సాక్షి, హైదరాబాద్ : సమ్మెను తప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య గురువారం జరిగిన రెండోదఫా చర్చల్లో కూడా ఎలాంటి ఫలితం రాలేదు. టీఎస్ ఆర్టీసీ జేఏసీతో త్రిసభ్య కమిటీ రెండోదఫా చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయాయి.
ఒకవేళ కార్మికులు సమ్మెకు దిగితే.. సమ్మెను ఎదుర్కొనేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్యాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవ్వడం కార్మిక సంఘాలకు ఆగ్రహం తెప్పించింది. ఈ అంశాన్ని లేవనెత్తుతూ గురువారం చర్చల నుంచి కార్మిక సంఘాలు అర్ధంతరంగా వెళ్లిపోయాయి. ఇక, సమ్మె వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ జేఏసీకి త్రిసభ్య కమిటీ మరోసారి సూచించింది. పండుగ సందర్భంగా ఉండే రాకపోకలు, రద్దీని దృష్టిలో పెట్టుకొని సమ్మె వాయిదా వేసుకోవాలని కోరింది. అయితే, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ అమలుపై స్పష్టత ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ పట్టుబట్టింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇస్తేనే.. తమ నిర్ణయం చెబుతామని జేఏసీ నేతలు తేల్చిచెప్తున్నారు.
ప్రత్యామ్యాయ ఏర్పాట్లు..
ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రతిపాదన నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేస్తోంది. కార్మికులు సమ్మె చేస్తే.. ఆ ప్రభావం బస్సుల రాకపోకలు, ప్రయాణికులపై పడకుండా రవాణా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సోమేశ్‌కుమార్ తాజాగా దిశానిర్దేశం చేశారు. ప్రైవేటు స్కూల్ బస్సుల డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడపాలని యాజమాన్యం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకుగాను రోజుకు డ్రైవర్‌కు రూ. 1500, కండక్టర్‌కు రూ. వెయ్యి వేతనంగా ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment