Sunil Sharma
-
‘జైపూర్ డైలాగ్స్’తో సంబంధం లేదు..సునీల్ శర్మ వివరణ
జైపూర్: లోక్‌సభ ఎన్నికలు సమీస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే గురువారం విడుదల చేసిన మూడో జాబితాలో రాజస్థాన్‌లోని జైపూర్ నియోజకవర్గంలో సునీల్ శర్మకు అవకాశం కల్పించింది కాంగ్రెస్. అయితే బీజేపీకి సంబంధించిన ఓ యూట్యూబ్ ఛానెల్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు ఉన్న సునీల్ శర్మకు కీలకమైన జైపూర్ స్థానాన్నికేటాయించటం చర్చనీయాంశం అయింది. తరచూ కాంగ్రెస్‌పై విమర్శలు చేసే.. బీజేపీ అనుకూలమైన వార్తలు ప్రసారం చేసే ‘జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్‌ను ఆయన 2016లో మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజయ్ దిక్షిత్తో కలిసి ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సునీల్ శర్మ జైపూర్ అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని కోరుతున్నారు. I am in no way related to the Jaipur dialogues YouTube channel or Twitter handle. This is completely fake news and false propaganda being floated to diminish the prospects of the Congress Party. — Sunil Sharma (@I_SunilSharma) March 23, 2024 ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై సునీల్ శర్మ స్వయంగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘నాకు జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్ లేదా ట్విటర్ హాండిల్‌తో ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీని అపహాస్యం చేయడానికి వ్యాప్తి చేస్తున్న తప్పుడు వార్తలు, అసత్య ప్రచారం’ అని సునీల్ శర్మ ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారు. ‘నాకు జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్‌తో ఎటువంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు, భావాలు తెలియజేయటం కోసం నేను టీవీ, యూట్యూట్ ఛానెల్స్ ఆహ్వానిస్తే వెళ్తుంటాను. అదే విధంగా జైపూర్ డైలాగ్స్ కూడా సామాజిక సమస్యలపై కాంగ్రెస్ పార్టీ విజన్ గురించి మాట్లాడటానికి నన్ను ఆహ్వానించింది. నేను మతం పేరుతో జరిగే ఉన్మాదాన్ని బలంగా వ్యతిరేకిస్తాను’ అని సునీల్ శర్మ అన్నారు. జైపూర్ డైలాగ్స్‌కు సునీల్ శర్మ డైరెక్టర్ అంటూ.. సోషల్ మీడియా ప్రచారం జరుగుతోందని అది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వదంతులు సృష్టిస్తున్నారని తెలిపారు. -
గ్లోబల్ లైట్‌హౌస్ సిటీగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో గ్లోబల్ లైట్‌హౌస్ సిటీగా అభివృద్ధి చేయడానికి బ్రిటన్ సహకారంతో రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ(రెడ్కో) రూపొందించిన నివేదికను రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ బ్రిటన్ మంత్రి నైజెల్ ఆడమ్స్‌తో కలసి శనివారం ఇక్కడ ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పరిశోధనలపై పెట్టుబడులు పెట్టి, పరీక్షించి చూసే ప్రయోగశాలను లైట్‌హౌస్ సిటీగా పరిగణిస్తారు. దశలవారీగా అమలు చేయాల్సిన ప్రణాళికలను ఈ నివేదికలో సిఫారసు చేశారు. ప్రధానంగా యూకేలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల ఆధారంగా ఈ సిఫారసులు చేశారు. ఈ సిఫారసులు అమలులోకి వస్తే రూ.30,360 కోట్ల పెట్టుబడులతోపాటు 1.20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలంగాణ రెడ్కో ఒక ప్రకటనలో తెలిపింది. దీనికితోడు 2030 నాటికి వాతావరణంలో 45.84 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ కాలుష్యాన్ని నివారించగలమని తెలిపింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్, యూకే ప్రభుత్వ సహకారంతో రూపలక్పన చేసిన ‘టీఎస్ఈవీ’వెబ్‌పోర్టల్‌ను సైతంఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. సాంకేతిక మార్పిడికి యూకే, భారత ప్రధానుల మధ్య గతంలో జరిగిన ఒప్పందంలో భాగంగా యూకే ఈ మేరకు సహకారాన్ని అందించింది. కార్యక్రమంలో రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ జానయ్య, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తదితరులు పాల్గొన్నారు. -
వారికి రిలీఫ్‌లు లేవు: ఆర్టీసీ ఎండీ
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లపాటు ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పటంతో కొత్తగా ఏర్పడ్డ డిపో సంక్షేమ మండళ్ల సభ్యులకు రిలీఫ్‌లు కేటాయించకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. రోజువారీ విధులు నిర్వర్తిస్తూనే అదనంగా సిబ్బంది సమస్యల పరి ష్కారం కోసం దృష్టి సారించాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ స్పష్టం చేశారు. ఈ సంక్షేమ మండళ్లు అందుబాటులోకి వచ్చి నెలరోజులు గడిచినందున, వాటి నిర్వహణలో ఉన్న ఇబ్బందులు తెలుసుకుని, తగు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటుగా మరింత పకడ్బందీగా వ్యవహరించేందుకు సాధారణ శిక్షణ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. బస్‌భవన్‌లో మంగళవారం జరిగిన కరీంనగర్ జోన్ పరిధిలోని డిపో మేనేజర్లు, అకౌంట్స్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని సునీల్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కొందరు డిపో మేనేజర్లు, సంక్షేమ మండళ్ల సభ్యులు తమకు విధులు లేకుండా రిలీఫ్‌లు కేటాయించాలని కోరుతున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 200 మందిని మించి సభ్యులున్నం దున, వారికి రిలీఫ్‌లు ఇస్తే సంస్థపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. రోజు కాసేపు మాత్రమే సిబ్బంది సమస్యలపై దృష్టి సారిస్తే సరిపోతుందని, ఇందుకు పెద్దగా సమయం పట్టనందున ప్రత్యేకంగా రిలీఫ్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
సిటీ ఏసీ బస్సు చార్జీల తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగర ప్రయాణికుల కు ‘చల్లటి’ ప్రయాణాన్ని అందించేందుకు ప్రారం భించిన ఏసీ మెట్రో లగ్జరీ బస్సుల చార్జీలను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే వాటి టికెట్ ధరలను ఎంతమేర తగ్గించాలనే విషయంలో అధికారులు కసరత్తు పూర్తి చేశారు. తుది ఆమోదం కోసం ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మకు పంపారు. ఆయ న ఆమోదం రాగానే కొత్త చార్జీలు అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 1 నుంచి సిటీ ప్రయాణికులకు కొత్త సంవత్సరం కానుకగా అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నగరంలో ఈ కేటగిరీకి సంబంధించి 80 బస్సులు తిరుగుతున్నాయి. వాటిని వోల్వో కంపెనీ నుంచి ఐదేళ్ల కింద కొనుగోలు చేశారు. ఉప్పల్ నుంచి వేవ్‌రాక్, లింగంపల్లి నుంచి ఎల్బీనగర్, లింగంపల్లి నుంచి దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్ నుంచి విమానాశ్రయం, సికింద్రాబాద్ నుంచి ఎల్బీనగర్.. ఇలా తిప్పుతున్నారు. ఎంత తగ్గిస్తారో..?! ఏసీ బస్సుల్లో ప్రస్తుతం లింగంపల్లి నుంచి ఎల్బీనగర్కు టికెట్ చార్జీ రూ.110గా ఉంది. అదే లింగంపల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు రూ.80గా ఉంది. ఉప్పల్ నుంచి వేవ్‌రాక్‌కు కూడా అంతే వసూలు చేస్తున్నారు. మెట్రో రైలు కంటే ఇది చాలా ఎక్కువ. దీంతో బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. ఇప్పుడు రూ.110గా ఉన్న టికెట్ ధరను రూ.75కు, రూ.80గా ఉన్న చార్జీని రూ.50కి తగ్గించబోతున్నట్లు సమాచారం. కనిష్ట టికెట్ ధర రూ.20 అలాగే కొనసాగిస్తూ, మూడు స్టాప్ల తర్వాత చార్జీలను సవరించనున్నట్లు సమాచారం. దీంతో కొన్ని స్టాపులకు మెట్రో డీలక్స్ బస్సు సర్వీసు కంటే రూ.5 చార్జీ మాత్రమే ఎక్కువగా ఉండబోతోంది. దీంతో ప్రయాణికులు ఈ బస్సుల వైపు మళ్లే అవకాశం ఉంటుందనేది ఆర్టీసీ ఆలోచన. -
ఉద్యోగుల మృతి కలచివేసింది
సాక్షి, హైదరాబాద్: సమ్మె సమయంలో మృతిచెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగావకాశం కల్పించిన నేపథ్యంలో వారికి సంస్థ శిక్షణను ప్రారంభించింది. మొత్తం 38 మందికిగాను ఖమ్మంకు చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యులు ఉద్యోగం బదులు నగదు సాయం కోరారు. మిగతా 37 మందిలో నలుగురు వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. మిగతావారికి హకీంపేటలోని ఆర్టీసీ శిక్షణా కేంద్రంలో బుధవారం నుంచి శిక్షణ ప్రారంభించారు. అంతకుముందు వారితో ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ బస్‌భవన్‌లో భేటీ అయ్యారు. అక్కడే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉద్యోగుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సమ్మె సమయంలో అంతమంది ఉద్యోగులు చనిపోవటం కలిచివేసిందన్నారు. కొత్తగా సంస్థలోకి వస్తున్న వీరికి చక్కటి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం నాటికి ఉద్యోగులు అంతా బోనస్ తీసుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవటం పెను విషాదంగా పేర్కొన్నారు. వారిని అధికారులు ఓదార్చారు. జూనియర్ అసిస్టెంట్స్‌కు 13 వారాలు, కండక్టర్లకు 3 వారాలు, సెక్యూ రిటీ కానిస్టేబుల్స్‌కు 8 వారాలు, శ్రామిక్‌లకు 2 వారాలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. మీ ఆర్టీసీ ఎలాగుంది..? పరిశీలనకు రాజస్థాన్ ఆర్టీసీ అడ్వైజర్ సాక్షి, హైదరాబాద్: నష్టాల కుప్పగా మారి, సమ్మెతో అతలాకుతలమై, తిరిగి గాడిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న మన ఆర్టీసీ పరిస్థితిని ఇప్పుడు రాజస్తాన్ ఆర్టీసీ అధ్యయనం చేయబోతోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ రవాణా సంస్థలు తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు చవిచూస్తున్నాయి. చిన్న ఆర్టీసీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ బస్సులతో ఉన్న రాజస్తాన్ ఆర్టీసీ టీఎస్ఆర్టీసీని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇక్కడ అనుసరిస్తున్న తీరును తెలుసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్టీసీ ఫైనాన్స్ అడ్వైజర్ గుప్తా గురు, శుక్రవారాల్లో టీఎస్ఆర్టీసీ అధికారులతో భేటీ కాబోతున్నారు. సమ్మెతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకునేందుకు ఆర్టీసీ శ్రమిస్తున్న సమయంలో ఈ అధ్యయనానికి రానుండటం విశేషం. -
వారం పదిరోజుల్లో హామీలు అమలయ్యేలా చూడండి: సునీల్ శర్మ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీకి ఇచ్చిన హామీలను వారం పది రోజుల్లోగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉద్యోగుల సంక్షేమ బోర్డు కార్యలాపాలను ఈవారంలోనే ప్రారంభించాలని సూచించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. డిపో స్థాయి, రీజియన్, కార్పొరేషన్ స్థాయిలో ఉద్యోగ సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందున వాటి విధివిధానాలను ఖరారు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులను హేతుబద్ధీకరించాలని, తద్వారా తక్కువ మంది ప్రయాణికులతో బస్సులు తిరిగే పరిస్థితిని నివారించాలన్నారు. పెరిగిన చార్జీల ద్వారా గరిష్ట ఆదాయం పొందేలా షెడ్యూల్ ఉండాలని పేర్కొన్నారు. మహిళా సిబ్బందికి కొత్త యూనిఫాం ఆప్రాన్లను అందించాలన్నారు. సిబ్బంది ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాలను ఒక్కొక్కటిగా ఆయన సమీక్షించారు. వీటిపై త్వరలో సీఎం భేటీ నిర్వహించే అవకాశం ఉన్నందున ఈలోపు వాటిని అమల్లోకి తెచ్చేలా చూడాలని ఆదేశించారు. -
టీఎస్ఆర్టీసీలో కొత్త లొల్లి..
-
ఆంధ్రావాళ్లం.. ఏపీకి పంపండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న ప్పుడు తెలంగాణ ఆర్టీసీలో నియమితులైన ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులిప్పుడు తమను ఏపీకి మార్చాలని కోరుతున్నారు. ఏపీలో పుట్టి అక్కడే ప్రాథమిక విద్యనభ్యసించినందున తమను ఏపీఎస్ఆర్టీసీలోకి మార్చాలని తాజాగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మల కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో వినతులు పంపుతున్నారు. ఆర్టీసీలో ఏర్పడ్డ సంక్షోభంతో.. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఏపీకి చెందిన చాలామంది హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని జిల్లాల్లో ఆర్టీసీలో నియమితులయ్యారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో కొంతమంది మాత్రమే ఏపీకి వెళ్లాలనుకున్నారు. మిగతావారు ఇక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో 58:42 దామాషా ప్రకారం ఉద్యోగుల మార్పిడి జరిగినా, ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోనే సిబ్బంది ఎక్సెస్ కావటంతో ఇక్కడి వారిని తీసుకో లేదు. అక్కడి నుంచే కొందరు తెలంగాణకు వచ్చారు. ఆ తర్వాత ఎవరూ సొంత ప్రాంతానికి బదిలీ చేయాలని కోరిన సందర్భాలు కూడా లేవు. కానీ ఇటీవల ఆర్టీసీలో ఏర్పడ్డ సంక్షోభం వారిని ఆలోచనలో పడేసింది. సమ్మె సమయంలో కార్మికులకు ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ అగాధం, ఆర్టీసీలో సగం మేర ప్రైవేటీకరణ కసరత్తు నేపథ్యంలో అసలు ఉద్యోగాలుంటాయో లేదోనన్న ఆందోళనలో కార్మికులు గడిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం నిర్ణయించటంతో కథ సుఖాంతమైంది. అయినా.. భవిష్యత్తుపై కొంతమందిలో ఆందోళన మాత్రం కొనసాగుతోంది. ఏపీలో విలీనం వైపు.. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే కసరత్తు వేగంగా జరుగుతుండటంతో కార్మికుల్లో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదని ప్రభుత్వం అప్పట్లోనే తేల్చి చెప్పింది. వీటన్నింటిని పరిగణించి ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు ఆ రాష్ట్రానికి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో తాము ఏపీకి చెందిన వారమని, ప్రాథమిక విద్య అంతా అక్కడే జరిగిందని, ఓటరు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయని, తమ తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారని, వృద్ధులైనందున వారితో తాము ఉండాల్సిన అవసరం ఉందని... ఇలాంటి కారణాలు చూపుతూ ఇప్పుడు అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. కొంతమంది తమ భార్య/భర్త ఏపీలో ఉద్యోగం చేస్తున్నారన్న కారణాన్ని చూపుతున్నారు. ఇలా డిపో మేనేజర్లు మొదలు ముఖ్యకార్యదర్శి కార్యాలయం వరకు రెండు మూడ్రోజులుగా వినతులు వస్తున్నాయి. తాజాగా కొందరు రిజిస్టర్ పోస్టు రూపంలో మంత్రి పువ్వాడ కార్యాలయానికే తమ వినతులు పంపారు. టీఎస్ఆర్టీసీలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు దాదాపు 3 వేల మంది వరకు ఉన్నట్టు సమాచారం. అది సాధ్యం కాదు: ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగుల బదిలీ అనేది అధికారుల స్థాయిలో జరిగే నిర్ణయం కాదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ‘ఆర్టీసీ ఇంకా కేంద్రం దృష్టిలో ఉమ్మడిగానే ఉంది. స్థానికత ఆధారంగా ఉద్యో గుల బదిలీ కావాలంటే కేంద్రం కనుసన్నల్లోనే జరగాలి. లేదంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగుల వినతులతో బదిలీ చేయటం కుదరదు’అని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. -
ఆర్టీసీ రూట్ మ్యాప్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 5,100 బస్సులను ప్రైవేటు పర్మిట్లతో తిప్పేందుకు అనుమతించే విషయంలో కేబినెట్ ఆమోదం తెలపడంతో మిగతా సగం బస్సులను ఆర్టీసీ పరిధిలో ఎలా నిర్వహించాలన్న అంశాన్ని ఖరారు చేయనుంది. దీనికి సంబంధించి గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ అధీనంలో సగం బస్సులను ఉంచి మిగతా సగం రూట్లను ప్రైవేటు బస్సులు తిప్పుకునేలా వాటి యజ మానులకు స్టేజీ క్యారియర్ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఉన్నపళంగా ప్రైవేటు పర్మిట్లు జారీ చేయాలా లేక కొంతకాలం ఆగాక ఈ ప్రక్రియ ను చేపట్టాలా అనే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయానికి రాలేదు. ఆ ప్రక్రియ ఎలా ఉం డాలనే అంశంపై ఇప్పటికే ఆర్టీసీ–రవాణాశాఖ అధికారులు రూట్‌మ్యాప్ తయారు చేశారు. దీనికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేస్తే నోటిఫికేషన్ జారీ కానుంది. గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై మరోసారి చర్చించనున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె విరమించిన నేపథ్యంలో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటంతో మంత్రివర్గ భేటీలో సర్కారు దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. రూ. వెయ్యి కోట్లు ఇవ్వండి...: మంత్రివర్గ భేటీ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు, జేటీసీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఆర్టీసీ నిర్వహణపై అధికారులను ఆయన ప్రశ్నించగా ప్రస్తుతానికి రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని వారు కోరినట్లు తెలిసింది. ఆర్టీసీ సహకార పరపతి సంఘం, ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను చెల్లిస్తే కొంత ఉపశమనం ఉంటుందని, యథావిధిగా బస్సులు తిప్పితే క్రమంగా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రూ. వెయ్యి కోట్లు కేటాయించే పరిస్థితి లేదని సీఎం తెలిపినట్లు సమాచారం. దీంతో అంతమేర ఆర్టీసీ ఆస్తుల విక్రయం అంశాన్ని అధికారులు ప్రస్తావించగా రూ. వెయ్యి కోట్లు వచ్చే ఆస్తులెక్కడివని సీఎం వ్యాఖ్యానించినట్లు, ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలించాలని సూచించినట్లు తెలియవచ్చింది. ఇంత మంది సిబ్బందినేం చేస్తారు? సగం బస్సులను ప్రైవేటీకరిస్తే మిగతా సగం బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీకి తక్కువ మంది సబ్బందే అవసరమవుతారు. కానీ సమ్మె చేసిన 49,300 మంది సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటే సంస్థపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. దీంతో వీఆర్ఎస్ పథకాన్ని అమలు చేసి అదనంగా ఉన్న వారిని ఇళ్లకు పంపే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ చేపట్టిన సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాలేదు. ఒకవేళ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఈ విషయం చర్చకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఈ అంశంపై కసరత్తు చేసి కేబినెట్ సమావేశమయ్యేలోగా వివరాలను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి వీఆర్ఎస్ వర్తింపజేయాలనే దిశగా సమాచారాన్ని సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. దీంతోపాటు నాలుగైదేళ్ల తర్వాత ప్రైవేటు పర్మిట్ల విధానం ప్రారంభిస్తే ఈలోగా పదవీవిరమణ రూపంలో సిబ్బంది సంఖ్య తగ్గుతుందనే అభిప్రాయాన్ని కూడా అధికారులు వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. షరతులతోనే విధుల్లోకి! సమ్మె చేసిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే కచ్చితంగా షరతుల ఆధారంగానే తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. భవిష్యత్తులో యూనియన్లు ఉండకుండా చేసే దిశగా ప్రభుత్వం ఆలోచనలున్నట్లు తెలుస్తోంది. యూనియన్లతో సంబంధం లేకుండా పనిచేసేలా కార్మికులు అంగీకార పత్రంపై సంతకం చేసి ఇవ్వాలనే షరతు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇకపై సమ్మెల జోలికి వెళ్లబోమని కూడా కార్మికులు నిర్దిష్ట హామీ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత సమ్మె కాలానికి కూడా కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి ఆర్టీసీకి లేని నేపథ్యంలో వేతన సవరణ గడువును నాలుగేళ్ల నుంచి సడలించి ఐదారేళ్ల గడువు విధించే అవకాశం కనిపిస్తోంది. ఈ షరతులను కూడా ఖరారు చేసి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రెండు రోజులు ‘మంత్రాంగం’! ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మరుసటి రోజు, అంటే శుక్రవారం కూడా కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశముందని ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్టీసీ, కార్మికుల భవితవ్యంపైనే ప్రధానంగా ఈ భేటీలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆర్టీసీ భవితవ్యంపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇతర పెండింగ్ అంశాలను సైతం ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఈ సమావేశానికి సంబంధించిన ఏజెండా బుధవారం ఖరారు కానుందని సచివాలయ వర్గాలు తెలిపాయి. -
కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదు: సునీల్ శర్మ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సూచించిన ప్రక్రియ ముగిసే వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ ప్రకటించారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం ప్రగతి భవన్లో ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన అనంతరం సునీల్‌శర్మ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. సమ్మె చేయాలని ప్రభుత్వం చెప్పలేదు.. ‘ఓ వైపు పోరాటం కొనసాగుతుందని ప్రకటిస్తూనే మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెబుతున్నారు. ఇష్టమొచ్చినప్పు డు విధులకు గైర్హాజరై, మళ్లీ విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థలోనూ ఉండదు. ఆర్టీసీ కార్మికులు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం లేదా ప్రభుత్వం సమ్మె చేయాలని చెప్పలేదు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి ముఖ్య పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించా రు. కార్మికులు ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదు’ అని సునీల్‌శర్మ తేల్చి చెప్పారు. అంతా చట్టప్రకారం జరుగుతుంది.. ‘హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మికశాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు చేపడు తుంది. అంతా చట్ట ప్రకారం జరుగుతుంది. అప్పటివరకు అంతా సంయమనం పాటించాలి. హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదు. వారంతట వారుగా సమ్మెకు దిగి ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదు’అని సునీల్‌శర్మ పేర్కొన్నారు. తాత్కాలిక సిబ్బందిని అడ్డగిస్తే క్షమించం.. ‘కార్మికులు యూనియన్ల మాట విని నష్టపోయారు. ఇకపై కూడా యూనియన్ల మాట విని మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దు. మం గళవారం డిపోలవద్దకు వెళ్లి శాంతిభద్రతల సమస్యలు సృష్టిం చొద్దు. బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకోవద్దని కోరుతున్నా. డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తాం. ఎవరైనా చట్టాన్నిఉల్లంఘిస్తే ప్రభుత్వం లేదా ఆర్టీసీ యాజమాన్యం క్షమించదు. చట్టపరమైన చర్యలు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేస్తాం. హైకోర్టు సూచించిన ప్రక్రియ ప్రకారం లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకొనే వరకు సంయమనం పాటించాలని కోరుతున్నా’అని సునీల్ శర్మ కార్మికులకు సూచించారు. -
ఆర్టీసీ కార్మికులకు భారీ షాక్..
సాక్షి, హైదరాబాద్ : సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ కార్మికులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రకటనపై స్పందించిన యాజమాన్యం.. వారిని విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. మంగళవారం ఉదయం విధులకు హాజరవుతామని కార్మిక సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్మిక సంఘాల ప్రకటనపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ జేఏసీ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని సునీల్ శర్మ పేర్కొన్నారు. కార్మికులు పండగ సమయాల్లో అనాలోచితంగా సమ్మె చేసి.. ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని విమర్శించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మె చేసి.. ఇప్పుడు వచ్చి విధుల్లో చేరతామంటే కుదరదని అన్నారు. తాత్కాలిక డ్రైవర్లను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు డిపోల వద్ద శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని కార్మికులకు సూచించారు. అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. పరిస్థితులను సమీక్షిస్తామని తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ కార్మికులకు సమ్మె చేయమని చెప్పలేదని వ్యాఖ్యానించారు. హైకోర్టు సూచించిన ప్రకారం లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకునేవరకు వేచి చూడాలని కార్మికులకు సూచించారు. ఆ నిర్ణయం ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుందని.. అప్పటివరకు సంయమనం పాటించాలని కోరారు. కార్మికులు యూనియన్ల మాటలు విని ఇప్పటికే నష్టపోయారు.. ఇక ముందు వారి మాటలు విని నష్టాలు కోరి తెచ్చుకోవద్దని అన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆర్టీసీ యాజమాన్యం క్షమించదని తెలిపారు. చదవండి : ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గిన జేఏసీ -
సునీల్ శర్మ టీఆర్ఎస్ ఏజెంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని విపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులను ప్రభావితం చేస్తున్నాయని సునీల్ శర్మ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విపక్ష పార్టీల నేతలు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాయి. గవర్నర్‌ను కలిసిన అనంతరం విపక్ష పార్టీల నేతలతో కలిసి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కార్మికులు ఎప్పుడొచ్చినా విధుల్లో చేర్చుకోవాలని హైకోర్టు సూచించిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని కోరేందుకు త్వరలో అఖిలపక్ష పార్టీల నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేపట్టబోమని గతంలో సీఎం కేసీఆర్ స్వయంగా పేర్కొన్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ గుర్తు చేశారు. సునీల్ శర్మను ఆర్టీసీ ఎండీ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి మండిపడ్డారు. ప్రజాసమస్యలను చర్చించేందుకు గవర్నర్ తమకు సమయం ఇస్తున్నారు కానీ, సీఎం కేసీఆర్ ఇవ్వడం లేదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై గవర్నర్‌కు ఉన్న శ్రద్ధ సీఎంకు లేదన్నారు. ఇప్పటివరకు 28 మంది కార్మికులు గుండెపోటుతో మృతి చెందినా కేసీఆర్‌కు కనికరం లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. -
ఆర్టీసీ సమ్మె.. లేబర్ కోర్టే తేలుస్తుంది
సాక్షి, హైదరాబాద్ : ‘ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని తేల్చే అధికారం కన్సిలియేషన్ అధికారి అయిన కార్మిక శాఖ జాయింట్ కమిషనర్‌కు లేదు. సమ్మె చర్చలు విఫలమైనట్లుగా ప్రభుత్వానికి తెలియజేసే అధికారం మాత్రమే కన్సిలియేషన్ అధికారికి ఉంటుంది. సమ్మె చట్టవిరుద్ధమో కాదో తేల్చాల్సిన అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంది. సమ్మె చట్ట విరుద్ధమంటూ అక్టోబర్ 5న కన్సిలియేషన్ అధికారి ఇచ్చిన నివేదికకు అనుగుణంగా కార్మిక శాఖ కమిషనర్ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకం. ఈ విషయాన్ని తేల్చే అధికారం పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంది. మేం జారీ చేస్తున్న ఈ ఉత్తర్వుల ప్రతి అందిన రెండు వారాల్లోగా సమ్మె వ్యవహారంపై కార్మిక శాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకుని లేబర్ కోర్టుకు నివేదించాలి. ఒకవేళ ఏ నిర్ణయాన్ని తీసుకోనట్లయితే అందుకు కారణా లను వివరిస్తూ ఆర్టీసీ సమ్మె కేసులోని వాదప్రతివాదులందరికీ కూడా తెలియజేయాలి. ఈ దశలోనూ కన్సిలియేషన్ అధికారి తీసుకున్న నిర్ణయానికి ఎవరూ ప్రభావితం కారాదు. దానిని పూర్తిగా విస్మరించాలి. సమ్మె చట్టవిరుద్ధమో కాదో తేల్చడం మా పరిధిలో లేదు’అని హైకోర్టు స్పష్టంచేసింది. తాము పనిచేసే చోట మెరుగైన పరిస్థితులు కోసమే కార్మికులు సమ్మెలోకి వెళతారని, సమ్మెలోకి వెళ్లడమంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవడమని భావించడం తప్పు అని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేసింది. ఆర్టీసీ యాజమాన్యం/ప్రభుత్వం అలాంటి ముగింపునకు రావడం న్యాయసమ్మతం కాదని గుర్తుంచుకోవాలని సూచించింది. ‘ఇది ఆర్టీసీ యాజమాన్యానికో లేదా కార్మికులకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. ఉద్యోగం నుంచి తొలగిస్తే 48 వేల మంది కాకుండా లక్షల్లో ఉండే వారి కుటుంబ» సభ్యులను రోడ్డున పడేసినట్లు అవుతుంది. ఇలాంటి పరిస్థితులు వస్తే ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. లక్షలాది మంది కుటుంబ సభ్యులను అనాథలుగా చేయడం న్యాయమా అనే కోణంలో ప్రభుత్వం/ఆర్టీసీ సంస్థ ఆలోచించుకోవాలి. నిరుద్యోగం రాజ్యమేలుతున్న తరుణంలో ఉద్యోగ అర్హత వయసు మీరిన వాళ్లకు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి. అందుకే ఈ విషయాన్ని ఇటు ప్రభుత్వం అటు ఆర్టీసీ యాజమాన్యానికి వదిలేస్తున్నాం. వారు ఆదర్శనీయంగా వ్యవహరించాలి. విశాల హృదయంతో చర్యలు ఉండాలి. మానవీయతతో స్పందించాలి. అపరిష్కృతంగా ఉన్న సమ్మె వ్యవహారాన్ని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది’అని పేర్కొంటూ ఆర్టీసీ సమ్మెపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలని, సిబ్బంది డిమాండ్ల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు సోమవారం ముగిశాయి. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. సమ్మె చేస్తున్నవారికి జైలుశిక్ష వేయొచ్చు: ఏఏజీ విచారణ సందర్భంగా తొలుత ఆర్టీసీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదిస్తూ.. సమ్మె చట్ట వ్యతిరేకమని, ఈ మేరకు కన్సిలియేషన్ అధికారి కూడా ప్రకటించారని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సమ్మె చట్టవ్యతిరేకమని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించాల్సిన అవసరం కూడా లేదని, చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తున్న వారికి నెలరోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి వరకు జరిమానా విధించేందుకు చట్టంలో వీలుందని పేర్కొన్నారు. అదే చట్టంలోని 22 (1) సెక్షన్‌లోని ఎ, బి, సి, డి ప్రకారం సమ్మెలోకి వెళ్లినవారిపై చర్యలు తీసుకునే వీలుందని చెప్పారు. ఇక ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల వ్యవహారాన్ని లేబర్ కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన సిండికేట్ బ్యాంక్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించగా.. ధర్మాసనం కల్పించుకుని ఆ తీర్పు ఇక్కడి కేసులో వర్తించదని చెప్పింది. సమ్మె చట్ట వ్యతిరేకమని ఆ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పలేదని.. వాదప్రతివాదనలు, తమ వద్ద ఉన్న పత్రాల ఆధారంగా లేబర్ కోర్టు తేల్చుతుందని పేర్కొంది. తాము ముందు సమ్మె చట్ట వ్యతిరేకమా కాదా, ఈ మేరకు ప్రకటన చేసే అధికారం ఏ అధికారికి ఉంది.. అనే విషయాలనే తేల్చుతామని తెలిపింది. అయినా ఇప్పటి వరకూ ఆర్టీసీ ఈ విషయం గురించి కార్మిక శాఖ కమిషనర్‌కు ఎందుకు నివేదిక ఇవ్వలేదని ప్రశ్నించింది. హైకోర్టులో కేసు ఉన్నందున కోర్టు ధిక్కారం అవుతుందని ఏఏజీ చెప్పగా.. తామేమీ స్టే ఉత్తర్వులు ఇవ్వలేదని ధర్మాసనం గుర్తు చేసింది. హైకోర్టు పట్ల గౌవరంతో కమిషనర్‌కు నివేదించలేదని ఏజీ చెప్పారని తెలిపింది. నిజం ఎక్కడుందో తెలియడంలేదు.. యూనియన్ తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్‌రెడ్డి వాదిస్తూ.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసే విస్తృతాధికారం సెక్షన్ 89 ప్రకారం హైకోర్టుకు ఉందని చెప్పారు. వాదప్రతివాదుల్లో ఏఒక్కరు కమిటీ ఏర్పాటుకు అంగీకరించినా అందుకు అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వొచ్చునని రామానుజశర్మ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘కమిటీ ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందని ఆశించాం. ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఈ దశలో మా విస్తృతాధికారాలను వినియోగించి కమిటీ వేసినా ఆ తర్వాత కూడా అదే పరిస్థితులు ఉంటాయనే అనిపించింది. రాజ్యాంగంలోని 226 అధికరణ ప్రకారం మాకు ఆకాశమే హద్దు. అయితే మా ప్రయత్నాలు నిర్ధకం అయ్యాయి. ఇసుక రేణువంత ఆశ ఉన్నా మాకున్న విస్తృతాధికారాల అస్త్రాన్ని సంధించేవాళ్లం’అని నిస్సహాయత వ్యక్తంచేసింది. తిరిగి ప్రకాష్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ, టీఎస్ఆర్టీసీ 2016 అక్టోబర్‌లో ఏర్పడితే అంతకుముందే 2015 డిసెంబర్ 1నే ఆర్టీసీని అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలోకి తెచ్చినట్లుగా సంస్థ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని.. ఈ కేసులో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అఫిడవిట్లను దాఖలు చేశారని, వాళ్ల వాదనల్ని వాళ్లే ఖండించుకున్నారని, నిజం ఎక్కడ దాగి ఉందో తమకు తెలియడం లేదని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ అన్ని రంగాల్లోనూ ఉత్పాదకవృద్ధి సాధించడానికి కార్మికుల సేవలే ఎనలేనవని అధికారిక నివేదికలే చెబుతున్నాయని, అయిదేళ్లల్లో డీజిల్ లీటర్ ధర రూ.20 పెరిగితే అందుకు అనుగుణంగా టికెట్ల రేట్ల పెంపునకు సీఎం అనుమతి ఇవ్వలేదని సాక్షాత్తు రవాణా మంత్రి శాసనసభలో చెప్పారని ప్రకాష్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజలపై భారం పడకూడదని భావిస్తే అందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించాలేగానీ ఆర్టీసీ కాదన్నారు. ఆర్టీసీ యాజమాన్యం/ఉద్యోగుల పరస్పర విరుద్ధమైన ఈ వాదనలపై తాము స్పందించబోమని, ఈ విషయాలను లేబర్ కోర్టులో తేల్చుకోవాలని ధర్మాసనం సూచించింది. సమ్మె విరమిస్తామన్నా సర్కారు స్పందించలేదు.. ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నందున అందుకు అనుగుణంగా చర్చలు జరపాల్సిందిగా ఆదేశాలివ్వాలని ప్రకాష్‌రెడ్డి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. బస్సులు పూర్తి స్థాయిలో లేవని, ఉన్న అరకొర సౌకర్యాలను కూడా అనుభవం ఉన్న డ్రైవర్లతో నడపకపోవడంతో ప్రమాదాల శాతం పెరిగిందని, మరమ్మతులకు వచ్చిన వాటిని బాగు చేసే నాథేడే లేడని తెలిపారు. ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేయడమో, భూస్థాపితం చేయాలనే దురుద్ధేశం చాలా స్పష్టంగా కనబడుతోందని ఆరోపించారు. తొలుత విధుల్లోకి చేరాలని గడువు పెట్టి బెదిరించారని, ఇప్పుడు విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చినా ఉద్యోగాల్లో చేర్చుకుంటామనే ధీమా ఏమీ లేదని సాక్షాత్తు ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయపార్టీ నేత మాదిరిగా ఆయన అఫిడవిట్ దాఖలు చేశారని, ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. రోజూ 97 లక్షల మంది అంటే రాష్ట్ర జనాభాలో మూడో వంతు మంది ప్రజలు ఆర్టీసీ సమ్మె వల్ల ఇబ్బందులు పడకూడదనే ఉద్ధేశంతో సమ్మె విరమించాలని తాను కూడా యూనియన్‌కు సూచించానని, దీంతో సమ్మె విరమిస్తామని వారు చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ప్రకాష్‌రెడ్డి చెప్పారు. అయితే, చర్చలు జరపాలని తాము ఆదేశాలివ్వలేమని, చర్చలు స్వచ్ఛందంగా ఉండాలేగానీ బలవంతంగా ఉండకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. సమ్మె విరమణకు సిద్ధంగా ఉంటే లేబర్ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకునే వరకు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరవచ్చునని సూచించింది. ఆర్టీసీ సిబ్బంది శ్రమశక్తికి సంబంధించిన పీఎఫ్ రూ.900 కోట్లు, ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో దాచుకున్న రూ.500 కోట్లను సంస్థ తీసేసుకుందని, వాటిని చెల్లించాలని కోరితే యూనియన్ డిమాండ్లు అన్యాయమని ఎదురుదాడి చేయడం దారుణమని ప్రకాష్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఉద్యోగాల్లో చేరేందుకు వచ్చినా చేర్చుకునే అవకాశాలు లేవని సునీల్ శర్మ అధికారపార్టీ నాయకుడి మాదిరిగా అఫిడవిట్లో పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఇది వదిలిపెట్టకూడని విషయమని, కోర్టు రికార్డుల్లో ఇలాంటి అఫిడవిట్ దాఖలు చేసిన అధికారి గురించి నమోదు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని, ముస్సోరిలో ఐఏఎస్ అధికారుల శిక్షణ సరిగ్గా లేదని అర్ధం అవుతోందని వ్యాఖ్యానించింది. విధుల్లో చేర్చుకోవాలని చెప్పలేం: ధర్మాసనం ప్రయాణికులు ఇబ్బందులు పడకూదని విధుల్లో చేరేందుకు కార్మికులు వెళితే రేపు విధుల్లోకి తీసుకోకపోతే పరిస్థితి ఏమిటని ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. సమ్మె విరమణకు వారు సిద్ధంగా ఉన్నారని, విధుల్లో చేర్చుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డి స్పందిస్తూ.. ఆ విధంగా అఫిడవిట్లో లేదని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ కల్పించుకుని, సమ్మె విరమించిన వాళ్లను విధుల్లో చేర్చుకోవాలని చేరాలని ఉత్తర్వులు ఇవ్వలేమని.. ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి మాత్రమే చేస్తామని తేల్చి చెప్పారు. తిరిగి ప్రకాష్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. సుప్రీంకోర్టు 1963లో ఇచ్చిన తీర్పు ప్రకారం సమ్మె చట్టబద్ధమో, చట్టవ్యతిరేకమో తేల్చవచ్చుగానీ సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగింపునకు వీల్లేదని నివేదించారు. సంస్థలో మెరుగైన సౌకర్యాల కోసమే సమ్మెలోకి వెళ్లారని, కార్మికులు విధుల్లో చేరాలంటే ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని కోరారు. చివర్లో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, ఇదే తుది నిర్ణయం కాదని, పారిశ్రామిక వివాదాల చట్టం కింద లేబర్ కోర్టు ఉత్తర్వులు ఇస్తుందని, ఆ తర్వాత తగిన విధంగా అడుగులు ఉంటాయని చెప్పారు. వాదనలు కోర్టు సమయం ముగిసిన తర్వాత కూడా కొనసాగాయి. అనంతరం సమ్మె వ్యవహారంపై కార్మిక శాఖ కమిషనర్ స్పందించాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేస్తూ కేసు విచారణ ముగిసినట్లుగా ప్రకటించింది. స్టే కొనసాగింపు... 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అమలు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోరాదని గతంలో జారీ చేసిన స్టే ఉత్తర్వులను మంగళవారం వరకు పొడిగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. దీనిపై దాఖలైన వ్యాజ్యంతోపాటు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన మరో పిల్‌పై మంగళవారం విచారణ జరుపుతామని పేర్కొంది. -
ఆధారాలుంటే జైలుకు పంపండి : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ యూనియన్లతో కలసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయంటూ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ హైకోర్టులో దాఖలు పిటిషన్ దాఖలు చేయడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. తాము ఆర్టీసీ యూనియన్ల తో కలసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని భావించడం లేదని, అలాంటి ఆలోచనే తమకు లేదని స్పష్టంచేశారు. తమ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలను తన అధికారిక నివాసానికి పిలిపించుకుని కాంగ్రెస్ పార్టీని అస్థిరపర్చేందుకు సీఎం కేసీఆరే ప్రయత్నించారని, అయినా తాము రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నామని చెప్పారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్య నేతలతో కలసి ఉత్తమ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీనియర్ ఐఏఎస్ అధికారి హైకోర్టులో... అది కూడా ప్రధాన న్యాయమూర్తి ముందు లిఖిత పూర్వకంగా పచ్చిఅబద్ధం ఎలా చెబుతారని, దీన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. అవసరమైతే సీబీఐ లాంటి సంస్థలతో విచారణ జరిపించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నిన ఆధారాలుంటే తమను జైలు కు పంపాలని, లేదంటే ఐఏఎస్ అధికారి సునీల్‌శర్మపై చర్యలు తీసుకుని డిస్మిస్ చేయాలని హైకోర్టును కోరారు. సునీల్‌శర్మ ఎవరి ప్రోద్బలంతో ఇలా చేస్తున్నారో తేల్చాలన్నారు. దీన్ని తామూ సీరియస్‌గా తీసుకుంటామని, చట్టపరంగా హైకోర్టులో అప్పీల్ చేస్తామని, డీవోపీటీ దృష్టికి తీసుకెళ్తామని, ఈ అంశాన్ని పార్లమెంటులో కూడా ప్రస్తావిస్తామని ఉత్తమ్ చెప్పారు. రాష్ట్రం కేసీఆర్ జాగీర్ కాదు ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ఏపీఎస్ఆర్టీసీ గిన్నీస్ రికార్డుల్లో కూడా స్థానం సంపాదించిందని, అలాంటి సంస్థను నిర్వీర్యం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది ఆర్టీసీ కార్మికులేనని చెప్పారు. కానీ, కేసీఆర్ మాత్రం రాష్ట్రం ప్రైవేట్ ఎస్టేట్‌గా భావిస్తున్నారని, రాష్ట్రం ఆయన జాగీర్ కాదన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించిందని, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలు మోడల్ ఆర్టీసీని నడిపిస్తున్నాయని చెప్పారు. ఆర్టీసీ అంటే లాభనష్టాల అంశం కాదని, ప్రజారవాణాను సంక్షేమ అంశంగా భావించి సమ్మె పరిష్కారానికి ప్రయత్నించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో సుదీర్ఘంగా కేసు నడుస్తోందని, సమ్మెపై సీఎం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అమానవీయ సీఎం.. 24 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయినా స్పందించని అమానవీయ సీఎం కేసీఆర్ అని, తెలంగాణ ఆర్టీసీని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా పోరాడుతుందని ఉత్తమ్ చెప్పారు. అంతమంది చనిపోయినా కేసీఆర్ అహం తగ్గలేదా అని యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోందన్నారు. ఆర్టీసీ కేసుల్లో పార్టీ పరంగా ఇంప్లీడ్ అయ్యే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అంతకుముందు ఆర్టీసీ జేఏసీ సభ్యుడు డీవీ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం గాంధీభవన్‌లో ఉత్తమ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను కలసి ఈనెల 19న నిర్వహించనున్న సడక్ బంద్‌కు మద్దతివ్వాలని కోరింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఉత్తమ్ సడక్ బంద్‌కు తాము సంపూర్ణ మద్దతినిస్తున్నామని చెప్పారు. పార్లమెంటులో ఆర్టీసీ సమ్మె అంశం.. అంతకుముందు గాంధీభవన్‌లో ఉత్తమ్ టీపీసీసీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ వీహెచ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తా వించాలని, తెలంగాణ ఎంపీల పక్షాన కేంద్రం చొరవను కోరాలని నిర్ణయించారు. ఈనెల 30న ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాంలీలా మైదా నంలో జరగనున్న ‘భారత్ బచావో ర్యాలీ’పై చర్చించారు. ఈ ర్యాలీకి రాష్ట్రం నుంచి వెళ్లాల్సిన వారితో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్‌కు అప్పగించారు. ఉత్తమ్... స్లిమ్ అయ్యారు ‘ఆరడుగుల ఆజానుబాహుడు.. మిలటరీలో పనిచేశాడు.. ఆయనకేంటిలే ఆరోగ్యంగా ఉంటాడు’ టీపీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చూసిన వారికి సహజంగా కలిగే భావన ఇది. ఎంత ఆరోగ్యంగా ఉన్నా ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను పాటించాలనుకున్నారో ఏమో కానీ, తన ఎత్తు, వయసుకు తగ్గట్లుగా శరీర బరువును కాపాడుకునేందుకు ఆయన 15 రోజులపాటు శ్రమించారు. బెంగళూరులోని జిందాల్ నేచర్ కేర్ ఇన్స్టిట్యూట్లో చేరి ఏకంగా 8.3 కిలోల బరువు తగ్గారు. 6.1 అడుగుల ఎత్తున్న ఉత్తమ్ 82 కిలోల బరువు ఉండాల్సి ఉండగా, ఏకంగా 95 కిలోలకు చేరుతుండడంతో చికిత్సకు వెళ్లారు. అందులో భాగంగా 94.5 కిలోల నుంచి 86.2 కిలోలకు తగ్గారు. ‘ప్రకృతి చికిత్స కోర్సు చాలా సీరియస్‌గా నేర్చుకున్నాను. బరువు ఇప్పటికీ ఇంకా 4 కిలోలు తగ్గాల్సి ఉంది. వయసు, ఎత్తుకు తగిన బరువును కాపాడుకోవడం అందరి బాధ్యత’ అని ఉత్తమ్ అన్నారు. -
కేసీఆర్‌కు వకాలత్ పుచ్చుకున్నారా?: చాడ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో సంస్థ ఎండీ సునీల్‌శర్మ తీరు చూస్తుంటే ఆయన సీఎం కేసీఆర్‌కు వకాల్తా పుచ్చుకున్నట్లు కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆర్టీసీ జేఏసీ ప్రతిపక్షాలతో కలసి ప్రభుత్వాన్ని కూలదోయడానికి యత్నించిందని సునీల్‌శర్మ ఆరోపించడం తగదన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ల కమిటీ, హైకోర్టు సూచనలతో వేసిన మరో కమిటీ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించకపోగా.. మరింత జఠిలంగా మార్చాయన్నారు. హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నా ఐఏఎస్ అధికారుల తీరు మారకపోవడం బాధాకరమని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి అరెస్టులను ఖండిస్తున్నామని, సర్కార్ కార్మికులను వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. -
ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర..!
సాక్షి, హైదరాబాద్: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆర్థిక సంక్షోభం ఊబిలోకి నెట్టి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు యూనియన్ ప్రయత్నిస్తుందని, అందుకు విపక్షాలతో చేతులు కలిపి కుట్రకు పాల్పడుతోందని టీఎస్ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ ఆరోపించారు. ఒక పక్క యాజమాన్యంతో చర్చలు జరుగుతుండగానే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెలోకి వెళ్లాయని, తిరిగి విధుల్లో చేరేందుకు వారంతా ముందుకు వచ్చిన విధుల్లోకి చేర్చుకునేలా నిర్ణయం తీసుకోవడం కూడా కష్టమేనని హైకోర్టుకు తేల్చి చెప్పారు. ఈ మేరకు టీఎస్‌ఆరీ్టసీ ఇన్చార్జి ఎండీ హోదాలో శనివారం ఆయన హైకోర్టులో స్పెషల్ అడిషినల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీసీ సిబ్బంది కోసం కాకుండా ప్రతిపక్ష రాజకీయపారీ్టల కోసం ఆర్టీసీ యూనియన్ అడుగులు వేస్తోందన్నారు. ఆర్టీసీ ఉనికినే దెబ్బతీస్తుంటే యాజమాన్యం చేతులు కట్టుకుని కూర్చోబోదని చెప్పారు. యూనియన్‌లో కొందరి తప్పిదాల వల్ల ప్రజలు, ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ సంస్థ ఇబ్బందులు పడుతున్నా రని చెప్పారు. యూనియన్ మొండిగా వ్యవహరించిందని, బెదిరింపులకు దిగే క్రమంలోనే దసరాకు ముందు సమ్మెలోకి దిగారని చెప్పారు. ఆర్టీసీ కారి్మకులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం ఆరు వారాలు లేదా 14 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని, కన్సిలియేషన్ జరుగుతుంటే సమ్మెలోకి వెళ్లడం అదే చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం సమ్మె చట్ట వ్యతి రేకం అవుతుందన్నారు. చట్ట వ్యతిరేకంగా సమ్మెలోకి వెళితే నెల రోజులపాటు జైలు శిక్షతోపాటు జరిమానాలను విధించేందుకు వీలుందన్నారు. డిమాండ్లను పరిష్కరించే పరిస్థితి లేదు.. యూనియన్ డిమాండ్లను పరిష్కరించే పరిస్థితుల్లో ఆర్టీసీ కార్పొరేషన్ లేదన్నారు. అగ్గి రాజేసి చలి కాచుకునే ధిక్కార ధోరణి/ క్రమశిక్షణారాహిత్యాలను ఉపేక్షించబోమని గట్టిగా నొక్కి చెప్పారు. సమ్మె పాశుపతాస్త్రం లాంటిదని, అయినదానికీ కానిదానికీ దానిని ప్రయోగించకూడదని, సమ్మె హక్కు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుగా లేదన్నారు. ప్రజా సరీ్వసుల్లోని సిబ్బంది సమ్మె చేస్తామని నోటీసు ఇవ్వడమే చట్ట విరుద్ధమని, 40 రోజుల సమ్మె వల్ల ఆర్టీసీ పరిస్థితే కాకుండా వ్యాపార, ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో మొండిగా వ్యవహరించిన యూనియన్ ఆ డిమాం డ్‌ను ప్రస్తుతానికి పక్కకు పెట్టిందన్నారు. యూనియన్ మొండి వైఖరిని అనుసరించిందనడానికి ఇదే పెద్ద నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్లీ విలీనం డిమాండ్‌ను తెరపైకి తెచ్చి ప్రభుత్వా న్ని అస్థిరపరిచే అవకాశాలు లేకపోలేదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. యూనియన్ సమ్మె వల్ల ఉన్న నిల్వ నిధులు కాస్తా ఖర్చు అవుతున్నాయని, నష్టాల నుంచి భారీ నష్టాల ఊబిలోకి వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారని ఆరోపించారు. పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నష్టాల్లో ఉన్నప్పటికీ ఆర్టీసీ సిబ్బందికి 44% జీతాల పెంపు, 16% మధ్యంతర భృతి ఇచ్చామని చెప్పారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు సత్వరమే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బస్సు రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు: సీఎస్ ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రహస్యమని, సెక్రటేరియట్ పరిధి దాటి ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి హైకోర్టుకు తెలియజేశారు. క్యాబినెట్ నిర్ణయ ప్రక్రియ పూర్తి కాలేదని, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడేలోగా ఆ నిర్ణయంలో మార్పుచేర్పులకు ఆస్కారం ఉంటుందన్నారు. జీవో వచ్చాకే క్యాబినెట్ నిర్ణయానికి పూర్తి సార్థకత వస్తుందన్నారు. ఈలోగా క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రశ్నించేందుకు వీల్లేదని రాజ్యాంగంలోని 166(1) అధికరణం స్పష్టం చేస్తోందన్నారు. రవాణా చట్టం కూడా అదే స్పష్టం చేస్తోందన్నారు. బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. క్యాబినెట్ తీర్మానం నోట్‌ఫైల్స్‌లో భాగమని, సచివాలయం బయట ఉన్న వాళ్లకు ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. క్యాబినెట్ నిర్ణయం తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్ వెలువరించాలని, ఆ తర్వాత జీవో జారీ చేస్తేనే క్యాబినెట్ అమల్లోకి వస్తుందని, అప్పటి వరకూ ఆ నిర్ణయాన్ని సవాల్ చేయడం చెల్లదని, పిల్‌ను డిస్మిస్ చేయాలని ఆయన హైకోర్టును కోరారు. -
ఆర్టీసీ సమ్మె: డిమాండ్లు పరిష్కరించం.. చర్చలు జరపం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను జేఏసీ నేతలు తాత్కాలికంగా పక్కన పెట్టినా.. తిరిగి ఏ క్షణమైనా ఆ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చే అవకాశ ఉందని ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ అనుమానం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెపై శనివారం హైకోర్టుకు సునీల్ శర్మ ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు తమ సొంత ఉనికి కోసం సమ్మె చేస్తున్నారని, అలాంటి సమ్మెను అక్రమమైనదిగా ప్రకటించాలని అఫిడవిట్లో కోరారు. ఆర్టీసీ అర్థిక పరిస్థితి బాగాలేనందున కార్మికులకు ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చలేమని తేల్చిచెప్పారు. ఇక కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని కోర్టుకు తెలిపిన సునీల్ శర్మ, మరోసారి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేమని స్పష్టం చేశారు. సమ్మె కారణంగా ఇప్పటివరకు ఆర్టీసీ కార్పొరేషన్ 44 శాతం నష్టపోయిందని కోర్టుకు తెలిపారు. కొంతమంది యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం మొత్తం టీఎస్ ఆర్టీసీనే నష్టాల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లో నెట్టేందుకు యూనియన్ నేతలు పనికట్టుకున్నారని దుయ్యబట్టారు. పరిస్థితి చేయి దాటిపోతోందని, ఇప్పటికైనా సమ్మెను ఇల్లీగల్‌గా ప్రకటించాలని మరోసారి కోరుతున్నట్లు అఫిడవిట్లో సునీల్ శర్మ పేర్కొన్నారు. ఇక ప్రభుత్వంపై కుట్ర పూరితంగా వ్యవహరించేందుకే జేఏసీ నేతలు ప్రతిపక్షాలతో చేతులు కలిపారని ఆరోపించారు. ఈ నెల 18న హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ అఫిడవిట్ దాఖలు చేశారు. కాగా, సమస్య పరిష్కారానికి హైకోర్టు సూచించిన తిసభ్య కమిటీని ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ ఎండీ తాజాగా దాఖలు చేసిన ఫైనల్ అఫిడవిట్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. -
ఆర్టీసీ సొంతంగా కొనలేకే...
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సొంతంగా బస్సులను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రయాణికుల అవసరాల నిమిత్తం అద్దె బస్సులను లీజుకు తీసుకోవాల్సివస్తోందని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. అద్దెకు బస్సులను తీసుకోవడం ఏనాటి నుంచో ఉందని, ఈ నిర్ణయం వెనుక ఆర్టీసీ కార్మికులను దెబ్బతీయాలనే కుట్ర ఏమీలేదని ఆ సంస్థ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో తెలిపారు. ఆర్టీసీ 1,035 అద్దె బస్సులను తీసుకునేందుకు టెండర్ ఆహ్వానించడాన్ని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శి సవాల్ చేస్తూ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఆర్టీసీ సంస్థ వాదనలతో సునీల్ శర్మ కౌంటర్ పిటిషన్ వేశారు. గత నెల 14న పత్రికల్లో అద్దె బస్సుల కోసం టెండర్‌ను ప్రచురించామని, అదే నెల 21న టెండర్ల దాఖలుకు ఆఖరు తేదీగా నిర్ణయించి అదే రోజు టెండర్లను తెరిచి ఇప్పటి వరకూ 287 మంది బస్సు యజమానులకు ఖరారు పత్రాలను అధికారికంగా ఇచ్చామన్నా రు. ఆర్టీసీలో 10,460 బస్సులుంటే అందులో అద్దె బస్సులు 2,103 మాత్రమేనని వివరించారు. మొత్తం బస్సుల్లో అద్దె బస్సులు 21.26 శాతమేనని, వాస్తవానికి 20 శాతం నుంచి 25% వరకూ అద్దెబస్సులు ఉండేందుకు వీలుగా 2013లోనే ఆర్టీసీ బోర్డు తీర్మానం చేసిందని చెప్పారు. తీవ్ర నష్టాల్లో ఉన్న నేపథ్యం లో ప్రయాణికుల సౌకర్యం కోసం అద్దె బస్సులు తీసుకోవాలని నిర్ణయించామని దీనికితోడు టెం డర్ల ప్రక్రియ ఖరారు అయినందున పిల్‌ను తోసిపుచ్చాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని ఈ నెల 18న హైకోర్టు విచారణ కొనసాగించనుంది. -
ఆర్టీసీ సమ్మె:ఇలాంటి అధికారులను చూడలేదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదల, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్లపై గురువారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ శర్మ, రామకృష్ణారావులపై హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. తమ 15 ఏళ్ల చరిత్రలో ఇంత అబద్ధాలు చెప్పే అధికారులను చూడలేదని అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీ యజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్య చేయాలని తాము ప్రయత్నిస్తుంటే అందుకు ఇరువర్గాలు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని తెలిపింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని మండిపడింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఏపీఎస్ఆర్టీసీ విభజన పూర్తి కాలేదు : కేంద్రం ఆర్టీసీ సమ్మెపై కేంద్ర ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. కేంద్రానికి ఏపీఎస్ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందని తెలిపింది. ఆ వాటా టీఎస్ఆర్టీసీకి ఆటోమేటిక్‌గా బదిలీ కాదని వాదించింది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీలో 33 శాతం వాటా అనేది తలెత్తదని వివరణ ఇచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని.. విభజన చేస్తే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. విభజనకు కేంద్రం అనుమతి ఇచ్చిందనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అలా అయితే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ విభజన జరిగిందా.. లేక కొత్తగా ఏర్పడిందా అని కేంద్రం అనుమానం వ్యక్తం చేసింది. అది ఎలా సాధ్యం నిలదీసిన హైకోర్టు కేంద్రం వాదనపై స్పందించిన ఎస్కే జోషి.. ఆర్టీసీ ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యుల్ 9 కిందకు వస్తుందని కోర్టుకు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేసినట్టు ఏజీ, ఆర్టీసీ ఎండీ కోర్టుకు వివరించారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పారు. అయితే వారి వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు.. ఓ వైపు విభజన పెండింగ్‌లో ఉందని, మరోవైపు కొత్త ఆర్టీసీ ఏర్పాటు చేశామని అంటున్నారని.. అది ఎలా సాధ్యమని నిలదీసింది. ఏపీఎస్ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలు కేంద్రం అనుమతి కోరాలి కదా అని ప్రశ్నించింది. ప్రభుత్వానికి సమస్య పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా అని సూటిగా ప్రశ్నించింది. నీటి పారుదల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి.. ఆర్టీసీకి రూ. 49 కోట్లు చెల్లించడాని ఇబ్బంది ఎందుకని మండిపడింది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని సూచించింది. ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకోవాలని ఆదేశించింది. క్షమాపణ సమాధానం కాదు.. : హైకోర్టు అంతకు ముందు విచారణ సందర్భంగా కోర్టుకు సమర్పించిన నివేదికలపై సీఎస్‌ను వివరణ ఇవ్వాలని హైకోర్టు కోరింది. ఆర్థికశాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. ఐఏఎస్ అధికారులు అసమగ్ర నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. అయితే రికార్డులు పరిశీలించాకే నివేదిక ఇస్తున్నట్టు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా సూటిగా ప్రశ్నించింది. సమయాభావం వల్ల రికార్డుల ఆధారగా నివేదిక రూపొందించామని.. మన్నించాలని హైకోర్టును కోరారు. అయితే క్షమాపణలు కోరడం సమాధానంని.. వాస్తవాలు చెప్పాలని న్యాయస్థానం పేర్కొంది. హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు, పదాలు వాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణపద్దుల కింద కేటాయించిన నిధులు అప్పులు కాదని గ్రాంట్ అని తెలివిగా చెబుతున్నారన్న హైకోర్టు.. ఇప్పటివరకు ఏ బడ్జెట్లో అలా చూడలేదని తెలిపింది. ఆర్టీసీ ఎండీ చెబుతున్న లెక్కలు వేరుగా ఉన్నాయని.. వాటిని మేం పరిగణలోకి తీసుకోవాలా అని ప్రశ్నించింది. అయితే దీనికి సమాధానమిచ్చిన రామకృష్ణారావు.. 2014 జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 2019 వరకు ఉన్న మొత్తం లెక్కలను తాజా నివేదికలో పొందుపరిచినట్టు వివరణ ఇచ్చారు. కాగ్ నివేదిక అనుగుణంగా తయారు చేసిన పూర్తి వివరాలతో హైకోర్టుకు అందజేసినట్టు తెలిపారు. సునీల్ శర్మపై హైకోర్టు ఆగ్రహం.. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ ఎండీ నివేదిక మంత్రులని తప్పుదోవ పట్టించేలా ఉందని అభిప్రాయపడింది. మంత్రిమండలికి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారని.. సీఎంని సైతం తప్పుడు లెక్కలతో స్టేట్మెంట్ ఇప్పించారని మండిపడింది. మంత్రిని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్టు ఆర్టీసీ ఎండీ నివేదికలో స్వయంగా అంగీకరించడం ఆశ్చర్యంగా ఉందని అభిప్రాయపడింది. మీ బాస్‌ను తప్పుదోవ పట్టించిన మీరు.. మాకు నిజాలు చెబుతారని ఎలా నమ్మాలి అని ప్రశ్నించింది. -
ఈనెల7న ఆర్టీసీ ఎండీ కోర్టుకు హాజరుకావలని ఆదేశం
-
జడ్జీలనే మోసం చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆర్టీసీ బకాయిల విషయంలో రవాణా మంత్రికి ఒకలా, కోర్టుకు మరోలా లెక్కలు చెబుతారా? ఇలా చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి? ఐఏఎస్ అధికారులు తెలిసే, కావాలనే, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని, మోసం చేస్తారని ఊహించనేలేదు’’అని హైకోర్టు మండిపడింది. ‘‘ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రూ. 1,492 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని మంత్రికి చెప్పామని సాక్షాత్తూ మాకు చెబుతున్నారు. బకాయిలు ఏమీ లేవని అఫిడవిట్లో పూర్తి భిన్నంగా చెబుతున్నారు. మంత్రిని మోసం చేస్తున్నారా లేక జడ్జీలకే తప్పుడు సమాచారం ఇస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? మీరిచ్చిన వివరాల ఆధారంగా చట్టసభలో మంత్రి ప్రకటన చేసి ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లేలా చేశారా? లేక ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవంటూ న్యాయమూర్తులనే మోసం చేస్తున్నారా? నిజాలే చెబుతామని ప్రమాణంతో దాఖలు చేసిన అఫిడవిట్ చూస్తే ఐఏఎస్‌ల కచ్చితత్వంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఐఏఎస్‌లు వాస్తవాలు చెబుతారని ఎంతో నమ్మకంతో ఉన్న మా ఆశల్ని వమ్ము చేయకండి. నిజాయతీ, నమ్మకాన్ని నీరుగార్చకండి. అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్లు జిగ్సా పజిల్లా (ముక్కలుగా ఉన్న వాటిని పేర్చి అసలు చిత్రం ఏర్పడేలా చేయడం) తరహాలో గందర గోళంగా ఉన్నాయి. ఏం చెప్పదల్చారో అది మాత్రమే కోర్టుకు చెబుతున్నారు. ఏదో ఒకటి చెబితే పోనీలే అనుకుంటే నాశనాన్ని కోరుకున్నట్లేనని గుర్తించుకోవాలి. ఐఏఎస్‌లు నిజాయితీగా వాస్తవాలతో కౌంటర్ వేస్తారని ఆశించాం. మా నమ్మకాన్ని దెబ్బతీశారు. మోసపూరిత వైఖరి ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఈ విధంగా ఉంటారని కనీస ఆలోచన కూడా చేయలేదు. ఐఏఎస్‌లు మౌనం వీడాలి. నిశబ్దంగా ఉంటే ఎలా? ప్రజాసమస్యతో ముడిపడిన వ్యవహారంలో వివరాలు ఇస్తున్నామని కూడా ఆలోచన చేసినట్లుగా లేదు. ఇది ఏమాత్రం ఉపేక్షించదగ్గ విషయం కాదు. ఇక నటనకు తెరదించండి. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే పర్యావసానాలు, కోర్టు ధిక్కార పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు’’అని ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మను ఉద్దేశించి హైకోర్టు ధర్మాసనం నిప్పులు చెరిగింది. బకాయిల చెల్లింపులుగా ఎలా చూపుతారు? ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ. అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం కిక్కిరిసిన కోర్టు హాల్లో విచారణ జరిపింది. విచారణకు ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్‌శర్మ, ఆర్టీసీ ఈడీలు, ఇతర అధికారులతోపాటు రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా హాజరయ్యారు. ఆర్టీసీ ఎండీ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయిలు చెల్లించాల్సినవి లేవనే అంశంపై లోతుగా విచారణ జరిపింది. జీవో 229 ద్వారా రూ. 35 కోట్లను గతేడాది మే 3న ఇచ్చిన నగదు బస్సులను కొనుగోలు చేసేందుకైతే వాటిని »బకాయిల చెల్లింపులుగా ఎలా చూపుతారని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే జూన్ 6న జారీ చేసిన జీవో 227 కింద ఇచ్చిన మొత్తం రుణం కోసమైతే దానినీ బకాయిల చెల్లింపులుగా చెప్పడాన్ని తప్పుపట్టింది. అస్పష్టమైన వాదనలు చేస్తే ఎలా? యూనియన్ తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్‌రెడ్డి జోక్యం చేసుకొని ఆర్టీసీకి ప్రభుత్వం రూ.1375 కోట్లు చెల్లించాల్సి ఉందని, కానీ ఇచ్చింది రూ. 130 కోట్లని చెప్పారు. ఆర్టీసీలో సిబ్బంది తగ్గినా ఆక్యుపెన్సీ 69 శాతం నుంచి 73 శాతానికి పెరిగిందని, డీజిల్ ధర రూ. 49 నుంచి రూ. 69కి పెరిగిందని, నష్టాలు వచ్చే గ్రామీణ ప్రాంతాల్లో 73 శాతం బస్సులు నడుపుతున్నప్పటికీ అదనంగా రూ. 181 కోట్ల ఆదాయం వచ్చేందుకు సిబ్బంది పనితీరే కారణమని వివరించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికంటే రూ. 622 కోట్లు అదనంగా ఇచ్చేశామని చెబుతోందని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్‌శర్మ జోక్యం చేసుకొని వివిధ రకాల పద్దుల కింద ప్రభుత్వం నిధులిస్తుందని, వాటిని అదే పద్దుల కింద ఆర్టీసీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. లోన్ అయినా గ్రాంట్ అయినా తిరిగి ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లించాల్సిన అవసరం లేదనగానే ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఏ ఖాతా కింద నిధులు వచ్చాయో, ఎలా సర్దుబాటు చేస్తున్నారో ఆధారాలతో చెప్పాలేగానీ అస్పష్టమైన వాదనలు చేస్తే ఎందుకు నమ్మాలో, ఎలా నమ్మాలో అర్థంకావట్లేదని వ్యాఖ్యానించింది. మీరు చెప్పే మాటల్ని ప్రవచనాలుగా ఎలా తీసుకోగలమని నిలదీసింది. ఏది గ్రాంటో, ఏది లోనో ప్రభుత్వం చెప్పాలేగానీ మీరు కాదని తేల్చిచెప్పింది. జీహెచ్ఎంసీ గతంలో బకాయిలెలా చెల్లించింది? ఈడీల కమిటీ నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ. 47 కోట్లు అవసరమని చెబితే ఆ మొత్తం ఇవ్వలేమని చేతులెత్తేసిన ప్రభుత్వం... ఆర్టీసీ బకాయిలన్నీ చెల్లించడమే కాకుండా రూ. 622 కోట్లను ఎక్కువగా ఇచ్చినట్లు వీక్ అఫిడవిట్ దాఖలు (ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు) చేసిందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ యూనియన్ చెబుతోందని గుర్తుచేసింది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 112 (30) ప్రకారం తాము ఆర్టీసీకి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదంటున్న కార్పొరేషన్ అదే సెక్షన్ ప్రకారం 2015–16లో రూ. 108 కోట్లు, ఆ తర్వాత ఏడాది రూ. 228 కోట్లను ఆర్టీసీకి బకాయిలుగా ఎలా చెల్లించిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టీసీకి దానం చేసిందా లేక దాతృత్వాన్ని ప్రదర్శించిందా అని ఎద్దేవా చేసింది. జీహెచ్ఎంసీ ఔదార్యాన్ని పక్కనపెడితే చట్ట ప్రకారం హైదరాబాద్‌లో సిటీ బస్సులు నడిపినందుకు డబ్బులు ఇవ్వాల్సి ఉందో లేదో చెప్పాలని ఆదేశించింది. ఈ దశలో తిరిగి ప్రకాష్‌రెడ్డి స్పందిస్తూ సిటీ బస్సులు నడిపినందుకు జీహెచ్ఎంసీ ఎంత మొత్తం ఇవ్వాలో లేక ఇవ్వకూడదో ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఇదే సమయంలో సునీల్‌శర్మ జోక్యం చేసుకొని జీవో 134 ద్వారా ఆ సెక్షన్‌కు సవరణ జరిగిందని, ఆర్టీసీకి జీహెచ్ఎంసీ కాకుండా ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. బకాయిలు చెల్లించాలని జీహెచ్ఎంసీకి ప్రభుత్వం లేఖ రాస్తే 2018–19కి తాము బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని 2017 ఏప్రిల్ 13న తీర్మానం చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జవాబు ఇచ్చారని సునీల్‌శర్మ చెప్పారు. అయితే బకాయిలు చెల్లించాలో లేదో కమిషనర్ నిర్ణయించలేరని, ప్రభుత్వం చెప్పాలని హైకోర్టు చట్ట నిబంధనల్ని గుర్తుచేసింది. ఏ చట్ట నిబంధనల కింద గతంలో జీహెచ్ఎంసీ బకాయిలు ఇచ్చిందో దాని ప్రకారమే 2018–19కి రూ. 533 కోట్లు ఇవ్వాలని పిటిషనర్ చెబుతున్నారని, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ జవాబుల వివరాల్ని అఫిడవిట్లో ఎందుకు పేర్కొనలేదని ధర్మాసనం తప్పుబట్టింది. ఆర్టీసీలో నాలుగేళ్లుగా ఆడిట్ చేసిన నాథుడే లేడని విమర్శించింది. జీహెచ్ంఎసీ బకాయిలపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి వివరిస్తూ ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, బకాయిలకు సంబంధించి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగిన మర్నాడే లేఖలు రాయడాన్ని ధర్మాసనం ఎత్తిచూపింది. ఈ లేఖలను ముగ్గురూ ఒకేచోట కూర్చొని రాసినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ అంశంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు 10 రోజుల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరగా హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. -
ఆర్టీసీ అఫిడవిట్‌పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలపై కోర్టు ప్రభుత్వ వివరణ కోరింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మ, ఆర్థిక సలహాదారుడు రమేష్ ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై హైకోర్టులో ఆఫిడవిట్ దాఖలు చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం నుంచి రాయితీల సొమ్ము రూ. 644.51 కోట్లు రావాల్సి ఉండగా.. మొత్తం సొమ్మును చెల్లించినట్లు ఆఫిడవిట్లో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో బస్సులు నడుపుతున్నందుకు రూ. 1786.06 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అయితే 2015 నుంచి 2017 మధ్య కాలంలో జీహెచ్ఎంసీ కేవలం రూ. 336 కోట్లు మాత్రమే చెల్లించినట్లు కోర్టుకు వెల్లడించారు. మిగతా సొమ్మును చెల్లించేందుకు తమకు స్థోమత లేదని జీహెచ్ఎంసీ చేతులెత్తేసినట్లు ఆర్టీసీ ఆఫిడవిట్లో పేర్కొంది. జీహెచ్ఎంసీ నిబంధలు సెక్షన్ 112(30) ప్రకారం నగరంలో బస్సులు నడిపినందుకు వచ్చే నష్టాన్ని భర్తీ చేయడానికి జీహెచ్ఎంసీ అంగీకరించలేదని ఆర్టీసీ కోర్టుకు తెలిపింది. అందువల్లన జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన నిధులను బకాయిలుగా పరిగణించరాదని వివరించింది. ఆర్టీసీలో నిర్వహణ, డీజిల్ భారం ఎక్కువగా ఉందని, నిర్వహణ వ్యయం కారణంగానే నష్టం వాటిల్లుతోందని ఆఫిడవిట్లో పేర్కొంది. కార్మికుల సమ్మె ప్రారంభమైన అక్టోబర్ 5 నుంచి 30 తేదీ వరకు బస్సుల ద్వారా రూ. 78 కోట్లు అర్జించగా.. రూ. 160 కోట్ల వ్యవమైనట్లు తెలిపింది. అయితే ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలతో అఫిడవిట్‌ను రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో మరోసారి అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని రాయితీ బకాయిల చెల్లింపుగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలా? లేదా తేల్చాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవచ్చని, కానీ ప్రస్తుతం బాగానే ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను నవంబర్ 7కి వాయిదా వేసింది. -
ఆర్టీసీకి ప్రభుత్వం ఎక్కువే ఇచ్చింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన దానికన్నా ఎక్కువగానే ఆర్టీసీకి చెల్లించిందని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ హైకోర్టుకు నివేదించారు. ఆర్టీసీకి ప్రభుత్వ బకాయిల చెల్లింపులతోపాటు జీహెచ్ఎంసీ చేసిన చెల్లింపులపై నివేదిక సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సునీల్‌శర్మ ఈ మేరకు కౌంటర్ దాఖలు చేశారు. 2018– 19 సంవత్సరానికి రాయితీ కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తం రూ.644.51 కోట్లుకాగా ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరంతర మద్దతు లభిస్తున్నప్పటికీ ఆర్టీసీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉందన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో బస్సులను తిప్పడం వల్ల వచ్చిన నష్టాల భర్తీకి రూ.1,786.06 కోట్లను తిరిగి చెల్లించాలని జీహెచ్ఎంసీని ఆర్టీసీ కోరిందన్నారు. జీహెచ్ఎంసీ 2015–16, 2016– 17కు కలిపి రూ. 336.40 కోట్లు మాత్రమే చెల్లించిందన్నారు. ఆర్టీసీ కోరుతున్న మొత్తాలను చెల్లించే పరిస్థితిలో లేమంటూ జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వంగా పలు తీర్మానాలు పంపిందని వివరించారు. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి ఆధారంగానే ఎప్పటికప్పుడు చెల్లింపులు ఉంటాయని, వాటిని ఏమాత్రం బకాయిలుగా పరిగణించడానికి వీల్లేదన్నారు. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఏవిధంగానూ రుణపడి లేదన్నారు. ఇప్పటిదాకా రూ. 78 కోట్ల ఆర్జన... ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టిన 5–10–2019 నుంచి 30–10– 2019 వరకు సంస్థ రూ. 78 కోట్లు ఆర్జించిందని సునీల్‌శర్మ హైకోర్టుకు తెలిపారు. ఆర్టీసీ సమ్మె గురించి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ కార్యదర్శికి తెలియచేశామని ఆయన హైకోర్టుకు వివరించారు. -
అర్ధాంతరంగా ముగిసిన ఆర్టీసీ చర్చలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో యాజమాన్యం శనివారం జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. మొత్తం డిమాండ్ల పరిష్కారానికి కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టడంతో చర్చలు చివరి వరకు కొనసాగలేదు. ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు చర్చలకు వచ్చారు. ఎర్రమంజిల్‌లో ఉన్న ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ, రవాణా శాఖ కమీషనర్ సందీప్ కుమార్ సుల్తానియా చర్చల్లో పాల్గొన్నారు. నలుగురు కార్మిక నేతలను మాత్రమే చర్చలకు అనుమతించారు. వారి ఫోన్లను అనుమతించబోమని అధికారులు చెప్పడంతో కార్మిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోన్లు సిచ్చాప్ చేసిన తర్వాతే చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చల ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. ప్రధాన డిమాండ్ ఆర్టీసీ విలీనంపై కార్మిక సంఘాల నాయకులు పట్టుబడటంతో చర్చలు అర్థాంతరంగా ముగిసినట్టు తెలుస్తోంది. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె 22వ రోజు కొనసాగుతోంది. -
డిపో మేనేజర్లతో ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్