అనుమతులు లేకుండా చెల్లింపులా?.. కేటీఆర్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం | ACB Officials Questions To KTR In Formula E Car Race Issue, More Details Inside | Sakshi
Sakshi News home page

అనుమతులు లేకుండా చెల్లింపులా?.. కేటీఆర్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం

Published Fri, Jan 10 2025 1:26 AM | Last Updated on Fri, Jan 10 2025 11:16 AM

ACB officials questions to KTR On Formula E car race Issue

ఫార్ములా–ఈ కార్‌ రేసు నిర్వహణలో నిబంధనలు ఎందుకు అతిక్రమించారు?

కేబినెట్, ఆర్థికశాఖ అనుమతి లేకుండా నిధులెలా మళ్లిస్తారు? 

హెచ్‌ఎండీఏ పాలకమండలి అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థకు పెద్దమొత్తం ఎలా చెల్లిస్తారు? 

రూ.700 కోట్ల లాభం వచ్చిందని చెబుతున్నారు.. లెక్కలున్నాయా?.. 7 గంటల పాటు విచారణ  

మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం

అడిగిన ప్రశ్నలే మార్చి మార్చి అడగడంతో కేటీఆర్‌ అసహనం 

ప్రశ్నలు వృథా ప్రయాసేనని, ప్రభుత్వం అరెస్టు చేయమంటే చేసుకోవచ్చని వ్యాఖ్య! 

ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన సీఎం రేవంత్‌రెడ్డిని ఈ కేసులో ఎందుకు భాగస్వామిగా చేర్చలేదని నిలదీత

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా–ఈ కార్‌ రేసు నిర్వహణకు ఎలా బీజం పడింది?, నిబంధనలు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది?, ఒప్పందాలతో పాటు నగదు చెల్లింపులకు సంబంధించిన ఫైళ్ల నిర్వ హణ ఎలా జరిగింది?, హెచ్‌ఎండీఏ పాలకమండలి అనుమతి లేకుండా, విదేశీ మారకద్రవ్య నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేటు సంస్థకు పెద్దమొత్తం ఎలా చెల్లిస్తారు?, కేబినెట్, ఆర్థికశాఖ అనుమతి లేకుండా నిధుల మళ్లింపు ఎలా చేశారు?, ఫార్ములా–ఈ కార్‌ రేసు నిర్వహణతో రాష్ట్రానికి రూ.700 కోట్ల లాభం వచ్చినట్టు మీరు చెప్తున్నారు.. వాటి లెక్కలేవి?, రేసుకు సంబంధించిన ప్రకటనలతో ప్రభుత్వ సంస్థలకు ఏం లాభాలు వచ్చాయి?, టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం ఎంత?..తదితర అంశాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావుపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. 

మంత్రిగా కేటీఆర్‌ తీసుకున్న నిర్ణయం, దాని తాలూకు కేబినెట్‌ ఆమోదం ఫైళ్ల సర్క్యులేషన్‌కు సంబంధించిన ప్రక్రియ, నిధుల బదిలీ..వంటి అంశాల కేంద్రంగా ఏసీబీ విచారణ కొనసాగినట్టు తెలిసింది. సుమారు 7 గంటల విచారణ సందర్భంగా అధికారులు పదేపదే ఒకే అంశంపై ప్రశ్నిస్తుండడంతో ‘మీరు ఎన్ని గంటలు ఈ కార్యాలయంలో కూర్చోమన్నా కూర్చుంటా..మీకు కావాలి అంటే బ్రేక్‌ తీసుకోండి.. కానీ అడిగిన ప్రశ్నలే పలు రకాలుగా అడగడం వలన లాభం లేదు. ప్రభుత్వం ఒకవేళ నన్ను అరెస్టు చేయమని మీకు ఆదేశాలు ఇస్తే..ఈ ప్రశ్నలు అడగడం అనే వృధా ప్రయాస మానేసి ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసుకోవచ్చు..’ అని కేటీఆర్‌ అన్నట్టు తెలిసింది. 

ఏసీబీ జేడీ ఆధ్వర్యంలో స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ 
ఫార్ములా–ఈ కార్‌ రేసు నిర్వహణకు సంబంధించిన కేసులో ఏసీబీ అధికారులు నోటీసు ఇవ్వడంతో కేటీఆర్‌ గురువారం ఉదయం వారి ఎదుట విచారణకు హాజరయ్యారు. కోర్టు అనుమతి నేపథ్యంలో న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌రావుతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కోర్టు ఆదేశం ప్రకారం..విచారణ సమయంలో న్యాయవాదికి కేటీఆర్‌ కనిపించేలా ఏర్పాటు చేశారు. జాయింట్‌ డైరెక్టర్‌ రితిరాజ్‌ ఆధ్వర్యంలో మొత్తం ఐదుగురు సభ్యుల బృందం ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసింది.    

బిజినెస్‌ రూల్స్‌ అధికారులు చూసుకుంటారు.. 
రేసు నిర్వహణ ఫైల్‌ కేబినెట్‌ ఆమోదానికి ఎందుకు పంపలేదు? అన్న అంశంపై ఏసీబీ అధికారులు పలుమార్లు ప్రశ్నించగా.. బిజినెస్‌ రూల్స్‌ గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులే చూసుకుంటారని కేటీఆర్‌ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఏసీబీకి లేదని ఆయన పేర్కొన్నారు. 

రేసు కొనసాగించకపోవడం వల్ల  ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లిందని.. ఒప్పందం రద్దుచేసి ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఈ కేసులో ఎందుకు భాగస్వామిగా చేర్చలేదని కేటీఆర్‌ ప్రశ్నించినట్లు సమాచారం. రేసు నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం గురించి ఏసీబీ ప్రశ్నించినప్పుడు.. కేబినెట్‌ ఆమోదం లేకుండా రేసు రద్దు చేసినందుకు ముఖ్యమంత్రిని కూడా బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని కేటీఆర్‌ అన్నట్టు తెలిసింది. 

ఈ రేసుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ, రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు తనకు ప్రభుత్వం కేటాయించిన అధికారిక ఈ–మెయిల్లో ఉన్నాయని.. ప్రస్తుతం ఆ అకౌంట్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉందని స్పష్టం చేశారు. మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వంలో భాగమైన తనకు ముమ్మాటికీ ఉందని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం మీరు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన జీవోను ఏమైనా ఇచ్చిందా? అని ప్రశ్నించినప్పుడు.. సచివాలయ బిజినెస్‌ రూల్స్‌ అన్నీ సీఎస్‌ పరిధిలో ఉంటాయని, ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్నే అడగాలని కేటీఆర్‌ చెప్పినట్టు తెలిసింది.  ఏస్‌ నెక్సŠట్‌ జెన్‌ సంస్థ మొదటిసారి రేసు నిర్వహించినప్పుడు పూర్తిగా డబ్బులు చెల్లించలేదంటూ.. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాల గురించి ప్రశ్నించినప్పుడు... ప్రైవేటు సంస్థ వివరాలు తనకు తెలియదని, ఆ అంశం తన పరిధిలోనిది కాదని కేటీఆర్‌ చెప్పినట్లు తెలిసింది.  



పత్రాలతో హాజరు..రేసుతో లబ్ధిపై వివరణ  
ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్‌.. ఏసీబీ ప్రశ్నించేందుకు అవకాశం ఉన్న పలు అంశాలకు సంబంధించిన కొన్ని పత్రాలను తన వెంట తెచ్చుకున్నారు. ముందు ఏసీబీ సీఐయూ డీఎస్పీ, ఈ కేసు దర్యాప్తు అధికారి మాజిద్‌ అలీని కలిసి, దర్యాప్తునకు సంబంధించి నోటీసులు తీసుకున్నారు. అప్పటికే కేటీఆర్‌ను విచారించేందుకు సిద్ధంగా ఉన్న ఏసీబీ జేడీ బృందం.. ప్రత్యేక గదిలో కేటీఆర్‌ను ప్రశ్నించింది. 

కాగా ఫార్ములా ఈ రేసు నిర్వహించడానికి గల కారణాలు..రేసు నిర్వహణతో రాష్ట్రానికి ఎలాంటి లబ్ధి జరిగిందన్న అంశాలను కేటీఆర్‌ వివరించినట్టు తెలిసింది. రేసు నిర్వహణతో రాష్ట్రానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగిన లబ్ధికి సంబంధించి కొన్ని పత్రాలు కూడా అందజేసినట్లు సమాచారం. విచారణ మధ్యలో కాసేపు భోజన విరామం ఇచ్చారు. 

ఒకవైపు కేటీఆర్‌ను ప్రశ్నిస్తూనే, మరోవైపు దర్యాప్తులో భాగంగా సేకరించిన అంశాలను ఏసీబీ అధికారులు పరిశీలించినట్టు తెలిసింది. సాయంత్రం 5 గంటల వరకు కేటీఆర్‌ను ప్రశ్నించిన అధికారులు, దర్యాప్తులో భాగంగా అవసరమైతే మళ్లీ హాజరుకావాల్సి ఉంటుందని సూచించినట్టు తెలిసింది. కాగా సాయంత్రం 5.06 గంటల సమయంలో కేటీఆర్‌ ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అక్కడ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. 

రేవంత్‌ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు: మీడియాతో కేటీఆర్‌  
‘ఏసీబీ పెట్టింది చెత్త కేసు..ఇందులో విషయమే లేదు. నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగిందేమీ లేదు. రేవంత్‌ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే అటూ ఇటూ తిప్పి అడిగారు. నాపై కేసు పెట్టి రేవంత్‌రెడ్డి ఏదైనా సాధించాలనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. పైసలు పంపాను అని నేనే చెబుతున్నా. డబ్బులు వచ్చాయని వాళ్లు (ఎఫ్‌ఈఓ) చెబుతున్నారు. ఇందులో అవినీతి ఎక్కడుందని ప్రశ్నిస్తే అధికారుల దగ్గర సమాధానమే లేదు. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకున్న అవగాహన మేరకు సమాధానమిచ్చా. ఎన్నిసార్లు పిలిచినా తప్పక వస్తానని చెప్పా..’ అని కేటీఆర్‌ తెలిపారు. 

అభ్యంతరం తెలిపిన డీసీపీ 
కేటీఆర్‌ మీడియాతో మాట్లాడడంపై డీసీపీ విజయ్‌కుమార్‌ అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ‘ట్రాఫిక్‌ ఇబ్బంది అవుతోంది.. ఇది మీడియా పాయింట్‌ కాదు..ఇక్కడ మీడియా సమావేశం పెట్టొద్దు..’ అని డీసీపీ అనడంతో కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ‘నేను ఇక్కడ మాట్లాడితే ఏం నొచ్చింది. ఏం ఇబ్బంది అయ్యింది. మీడియాపై మీ దాడి ఏంది..? మీకు ఇంత భయం ఎందుకు?..’ అంటూ నిలదీశారు. అయితే మీడియా ప్రతినిధులను పోలీసులు పక్కకు నెట్టేయడంతో కేటీఆర్‌ అక్కడి నుంచి నిష్క్రమించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement