ఆర్టీసీ సమ్మె: ఔదార్యమేదీ? | TSRTC Strike: Telangana High Court Verdict On RTC Strike | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె: ఔదార్యమేదీ?

Published Fri, Nov 8 2019 1:39 AM | Last Updated on Fri, Nov 8 2019 4:25 AM

TSRTC Strike: Telangana High Court Verdict On RTC Strike - Sakshi

ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలను అమలు చేస్తోందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే ఓట్లేసి తిరిగి గెలిపిస్తున్నారు, వారి విశ్వాసాన్ని ఏ రకంగానూ వమ్ము చేయడానికి వీల్లేదు... కార్మికులు కూడా ఓ మెట్టు దిగి రావడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. 

శక్తివంతమైన రాజ్యాల ఎదుగుదలను, అవి కుప్పకూలిపోవడాన్ని తెలంగాణ చూసింది. ప్రజలపట్ల చూపాల్సింది అధికారం కాదు, ఔదార్యం.

సాక్షి, హైదరాబాద్‌: ‘దేశం మొత్తం అబ్బురపడేలా ఈ రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయి. సాగునీరు సహా పలు ప్రాజెక్టుల కోసం రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రైతుల కోసం కేంద్రం రూ. 2 వేలు ఇస్తుంటే ఇక్కడ మరింత ఔదార్యంతో రూ. 4 వేలు ఇస్తున్నారు. విద్యుత్‌ రంగంలో ఎంతో పురోగతి సాధించారు. ఒకే ఒక్క భారీ ప్రాజెక్టుతో 80 శాతం నీటి అవసరాలను తీరుస్తున్నారు. ఒకే నియోజకవర్గానికి అభి వృద్ధి నిమిత్తం రూ. 100 కోట్లు కేటాయిం చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. అటు వంటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో ఔదార్యం చూపడం లేదు. సమస్య పరిష్కారానికి అవసరమైన రూ. 47 కోట్లు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. రాజు తండ్రిలాంటి వాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలను కాపా డాలి. అధికారం ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని అంత తక్కువ వాడాలి. మా వద్దా కోర్టు ధిక్కారణ అధికారం ఉంది. మా ముందు అధికారులు దాఖలు చేసిన అఫి డవిట్లన్నీ కోర్టు ధిక్కార పరిధిలోకి వచ్చేవే. మేం ఇప్పుడు ఆలోచిస్తోంది 48 వేల మంది ఉద్యోగుల గురించి కాదు. 3 కోట్ల మంది ప్రజల గురించి. ఈ ప్రభుత్వానికి రూ. 47 కోట్లు పెద్ద కష్టమేమీ కాదు. ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికులతో చర్చలు జరపండి. వారితో సంప్రదింపులు జరిపి ఓ నిర్ణయానికి రండి’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను జస్టిస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మలతోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటుకు మా అనుమతి తీసుకోలేదు: కేంద్రం
ఈ సందర్భంగా కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) నామవరపు రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తూ టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదన్నారు. తమ దృష్టిలో టీఎస్‌ఆర్టీసీకి ఎటువంటి గుర్తింపు లేదన్నారు. ఆర్టీసీ విభజనకు కేంద్రం అనుమతి తప్పనిసరన్నారు. కేంద్రం అనుమతి ఇచ్చిన తరువాతే విభజన సాధ్యమవుతుందని వివరించారు. తమకున్న వాటా ఏపీఎస్‌ఆర్టీసీలోనే ఉందని వివరించారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ జోక్యం చేసుకుంటూ ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌–3 కింద టీఎస్‌ఆర్టీసీ ఆవిర్భవించిందన్నారు. 

కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందే...
ఈ వాదనతో ధర్మాసనం విబేధిస్తూ ఆర్టీసీ విభజనకు కేంద్రం ఆమోదం తప్పనిసరని స్పష్టం చేసింది. సెక్షన్‌–3 కింద టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటైనప్పుడు ఆస్తి, అప్పుల విభజన గురించి ఎందుకు మాట్లాడతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టీసీకి ప్రత్యేక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టం ప్రకారమే నడుచుకోవాలే తప్ప ఇతర చట్టాల ప్రకారం కాదని తేల్చిచెప్పింది. ఆర్టీసీ చట్టం ప్రకారం విభజనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరని, ఇతర చట్టాలను సాకుగా చూపుతూ అనుమతి తీసుకోకుండా తప్పించుకోజాలరని స్పష్టం చేసింది. టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించింది. వాస్తవానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం అనుమతి తీసుకోవడం తప్పనిసరని తెలిపింది. సమస్య పరిష్కారానికి అవసరమైన రూ. 47 కోట్లు విడుదల చేయాలని చెబుతుంటే ఇరు వైపుల నుంచి స్పందన రావడం లేదని, ప్రభుత్వ వైఖరి వల్ల రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతున్నాయని వ్యాఖ్యానించింది. సామాన్య ప్రజల ఇబ్బందులు ఎవరికీ పట్టడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది.

అంత మొండి పట్టుదల ఎందుకు?
రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి ధర్మాసనం ప్రస్తావిస్తూ రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రూ. 47 కోట్ల విషయంలో ఎందుకు మొండి పట్టుదల ప్రదర్శిస్తోందో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ రాష్ట్రం రూ. 30 వేల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని చెప్పగా అన్ని వేల కోట్ల అప్పులో రూ. 47 కోట్లు ఎంత? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలను అమలు చేస్తోందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే ఓట్లేసి తిరిగి గెలిపిస్తున్నారని, వారి విశ్వాసాన్ని ఏ రకంగానూ వమ్ము చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కార్మికులు కూడా ఓ మెట్టు దిగి రావడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని పేర్కొంది.

ప్రభుత్వం ముందుకు రావడం లేదు...
దీనికి కార్మిక సంఘాల తరఫు సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ గడువు పెట్టి మరీ బేషరతుగా విధుల్లో చేరాలంటూ కార్మికులకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కార్మిక సంఘాలతో చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఈ సమయంలో జోషి జోక్యం చేసుకుంటూ మూడుసార్లు కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించామని, ముఖ్యమంత్రి కూడా కార్మికులకు విజ్ఞప్తి చేశారన్నారు.

ముఖ్యమంత్రిది బెదిరింపులా ఉంది...
దీనికి ధర్మాసనం స్పందిస్తూ ముఖ్యమంత్రిది విజ్ఞప్తి.. హామీ కాదని, అది బెదిరింపులా ఉందని తేల్చిచెప్పింది. ప్రభుత్వంపై ఉన్న గౌరవంతో మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీపై ఔదార్యం చూపాలని సూచించింది. బాలల దినోత్సవం సందర్భంగా బాలలకు చిత్ర కళల పోటీల్లో బహుమతులు ఇవ్వాలని తాము నిర్ణయించామని, అయితే బస్సుల సమ్మె వల్ల పిల్లలను తీసుకురావడం సాధ్యం కాదని జిల్లా జడ్జీలు చెప్పారని ధర్మాసనం గుర్తుచేసింది. సమ్మె వల్ల పిల్లలను ప్రోత్సహించేందుకు సైతం అవకాశం లేకుండా పోతోందని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. శక్తివంతమైన రాజ్యాల ఎదుగుదలను, అవి కుప్పకూలిపోవడాన్ని తెలంగాణ చూసిందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రజలపట్ల చూపాల్సింది అధికారం కాదని, ఔదార్యమని స్పష్టం చేసింది. ‘మాది పేద కుటుంబం. మా అమ్మ 13 మందిని పెంచింది. మా అన్నదమ్ములతోపాటు మరో 10 మందిని కూడా పెంచింది. పిల్లలందరికీ అన్నం సరిపోదని తెలిసీ అన్నం వండేటప్పుడు నీళ్లు ఎక్కువ పోసి, అన్నాన్ని పిల్లలకు పెట్టి మా అమ్మ గంజి తాగి బతికింది. అదీ తల్లి మనసు’ అని సీజే చెప్పారు. ప్రజలకు రాజే తండ్రని, అటువంటి రాజు ప్రజలపట్ల ఔదార్యం చూపాల్సిన అవసరం ఉందన్నారు.

గజిబిజి లెక్కలతో తెలివి ప్రదర్శిస్తున్నారు...
న్యాయస్థానాలైనా.. ప్రభుత్వాలైనా ఉన్నది ప్రజల కోసమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించాల్సిన అధికారులు, గజిబిజి లెక్కలతో చాలా తెలివి ప్రదర్శిస్తూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించింది. లెక్కలతో తాము ఎప్పుడు నివేదిక కోరినా అంతకుముందు ఇచ్చిన నివేదికకూ, తాజా నివేదికకూ ఏమాత్రం పొంతన ఉండటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ విచారణకు వారికి తోచిన లెక్కలు చెబుతున్నారని మండిపడింది. తప్పుడు లెక్కలతో న్యాయస్థానాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రిని తప్పుదోవ పట్టించిన అధికారులను తామెలా విశ్వసించగలమని ప్రశ్నించింది. ప్రమాణపూర్వకంగా అఫిడవిట్‌ దాఖలు చేసి అందులో అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మండిపడింది. ఇలా చేయడం కోర్టు ధిక్కారం కిందకు రాదా? అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషిని ప్రశ్నించింది. కోర్టు లేవనెత్తిన అంశాలకు అధికారులు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారని జోషి చెప్పగా ఆ అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్లు చదివే ఈ మాట చెబుతున్నారా? అంటూ జోషిని ధర్మాసనం నిలదీసింది. గతంలో వేసిన అఫిడవిట్‌కు, ఇప్పుడు వేసిన అఫిడవిట్‌కు ఏమాత్రం పొంతన లేదని గుర్తుచేసింది. ఇలాంటి అధికారులను ఎలా నమ్మగలమని ప్రశ్నించింది.

క్షమాపణ వల్ల ప్రయోజనం ఉండదు...
ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, తక్కువ సమయంలో కౌంటర్‌ దాఖలు చేయాల్సిన పరిస్థితి వల్ల తప్పులు దొర్లాయని, ఇందుకు క్షమించాలని కోరగా క్షమాపణ వల్ల ప్రయోజనం ఉండదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కోర్టు ఓ నిర్ణయానికి వచ్చి శిక్ష విధించాక ఆ సాక్షి వచ్చి తన వాంగ్మూలం తప్పని చెబితే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించింది. వాస్తవాలను పరిశీలించేందుకు కాగ్‌ నివేదికలు ఇంటర్నెట్‌లో సులభంగా అందుబాటులో ఉన్నాయని గుర్తుచేసింది. ఆర్టీసీకి చెల్లించిందని రూ. 3,903 కోట్లని ఓసారి, రూ. 3,400 కోట్లని మరోసారి అధికారులు చెబుతున్నారని, వీటిలో ఏది వాస్తవమో అర్థం కాని పరిస్థితి నెలకొందని విమర్శించింది. అలాగే ఆర్టీసీకి రుణం ఇచ్చామని ఓసారి, గ్రాంటు అని మరోసారి చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. జీవోల్లో రుణంగా చెప్పి ఇప్పుడు వాటిని గ్రాంటుగా పేర్కొనడంలో అర్థం ఏమిటని నిలదీసింది. జీహెచ్‌ఎంసీ బకాయిల విషయంలోనూ అస్పష్టత ఉందని ధర్మాసనం విమర్శించింది. ఒకసారేమో జీహెచ్‌ఎంసీ డబ్బు ఇచ్చిందని, మరోసారి అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదని ఎలా పడితే అలా చెబుతున్నారని ఆక్షేపించింది. ముఖ్యమంత్రిని, మంత్రిని తప్పుదోవ పట్టించే అధికారులను ఆ పోస్టుల్లో కొనసాగించడం సబబు కాదని అభిప్రాయపడింది.

డబ్బు తీసుకొని బకాయి ఉందంటే ఎలా?
2019–20లో రూ. 565 కోట్లు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చి అందులో రూ. 540 కోట్లను మోటారు వాహన పన్ను కింద ప్రభుత్వం మినహాయించుకుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయని ధర్మాసనం తెలిపింది. అలాంటప్పుడు తీసేసుకున్న మోటారు వాహన పన్నును ఆర్టీసీ బకాయి ఉందని ప్రభుత్వం ఎలా చెబుతుందని నిలదీసింది. ఎవరు చెప్పేది నిజమో.. ఎవరిది అబద్ధమో దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ సీఎం చెప్పినా కార్మికులు వినడం లేదని, కేవలం 300 మందే విధుల్లో చేరానన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రూ. 47 కోట్లు ఇచ్చి ఉంటే నాలుగు డిమాండ్‌లు పరిష్కారమై ఉండేవని, తద్వారా సమస్య పరిష్కారానికి సుహృద్భావ వాతావరణం నెలకొని ఉండేదని అభిప్రాయపడింది. రూ. 47 కోట్లు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని మేం భావిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఓసారి ఎక్కువ ఇచ్చామని, మరోసారి ఇవ్వాల్సింది ఏమీ లేదని చెబుతోందని తెలిపింది. ఇలా మాట్లాడుతుంటే సమస్య ఎప్పుడు పరిష్కారం కావాలని ప్రశ్నించింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. మరోవైపు 5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న కేబినెట్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement