labour court
-
'జీతాలిచ్చే వాళ్లపై జోకులేస్తే ఇలాగే ఉంటది', ఎలన్ మస్క్‌కు భారీ ఝులక్!
టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు ఝలక్ ఇచ్చేలా ఉద్యోగులు తమని అక్రమంగా విధుల నుంచి తొలగించడంపై ఉద్యోగులు లేబర్ కోర్ట్‌ను ఆశ్రయించుకోవచ్చంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే జరిగితే టెస్లా సంస్థ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవల టెస్లా ఉద్యోగులు ఆ సంస్థ తీరును, సీఈవో ఎలన్ మస్క్‌ను విమర్శిస్తూ ఉద్యోగులు ఇంటర్నల్ చాట్ సిస్టం (ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ)లో దుమ్మెత్తి పోశారు. బహిరంగంగా ఓపెన్ లెటర్‌ను విడుదల చేశారు. ఆ లెటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్ ఉద్యోగుల్ని (ఎంత మంది అనేది స్పష్టత లేదు) తొలగించారు. ఈ తొలగింపుతో ఉద్యోగులు మస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్లా ఉద్యోగుల పట్ల ఆయన వ్యవహార శైలి సరిగ్గా లేదని మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో టెస్లా తొలగించిన ఉద్యోగులు నేషనల్ లేబర్ రిలేషన్ బోర్డ్ (ఎన్ఎల్ఆర్బీ)లో పిటిషన్ దాఖలు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయంపై న్యాయవ్యవస్థకు చెందిన నిపుణులు స్పందిస్తున్నారు. ఎన్ఎల్ఆర్బీలో టెస్లాకు వ్యతిరేకంగా ఉద్యోగులు పిటిషన్ దాఖలు ఆ సంస్థకు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. లేబర్ చట్టాన్ని ఉల్లంఘించారని అపవాదుతో పాటు తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడం, వారికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.ఇదే అంశంపై సీటెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షార్లెట్ గార్డెన్ మాట్లాడుతూ..కోర్ట్లు కేసు ఫైల్ అయితే టెస్లా సంస్థ ఆకస్మికంగా ఉద్యోగుల్ని ఎందుకు తొలగించిందో చెప్పాల్సి ఉంటుందని అన్నారు. అలాంటిది ఏం లేదు! మస్క్‌ను విమర్శించినందుకే ఉద్యోగుల్ని తొలగించారని వస్తున్న ఆరోపణలపై టెస్లా ప్రెసిడెంట్ గ్విన్ షాట్వెల్ స్పందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను విమర్శించిన ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలిపారు. ఎందుకు వారి వల్ల సంస్థకు నష్టంతో పాటు..సాధారణ ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది. అందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్లిష్ట సమయాల్లో ఉద్యోగులు ఇలాంటి అనాలోచిత చర్యలు సరైనవి కావని ఉద్యోగులకు పంపిన లేఖలో గ్విన్ షాట్వెల్ పేర్కొన్నారు. చదవండి👉టెస్లా ఉద్యోగులు: ఎలన్ మస్క్ నీ పద్దతి మార్చుకో..లేదంటే నీకే నష్టం! -
టీసీఎస్కి న్యాయస్థానంలో చుక్కెదురు !
ఉద్యోగికి పట్ల టీసీఎస్ న్యాయస్థానం ప్రవర్తించిన తీరు పట్ల చెన్నై సిటీ కార్మిక న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్థరహితమైన కారణాలు చెప్పి ఉద్యోగులు జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించింది. ఈ మేరకు సదరు ఉద్యోగికి జరిగిన అన్యాయం సరి చేయాలంటూ తీర్పు వెలువరించింది. తిరుమలై సెల్వన్ (48) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో మేనేజర్ హోదాలో పని చేస్తున్న సమయంలో ఊహించిన విధంగా యాజమాన్యం ప్రవర్తించింది. సరైన కారణాలు పేర్కొనకుండా అతన్ని ఫ్రీలాన్సర్‌గా మారమంటూ ఒత్తిడి తెచ్చింది. దీంతో గడిచిన ఏడేళ్లుగా అతను ఫ్రీలాన్సర్‌గా పని చేస్తూ నెలకు కేవలం రూ. 10,000 జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కుటంబం గడిచేందుకు అతని భార్య కూడా పని చేస్తోంది. సరైన కారణాలు పేర్కొనకుండా తనను ఉద్యోగంలోంచి తొలగించారంటూ తిరుమలై సెల్వన్ చెన్నైలోని లేబర్కోర్టును ఆశ్రయించాడు. అతనికి మద్దతుగా ది ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్ కూడా నిలబడింది. ఇలా ఏడేళ్లలో 150 సార్లు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. మొత్తంగా ఉద్యోగంలోకి తీసుకున్న వ్యక్తిని సరైన కారణాలు చూపకుండా తొలగించడం తప్పని చెబుతూ న్యాయస్థానం తాజాగా తీర్పు ఇచ్చింది. సెల్వన్‌కు వ్యతిరేకంగా టీసీఎస్ తరఫున వినిపించిన వాదనలుఅ అర్థరహితమంటూ వ్యాఖ్యానించింది. ఒక ఉద్యోగిగా సెల్వన్ నష్టపోయిన కాలానికి సంబంధించి పూర్తి పరిహారాన్ని జీతం, ఇతర బెనిఫిట్స్‌తో సహా చెల్లించాలని టీసీఎస్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు అతన్ని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పింది. కోర్టు తీప్పు పట్ల ఐటీ ఎంప్లాయిస్ ఫోరం హర్షం వ్యక్తం చేసింది. చదవండి: రెండు వారాలు ఇంటినుంచే పని -
బేషరతుగా విధుల్లోకి తీసుకోండి..సమ్మె విరమిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. సమ్మె వ్యవహారాన్ని కార్మిక న్యాయస్థానమే తేల్చాలని, దీనికి రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ హైకోర్టు కార్మిక శాఖ కమిషనర్‌కు సూచించిన నేపథ్యంలో... ఈ వ్యవహారం ఇప్పుడు కార్మిక శాఖకు చేరింది. దీంతో కార్మిక న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని జేఏసీ బుధవారం వెల్లడించింది. విషయం కార్మిక న్యాయస్థానం పరిధిలోకి వెళ్లే అవకాశం ఉన్నందున... ప్రజలు, కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే, సమ్మెలో ఉన్న కార్మికుల ఆత్మగౌరవం కాపాడాలని, సమ్మెకు పూర్వం ఉన్న పరిస్థితి కల్పించి వారిని విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి సానుకూలత వ్యక్తమైతే సమ్మె విరమిస్తామని పేర్కొంది. లేని పక్షంలో యథాతథంగా సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. సమ్మె విషయంలో హైకోర్టులో ఊరట లభిస్తుందని ముందు నుంచి ఊహించిన కార్మికులకు.. అనుకూల నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవటంతో సమ్మె కొనసాగించే విషయంలో పునరాలోచనలో పడ్డారు. విషయం కార్మిక శాఖ పరిధిలోకి వెళ్లటం, అక్కడి నుంచి కార్మిక న్యాయస్థానానికి వెళ్లేందుకు కనీసం రెండు వారాల సమయం పట్టడం, ఆ తర్వాత తీర్పు రావటానికి మరికొంత సమయం పడుతుండటంతో సమ్మె విరమించాలంటూ జేఏసీపై ఒత్తిడి వచ్చింది. అదే సమయంలో సమ్మెను మరింత ఉధృతం చేయాలన్న ఒత్తిడి కూడా ప్రారంభమైంది. దీంతో మెజార్టీ కార్మికుల అభిప్రాయానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో మంగళవారం డిపోల స్థాయి నేతలతో జేఏసీలోని నాలుగు సంఘాలు విడివిడిగా సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. ఇందులో సమ్మె విరమించాలనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమైనా, దానికి భిన్నమైన వాదన కూడా వచ్చింది. ఆ తర్వాత జేఏసీ భేటీ అయినా ఓ నిర్ణయానికి రాలేకపోయింది. కార్మిక శాఖ ఎలా వ్యవహరించే అవకాశం ఉంది.. కార్మిక న్యాయస్థానానికి కేసు బదిలీ అయితే ఏం జరిగే అవకాశం ఉంది... తదితరాలపై న్యాయవాదుల సలహా తీసుకున్నాక తుది నిర్ణయం వెల్లడించాలని నిర్ణయించింది. హైకోర్టు పేర్కొన్న అంశాలకు సంబంధించిన పూర్తి ప్రతి ఆధారంగా బుధవారం న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించి చివరకు సమ్మె విరమణకే మొగ్గు చూపింది. ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో వివరాలను జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. కో–కన్వీనర్లు రాజిరెడ్డి, సుధ, లింగమూర్తి, థామస్‌రెడ్డితోపాటు తిరుపతి, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. సానుకూల స్పందన వస్తుందా?.. సమ్మె విరమించాక కార్మికులను విధుల్లోకి తీసుకోకుంటే పరిస్థితి గందరగోళంగా మారే ప్రమాదం ఉన్నందున ముందుగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావాల్సి ఉంటుందని నిర్ణయించి, కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలన్న ప్రతిపాదనను జేఏసీ ప్రభుత్వం ముందుంచింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే తమ ప్రధాన డిమాండ్ అంటూ పేర్కొన్నా, దాన్ని తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు 10 రోజుల క్రితమే ప్రకటించి ఓ మెట్టు దిగింది. ఇప్పుడు... 47 రోజుల పాటు ఉధృతంగా నిర్వహించిన సమ్మెనే విరమించుకునేందుకు సిద్ధమని పేర్కొంది. దీంతో మెట్టు దిగకుండా భీష్మించుకుని కూర్చున్న ప్రభుత్వం నిర్ణయంపై ప్రస్తుతం అందరి దృష్టి నిలిచింది. సమ్మె ప్రారంభమయ్యాక ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దాదాపు డజన్ పర్యాయాలు అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కోర్టులో వ్యవహరించాల్సిన తీరు, ఆర్టీసీ ప్రైవేటీకరణ, ప్రైవేటు బస్సులకు పర్మిట్ల కేటాయింపు... తదితర అంశాలపై చర్చించారు. ఈ నిర్ణయాల ప్రకారమే ఆర్టీసీ, రవాణాశాఖ నడుచుకుంది. ఇప్పుడు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో కూడా ఆర్టీసీ సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. సీఎం స్థాయిలోనే దీనిపై నిర్ణయం జరగాల్సి ఉంది. దీంతో ఆయన దీనిపై ఎప్పుడు సమీక్షించి నిర్ణయం తీసుకుంటారోనని 49,500 మంది కార్మికుల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. రెండు రోజులుగా డిపోలకు ‘ఆదేశం’.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోమవారమే సమ్మె విరమణపై కొందరు కార్మికులు ఆసక్తి చూపుతున్నారన్న మాట వినిపించింది. కార్మికులు వస్తే ఏం చెప్పాలంటూ చాలా చోట్ల డిపో మేనేజర్లు ఉన్నతాధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో నేరుగా డిపోలకు వచ్చే కార్మికుల నుంచి ఎలాంటి లేఖలు తీసుకోవద్దని, విధుల్లో చేరే విషయంలో వారితో అసలు మాట్లాడొద్దంటూ అన్ని డిపోలకు మౌఖిక ఆదేశాలందినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఫోన్లు చేసి మరీ హెచ్చరించారు. బుధవారం కూడా ఉన్నతాధికారులు మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. డ్యూటీ చార్టు, హాజరు పట్టికలో తప్ప ఎక్కడా సంతకం చేయం... ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి బుధవారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్ విభాగం ప్రతినిధులు, కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం విద్యానగర్‌లోని టీఎంయూ కార్యాలయానికి తరలివెళ్లారు. సాయంత్రం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కార్మిక న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు ఉంది. హైకోర్టు సూచనలను రెండు పక్షాలు గౌరవించాలి. కోర్టు చెప్పినట్లుగా వెంటనే విషయాన్ని లేబర్‌కోర్టుకు రిఫర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలపై కూడా ఆ కోర్టులో ప్రస్తావిస్తాం. ఇప్పుడు సమ్మెలో ఉన్న కార్మికులందరినీ తిరిగి విధుల్లోకి ఆహ్వానించాలి. ఇందులో ఎలాంటి షరతులు విధించొద్దు. కార్మికులు డ్యూటీ చార్టు, హాజరు పట్టికలపై తప్ప ఎలాంటి షరతుల ప్రతులపై సంతకాలు చేయరు. కార్మికుల ఆత్మగౌరవం నిలిచేలా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అక్టోబర్ 4న (సమ్మెకు పూర్వం) ఉన్న పరిస్థితులను కల్పించాలి. కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం స్పందించలేదు, ముందుగా మేమే స్పందించి సమ్మె విరమణ అంశాన్ని పేర్కొంటున్నాం. మా సూచనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమణకు సిద్ధం. లేని పక్షంలో సమ్మె కొనసాగిస్తాం.’’ -
ఆర్టీసీ సమ్మె.. లేబర్ కోర్టే తేలుస్తుంది
సాక్షి, హైదరాబాద్ : ‘ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని తేల్చే అధికారం కన్సిలియేషన్ అధికారి అయిన కార్మిక శాఖ జాయింట్ కమిషనర్‌కు లేదు. సమ్మె చర్చలు విఫలమైనట్లుగా ప్రభుత్వానికి తెలియజేసే అధికారం మాత్రమే కన్సిలియేషన్ అధికారికి ఉంటుంది. సమ్మె చట్టవిరుద్ధమో కాదో తేల్చాల్సిన అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంది. సమ్మె చట్ట విరుద్ధమంటూ అక్టోబర్ 5న కన్సిలియేషన్ అధికారి ఇచ్చిన నివేదికకు అనుగుణంగా కార్మిక శాఖ కమిషనర్ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకం. ఈ విషయాన్ని తేల్చే అధికారం పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంది. మేం జారీ చేస్తున్న ఈ ఉత్తర్వుల ప్రతి అందిన రెండు వారాల్లోగా సమ్మె వ్యవహారంపై కార్మిక శాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకుని లేబర్ కోర్టుకు నివేదించాలి. ఒకవేళ ఏ నిర్ణయాన్ని తీసుకోనట్లయితే అందుకు కారణా లను వివరిస్తూ ఆర్టీసీ సమ్మె కేసులోని వాదప్రతివాదులందరికీ కూడా తెలియజేయాలి. ఈ దశలోనూ కన్సిలియేషన్ అధికారి తీసుకున్న నిర్ణయానికి ఎవరూ ప్రభావితం కారాదు. దానిని పూర్తిగా విస్మరించాలి. సమ్మె చట్టవిరుద్ధమో కాదో తేల్చడం మా పరిధిలో లేదు’అని హైకోర్టు స్పష్టంచేసింది. తాము పనిచేసే చోట మెరుగైన పరిస్థితులు కోసమే కార్మికులు సమ్మెలోకి వెళతారని, సమ్మెలోకి వెళ్లడమంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవడమని భావించడం తప్పు అని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేసింది. ఆర్టీసీ యాజమాన్యం/ప్రభుత్వం అలాంటి ముగింపునకు రావడం న్యాయసమ్మతం కాదని గుర్తుంచుకోవాలని సూచించింది. ‘ఇది ఆర్టీసీ యాజమాన్యానికో లేదా కార్మికులకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. ఉద్యోగం నుంచి తొలగిస్తే 48 వేల మంది కాకుండా లక్షల్లో ఉండే వారి కుటుంబ» సభ్యులను రోడ్డున పడేసినట్లు అవుతుంది. ఇలాంటి పరిస్థితులు వస్తే ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. లక్షలాది మంది కుటుంబ సభ్యులను అనాథలుగా చేయడం న్యాయమా అనే కోణంలో ప్రభుత్వం/ఆర్టీసీ సంస్థ ఆలోచించుకోవాలి. నిరుద్యోగం రాజ్యమేలుతున్న తరుణంలో ఉద్యోగ అర్హత వయసు మీరిన వాళ్లకు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి. అందుకే ఈ విషయాన్ని ఇటు ప్రభుత్వం అటు ఆర్టీసీ యాజమాన్యానికి వదిలేస్తున్నాం. వారు ఆదర్శనీయంగా వ్యవహరించాలి. విశాల హృదయంతో చర్యలు ఉండాలి. మానవీయతతో స్పందించాలి. అపరిష్కృతంగా ఉన్న సమ్మె వ్యవహారాన్ని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది’అని పేర్కొంటూ ఆర్టీసీ సమ్మెపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలని, సిబ్బంది డిమాండ్ల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు సోమవారం ముగిశాయి. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. సమ్మె చేస్తున్నవారికి జైలుశిక్ష వేయొచ్చు: ఏఏజీ విచారణ సందర్భంగా తొలుత ఆర్టీసీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదిస్తూ.. సమ్మె చట్ట వ్యతిరేకమని, ఈ మేరకు కన్సిలియేషన్ అధికారి కూడా ప్రకటించారని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సమ్మె చట్టవ్యతిరేకమని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించాల్సిన అవసరం కూడా లేదని, చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తున్న వారికి నెలరోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి వరకు జరిమానా విధించేందుకు చట్టంలో వీలుందని పేర్కొన్నారు. అదే చట్టంలోని 22 (1) సెక్షన్‌లోని ఎ, బి, సి, డి ప్రకారం సమ్మెలోకి వెళ్లినవారిపై చర్యలు తీసుకునే వీలుందని చెప్పారు. ఇక ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల వ్యవహారాన్ని లేబర్ కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన సిండికేట్ బ్యాంక్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించగా.. ధర్మాసనం కల్పించుకుని ఆ తీర్పు ఇక్కడి కేసులో వర్తించదని చెప్పింది. సమ్మె చట్ట వ్యతిరేకమని ఆ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పలేదని.. వాదప్రతివాదనలు, తమ వద్ద ఉన్న పత్రాల ఆధారంగా లేబర్ కోర్టు తేల్చుతుందని పేర్కొంది. తాము ముందు సమ్మె చట్ట వ్యతిరేకమా కాదా, ఈ మేరకు ప్రకటన చేసే అధికారం ఏ అధికారికి ఉంది.. అనే విషయాలనే తేల్చుతామని తెలిపింది. అయినా ఇప్పటి వరకూ ఆర్టీసీ ఈ విషయం గురించి కార్మిక శాఖ కమిషనర్‌కు ఎందుకు నివేదిక ఇవ్వలేదని ప్రశ్నించింది. హైకోర్టులో కేసు ఉన్నందున కోర్టు ధిక్కారం అవుతుందని ఏఏజీ చెప్పగా.. తామేమీ స్టే ఉత్తర్వులు ఇవ్వలేదని ధర్మాసనం గుర్తు చేసింది. హైకోర్టు పట్ల గౌవరంతో కమిషనర్‌కు నివేదించలేదని ఏజీ చెప్పారని తెలిపింది. నిజం ఎక్కడుందో తెలియడంలేదు.. యూనియన్ తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్‌రెడ్డి వాదిస్తూ.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసే విస్తృతాధికారం సెక్షన్ 89 ప్రకారం హైకోర్టుకు ఉందని చెప్పారు. వాదప్రతివాదుల్లో ఏఒక్కరు కమిటీ ఏర్పాటుకు అంగీకరించినా అందుకు అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వొచ్చునని రామానుజశర్మ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘కమిటీ ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందని ఆశించాం. ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఈ దశలో మా విస్తృతాధికారాలను వినియోగించి కమిటీ వేసినా ఆ తర్వాత కూడా అదే పరిస్థితులు ఉంటాయనే అనిపించింది. రాజ్యాంగంలోని 226 అధికరణ ప్రకారం మాకు ఆకాశమే హద్దు. అయితే మా ప్రయత్నాలు నిర్ధకం అయ్యాయి. ఇసుక రేణువంత ఆశ ఉన్నా మాకున్న విస్తృతాధికారాల అస్త్రాన్ని సంధించేవాళ్లం’అని నిస్సహాయత వ్యక్తంచేసింది. తిరిగి ప్రకాష్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ, టీఎస్ఆర్టీసీ 2016 అక్టోబర్‌లో ఏర్పడితే అంతకుముందే 2015 డిసెంబర్ 1నే ఆర్టీసీని అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలోకి తెచ్చినట్లుగా సంస్థ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని.. ఈ కేసులో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అఫిడవిట్లను దాఖలు చేశారని, వాళ్ల వాదనల్ని వాళ్లే ఖండించుకున్నారని, నిజం ఎక్కడ దాగి ఉందో తమకు తెలియడం లేదని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ అన్ని రంగాల్లోనూ ఉత్పాదకవృద్ధి సాధించడానికి కార్మికుల సేవలే ఎనలేనవని అధికారిక నివేదికలే చెబుతున్నాయని, అయిదేళ్లల్లో డీజిల్ లీటర్ ధర రూ.20 పెరిగితే అందుకు అనుగుణంగా టికెట్ల రేట్ల పెంపునకు సీఎం అనుమతి ఇవ్వలేదని సాక్షాత్తు రవాణా మంత్రి శాసనసభలో చెప్పారని ప్రకాష్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజలపై భారం పడకూడదని భావిస్తే అందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించాలేగానీ ఆర్టీసీ కాదన్నారు. ఆర్టీసీ యాజమాన్యం/ఉద్యోగుల పరస్పర విరుద్ధమైన ఈ వాదనలపై తాము స్పందించబోమని, ఈ విషయాలను లేబర్ కోర్టులో తేల్చుకోవాలని ధర్మాసనం సూచించింది. సమ్మె విరమిస్తామన్నా సర్కారు స్పందించలేదు.. ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నందున అందుకు అనుగుణంగా చర్చలు జరపాల్సిందిగా ఆదేశాలివ్వాలని ప్రకాష్‌రెడ్డి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. బస్సులు పూర్తి స్థాయిలో లేవని, ఉన్న అరకొర సౌకర్యాలను కూడా అనుభవం ఉన్న డ్రైవర్లతో నడపకపోవడంతో ప్రమాదాల శాతం పెరిగిందని, మరమ్మతులకు వచ్చిన వాటిని బాగు చేసే నాథేడే లేడని తెలిపారు. ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేయడమో, భూస్థాపితం చేయాలనే దురుద్ధేశం చాలా స్పష్టంగా కనబడుతోందని ఆరోపించారు. తొలుత విధుల్లోకి చేరాలని గడువు పెట్టి బెదిరించారని, ఇప్పుడు విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చినా ఉద్యోగాల్లో చేర్చుకుంటామనే ధీమా ఏమీ లేదని సాక్షాత్తు ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయపార్టీ నేత మాదిరిగా ఆయన అఫిడవిట్ దాఖలు చేశారని, ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. రోజూ 97 లక్షల మంది అంటే రాష్ట్ర జనాభాలో మూడో వంతు మంది ప్రజలు ఆర్టీసీ సమ్మె వల్ల ఇబ్బందులు పడకూడదనే ఉద్ధేశంతో సమ్మె విరమించాలని తాను కూడా యూనియన్‌కు సూచించానని, దీంతో సమ్మె విరమిస్తామని వారు చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ప్రకాష్‌రెడ్డి చెప్పారు. అయితే, చర్చలు జరపాలని తాము ఆదేశాలివ్వలేమని, చర్చలు స్వచ్ఛందంగా ఉండాలేగానీ బలవంతంగా ఉండకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. సమ్మె విరమణకు సిద్ధంగా ఉంటే లేబర్ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకునే వరకు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరవచ్చునని సూచించింది. ఆర్టీసీ సిబ్బంది శ్రమశక్తికి సంబంధించిన పీఎఫ్ రూ.900 కోట్లు, ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో దాచుకున్న రూ.500 కోట్లను సంస్థ తీసేసుకుందని, వాటిని చెల్లించాలని కోరితే యూనియన్ డిమాండ్లు అన్యాయమని ఎదురుదాడి చేయడం దారుణమని ప్రకాష్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఉద్యోగాల్లో చేరేందుకు వచ్చినా చేర్చుకునే అవకాశాలు లేవని సునీల్ శర్మ అధికారపార్టీ నాయకుడి మాదిరిగా అఫిడవిట్లో పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఇది వదిలిపెట్టకూడని విషయమని, కోర్టు రికార్డుల్లో ఇలాంటి అఫిడవిట్ దాఖలు చేసిన అధికారి గురించి నమోదు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని, ముస్సోరిలో ఐఏఎస్ అధికారుల శిక్షణ సరిగ్గా లేదని అర్ధం అవుతోందని వ్యాఖ్యానించింది. విధుల్లో చేర్చుకోవాలని చెప్పలేం: ధర్మాసనం ప్రయాణికులు ఇబ్బందులు పడకూదని విధుల్లో చేరేందుకు కార్మికులు వెళితే రేపు విధుల్లోకి తీసుకోకపోతే పరిస్థితి ఏమిటని ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. సమ్మె విరమణకు వారు సిద్ధంగా ఉన్నారని, విధుల్లో చేర్చుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డి స్పందిస్తూ.. ఆ విధంగా అఫిడవిట్లో లేదని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ కల్పించుకుని, సమ్మె విరమించిన వాళ్లను విధుల్లో చేర్చుకోవాలని చేరాలని ఉత్తర్వులు ఇవ్వలేమని.. ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి మాత్రమే చేస్తామని తేల్చి చెప్పారు. తిరిగి ప్రకాష్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. సుప్రీంకోర్టు 1963లో ఇచ్చిన తీర్పు ప్రకారం సమ్మె చట్టబద్ధమో, చట్టవ్యతిరేకమో తేల్చవచ్చుగానీ సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగింపునకు వీల్లేదని నివేదించారు. సంస్థలో మెరుగైన సౌకర్యాల కోసమే సమ్మెలోకి వెళ్లారని, కార్మికులు విధుల్లో చేరాలంటే ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని కోరారు. చివర్లో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, ఇదే తుది నిర్ణయం కాదని, పారిశ్రామిక వివాదాల చట్టం కింద లేబర్ కోర్టు ఉత్తర్వులు ఇస్తుందని, ఆ తర్వాత తగిన విధంగా అడుగులు ఉంటాయని చెప్పారు. వాదనలు కోర్టు సమయం ముగిసిన తర్వాత కూడా కొనసాగాయి. అనంతరం సమ్మె వ్యవహారంపై కార్మిక శాఖ కమిషనర్ స్పందించాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేస్తూ కేసు విచారణ ముగిసినట్లుగా ప్రకటించింది. స్టే కొనసాగింపు... 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అమలు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోరాదని గతంలో జారీ చేసిన స్టే ఉత్తర్వులను మంగళవారం వరకు పొడిగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. దీనిపై దాఖలైన వ్యాజ్యంతోపాటు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన మరో పిల్‌పై మంగళవారం విచారణ జరుపుతామని పేర్కొంది. -
లేబర్ కోర్టు న్యాయాధికారి గాంధీ అరెస్టు
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి మల్లంపేట గాంధీని ఏసీబీ అధికారులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. రాత్రి 7.30 గంటల సమయంలో నాటకీయ పరిణామాల మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించారు. గాంధీపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ వారాసిగూడలోని గాంధీ నివాసంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో దొరికిన పత్రాలు, బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గాంధీని అరెస్టు చేసి, ఆయన నివాసం నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు :గాంధీ ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో మల్లంపేట గాంధీకి వైద్యపరీక్షలు నిర్వహించారు. గాంధీ తనకు గుండెపోటు వస్తోందని, కాలేయ సమస్య ఉందని, శ్వాస ఆడటంలేదని చెప్పడంతో సాయం త్రం 5 వరకు వైద్య పరీక్షలు, స్కానింగ్‌లు నిర్వహించారు. అనంతరం ఏసీబీ అధికారులు ఆయన్ను మెట్టుగూడలోని న్యాయమూర్తి ఎదుట హజరుపర్చారు. అనంతరం గాంధీని ప్రత్యేక వాహనంలో చంచల్‌గూడ జైలుకు తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్న సమయంలో గాంధీ కుటుంబ సభ్యులు, బంధువులు మీడియాను అడ్డుకున్నారు. వీడియోలు, ఫొటోలు తీయరాదంటూ అడ్డంగా నిలబడి హడావుడి చేశారు. కాగా, చంచల్‌గూడ జైలు వైద్యులు గాంధీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
న్యాయవ్యవస్థలో తోలిసారి.. న్యాయాధికారి అరెస్ట్ !
-
న్యాయాధికారి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థలో సంచలనం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా పనిచేస్తున్న మల్లంపేట గాంధీని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఓ న్యాయాధికారి ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో అరెస్టు కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనా ర్హం. శనివారం సమీప బంధువు ఇచ్చి న ఫి ర్యాదు ఆధారంగా గాంధీపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు... హైదరాబాద్‌తోపాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం ఏడు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ఇళ్లు, స్థలాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.20కోట్లకు పైగా అక్రమ ఆస్తులను ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా మీడియాతో గాంధీ మాట్లాడారు. వ్యక్తిగత కోపంతో బంధువుల్లోని కొందరు అనిశాకు తప్పుడు సమాచారం అందించారన్నారు. తన భార్యకు వారి తల్లిదండ్రులు ఇచ్చిన బంగారాన్ని సైతం అక్రమాస్తులంటున్నారని పేర్కొన్నారు. మీడియాతో మాట్లడాక ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఏసీబీ అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
లేబర్ కోర్టు న్యాయాధికారిపై ఏసీబీ కేసు
సాక్షి, హైదరాబాద్ : న్యాయవ్యవస్థలో శనివారం సంచలనం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా పనిచేస్తున్న మల్లంపేట గాంధీపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. ఓ న్యాయాధికారిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే తొలి సారి కావడం గమనా ర్హం. సమీప బంధువు ఇచ్చి న ఫి ర్యాదు ఆధారంగా గాంధీపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు... హైదరాబాద్‌తోపాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం ఏడు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ఇళ్లు, స్థలాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.3.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. శనివారం రాత్రి అనంతరం కూడా సో దాలు కొనసాగుతున్నాయి. సమీప బంధువు ఫిర్యాదుతో గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆయన సమీప బంధువు ఒక రు ఇటీవల ఏసీబీ డీజీ పూర్ణ చంద్రరావుకు ఫిర్యాదు చేశారు. అన్ని వివరాలు, ఆధారాలు సమర్పించారు. దీనిపై ప్రాథమిక సమాచారం తెప్పించుకున్న ఏసీబీ అధికారులు.. గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించుకున్నారు. ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు ఇటీవల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను కలసి.. తమకు అందిన ఫిర్యాదు, తాము సేకరించిన ఆధారాలను సమర్పించారు. పూర్తిస్థాయి ఆధారాలు ఉండటంతో గాంధీపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదుకు ఏసీజే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు శనివారం గాంధీపై కేసు నమోదు చేసి... హైదరాబాద్‌తోపాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, మరికొన్ని చోట్ల గాంధీ, ఆయన సమీప బంధువుల నివాసాల్లో ఏకకాలం లో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఐదేళ్లకు పైగా ఒకే కోర్టులో.. మల్లంపేట గాంధీకి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు న్యాయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2015లో హైదరాబాద్‌లోని నాగోల్‌లో జరిగిన గాంధీ కుమార్తె వివాహ వేడుకల్లో ఆ నేత చాలాసేపు గడిపారని కొందరు న్యాయాధికారులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే ఢిల్లీస్థాయిలో కీలక పదవిలో ఉన్న ఓ నేతకు సైతం గాంధీ అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. ఓ దశలో గాంధీ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏకంగా ఐదేళ్లకుపైగా కొనసాగారు. ఓ న్యాయాధికారి ఒకే కోర్టులో ఐదేళ్లకుపైగా కొనసాగడాన్ని అసాధారణ విషయంగా చెప్పుకోవచ్చు. దాడుల్లో ఏసీబీ గుర్తించిన ఆస్తులివీ.. ఏసీబీ అధికారుల సోదాల్లో రూ.3.57 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలివీ.. బంజారాహిల్స్‌లో రూ.10.52 లక్షల విలువైన ఫ్లాట్ డీడీ కాలనీలో రూ.33.51 లక్షల విలువైన ఫ్లాట్ వారాసిగూడలో రూ.35 లక్షల విలువైన ఇల్లు వారాసిగూడలోనే రూ.70 లక్షల విలువైన నూతన మూడు అంతస్తుల భవనం రూ.12.30 లక్షల విలువైన వెర్నా కారు రూ.17 లక్షల విలువైన కారోలా ఆల్టిస్ కారు రూ.3.5 లక్షల విలువైన ఆల్టో కారు రూ.60 వేల విలువైన హోండా యాక్టివా టూ వీలర్ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వెంకటాయపాలెంలో రూ.48.65 లక్షల విలువైన వ్యవసాయ భూమి ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కరగపాడులో రూ.23 లక్షల విలువైన 8.73 ఎకరాల భూమి రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్లో రూ.30 లక్షల విలువైన 1.5 కేజీల బంగారం బ్యాంకు లాకర్లో రూ.2 లక్షల విలువగల 4 కేజీల వెండి అభరణాలు బ్యాంకు ఖాతాలో రూ.9 లక్షల నగదు నిల్వ.. ఇంట్లో రూ.89 వేల నగదు రూ.6 లక్షల విలువైన గృహోపకరణాలు రూ.33 లక్షల విలువగల చిట్టీల డబ్బు -
లేఆఫ్స్‌పై లేబర్ కోర్టును ఆశ్రయించిన టెకీలు
సాక్షి, బెంగుళూరు: టెక్ మహీంద్రలో ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో మహారాష్ట్ర కార్మిక శాఖ విఫలం కావడంతో ఐటీ ఉద్యోగుల ఫోరం 11 వివాదాలకు సంబంధించి లేబర్ కోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించింది. బాధిత ఉద్యోగులు పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 2 ఏ కింద పిటిషన్లు వేశారని ఫోరం కో-ఆర్డినేటర్ ఇలవరసన్ రాజా తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం ఏ ఉద్యోగినైనా సంస్థ తొలగించిన పక్షంలో దాన్ని పారిశ్రామిక వివాదంగా పరిగణిస్తారు. కాగా దీనిపై స్పందించిన టెక్ మహీంద్ర న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. గతంలో ఓ ఉద్యోగిని బలవంతంగా తొలగించేలా కంపెనీ హెచ్ఆర్ అధికారులు వ్యవహరించిన ఆడియో క్లిప్‌లు వెలుగు చూడటంతో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా క్షమాపణలు వేడుకున్న విషయం తెలిసిందే. పలు ఐటీ కంపెనీలు ఇటీవల ఉద్యోగులను పెద్దసంఖ్యలో తొలగిస్తున్నాయి. విప్రో, కాగ్నిజెంట్ సహా పలు ఐటీ కంపెనీలు సామర్థ్య మదింపు పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. -
ప్రధాని సతీమణికి భారీ జరిమానా
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సతీమణికి లేబర్ కోర్టు భారత కరెన్సీలో సుమారు 30 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. గతంలో నమోదైన కేసును విచారించి తమ తీర్పును వెల్లడించింది. నెతన్యాహు భార్య సారా నెతన్యాహు తమ ఇంట్లో పనిచేసే స్టాఫ్ పై వ్యక్తిగత దూషణకు దిగిందని గతంలో ఫిర్యాదులు అందాయి. మెని నఫ్టాలి అనే వ్యక్తి గతంలో సారా ఇంట్లో ఉంటూ ఆమె కెర్ టేకర్ గా ఉండేవాడు. అయితే ఆవేశానికి లోనైన సారా తనను అవమానించడంతో పాటు దూషించిందని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన లేబర్ న్యాయస్థానం నఫ్టాలి చెప్పిన వివరాలపై స్పందించి ప్రధాని సతీమణికి జరిమానా విధించింది. ఈ పరిహారాన్ని నఫ్టాలికి చెల్లించాలని తీర్పునిచ్చింది. తనపై చేసినవన్నీ అసత్యాలంటూ సారా కొట్టిపారేశారు. ఇంట్లో పనిచేసే వారితో పద్ధతిగానే వ్యవహరించానని పేర్కొన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. గతంలోనూ హౌస్ కీపర్ పై ఆమె దురుసుగా ప్రవర్తించిందంటూ కేసు నమోదు కాగా, ఆ వ్యవహారం కోర్టు వరకు వెళ్లకుండానే సెటిల్ చేసుకున్న విషయం విదితమే.