సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోమవారం వాదనలను కొనసాగించిన హైకోర్టు.. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమంటూ ఓ పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణయ్య హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆర్టీసీని పబ్లిక్ యూటిలిటీ సర్వీస్‌గా ప్రకటించినందున అత్యవసర సేవల (ఎస్మా) పరిధిలోకి వస్తుందని కృష్ణయ్య పేర్కొన్నారు. కాబట్టి ఆర్టీసీ సమ్మెపై ఎస్మా ప్రయోగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే, అత్యవసర సేవలు నిలిచిపోయినప్పుడు మాత్రమే ఎస్మా ప్రయోగించడానికి వీలుంటుందని, ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధంగా చెప్పలేమని హైకోర్టు పేర్కొంది.
ప్రజాప్రయోజనాల పేరిట ఆధారాలు లేకుండా విచిత్రమైన ఇష్యూస్‌ను కోర్టు ముందుకు తీసుకొస్తే.. రిలీఫ్ ఇవ్వలేమని, ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని అనేకసార్లు తాము కోరామని గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయని, ఇలాగే చేయాలని ఆదేశించలేమని పేర్కొన్న హైకోర్టు.. విచారణను రేపట్టికి వాయిదా వేసింది. ఇక, రాష్ట్రంలోని పలు రూట్లను ప్రవైటీకరిస్తూ రాష్ట్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని విచారణ సందర్భంగా ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment