DGPs-IGPs Conference
-
‘సంప్రదాయ పోలీసింగ్’ బలోపేతం
న్యూఢిల్లీ: పోలీసు దళాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కొత్త టెక్నాలజీలో సుశిక్షితులు కావాలన్నారు. అదేసమయంలో సంప్రదాయ పోలీసింగ్ విధానాలను బలోపేతం చేసుకోవాలని చెప్పారు. ఆదివారం డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ 57వ అఖిల భారత సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలు పరస్పరం సహకారం పెంపొందించుకోవాలని అన్నారు. ఉత్తమమైన విధానాలను పంచుకోవాలని తెలిపారు. వాడుకలోని లేని క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖ ప్రమాణాలను మరింత పెంచాల్సి ఉందన్నారు. వివిధ దర్యాప్తు సంస్థల నడుమ డేటాను ఇచ్చిపుచ్చుకొనే విధానం బలపడాలని, ఇందుకోసం నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇక జైళ్ల సమర్థ నిర్వాహణకు సంస్కరణలు చేపట్టాలని తెలిపారు. నూతన సవాళ్లు, పరిష్కార మార్గాలపై చర్చించుకొనేందుకు పోలీసు ఉన్నతాధికారుల సదస్సులు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా నిర్వహించుకోవాలని సూచించారు. డీజీపీలు/ఐజీపీల సదస్సుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. నేషనల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై సదస్సులో చర్చించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 600 మందికిపైగా అధికారులు పాల్గొన్నారు. -
ఆలిండియా డీజీపీల సదస్సు ప్రారంభం
హైదరాబాద్: 51వ ఆలిండియా డీజీపీలు, ఐజీల సదస్సును కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఈ సదస్సును ఆరంభించారు. అత్యుత్తమ సేవలు అందించిన హోం శాఖ, ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులకు భారత పోలీస్ పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ.. దేశ అంతర్గత భద్రతను కాపాడేందుకు పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఉగ్రవాద ప్రాబల్యం ఉన్న జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్రాల పోలీసు బలగాలు శాంతిభద్రతలు కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయని అన్నారు. అంతకుముందు రాజ్నాథ్ ఉక్కుమనిషి, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు కిరన్ రిజిజు, హన్సరాజ్ గంగారామ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి, అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశం ఎదుర్కొంటున్న భద్రత సమస్యలను చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ విచ్చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఆయన అక్కడ నుంచి నేరుగా పోలీస్ అకాడమీకి చేరుకున్నారు. ఈ రోజు రాత్రికి అక్కడే బస చేసి రేపు సదస్సులో పాల్గొంటారు.