మొసలి కన్నీరు కార్చొద్దు.. కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ కౌంటర్ | Cm Revanth Strong Counter To Union Minister Kishan Reddy | Sakshi
Sakshi News home page

మొసలి కన్నీరు కార్చొద్దు.. కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ కౌంటర్

Published Tue, Dec 3 2024 7:13 PM | Last Updated on Tue, Dec 3 2024 7:35 PM

Cm Revanth Strong Counter To Union Minister Kishan Reddy

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్​ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో “హైదరాబాద్ రైజింగ్” ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్ది, న్యూయార్క్ లాంటి  నగరాలతో సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

‘‘ప్రజలు ఏకోన్ముఖమై రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని  తెచ్చుకుని ఇవ్వాళ్టికి ఏడాది. వచ్చే ఏడాదికి భవిష్యత్ ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అంటే రాష్ట్రానికే కాదు.. ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ. నగరంలో తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కృష్ణా జలాలనే కాదు.. గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌ది. కాంగ్రెస్ ముందుచూపుతో వ్యవహరించడం వల్లే హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య పరిష్కారమైంది.

..హైదరాబాద్‌కు మెట్రోను తీసుకొచ్చేందుకు ఆనాడు కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చాయి. రూ.35 వేల కోట్లతో 360 కి.మీ  తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి రేడియల్ రోడ్లు నిర్మించి నగరాన్ని మరింత అభివృద్ధి చేయనున్నాం. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ లో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

..40 నుంచి 50 వేల ఎకరాల్లో ప్రపంచంలోని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ట్యాంక్ బండ్‌ను మురికి కూపంగా మార్చారు. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానని ప్రజలను మోసం చేశారు. పదేళ్లలో నగరానికి కావాల్సిన శాశ్వత అభివృద్ధిని గత ప్రభుత్వం విస్మరించింది. ఢిల్లీ నగరం పూర్తిగా కాలుష్యమయమైంది.

ముంబైలో వరదలు వస్తే  నివసించలేని పరిస్థితి. చెన్నైలోనూ వరదలు వస్తే గందరగోళ పరిస్థితి. బెంగుళూరులో గంటలకొద్దీ ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక కలకత్తాలో ఉన్నన్ని సమస్యలు ఎక్కడా లేవు. దేశంలో ఏ నగరాన్ని చూసినా సమస్యలమయమే. ఆ నగరాల నుంచి మనం నేర్చుకోవాలి. హైదరాబాద్ నగరం అలా మారకుండా జాగ్రత్త పడాలి. అందుకే హైదరాబాద్ నగరంలో మూసీ పునరుజ్జీవనం జరగాలి.

నగరంలో వరదల నియంత్రణకు రోడ్లపై వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మిస్తున్నాం. నగరంలోని 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని అధికారులకు ఆదేశించాం. ఎంత మంది ఎంత విష ప్రచారం చేసినా.. రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేసినా మేం వెనక్కి తగ్గేది లేదు. ఏప్రిల్ 1, 2023 నుంచి నవంబర్ 30, 2023 వరకు మీరు గమనించండి. మేం అధికారంలోకి వచ్చిన తరువాత ఏప్రిల్ 1, 2024 నుంచి నవంబర్ 30, 2024 వరకు మా పాలనకు తేడా చూడండి. మా పాలనలో 29 శాతం ఎక్కువ అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది తగ్గలేదు. ఇది మా నిబద్ధతకి నిదర్శనం. హైడ్రా చెరువుల ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు పుట్టించింది.

10 వేల కోట్లు తీసుకురా.. భూమి నేను చూపిస్తా: భూమి కిషన్‌రెడ్డికి కౌంటర్‌
మూసీ వద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు.. మోదీ కంటే మంచి పేరు వస్తుందనే ఆయన మా కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారంటూ ముఖ్యమంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు మూసీలో పడుకున్నా.. మూసీలో మునిగి ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మీకు చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి మూసీ ప్రక్షాళనకు రూ.25 వేల కోట్లు నిధులు తీసుకురావాలి.

పేదలపై మొసలి కన్నీరు కార్చొద్దు.. చిత్తశుద్ది ఉంటే కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు తీసుకురా భూమి నేను చూపిస్తా.. పేదలకు మంచి అపార్ట్ మెంట్స్ కట్టిద్దాం.. మంచి భవిష్యత్ ఇద్దాం. మోదీ గుజరాత్‌కి  గిఫ్ట్ సిటీ తీసుకుపోయిండు. నువ్వు తెలంగాణకు ఏం గిఫ్ట్ తెచ్చినవ్?. రెండో సారి కేంద్రమంత్రి అయిన నువ్వు రాష్ట్రానికి ఏం నిధులు  తీసుకొచ్చినవ్? సమాధానం చెప్పాలి. నగరంలో మెట్రో విస్తరణకు రూ.35 వేల కోట్లు అవసరం ఉంది.. మీరు ఎన్ని నిధులు తెస్తారో చెప్పండి. గుజరాత్ మెట్రోకు,  చెన్నైకి మెట్రోకు నిధులు ఇచ్చారు.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు ఇవ్వరు..?

..హైదరాబాద్‌కు తాగు నీటికి కోసం గోదావరి జలాల తరలించడానికి  రూ.7 వేల కోట్లు కావాలి.. కేంద్రం నుంచి నువ్వు ఎంత తెస్తావ్.. రీజనల్‌ రింగ్ రోడ్డుకు, రేడియల్ రోడ్లకు రూ.50 వేల కోట్లు కావాలి. కేంద్రం నుంచి నువ్వు ఎన్ని నిధులు తెస్తావ్?. నితిన్ గడ్కరీ దగ్గర మన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి.. మీరు ఎన్ని నిధులు ఇప్పిస్తారో జవాబు చెప్పాలి.. మోదీ గుజరాత్‌కు తీసుకెళ్తుంటే గుడ్లు అప్పగించి చూస్తారా?. మూసీలో పడుకోవడం కాదు.. మోదీని తీసుకొచ్చి మూసీని  చూపించు... పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందొ..

మూసీ అభివృద్ధి ఎందుకు అడ్డుకుంటున్నారు?.. హైదరాబాద్‌ మరో ఢిల్లీ కావాలా?. మనం ఈ మురికి కూపంలో మగ్గాల్సిందేనా? తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి.. లక్షన్నర కోట్లతో హైదరాబాద్ నగరం అద్భుతమైన నగరంగా మారుతుంది. ప్రపంచం పెట్టుబడులకు హైదరాబాద్ వేదిక కావాలంటే.. ఇవన్నీ జరగాలి.. ఇవన్నీ జరగాలంటే కేంద్రం సహకరించాలి. మీరు నిధులు తెస్తారా? గుజరాత్‌కు వలస వెళతారా? తేల్చుకోండి’’ అంటూ కిషన్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement