డీప్‌ఫేక్.. నటి రష్మిక మందన పేరుతో వైరల్ అయిన ఓ వీడియో తర్వాత విస్తృతంగా చర్చ నడిచిన టెక్నాలజీ. ఆ వీడియోకుగానూ ఆమెకు అన్నిరంగాల నుంచి సానుభూతి కనిపించింది. ఆ టైంలో ఈ టెక్నాలజీని కట్టడి చేయాలంటూ ప్రభుత్వాలు సైతం గళం వినిపించాయి. అయితే ఏఐ వాడకం పెరిగిపోయాక.. ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అయిపోయాయి. ఏకంగా సినిమా హీరోయిన్లను.. నచ్చిన అమ్మాయిలను ముద్దు పెట్టుకుంటున్నట్లు, వాళ్లతో రొమాన్స్ చేస్తున్నట్లు వీడియో క్రియేట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లాంటి పాపులర్ షార్ట్‌వీడియోస్ యాప్‌లలోనూ వదులుతున్నారు.
ఒకవైపు మన దేశంలో ఈ తరహా విషసంస్కృతిని కట్టడి చేయలేకపోవడంతో.. ఉన్మాదులు మరింత రెచ్చిపోతున్నారు. మన దేశ ప్రధానిని సైతం కూడా వదలకుండా తమ పైత్యం ప్రదర్శిస్తున్నారు. ఇందులో సరదా కోణం ఉన్నప్పటికీ.. అశ్లీలత, అసభ్యత లాంటివి కూడా చాలావరకు కనిపిస్తోంది. అయితే ఇక్కడో దేశం డీప్‌ఫేక్ కట్టడికి కఠిన చట్టం అమల్లోకి తేబోతోంది.
ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్‌లను ఆర్టిఫిషియల్ టెక్నాలజీ(Artificial Intelligence) ని ఉపయోగించి.. అచ్చం నిజంవాటిలా అనిపించేలా చేసే ప్రయత్నమే డీప్‌ఫేక్. ఇందులో సరదా కోణం మాత్రమే కాదు.. అచ్చం పోలికలతో ఉండేలా అసభ్యకరమైన వీడియోలను, ఫొటోలను, అలాగే ఫేక్ ఆడియో క్లిప్‌లను కూడా సృష్టించవచ్చు. అందుకే ఆందోళన తీవ్రతరం అవుతోంది. అయితే..
డీప్‌ఫేక్స్(Deepfakes)ను క్రియేట్ చేసినా.. వాటిని ఇతరులకు షేర్ చేసినా.. ఇక నుంచి తీవ్ర నేరంగానే పరిగణించనుంది బ్రిటన్. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన చేసింది. ముఖ్యంగా మహిళలను, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని మృగాలు నెట్టింట రెచ్చిపోతున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్రిటన్ ప్రకటించింది.
వాస్తవానికి 2015 నుంచే డీప్‌ఫేక్‌ను తీవ్ర నేరంగా పరిగణించేలా చట్టం చేయాలని బ్రిటన్ ప్రయత్నిస్తూ వస్తోంది. గత కన్జర్వేటివ్ ప్రభుత్వం తీవ్ర నేరంగానే పరిగణించాలని చట్టం చేయాలనుకున్నప్పటికీ.. శిక్షను మాత్రం స్వల్ప జైలు శిక్ష, జరిమానాతో సరిపెట్టాలనుకుంది. అయితే ఆ టైంలో శిక్ష కఠినంగా ఉండాలని పలువురు డిమాండ్ చేశారు.
తాజాగా లేబర్ పార్టీ(labour Party) ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. డీప్‌ఫేక్‌ను ప్రమోట్ చేసేవాళ్లు కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కఠిన శిక్షకూడా పడుతుంది. ‘‘అనుమతి లేకుండా అశ్లీలంగా డీప్‌ఫేక్ కంటెంట్ తయారు చేసినా.. వైరల్ చేసినా శిక్షార్హులే అని ఆ దేశ న్యాయశాఖ ప్రకటించింది. అలాగే మహిళల ప్రైవసీకి భంగం కలిగించే ఈ వ్యవహారాన్ని అత్యవసర పరిస్థితిగానూ పరిగణిస్తామని పేర్కొంది. అతిత్వరలో ఈ చట్టాన్ని పార్లమెంట్‌కు తీసుకురానున్నట్లు తెలిపింది.
యూకేకు చెందిన రివెంజ్‌పోర్న్ హెల్ప్‌లైన్ గణాంకాలను పరిశీలిస్తే.. 2017 నుంచి సోషల్ మీడియాలో ఈ తరహా వేధింపులు 400 శాతం పెరిగిపోయినట్లు తేలింది. అయితే ఇది ఫొటోల రూపేణా ఎక్కువగా కనిపించింది.
ఉన్మాదంతో, ఒక్కోసారి ప్రతీకార చర్యలో భాగంగా పోర్నోగ్రఫిక్ కంటెంట్‌ను ఉద్దేశపూర్వకంగానే నెట్‌లో వదులుతున్నారు కొందరు. మన దేశంలోనూ కొందరి డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలు అప్పుడప్పుడు తెర మీదకు వస్తుండడంతో.. ఆ ప్రైవేట్ వీడియోలు తమవి కావంటూ వాళ్లు ఖండిస్తుండడం చూస్తున్నాం.
ఇదీ చదవండి: చొరబాట్లకు మూడు రూట్లు
Comments
Please login to add a commentAdd a comment