సాక్షి, హైదరాబాద్ : ‘ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని తేల్చే అధికారం కన్సిలియేషన్ అధికారి అయిన కార్మిక శాఖ జాయింట్ కమిషనర్‌కు లేదు. సమ్మె చర్చలు విఫలమైనట్లుగా ప్రభుత్వానికి తెలియజేసే అధికారం మాత్రమే కన్సిలియేషన్ అధికారికి ఉంటుంది. సమ్మె చట్టవిరుద్ధమో కాదో తేల్చాల్సిన అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంది. సమ్మె చట్ట విరుద్ధమంటూ అక్టోబర్ 5న కన్సిలియేషన్ అధికారి ఇచ్చిన నివేదికకు అనుగుణంగా కార్మిక శాఖ కమిషనర్ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకం. ఈ విషయాన్ని తేల్చే అధికారం పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంది. మేం జారీ చేస్తున్న ఈ ఉత్తర్వుల ప్రతి అందిన రెండు వారాల్లోగా సమ్మె వ్యవహారంపై కార్మిక శాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకుని లేబర్ కోర్టుకు నివేదించాలి. ఒకవేళ ఏ నిర్ణయాన్ని తీసుకోనట్లయితే అందుకు కారణా లను వివరిస్తూ ఆర్టీసీ సమ్మె కేసులోని వాదప్రతివాదులందరికీ కూడా తెలియజేయాలి. ఈ దశలోనూ కన్సిలియేషన్ అధికారి తీసుకున్న నిర్ణయానికి ఎవరూ ప్రభావితం కారాదు. దానిని పూర్తిగా విస్మరించాలి. సమ్మె చట్టవిరుద్ధమో కాదో తేల్చడం మా పరిధిలో లేదు’అని హైకోర్టు స్పష్టంచేసింది.
తాము పనిచేసే చోట మెరుగైన పరిస్థితులు కోసమే కార్మికులు సమ్మెలోకి వెళతారని, సమ్మెలోకి వెళ్లడమంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవడమని భావించడం తప్పు అని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేసింది. ఆర్టీసీ యాజమాన్యం/ప్రభుత్వం అలాంటి ముగింపునకు రావడం న్యాయసమ్మతం కాదని గుర్తుంచుకోవాలని సూచించింది. ‘ఇది ఆర్టీసీ యాజమాన్యానికో లేదా కార్మికులకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. ఉద్యోగం నుంచి తొలగిస్తే 48 వేల మంది కాకుండా లక్షల్లో ఉండే వారి కుటుంబ» సభ్యులను రోడ్డున పడేసినట్లు అవుతుంది. ఇలాంటి పరిస్థితులు వస్తే ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. లక్షలాది మంది కుటుంబ సభ్యులను అనాథలుగా చేయడం న్యాయమా అనే కోణంలో ప్రభుత్వం/ఆర్టీసీ సంస్థ ఆలోచించుకోవాలి. నిరుద్యోగం రాజ్యమేలుతున్న తరుణంలో ఉద్యోగ అర్హత వయసు మీరిన వాళ్లకు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి. అందుకే ఈ విషయాన్ని ఇటు ప్రభుత్వం అటు ఆర్టీసీ యాజమాన్యానికి వదిలేస్తున్నాం. వారు ఆదర్శనీయంగా వ్యవహరించాలి. విశాల హృదయంతో చర్యలు ఉండాలి. మానవీయతతో స్పందించాలి. అపరిష్కృతంగా ఉన్న సమ్మె వ్యవహారాన్ని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది’అని పేర్కొంటూ ఆర్టీసీ సమ్మెపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలని, సిబ్బంది డిమాండ్ల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు సోమవారం ముగిశాయి. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
సమ్మె చేస్తున్నవారికి జైలుశిక్ష వేయొచ్చు: ఏఏజీ
విచారణ సందర్భంగా తొలుత ఆర్టీసీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదిస్తూ.. సమ్మె చట్ట వ్యతిరేకమని, ఈ మేరకు కన్సిలియేషన్ అధికారి కూడా ప్రకటించారని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సమ్మె చట్టవ్యతిరేకమని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించాల్సిన అవసరం కూడా లేదని, చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తున్న వారికి నెలరోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి వరకు జరిమానా విధించేందుకు చట్టంలో వీలుందని పేర్కొన్నారు. అదే చట్టంలోని 22 (1) సెక్షన్‌లోని ఎ, బి, సి, డి ప్రకారం సమ్మెలోకి వెళ్లినవారిపై చర్యలు తీసుకునే వీలుందని చెప్పారు. ఇక ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల వ్యవహారాన్ని లేబర్ కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన సిండికేట్ బ్యాంక్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించగా.. ధర్మాసనం కల్పించుకుని ఆ తీర్పు ఇక్కడి కేసులో వర్తించదని చెప్పింది. సమ్మె చట్ట వ్యతిరేకమని ఆ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పలేదని.. వాదప్రతివాదనలు, తమ వద్ద ఉన్న పత్రాల ఆధారంగా లేబర్ కోర్టు తేల్చుతుందని పేర్కొంది. తాము ముందు సమ్మె చట్ట వ్యతిరేకమా కాదా, ఈ మేరకు ప్రకటన చేసే అధికారం ఏ అధికారికి ఉంది.. అనే విషయాలనే తేల్చుతామని తెలిపింది. అయినా ఇప్పటి వరకూ ఆర్టీసీ ఈ విషయం గురించి కార్మిక శాఖ కమిషనర్‌కు ఎందుకు నివేదిక ఇవ్వలేదని ప్రశ్నించింది. హైకోర్టులో కేసు ఉన్నందున కోర్టు ధిక్కారం అవుతుందని ఏఏజీ చెప్పగా.. తామేమీ స్టే ఉత్తర్వులు ఇవ్వలేదని ధర్మాసనం గుర్తు చేసింది. హైకోర్టు పట్ల గౌవరంతో కమిషనర్‌కు నివేదించలేదని ఏజీ చెప్పారని తెలిపింది.
నిజం ఎక్కడుందో తెలియడంలేదు..
యూనియన్ తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్‌రెడ్డి వాదిస్తూ.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసే విస్తృతాధికారం సెక్షన్ 89 ప్రకారం హైకోర్టుకు ఉందని చెప్పారు. వాదప్రతివాదుల్లో ఏఒక్కరు కమిటీ ఏర్పాటుకు అంగీకరించినా అందుకు అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వొచ్చునని రామానుజశర్మ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘కమిటీ ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందని ఆశించాం. ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఈ దశలో మా విస్తృతాధికారాలను వినియోగించి కమిటీ వేసినా ఆ తర్వాత కూడా అదే పరిస్థితులు ఉంటాయనే అనిపించింది. రాజ్యాంగంలోని 226 అధికరణ ప్రకారం మాకు ఆకాశమే హద్దు. అయితే మా ప్రయత్నాలు నిర్ధకం అయ్యాయి. ఇసుక రేణువంత ఆశ ఉన్నా మాకున్న విస్తృతాధికారాల అస్త్రాన్ని సంధించేవాళ్లం’అని నిస్సహాయత వ్యక్తంచేసింది.
తిరిగి ప్రకాష్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ, టీఎస్‌ఆర్టీసీ 2016 అక్టోబర్‌లో ఏర్పడితే అంతకుముందే 2015 డిసెంబర్ 1నే ఆర్టీసీని అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలోకి తెచ్చినట్లుగా సంస్థ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని.. ఈ కేసులో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అఫిడవిట్లను దాఖలు చేశారని, వాళ్ల వాదనల్ని వాళ్లే ఖండించుకున్నారని, నిజం ఎక్కడ దాగి ఉందో తమకు తెలియడం లేదని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ అన్ని రంగాల్లోనూ ఉత్పాదకవృద్ధి సాధించడానికి కార్మికుల సేవలే ఎనలేనవని అధికారిక నివేదికలే చెబుతున్నాయని, అయిదేళ్లల్లో డీజిల్ లీటర్ ధర రూ.20 పెరిగితే అందుకు అనుగుణంగా టికెట్ల రేట్ల పెంపునకు సీఎం అనుమతి ఇవ్వలేదని సాక్షాత్తు రవాణా మంత్రి శాసనసభలో చెప్పారని ప్రకాష్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజలపై భారం పడకూడదని భావిస్తే అందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించాలేగానీ ఆర్టీసీ కాదన్నారు. ఆర్టీసీ యాజమాన్యం/ఉద్యోగుల పరస్పర విరుద్ధమైన ఈ వాదనలపై తాము స్పందించబోమని, ఈ విషయాలను లేబర్ కోర్టులో తేల్చుకోవాలని ధర్మాసనం సూచించింది.
సమ్మె విరమిస్తామన్నా సర్కారు స్పందించలేదు..
ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నందున అందుకు అనుగుణంగా చర్చలు జరపాల్సిందిగా ఆదేశాలివ్వాలని ప్రకాష్‌రెడ్డి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. బస్సులు పూర్తి స్థాయిలో లేవని, ఉన్న అరకొర సౌకర్యాలను కూడా అనుభవం ఉన్న డ్రైవర్లతో నడపకపోవడంతో ప్రమాదాల శాతం పెరిగిందని, మరమ్మతులకు వచ్చిన వాటిని బాగు చేసే నాథేడే లేడని తెలిపారు. ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేయడమో, భూస్థాపితం చేయాలనే దురుద్ధేశం చాలా స్పష్టంగా కనబడుతోందని ఆరోపించారు. తొలుత విధుల్లోకి చేరాలని గడువు పెట్టి బెదిరించారని, ఇప్పుడు విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చినా ఉద్యోగాల్లో చేర్చుకుంటామనే ధీమా ఏమీ లేదని సాక్షాత్తు ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయపార్టీ నేత మాదిరిగా ఆయన అఫిడవిట్ దాఖలు చేశారని, ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. రోజూ 97 లక్షల మంది అంటే రాష్ట్ర జనాభాలో మూడో వంతు మంది ప్రజలు ఆర్టీసీ సమ్మె వల్ల ఇబ్బందులు పడకూడదనే ఉద్ధేశంతో సమ్మె విరమించాలని తాను కూడా యూనియన్‌కు సూచించానని, దీంతో సమ్మె విరమిస్తామని వారు చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ప్రకాష్‌రెడ్డి చెప్పారు.
అయితే, చర్చలు జరపాలని తాము ఆదేశాలివ్వలేమని, చర్చలు స్వచ్ఛందంగా ఉండాలేగానీ బలవంతంగా ఉండకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. సమ్మె విరమణకు సిద్ధంగా ఉంటే లేబర్ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకునే వరకు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరవచ్చునని సూచించింది. ఆర్టీసీ సిబ్బంది శ్రమశక్తికి సంబంధించిన పీఎఫ్ రూ.900 కోట్లు, ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో దాచుకున్న రూ.500 కోట్లను సంస్థ తీసేసుకుందని, వాటిని చెల్లించాలని కోరితే యూనియన్ డిమాండ్లు అన్యాయమని ఎదురుదాడి చేయడం దారుణమని ప్రకాష్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఉద్యోగాల్లో చేరేందుకు వచ్చినా చేర్చుకునే అవకాశాలు లేవని సునీల్ శర్మ అధికారపార్టీ నాయకుడి మాదిరిగా అఫిడవిట్‌లో పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఇది వదిలిపెట్టకూడని విషయమని, కోర్టు రికార్డుల్లో ఇలాంటి అఫిడవిట్ దాఖలు చేసిన అధికారి గురించి నమోదు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని, ముస్సోరిలో ఐఏఎస్ అధికారుల శిక్షణ సరిగ్గా లేదని అర్ధం అవుతోందని వ్యాఖ్యానించింది.
విధుల్లో చేర్చుకోవాలని చెప్పలేం: ధర్మాసనం
ప్రయాణికులు ఇబ్బందులు పడకూదని విధుల్లో చేరేందుకు కార్మికులు వెళితే రేపు విధుల్లోకి తీసుకోకపోతే పరిస్థితి ఏమిటని ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. సమ్మె విరమణకు వారు సిద్ధంగా ఉన్నారని, విధుల్లో చేర్చుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డి స్పందిస్తూ.. ఆ విధంగా అఫిడవిట్‌లో లేదని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ కల్పించుకుని, సమ్మె విరమించిన వాళ్లను విధుల్లో చేర్చుకోవాలని చేరాలని ఉత్తర్వులు ఇవ్వలేమని.. ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి మాత్రమే చేస్తామని తేల్చి చెప్పారు. తిరిగి ప్రకాష్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. సుప్రీంకోర్టు 1963లో ఇచ్చిన తీర్పు ప్రకారం సమ్మె చట్టబద్ధమో, చట్టవ్యతిరేకమో తేల్చవచ్చుగానీ సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగింపునకు వీల్లేదని నివేదించారు. సంస్థలో మెరుగైన సౌకర్యాల కోసమే సమ్మెలోకి వెళ్లారని, కార్మికులు విధుల్లో చేరాలంటే ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని కోరారు. చివర్లో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, ఇదే తుది నిర్ణయం కాదని, పారిశ్రామిక వివాదాల చట్టం కింద లేబర్ కోర్టు ఉత్తర్వులు ఇస్తుందని, ఆ తర్వాత తగిన విధంగా అడుగులు ఉంటాయని చెప్పారు. వాదనలు కోర్టు సమయం ముగిసిన తర్వాత కూడా కొనసాగాయి. అనంతరం సమ్మె వ్యవహారంపై కార్మిక శాఖ కమిషనర్ స్పందించాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేస్తూ కేసు విచారణ ముగిసినట్లుగా ప్రకటించింది.
స్టే కొనసాగింపు...
5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అమలు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోరాదని గతంలో జారీ చేసిన స్టే ఉత్తర్వులను మంగళవారం వరకు పొడిగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. దీనిపై దాఖలైన వ్యాజ్యంతోపాటు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన మరో పిల్‌పై మంగళవారం విచారణ జరుపుతామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment