డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని మోదీ ఆందోళన
భువనేశ్వర్: డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలతోపాటు కృత్రిమ మేధతో సామాజిక, కుటుంబ సంబంధాలకు భంగం కలిగే డీప్‌ఫేక్ కేసులు పెరుగుతుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను గరిష్ట స్థాయిలో వాడుకుంటూ పోలీస్ కానిస్టేబుళ్లపై పనిభారం తగ్గించేందుకు ప్రయత్నించాలని సూచించారు. పోలీసు సిబ్బంది, వనరుల కేటాయింపులో పోలీస్‌స్టేషన్లు కేంద్ర స్థానాలుగా మారాలన్నారు.
ఆదివారం ప్రధాని మోదీ 59వ అఖిల భారత డీజీపీలు, ఐజీపీల సదస్సులో మాట్లాడారు. భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొనే విషయమై సదస్సులో అన్ని కోణాల్లోనూ విస్తృత స్థాయి చర్చలు జరిగినందుకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కృత్రిమ మేధను వాడుకుంటూ సవాళ్లను అవకాశాలుగా మల్చుకోవాలని కోరారు. అర్బన్ పోలీసింగ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 100 నగరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment