ఆర్టీసీ సమ్మె : వెనకడుగు వేయం | TSRTC Strike: RTC workers Reluctance To Join Duty | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె : వెనకడుగు వేయం

Published Wed, Nov 6 2019 2:35 AM | Last Updated on Wed, Nov 6 2019 8:29 AM

TSRTC Strike: RTC workers Reluctance To Join Duty - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్‌ విధించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. అయినప్పటికీ తిరిగి డ్యూటీలో చేరే విషయంలో కార్మికులు వెనకడుగు వేయడంలేదు. దాదాపు 300 మంది మినహా మిగిలినవారంతా సమ్మెలోనే కొనసాగాలని నిర్ణయించు కున్నట్టు తెలుస్తోంది. డిపోల్లోనే కాకుండా పోలీసు స్టేషన్లు, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు, ఆర్టీఓ, ఎస్పీ డీఎస్పీ తదితర కార్యాలయాల్లో కూడా తిరిగి చేరికకు సంబంధించిన లేఖలు ఇవ్వచ్చని అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని చోట్ల కార్మికులు ఆయా కార్యాలయాల్లో అందజేశారు. ఆ వివరా లన్నీ పూర్తిగా క్రోడీకరించాల్సి ఉన్నందున, మంగళవారం అర్ధరాత్రి 12 వరకు ఎంతమంది కార్మికులు లేఖలు ఇచ్చారన్న విషయంలో స్పష్టత రాలేదు. దీంతో రాత్రి వరకు ఆర్టీసీ అధికారికంగా ఆ సంఖ్యను ప్రకటించలేదు. సాయంత్రం 6 గంటల వరకు 150 మంది, రాత్రి తొమ్మిది వరకు 240 మంది, 10 వరకు ఆ సంఖ్య 300కి  కాస్త అటూ ఇటూగా చేరుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం కచ్చితమైన సమాచారం తెలుస్తుందని తెలిపారు. కనీసం వేయి మందికిపైగా చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసినా.. అది సాధ్యం కాలేదు.

కార్మిక నేతలు రంగంలోకి దిగి..
ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు విధుల్లో చేరిన కార్మికులనే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని, మిగతావారికి సంస్థతో ఎలాంటి సంబంధం ఉండదని, ఇదే చివరి అవకాశమని సీఎం తేల్చి చెప్పటంతో తొలుత కార్మికుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే రెండు నెలలుగా జీతాలు లేనందున రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది కార్మికులు విధుల్లో చేరే విష యంలో కుటుంబ సభ్యులు, సన్ని హితులతో చర్చించారు. ఎక్కువ మంది చేరేందుకే ఆసక్తి కనబరిచారు. విషయం తెలిసి కార్మిక సంఘాల నేతలు వెంటనే రంగం లోకి దిగారు. సంఘాలుగా విడివిడిగా జిల్లా స్థాయి నేతలను నగరానికి పిలిపించుకుని చర్చలు జరిపారు. న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఇన్ని వేల మంది ఉద్యోగాలు తొలగించే హక్కు ప్రభుత్వానికి లేనందున అది చెల్లుబాటు కాదని, బేషరతుగా చేరాలన్న మెలికపెట్టడంతో భవిష్యత్తులో జీతాలు పొందడం సహా అన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయని, ఇన్ని రోజులు పోరాటం చేసి ఇప్పుడు చేతులెత్తేస్తే సంస్థను కాపాడు కోలేమని చెప్పారు. ఇదంతా కార్మికులందరికీ చేరేలా చర్యలు చేసుకున్నారు. దీంతో కార్మికుల్లో చాలామంది విధుల్లో చేర కుండా ఆగిపోయారు. జేఏసీలో భాగంగా ఉన్న సూపర్‌వైజరీ అసోసియేషన్‌ పరిధిలో ఉండే ఉద్యోగులు మాత్రం తిరిగి విధుల్లో చేరేందుకే ఆసక్తి కనపడింది. వారిలో కొందరు మంగళవారం రాత్రి వివిధ ప్రాంతాల్లో లేఖలు అందజేశారు. 

అఖిలపక్ష నేతలతో జేఏసీ భేటీ...
ముఖ్యమంత్రి విధించిన గడువు చివరి రోజైన మంగళవారం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపైనే ఎక్కువ సేపు చర్చించారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన మీదట, అసలు ఆర్టీసీని ప్రైవేటీకరించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదనే అంశంపై స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 31 శాతం వాటా ఉన్నందున, దాన్ని మూసివేయాలంటే కచ్చితంగా కేంద్రం అనుమతించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను కార్మికులకు తెలియజేసి.. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. మరోవైపు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు డిపోల ముందు కార్మికులు నిరసనలు వ్యక్తం చేశారు. విధుల్లో చేరేందుకు వచ్చే కార్మికులను అడ్డుకునేందుకు వారు కాపలా తరహాలో దీక్షలు నిర్వహించారు. అన్ని డిపోల వద్ద వంటావార్పు ఏర్పాటు చేసి భోజనాలు కూడా అక్కడే చేసేలా చూశారు. జిల్లాల్లో పనిచేస్తున్న దాదాపు వందమంది హైదరాబాద్‌బస్‌భవన్‌లో లేఖలివ్వటం విశేషం.

కార్మికులు భయపడొద్దు: అశ్వత్థామరెడ్డి
కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్టీసీని ప్రైవేటీకరించడం సాధ్యం కాదని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లో రాజకీయ పక్షాలతో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రకటనలు చూసి భయాందోళనకు గురికావద్దని కార్మికులకు సూచించారు. కోర్టులో సాగుతున్న న్యాయపోరాటాన్ని బలహీన పరచడానికి ముఖ్యమంత్రి వేస్తున్న ఎత్తుగడలనే సంగతి గ్రహించాలని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా జేఏసీతో చర్చలు జరిపి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈనెల 7న నిర్వహించే సడక్‌బంద్‌లో భాగంగా ఉపాధ్యాయ, ఉద్యోగులు పెన్‌డౌన్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. 9న నిర్వహించే ఛలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు కె.రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వివిధ పార్టీల నేతలు జూలకంటి రంగారెడ్డి, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరోసారి సీఎం సమీక్ష?
ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఎంతమంది విధుల్లో చేరారన్న లెక్కలకు సంబంధించి అందుబాటులో ఉన్న వివరాలను మంగళవారం రాత్రి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అధికారులు అందజేశారు. వాటిని ఆయన సీఎంకు తెలియజేశారు. దీనిపై మరోసారి ముఖ్యమంత్రి స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది. 7న హైకోర్టులో వాదనలు ఉన్నందున, మరోసారి ముఖ్యమంత్రి సమీక్షిస్తారని చెబుతున్నారు. కార్మికుల స్పందన తక్కువగా ఉన్న నేపథ్యంలో, ప్రైవేట్‌ బస్సులకు పర్మిట్లు మరిన్ని ఎక్కువగా ఇచ్చే విషయంలో కీలక ప్రకటన ఉండనుందని చెబుతున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 72.46 శాతం బస్సులు నడిచినట్లు ఆర్టీసీ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 1937 అద్దె బస్సులను కలుపుకొని మొత్తం 6,484 బస్సులు నడిచాయని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement