
ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు గురువారం రాజ్యసభ్యలో చర్చకు వచ్చిన సందర్భంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. తొలుత వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ అదే రాజ్యసభలో ముందురోజు(బుధవారం) చెప్పిన ‘ద బిజు జనతాదళ్(బీజేడీ).. గురువారం నాటికి వచ్చేసరికి యూటర్న్ తీసుకుంది.
ఆ బిల్లుకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థులు ఎలాగైనా ఓటేసుకోవచ్చని స్పష్టం చేసింది. వారి( బీజేడీ ఎంపీలు) మనస్సాక్షి ప్రకారం ఓటేసుకోవచ్చంటూ యూ టర్న్ తీసుకుంది. ఇక్కడ తమ ఎంపీలు ఎలా ఓటేసినా అంటే అనుకూలంగా ఓటేసినా ఎటువంటి విప్ జారీ చేయబోమని తేల్చి చెప్పింది. తాము మైనార్టీ వర్గాల సెంటిమెంట్స్ ను గౌరవిస్తామన్న రోజు వ్యవధిలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం హైడ్రామాకు తెరలేపింది.
బీజేడీ తొలుత చెప్పింది ఇదే..
‘‘ మేము మైనార్టీల సెంటిమెంట్స్ ను పరిగణలోకి తీసుకుంటాం. మా సభ్యులంతా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మాకు లోక్ సభలో ఎంపీలు లేరు.. మాకు రాజ్యసభలో ఉన్న ఏడుగురు సభ్యులు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటేస్తారు’’ అని పేర్కొంది.
మరి మళ్లీ బీజేడీకి ఏమైంది?
అయితే రాజ్యసభలో ముందు చెప్పిన మాటకు బీజేడీ కట్టుబడలేదు. తమ ఎంపీలు ఇష్టప్రకారమే ఓటేయొచ్చని తెలిపింది. ‘‘వారు ఫ్రీగా ఓటేసుకోవచ్చు. అనుకూలంగా ఓటేసినా, వ్యతిరేకంగా ఓటేసినా తాము వారికి ఎటువంటి విప్ జారీ చేయం’’ అని తెలిపింది. బీజేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలతోనే ఆ పార్టీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.