కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత | Formula e car Race Case: HC To Pronounce judgment on KTR quash petition Updates | Sakshi
Sakshi News home page

ఫార్ములా ఈ-రేస్‌ కేసు: కేటీఆర్‌కు చుక్కెదురు.. క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత

Published Tue, Jan 7 2025 10:31 AM | Last Updated on Tue, Jan 7 2025 12:01 PM

Formula e car Race Case: HC To Pronounce judgment on KTR quash petition Updates

హైదరాబాద్‌, సాక్షి: ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు చుక్కెదురైంది. ఏసీబీ కేసును కొట్టేయాలని వేసిన క్వాష్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేం జోక్యం చేసుకోం అని తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్‌ తరఫు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. 

ఈ పిటిషన్‌పై ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం(Bench).. డిసెంబర్‌ 31న వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని.. కావాలంటే విచారణ జరుపుకోవచ్చని దర్యాప్తు సంస్థలకు సూచించింది. మరోవైపు.. కోర్టు తీర్పు నేపథ్యంతోనే ఆయన ఇవాళ్టి ఈడీ విచారణ వాయిదా పడింది కూడా.

ప్రభుత్వ వాదనలు ఇలా..
ఏసీబీ తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్‌ఐఆర్‌ నమోదు ప్రాథమిక అంశం మాత్రమే. అందులో పేర్కొన్న అంశాలే అంతిమం కాదు. దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తారు. రెండు నెలల క్రితమే కేసు నమోదుకు నిర్ణయించారు. కేసు నమోదు కోసం గవర్నర్‌ నిర్ణయానికి పంపారు. గవర్నర్‌ ఆమోదించాకే కేసు నమోదు చేశారు. ఫార్ములా సంస్థకు డబ్బు విదేశీ కరెన్సీలో చెల్లించారు. దీంతో హెచ్‌ఎండీఏపై అధిక భారం పడింది. విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం ఆర్‌బీఐ అనుమతి తీసుకోలేదు. ఆర్థికశాఖ అనుమతి కూడా లేదు.

(గవర్నర్‌ అనుమతి కాపీని కోర్టు అడగడంతో ఏజీ అందజేశారు.)

చెల్లింపుల్లో కేటీఆర్‌ పాత్ర ఏంటని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. కేటీఆర్‌ పాత్ర ఏంటో దర్యాప్తులో తేలుతుందని ఏజీ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు అనేది దర్యాప్తు కోసమేనని వివరించారు. కేసు పూర్తి వివరాలు అభియోగపత్రంలో ఉంటాయని, రూ.56 కోట్లకు పైగా చెల్లింపుల్లో నిబంధన ఉల్లంఘన జరిగిందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు.

దానకిశోర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీపీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ..  పురపాలక శాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. రేసింగ్‌కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్‌ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది  వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు నమోదు చేసినట్లు చెప్పారు. 

కేటీఆర్‌ తరఫు వాదనలు..
‘‘అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. ముఖ్యంగా 13(1)(a) సెక్షన్‌ ఈ కేసుకు వర్తించదు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవు. ప్రొసీజర్‌ పాటించలేదనడం సరైంది కాదు. 14 నెలల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారు. కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే కేటీఆర్‌పై కేసు పెట్టారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. కార్‌ రేస్‌ నిర్వహణకు 2022 అక్టోబరు 25న ఒప్పందం జరిగింది. సీజన్‌ 10 నిర్వహణకు స్పాన్సర్‌ వెనక్కి తగ్గారు. రేస్‌ నిర్వహణలో ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇబ్బందులు రాకూడదనే హెచ్‌ఎండీఏ చెల్లింపులు చేసింది.

సీజన్‌-9 వల్ల దాదాపు రూ.700 కోట్ల లాభం వచ్చింది. ఆర్థికశాఖ అనుమతి లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. కార్‌ రేసింగ్‌ ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించింది. కొత్త ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దయింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఆలస్యానికి కారణాలు చెప్పలేదు. సుప్రీం తీర్పుల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఆలస్యం తగదు. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులను ఏసీబీ అధికారులు పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధిపై కేసుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలి. 18న ఫిర్యాదు అందగానే.. 19న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేటీఆర్‌ స్పెక్యులేషన్‌ చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు’’ అని కేటీఆర్‌ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.

ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. ఏసీబీ వాదనలనే పరిగణనలోకి తీసుకుని కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement