
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, కమిటీ ఏర్పాటుకు తాము అంగీకరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరపాలని ఆయన కోరారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ అనంతరం మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటుతో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చదవండి: ఆర్టీసీ సమ్మె: హైకోర్టు కీలక నిర్ణయం
సమ్మె చేస్తున్న కార్మికులపై ఎస్మా ప్రయోగానికి హైకోర్టు ఒప్పుకోలేదని, సమ్మె చట్ట విరుద్ధమని ఎక్కడ ప్రస్తావించలేదని అశ్వత్థామరెడ్డి గుర్తు చేశారు. కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని, ఈ విషయమై బుధవారంలోగా తమకు ప్రభుత్వ అభిప్రాయాన్ని చెప్పాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment