సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదల, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌లపై గురువారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ శర్మ, రామకృష్ణారావులపై హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. తమ 15 ఏళ్ల చరిత్రలో ఇంత అబద్ధాలు చెప్పే అధికారులను చూడలేదని అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీ యజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్య చేయాలని తాము ప్రయత్నిస్తుంటే అందుకు ఇరువర్గాలు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని తెలిపింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని మండిపడింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఏపీఎస్‌ఆర్టీసీ విభజన పూర్తి కాలేదు : కేంద్రం
ఆర్టీసీ సమ్మెపై కేంద్ర ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. కేంద్రానికి ఏపీఎస్‌ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందని తెలిపింది. ఆ వాటా టీఎస్‌ఆర్టీసీకి ఆటోమేటిక్‌గా బదిలీ కాదని వాదించింది. ఈ క్రమంలో టీఎస్‌ఆర్టీసీలో 33 శాతం వాటా అనేది తలెత్తదని వివరణ ఇచ్చింది. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని.. విభజన చేస్తే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. విభజనకు కేంద్రం అనుమతి ఇచ్చిందనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అలా అయితే ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ విభజన జరిగిందా.. లేక కొత్తగా ఏర్పడిందా అని కేంద్రం అనుమానం వ్యక్తం చేసింది.
అది ఎలా సాధ్యం నిలదీసిన హైకోర్టు
కేంద్రం వాదనపై స్పందించిన ఎస్కే జోషి.. ఆర్టీసీ ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యుల్ 9 కిందకు వస్తుందని కోర్టుకు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్‌ఆర్టీసీని ఏర్పాటు చేసినట్టు ఏజీ, ఆర్టీసీ ఎండీ కోర్టుకు వివరించారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పారు. అయితే వారి వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు.. ఓ వైపు విభజన పెండింగ్‌లో ఉందని, మరోవైపు కొత్త ఆర్టీసీ ఏర్పాటు చేశామని అంటున్నారని.. అది ఎలా సాధ్యమని నిలదీసింది. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలు కేంద్రం అనుమతి కోరాలి కదా అని ప్రశ్నించింది. ప్రభుత్వానికి సమస్య పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా అని సూటిగా ప్రశ్నించింది. నీటి పారుదల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి.. ఆర్టీసీకి రూ. 49 కోట్లు చెల్లించడాని ఇబ్బంది ఎందుకని మండిపడింది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని సూచించింది. ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకోవాలని ఆదేశించింది.
క్షమాపణ సమాధానం కాదు.. : హైకోర్టు
అంతకు ముందు విచారణ సందర్భంగా కోర్టుకు సమర్పించిన నివేదికలపై సీఎస్‌ను వివరణ ఇవ్వాలని హైకోర్టు కోరింది. ఆర్థికశాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. ఐఏఎస్ అధికారులు అసమగ్ర నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. అయితే రికార్డులు పరిశీలించాకే నివేదిక ఇస్తున్నట్టు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా సూటిగా ప్రశ్నించింది. సమయాభావం వల్ల రికార్డుల ఆధారగా నివేదిక రూపొందించామని.. మన్నించాలని హైకోర్టును కోరారు.
అయితే క్షమాపణలు కోరడం సమాధానంని.. వాస్తవాలు చెప్పాలని న్యాయస్థానం పేర్కొంది. హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు, పదాలు వాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణపద్దుల కింద కేటాయించిన నిధులు అప్పులు కాదని గ్రాంట్ అని తెలివిగా చెబుతున్నారన్న హైకోర్టు.. ఇప్పటివరకు ఏ బడ్జెట్‌లో అలా చూడలేదని తెలిపింది. ఆర్టీసీ ఎండీ చెబుతున్న లెక్కలు వేరుగా ఉన్నాయని.. వాటిని మేం పరిగణలోకి తీసుకోవాలా అని ప్రశ్నించింది. అయితే దీనికి సమాధానమిచ్చిన రామకృష్ణారావు.. 2014 జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 2019 వరకు ఉన్న మొత్తం లెక్కలను తాజా నివేదికలో పొందుపరిచినట్టు వివరణ ఇచ్చారు. కాగ్ నివేదిక అనుగుణంగా తయారు చేసిన పూర్తి వివరాలతో హైకోర్టుకు అందజేసినట్టు తెలిపారు.
సునీల్ శర్మపై హైకోర్టు ఆగ్రహం..
ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ ఎండీ నివేదిక మంత్రులని తప్పుదోవ పట్టించేలా ఉందని అభిప్రాయపడింది. మంత్రిమండలికి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారని.. సీఎంని సైతం తప్పుడు లెక్కలతో స్టేట్‌మెంట్ ఇప్పించారని మండిపడింది. మంత్రిని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్టు ఆర్టీసీ ఎండీ నివేదికలో స్వయంగా అంగీకరించడం ఆశ్చర్యంగా ఉందని అభిప్రాయపడింది. మీ బాస్‌ను తప్పుదోవ పట్టించిన మీరు.. మాకు నిజాలు చెబుతారని ఎలా నమ్మాలి అని ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment