
హైదరాబాద్: కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. కిషన్‌రెడ్డి.. మెట్రో తానే తెచ్చానని చెప్పుకుంటున్నాడని, ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడుందో తనకైతే తెలియదంటూ చమత్కరించారు రేవంత్. మీడియాతో చిట్ చాట్ లో భాగంగా రేవంత్ మాట్లాడారు. ‘ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సహకరించడం లేదు.
తెలంగాణకు నిధులు తెస్తే ఆయనకు సన్మానం చేస్తాం. ఇటీవల అఖిల పక్షం సమావేశం నిర్వహిస్తే కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ లో ఉండి రాలేదు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ హైదరాబాద్ కు వచ్చేది కూడా కిషన్‌రెడ్డికి తెలియదా?, ఈటల వచ్చారు.. కానీ కిషన్‌రెడ్డి రాలేదు. మెట్రో నేనే తెచ్చానని కిషన్‌రెడ్డి అంటారు. నాకైతే జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కన్పిస్తోంది కానీ కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది?,
రీజనల్ రింగ్ రోడ్డు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.. అదే ఇవ్వమని అంటున్నాం. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడటం లేదు. భూసేకరణ అడ్డుకుంటుంది ఈటల, లక్ష్మణ్. ప్రాజెక్టులు ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటుంది రాష్ట్ర బీజేపీ నేతలే. మూసీకి నిధులు తెస్తే కిషన్‌రెడ్డికి సన్మానం చేసి గండపిండేరం తొడుగుతాను. సబర్మతి, యమునా, గంగా ప్రక్షాళనకు నిధులు ఇస్తున్న కేంద్రం మూసీకి ఎందుకు ఇవ్వడం లేదు? అని రేవంత్ ప్రశ్నించారు.
ఇక రేవంత్ తన ఢిల్లీ పర్యటనపై కూడా మాట్లాడారు. ఢిల్లీకి 39 సార్లు కాదు 99 సార్లు వెళ్తాను. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకుంటా. రాష్ట్రానికి కావాల్సిన అనేక అంశాలను క్లియర్ చేసుకొని వచ్చాను. కుల గణన ప్రభావమే అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇచ్చాయి. హరీష్ రావు మోసం వల్లే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోయాం’ అని రేవంత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment