలోకి తెచ్చినట్లుగా సంస్థ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని.. ఈ కేసులో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అఫిడవిట్లను దాఖలు చేశారని, వాళ్ల వాదనల్ని వాళ్లే ఖండించుకున్నారని, నిజం ఎక్కడ దాగి ఉందో తమకు తెలియడం లేదని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ అన్ని రంగాల్లోనూ ఉత్పాదకవృద్ధి సాధించడానికి కార్మికుల సేవలే ఎనలేనవని అధికారిక నివేదికలే చెబుతున్నాయని, అయిదేళ్లల్లో డీజిల్ లీటర్ ధర రూ.20 పెరిగితే అందుకు అనుగుణంగా టికెట్ల రేట్ల పెంపునకు సీఎం అనుమతి ఇవ్వలేదని సాక్షాత్తు రవాణా మంత్రి శాసనసభలో చెప్పారని ప్రకాష్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజలపై భారం పడకూడదని భావిస్తే అందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించాలేగానీ ఆర్టీసీ కాదన్నారు. ఆర్టీసీ యాజమాన్యం/ఉద్యోగుల పరస్పర విరుద్ధమైన ఈ వాదనలపై తాము స్పందించబోమని, ఈ విషయాలను లేబర్ కోర్టులో తేల్చుకోవాలని ధర్మాసనం సూచించింది. సమ్మె విరమిస్తామన్నా సర్కారు స్పందించలేదు.. ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నందున అందుకు అనుగుణంగా చర్చలు జరపాల్సిందిగా ఆదేశాలివ్వాలని ప్రకాష్‌రెడ్డి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. బస్సులు పూర్తి స్థాయిలో లేవని, ఉన్న అరకొర సౌకర్యాలను కూడా అనుభవం ఉన్న డ్రైవర్లతో నడపకపోవడంతో ప్రమాదాల శాతం పెరిగిందని, మరమ్మతులకు వచ్చిన వాటిని బాగు చేసే నాథేడే లేడని తెలిపారు. ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేయడమో, భూస్థాపితం చేయాలనే దురుద్ధేశం చాలా స్పష్టంగా కనబడుతోందని ఆరోపించారు. తొలుత విధుల్లోకి చేరాలని గడువు పెట్టి బెదిరించారని, ఇప్పుడు విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చినా ఉద్యోగాల్లో చేర్చుకుంటామనే ధీమా ఏమీ లేదని సాక్షాత్తు ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయపార్టీ నేత మాదిరిగా ఆయన అఫిడవిట్ దాఖలు చేశారని, ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. రోజూ 97 లక్షల మంది అంటే రాష్ట్ర జనాభాలో మూడో వంతు మంది ప్రజలు ఆర్టీసీ సమ్మె వల్ల ఇబ్బందులు పడకూడదనే ఉద్ధేశంతో సమ్మె విరమించాలని తాను కూడా యూనియన్‌కు సూచించానని, దీంతో సమ్మె విరమిస్తామని వారు చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ప్రకాష్‌రెడ్డి చెప్పారు. అయితే, చర్చలు జరపాలని తాము ఆదేశాలివ్వలేమని, చర్చలు స్వచ్ఛందంగా ఉండాలేగానీ బలవంతంగా ఉండకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. సమ్మె విరమణకు సిద్ధంగా ఉంటే లేబర్ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకునే వరకు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరవచ్చునని సూచించింది. ఆర్టీసీ సిబ్బంది శ్రమశక్తికి సంబంధించిన పీఎఫ్ రూ.900 కోట్లు, ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో దాచుకున్న రూ.500 కోట్లను సంస్థ తీసేసుకుందని, వాటిని చెల్లించాలని కోరితే యూనియన్ డిమాండ్లు అన్యాయమని ఎదురుదాడి చేయడం దారుణమని ప్రకాష్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఉద్యోగాల్లో చేరేందుకు వచ్చినా చేర్చుకునే అవకాశాలు లేవని సునీల్ శర్మ అధికారపార్టీ నాయకుడి మాదిరిగా అఫిడవిట్లో పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఇది వదిలిపెట్టకూడని విషయమని, కోర్టు రికార్డుల్లో ఇలాంటి అఫిడవిట్ దాఖలు చేసిన అధికారి గురించి నమోదు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని, ముస్సోరిలో ఐఏఎస్ అధికారుల శిక్షణ సరిగ్గా లేదని అర్ధం అవుతోందని వ్యాఖ్యానించింది. విధుల్లో చేర్చుకోవాలని చెప్పలేం: ధర్మాసనం ప్రయాణికులు ఇబ్బందులు పడకూదని విధుల్లో చేరేందుకు కార్మికులు వెళితే రేపు విధుల్లోకి తీసుకోకపోతే పరిస్థితి ఏమిటని ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. సమ్మె విరమణకు వారు సిద్ధంగా ఉన్నారని, విధుల్లో చేర్చుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డి స్పందిస్తూ.. ఆ విధంగా అఫిడవిట్లో లేదని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ కల్పించుకుని, సమ్మె విరమించిన వాళ్లను విధుల్లో చేర్చుకోవాలని చేరాలని ఉత్తర్వులు ఇవ్వలేమని.. ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి మాత్రమే చేస్తామని తేల్చి చెప్పారు. తిరిగి ప్రకాష్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. సుప్రీంకోర్టు 1963లో ఇచ్చిన తీర్పు ప్రకారం సమ్మె చట్టబద్ధమో, చట్టవ్యతిరేకమో తేల్చవచ్చుగానీ సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగింపునకు వీల్లేదని నివేదించారు. సంస్థలో మెరుగైన సౌకర్యాల కోసమే సమ్మెలోకి వెళ్లారని, కార్మికులు విధుల్లో చేరాలంటే ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని కోరారు. చివర్లో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, ఇదే తుది నిర్ణయం కాదని, పారిశ్రామిక వివాదాల చట్టం కింద లేబర్ కోర్టు ఉత్తర్వులు ఇస్తుందని, ఆ తర్వాత తగిన విధంగా అడుగులు ఉంటాయని చెప్పారు. వాదనలు కోర్టు సమయం ముగిసిన తర్వాత కూడా కొనసాగాయి. అనంతరం సమ్మె వ్యవహారంపై కార్మిక శాఖ కమిషనర్ స్పందించాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేస్తూ కేసు విచారణ ముగిసినట్లుగా ప్రకటించింది. స్టే కొనసాగింపు... 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అమలు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోరాదని గతంలో జారీ చేసిన స్టే ఉత్తర్వులను మంగళవారం వరకు పొడిగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. దీనిపై దాఖలైన వ్యాజ్యంతోపాటు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన మరో పిల్‌పై మంగళవారం విచారణ జరుపుతామని పేర్కొంది. -
సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. మంగళవారం తలపెట్టనున్న సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ రేపటి సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. జడ్జిమెంట్ కాపీ చూసి రేపు సాయంత్రం సమ్మెపై తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కేవలం సడక్ బంద్‌నే వాయిదా వేస్తున్నామని నిరసన దీక్షలు మాత్ర రేపు యధాతదంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. దీక్ష విరమించిన జేఏసీ నేతలు మూడు రోజులుగా ఆర్టీసీ జేఏసీ ముఖ్యనేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చేస్తున్న నిరవదిక నిరాహారదీక్షను సోమవారం సాయంత్రం విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలకు అఖిలపక్ష నాయకులు కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం,మందకృష్ణ మాదిగలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆస్పత్రిలోనే జేఏసీ నాయకులతో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. -
లేబర్ కోర్టుకు ఆర్టీసీ సమ్మె!
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై సోమవారం తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు జారీ చేసింది. ఈ అంశాన్ని కార్మిక న్యాయస్థానం చూసుకుంటుందని హైకోర్టు తెలిపింది. రెండు వారాల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కార్మిక శాఖ కమిషనర్‌కు సూచించింది. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె చట్టవిరుద్ధమని ఆదేశించలేమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. సమ్మె లీగల్, ఇల్లీగల్ అని చెప్పే అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడింది. ప్రభుత్వంతో చర్చల కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ కోరగా.. కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా కమిటీ వేయాలని ఆర్టీసీ జేఏసీ కోరింది. 45 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధర్మాసనానికి వివరించారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారం అవుతుందన్నారు. ప్రభుత్వం మాత్రం తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపిస్తూ యాక్సిడెంట్లు చేయిస్తుందని హైకోర్టుకు వివరించారు. ఈ విషయం లేబర్ కోర్టు చూసుకుటుందని, తాము ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు అభిప్రాయపడింది. సోమవారం ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ‘పిటిషినర్ కోరిన దాని ప్రకారం.. తమ ముందు రెండు అంశాలు మాత్రమే ఉన్నాయి. మొదటిది సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించడం. రెండోది కార్మికులను చర్చలకు పిలవమని ప్రభుత్వాన్ని ఆదేశించడం. సమ్మె చట్ట విరుద్ధమని చెప్పే అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంటుంది. కార్మికులను చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కోర్టుకు ఉందో లేదో చెప్పమని మొదటి నుంచి అడుగుతున్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో బస్సులు లేకపోయినా మెట్రోలో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’ అని పేర్కొంది. -
అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష భగ్నం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేవరకు నిరశన కొనసాగిస్తానంటూ స్వీయ గృహనిర్బంధం చేసుకున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థాహరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లోపలి నుంచి గడియపెట్టుకుని కొందరు కార్మికులతో కలిసి నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థారెడ్డిని పోలీసులు ఆదివారం సాయంత్రం చాకచక్యంగా అరెస్టు చేశారు. రెండు రోజుల దీక్షతో ఆయన ఆరోగ్యంగా స్వల్పంగా క్షీణించిందని వైద్యులు ప్రకటించటంతో, ఆయనను వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయన దీక్ష నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆయన ఇంటివద్దకు చేరుకుంటుండటం, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో శాంతిభద్రతల పరంగా ఉద్రిక్తతలు నెలకొనే ప్రమాదం ఉండటంతో ఆయన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఆదివారం ఉదయం నుండి ప్రయత్నించారు. కానీ ఆయన తలుపులు గడియ వేసి ఉండటంతో పోలీసులు లోనికి వెళ్లలేకపోయారు. దీక్ష నేపథ్యంలో ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్ వద్దకు పోలీసులు మీడియా ప్రతినిధులను తప్ప వేరేవారిని అనుమతించటం లేదు. కానీ అరెస్టు చేయాలంటే తలుపులు తీయాల్సి ఉండటంతో ఆదివారం సాయంత్రం వారు రూటు మార్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, వివేక్లులు వచ్చారు. వారిని అనుమతించటంతో వారు అశ్వత్థామరెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయనను కలిసి బయటకు వచ్చే క్రమంలో పోలీసులు చాకచక్యంగా లోనికి ప్రవేశించారు. దీంతో అశ్వత్థారెడ్డితోపాటు ఉన్న కార్మికులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని వారించి ఆయనను ఆరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ వైద్యులు వచ్చి పరీక్షించి బీపీ, షుగర్‌లెవల్స్ పెరిగాయని ప్రకటించారు. వెంటనే చికిత్స తీసుకోని పక్షంలో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఆరెస్టు చేసినా తన దీక్ష కొనసాగుతుందని, ఆసుపత్రిలో కొనసాగిస్తానని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి మానుకుని చర్చలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. అశ్వత్థామరెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా పోలీసులు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేశారని ఆర్టీసీ మహిళా కార్మికులు ఆరోపిస్తున్నారు. 44 రోజులుగా సమ్మె చేస్తున్నామని, తమ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించిన చర్చలకు పిలవాలని, తమ న్యాయమైన 25 డిమాండ్లను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. తమ ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వంలో ఆర్టీసీలో విలీనం అనే అంశాన్ని కూడా తాత్కాలికంగా పక్కన పెట్టామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. కాగా అంతకు ముందు నిరాహారదీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలు వివేక్, జితేందర్ రెడ్డి, రామచంద్రరావు తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులతో వివేక్, జితేందర్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. అశ్వత్థామరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన తమను ఎందుకు లోపలకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. -
రాజిరెడ్డి దీక్ష భగ్నం.. అశ్వత్థామరెడ్డికి వైద్య పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 44వ రోజు కొనసాగుతోంది. ఎల్బీనగర్లోని రెడ్డి కాలనీలో ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి కొనసాగిస్తున్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇంటి డోర్ పగలగొట్టి మరి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చే క్రమంలో రాజిరెడ్డి.. ఇంటి డోర్ వేసుకుని దీక్ష కొనసాగించారు. ఇంటి తలుపు పగలగొట్టి రాజిరెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ సమయంలో రెడ్డి కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. శనివారం నుంచి హస్తినాపూర్‌లో తన నివాసంలో అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం, ఆయన ఆరోగ్యం బాగోలేకపోతే పోలీసులు దీక్ష భగ్నం చేసి అరెస్ట్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అశ్వత్థామరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మందకృష్ణ అరెస్టు.. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మహాదీక్షకు ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందిరాపార్క్ దగ్గర ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఇందిరా పార్క్‌కు వస్తున్న నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ హబ్సిగూడలోని కృష్ణ లాడ్జ్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మందకృష్ణను అరెస్ట్ చేశారు. ఆయనను నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మందకృష్ణ విమర్శించారు. ఎట్టిపరిస్థిలోనూ భవిష్యత్తులో దీక్ష చేసి తీరుతామని అన్నారు. ఎమ్మార్పీఎస్ చేపట్టిన మహాదీక్షలో అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బలగాలు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. కొనసాగుతున్న అశ్వత్థామరెడ్డి దీక్ష చదవండి: ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఆర్టీసీ డిపోల వద్ద కార్మికుల ఆందోళన సమ్మెలో భాగంగా కార్మికులు ఆర్టీసీ డిపోల దగ్గర ఆందోళనకు దిగారు. ఖమ్మం డిపో దగ్గర బైఠాయించిన కార్మికులు... బస్సును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాలోనూ డిపోల దగ్గర ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు ఇంటి దగ్గర చీపురులతో ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు ఆర్టీసీ కార్మికులు. మరోవైపు -
నిరశనలు... అరెస్టులు
సాక్షి, హైదరాబాద్/హస్తినాపురం: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె శనివారం స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. సమ్మె కార్యాచరణలో భాగంగా శనివారం బస్ రోకో చేపట్టారు. దీనికి అనుమతి లేదని, బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందే హెచ్చరించారు. అయినా కార్మికులు శనివారం ఉదయం నుంచే డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు జేఏసీ రాష్ట్ర నేతలు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టగా వారికి మద్దతుగా అన్ని డిపోల వద్ద కార్మికులు కూడా దీక్షలు నిర్వహించటంతో స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ కార్మికులను అరెస్టు చేశారు. ముఖ్యంగా జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని గృహానిర్బంధం చేయడంతోపాటు, కోకన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తిలు చేపట్టిన దీక్షలను భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీక్షలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలపటంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. వారిని నిలవరించే క్రమంలో పోలీసులతో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. అశ్వత్థామరెడ్డి గృహ నిర్బంధం... సమ్మె కార్యాచరణలో భాగంగా శనివారం ధర్నా చౌక్ ఇందిరాపార్కు వద్ద నిరశన దీక్ష చేపట్టాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. అయితే దీనికి పోలీసులు అనుమతిత్వలేదు. దీంతో వీఎస్టీ సమీపంలోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఉదయం దీక్ష ఉండటంతో, దానిని భగ్నం చేసే క్రమంలో తెల్లవారుజామునే పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకోవాలని భావించారు. ఈ విషయం ముందుగానే ఊహించిన జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఇళ్ల వద్దకు రావాలంటూ అందుబాటులో ఉన్న కార్మికులకు సమాచారం అందించారు. హస్తినాపురం జయక్రిష్ణ ఎన్‌క్లేవ్‌లోని అశ్వత్థామరెడ్డి, రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజిరెడ్డి ఇళ్ల వద్దకు శుక్రవారం అర్ధరాత్రి దాటాక పెద్ద సంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీక్షా శిబిరం వద్దకు బయలుదేరితే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి అశ్వత్థామరెడ్డి బయటకు రాకుండా ఇంట్లోనే తలుపు గడియపెట్టుకుని ఉండిపోయారు. ఆయనతోపాటు పలువురు ఆర్టీసీ కార్మికులు కూడా ఉన్నారు. దీంతో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఇంట్లోనే దీక్ష ప్రారంభిస్తున్నట్టు ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆయనతోపాటు మహిళా కార్మికులు కూడా దీక్షలో పాల్గొన్నారు. మహిళా కార్మికులను వెలుపలికి రావాల్సిందిగా పోలీసులు కోరినా వారు తిరస్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. అశ్వత్థామరెడ్డి దీక్ష విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలేకరులను తప్పించి ఎవరినీ ఆపార్ట్‌మెంట్‌లోని అనుమతించలేదు. దీంతో పోలీసులు దమనకాండ నిర్వహిస్తున్నారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. అక్కడికి వచ్చిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, సంధ్యలను అనుమతించలేదు. ఆగ్రహానికి గురైన మందకృష్ణ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో సంధ్య గేటు దూకి లోనికి వెళ్లేందకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రెడ్డికాలనీలో ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు రాజిరెడ్డి అరెస్టు.. విడుదల.. ఇదే సమయంలో రాజిరెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజిరెడ్డి వద్దకు పోలీసులు వెళ్లకుండా చుట్టూ మహిళా కార్మికులు వలయంగా ఏర్పడ్డారు. అయినా పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని, రాజిరెడ్డిని అరెస్టు చేసి పహడీషరీఫ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడే ఆయన దీక్షను కొనసాగించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రాజిరెడ్డిని విడిచిపెట్టారు. మరో కోకన్వీనర్ లింగమూర్తి సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి బొల్లారం స్టేషన్‌ను తరలించారు. అక్కడ ఆయన దీక్ష కొనసాగించారు. సునీల్‌శర్మకు ఏం తెలుసు..?: అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఆర్టీసీ నష్టాలను పదేపదే చెబుతున్న ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోంది. నష్టాలకు కారణమైన ప్రభుత్వమే సంస్థను నిర్వీర్యం చేసింది. 17 నెలల క్రితం ఎండీగా వచ్చిన సునీల్‌శర్మకు ఆర్టీసీ గురించి ఏం తెలుసు. ఇప్పటివరకు కనీసం ఏడు సార్లు కూడా ఆయన ఆర్టీసీ కార్యాలయానికి రాలేదు. ముఖ్యమంత్రి తయారు చేసిన అఫిడవిట్లపై సునీల్‌శర్మ సంతకాలు పెడుతున్నారు. వాటిని చూస్తే అధికారుల రూపొందించినట్టు లేవు. రాజకీయ పార్టీలు తయారు చేసినట్టే ఉన్నాయి. కోర్టులు చివాట్లు పెట్టినా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవటం లేదు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. సంస్థను మూసివేసేందుకు నష్టాల ముద్ర వేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌పై వెనక్కు తగ్గినా ప్రభుత్వం పట్టించుకోకపోవటమే దీనికి నిదర్శనం. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు దిగినా కార్మికులు భయపడలేదు, భయపడరు. సమ్మె కొనసాగుతుంది. మరింత ఉధృతమవుతుంది. ప్రశాంతంగా దీక్ష చేయబోతే, పోలీసులు 144 సెక్షన్‌తో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలతో చేతులు కలిపామన్న ఆరోపణలు అవాస్తవం. తీరు మారకుంటే భవిష్యత్తులో ప్రజా క్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీకి అవమానం తప్పదు. కేరళ ఎంపీ సంఘీభావం.. రాజిరెడ్డి సహా పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకుని పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న కేరళ సీపీఐ ఎంపీ బినాయ్ విశ్వం కూడా అక్కడికి చేరుకుని సంఘీభావం తెలిపారు. కార్మికులను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడం సరి కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న వ్యవహారం, ఇక్కడి ప్రభుత్వం తీరును పార్లమెంట్లో ప్రస్తావిస్తానన్నారు. పోలీసు స్టేషన్ వద్ద మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష చేస్తే నాటి ప్రభుత్వం అనుమతించిందని, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల దీక్షకు మాత్రం అనుమతించకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలన్నారు. ప్రభుత్వ వేధింపుల కారణంగా 27 మంది కార్మికులు చనిపోయారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు జరిపిన సమ్మె కారణంగానే రాష్ట్రం ఏర్పడిందని చెప్పిన కేసీఆర్.. ప్రస్తుతం వారి పట్ల నిరంకుశంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పోలీసులు కూడా మానవత్వంతో ఆలోచించాలన్నారు. -
ఆశ్వత్థామ ఇంటి వద్ద నిరసనకు దిగిన న్యూడెమోక్రసీ నేతలు
-
ఆర్టీసీ సమ్మె: ‘జేఏసీ కీలక నిర్ణయం’
సాక్షి, హైదరాబాద్ : సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. మిగిలిన అంశాలపై తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులను ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయిస్తుందని మండిపడ్డారు. సేవ్ ఆర్టీసీ పేరుతో రేపటి నుంచి డిపోల ముందు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. కార్మికులు ఆత్మస్తైర్యాన్ని కోల్పోయి, ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని సంఘాలు, ప్రజల మద్దతు ఉందన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ నెల 15న గ్రామ గ్రామానికి బైక్ ర్యాలీ నిర్వహించి, 16న తనతో పాటు జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ నిరవధిక దీక్ష చేపట్టబోతున్నామని చెప్పారు. 17,18తేదిలలో ప్రతి డిపో ముందు 50మంది చొప్పున కార్మికులు నిరహారదీక్షకు చేపడుతారన్నారు. 19న సడక్ బంద్ పేరుతో హైదరాబాద్ నుంచి కోదాడ వరకు ర్యాలీ నిర్వహించబోతున్నామని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. -
హైపవర్ కమిటీకి ఒప్పుకోం : తేల్చిచెప్పిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు విచారణ బుధవారం కొనసాగింది. సమ్మె పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని, దీనిపై తమ అభిప్రాయం చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరగా.. ఈ కమిటీకి తాను ఒప్పుకునేది లేదని ప్రభుత్వం న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని తెలిపారు. ఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సమ్మె చట్టవిరుద్ధమని మీరెలా చెప్తారని ప్రశ్నించింది. సమ్మె పరిష్కారానికి హైపవర్ కమిటీ వేయాల్సిందేనంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది రాపోలు ఆనంద భాస్కర్ వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. ఇప్పటివరకు 27మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని పిటిషనర్లు న్యాయస్థానానికి నివేదించారు. హైపవర్ కమిటీని వేసి సమస్యను పరిష్కరించాలని రాపోలు ఆనంద భాస్కర్ కోర్టును అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను రేపటికి వాయిదా వేసింది. కార్మికుల సమ్మెపై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. చదవండి: హైపవర్ కమిటీపై సర్కార్ నిర్ణయంతో మరో మలుపు! -
తెలంగాణ ఆర్టీసీలో మరో బలిదానం
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మరో ప్రాణం బలైపోయింది. మహబూబాబాద్ డిపో డ్రైవర్ నరేష్ బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే నరేష్ ప్రాణాలు విడిచాడు. నరేష్‌కు భార్య పోలమ్మ, ఇద్దరు పిల్లలు శ్రీకాంత్, సాయికిరణ్ ఉన్నారు. అతను 2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత ఐదేళ్లుగా నరేష్ భార్య హృద్రోగంతో బాధపడుతోందని, నెలకు రూ. 5వేల మందులు వాడుతున్నారని, మరోవైపు ఇద్దరు పిల్లలు చదువుతుండటంతో నరేష్ ఆర్థికంగా అనేక బాధలు పడుతున్నాడని, ఈ క్రమంలో మొదలైన సమ్మె ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని తోటి కార్మికులు చెప్తున్నారు. నరేష్ ఆత్మహత్య వార్త తెలియడంతో అఖిలపక్ష నాయకులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇది ప్రభుత్వ హత్యేనని, కోర్టు విచారణ పేరిట కాలయాపన చేయకుండా కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి.. సమస్యను పరిష్కరించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నా చావుకు ముఖ్యమంత్రే కారణం! ఆత్మహత్య చేసుకునే ముందు ఆర్టీసీ డ్రైవర్ నరేష్ సూసైడ్ లెటర్ రాసినట్టు తెలుస్తోంది. ‘నా చావుకు ముఖ్యమంత్రే కారణం. నా వల్ల ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలి. ఆర్టీసీలో నాదే చివరి బలిదానం కావాలని ముఖ్యమంత్రిగారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నా కుటుంబానికి వచ్చిన ఇబ్బంది మరో కుటుంబానికి రాకూడదు. ఇది నేను సొంతంగా రాసిన లేఖ. నా అంత్యక్రియలకు అశ్వత్థామరెడ్డి హాజరుకావాలి. ఆర్టీసీ కార్మికులు బాగుండాలి’ అంటూ ఈ లేఖలో నరేష్ పేర్కొన్నాడు. ఈ లేఖను చూసి ఆర్టీసీ కార్మికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
ఆర్టీసీ పరిరక్షణకు 17న సబ్బండ వర్గాల మహాదీక్ష
పంజగుట్ట: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని అమ్ముకునేందుకు చూస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు దాన్ని కాపాడుకునేందుకు చూస్తున్నారు. అందుకే న్యా య వ్యవస్థతోపాటు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఆర్టీసీ కార్మికులకు లభిస్తోంది’అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. కార్మిక వర్గాలు, పేద వర్గాలను అణగదొక్కేందుకు చూస్తున్న వారికి చెమటలు పట్టించేలా కార్యాచరణ రూపొందించినట్లు ప్రకటించారు. 17న వేలాది మందితో ఇందిరాపార్క్ వద్ద ‘సబ్బండ వర్గాల మహాదీక్ష’, 18న ఆర్టీసీ జేఏసీ సడక్ బంద్‌కు సంపూర్ణ మద్దతు, 20న గవర్నర్‌ను కలసి ఆర్టీసీ ప్రైవేటీకరణతో పేదవర్గాలకు జరిగే నష్టంపై వివ రణ, 30న నాలుగు లక్షల మందితో హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామని తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల వేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంద కృష్ణ మాదిగ, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్, సామాజిక వేత్త జేబీ రాజు, మాజీ మంత్రి రవీంద్రనాయక్, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్, రాములు నాయక్ తదితరులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకుని ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.