విలీనమే విఘాతం | TSRTC Strike: Merger Is Disruptive For Negotiation Government Will Clear To High Court | Sakshi
Sakshi News home page

విలీనమే విఘాతం

Published Mon, Nov 11 2019 2:13 AM | Last Updated on Mon, Nov 11 2019 4:37 AM

TSRTC Strike: Merger Is Disruptive For Negotiation Government Will Clear To High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఆర్థికంగా తీవ్ర క్లిష్ట పరి స్థితుల్లో ఉంది. ఈ విషయం తెలిసినా యూనియన్లు బాధ్యతారహితంగా సమ్మెలోకి వెళ్లాయి. చర్చలు జరిపితే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమనే ఆచరణ సాధ్యం కాని డిమాండ్‌తో ముడిపెట్టి మొండిగా వ్యవహరిస్తున్నాయి. చర్చలకు ఇదే విఘాతంగా మారింది. ఇదే తీరుతో ఉన్నప్పుడు ఇకపై చర్చలతో ప్రయోజనం లేదు’ అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేయనుంది. ఈ మేరకు సోమవారం అపిడవిట్‌ దాఖలు చేయనుంది. అఫిడవిట్‌ ప్రతులను ప్రతివాదులకు ఆదివారమే పంపించింది. ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి పూర్తి వివరాలను అంశాలవారీగా అందులో ప్రస్తావించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సోమవారం హైకోర్టుకు దాన్ని సమర్పించనున్నారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని, ఆర్టీసీ సిబ్బంది డిమాండ్ల పరిష్కారం కోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ధర్మాసనం ఆదేశాల మేరకు సీఎస్‌ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణ కొనసాగనుంది.

సమస్యలు కొలిక్కి రావు...
‘హైకోర్టు ఆదేశించిన మేరకు నాలుగు డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీకి రూ. 47 కోట్లు చెల్లించినా సమస్యలేవీ కొలిక్కి వచ్చే అవకాశాలు లేవు. ధర్మాసనం సూచనల్ని పరిశీలిస్తే రూ. 2,209 కోట్లను విధిగా చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రూ. 47 కోట్లు ఏమాత్రం చాలవు. ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడల్లా ప్రభుత్వం చేయూత ఇస్తూనే ఉంది. ఇలా ఎంతకాలం సాయం చేస్తూ ఉండాలి? ఎన్నిసార్లు ఆర్థికంగా ఆదుకున్నా సంస్థ పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ఎన్నిసార్లు సాయం చేయాలి?’ అని కౌంటర్‌లో సీఎస్‌ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న డిమాండ్‌కు ముడిపెట్టి చర్చలు జరపాలని యూనియన్లు మొండిగా వ్యవహరి స్తున్నాయని సీఎస్‌ గుర్తుచేశారు. 

అయోధ్య తీర్పునాడే చలో ట్యాంక్‌బండ్‌...
‘పండుగలు, విద్యార్ధులకు పరీక్షలప్పుడు సమ్మెలోకి వెళ్లడం, ఇంకా చెప్పాలంటే యూనియన్‌ ఎన్నికల షెడ్యూల్‌ ఉన్నప్పుడల్లా సమ్మె చేయడం యూనియన్లకు అల వాటుగా మారింది. ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనే ఆలోచన లేకుండా బాధ్యతారహితంగా సమ్మెలోకి వెళ్లారు. యూనియన్లు ఒత్తిళ్లు తెచ్చి వ్యూహాలు పన్ను తున్నాయి. ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేందుకు ప్రయత్నించడంతో పాటు బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాయి. యూనియన్లవి ధిక్కార చర్యలని స్పష్టమైనప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సమ్మె చట్టవ్యతిరేకం అవుతుంది. అయోధ్య వ్యవహారంపై సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనుందని తెలిసి కూడా ఆర్టీసీ జేఏసీ ‘చలో ట్యాంక్‌బండ్‌’కు పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లో మత సామరస్యాన్ని కాపాడాల్సిన పరిస్థితుల్లో ‘చలో ట్యాంక్‌బండ్‌’ నిర్వహించారు. శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులపై ఒత్తిడి తెచ్చేలా జేఏసీ పని చేసింది. పోలీసులు, ప్రజల భద్రతతోనూ ఆడుకుంది’ అని కౌంటర్‌లో సీఎస్‌ ఆరోపించారు. 

పండుగల్లో ఆదాయానికి గండి...
బతుకమ్మ, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సమయంలో ఆర్టీసీకి అదనంగా ఆదాయం వస్తుందని, ఈ కాలంలో సమ్మె చేయడం వల్ల అప్పులు చెల్లించేందుకు దోహదపడే అదనపు ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయిందని సీఎస్‌ అఫిడవిట్‌లో పేర్కొ న్నారు. సమ్మె జరుగుతుండగా ఆర్టీసీ సహకార పరపతి సంఘానికి రూ. 200 కోట్లు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, పీఎఫ్‌ బకాయిల చెల్లింపు విషయంలో ఈ నెల 15న ఆర్టీసీ ఎండీ హాజరుకావాలని పీఎఫ్‌ కమిషనర్‌ నోటీసు జారీ చేశారని, మోటారు వాహన పన్ను రూ. 452 కోట్లు చెల్లించాలని రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు అ«థారిటీ నోటీసు ఇచ్చిందని చెప్పారు.

విలీనంపై మొండిగా..
‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ అమలు సాధ్యం కాదు. అయినా యూనియన్లు మొండిగా ఉన్నాయి. అర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. నవంబర్‌ 7న హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వంలోని ఇతర అధికారులతో సంప్రదించాక వాస్తవాల్ని హైకోర్టు దృష్టికి తేవాలని నిర్ణయించి అఫిడవిట్‌ దాఖలు చేస్తున్నా. టీఎస్‌ఆర్టీసీ ఆర్థిక స్థితిగతుల గురించి తెలిసినా సమ్మెలోకి వెళ్లిన యూనియన్లు బాధ్యతారహితంగా వ్యవహరించాయి. టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు నాటికి 10,350 బస్సులు ఉండేవి. మార్చాల్సిన, కాలం చెల్లిన బస్సులు 2,609 ఉన్నాయి. వాటిని స్థానంలో కొత్తవి కొనేందుకు రూ.750 కోట్లు అత్యవసరం. 2020లో మరో 476 బస్సుల్ని మార్చాల్సి ఉంది. లేకపోతే కాలుష్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. బస్సులను తొలగించినా లేక కొత్త బస్సులను భర్తీ చేయకపోయినా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితుల వల్ల ఆర్టీసీ తక్షణ, మధ్యస్థం నుంచి దీర్ఘకాలిక పద్ధతుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఆర్థికంగా ఏమాత్రం సానుకూల పరిస్థితులు లేవు. చెల్లింపుల భారం అధికంగా ఉంది. ఆ వివరాలను పరిశీలిస్తే చెల్లింపుల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది’ అని సీఎస్‌ వివరించారు.

అప్పుల్లో అత్యధికం ఉద్యోగుల చెల్లింపులవే...
‘ఆర్టీసీ బకాయిలను పరిశీలిస్తే ఉద్యోగుల చెల్లింపులకు సంబంధించిన మొత్తమే అత్యధికంగా రూ .1,521.25 కోట్లు ఉంది. టీఎస్‌ఆర్టీసీకి ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి నష్టాలు రూ. 5,269.25 కోట్లకు పెరిగిపోయాయి. ఇదే మాదిరిగా భారీ నష్టాల్లో ఆర్టీసీ కార్పొరేషన్‌ కొనసాగితే ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుగా ఎలా అందించాలి? బ్యాంకులు, ఇతర సంస్థలకు రూ. 1,786.81 కోట్ల మేరకు అప్పులు ఎలా చెల్లించాలి? ఈ ఆర్థిక పరిస్థితుల గురించి ఆర్టీసీ కార్మిక సంఘాలకు పూర్తిగా తెలుసు. అయినప్పటికీ వివిధ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్టీసీ తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లొద్దని కమిటీ సూచించినా ఫలితం లేకపోయింది. దసరాకు ముందు సమ్మె చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పినా ఉపయోగం లేకపోయింది. ఆర్టీసీ భవిష్యత్తుతోపాటు ప్రజలకు కలిగే అసౌకర్యాల గురించి యూనియన్లు పట్టించుకోలేదు. యూనియన్లతో చర్చలు విఫలమయ్యాయి కాబట్టి చట్ట ప్రకారం ఈ వ్యవహారంపై కార్మికశాఖలోని జాయింట్‌ కమిషనర్‌ వద్ద పరిష్కరించుకోవాలి. అయితే హైకోర్టులో వ్యాజ్యం విచారణలో ఉన్న కారణంగా ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాం’ అని సీఎస్‌ కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

కోర్టు ఆదేశాలను సర్కారు గౌరవించినా...
పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టంలోని సెక్షన్‌ 22 (1) (డీ)తోపాటు అత్యవసర సర్వీసుల చట్టం (ఎస్మా)–1971 ప్రకారం కూడా సమ్మె చట్ట విరుద్ధమని తెలిసినా హైకోర్టు ఆదేశాలను గౌరవించి గత నెల 26న 11 ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులకు చర్చలకు పిలిచిందని సీఎస్‌ గుర్తుచేశారు. అయితే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న డిమాండ్‌తో ముడిపెట్టి ఇతర అంశాలపై చర్చించాలని జేఏసీ మొండిగా వ్యవహరించిందని కౌంటర్‌లో వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement