హైదరాబాద్: 51వ ఆలిండియా డీజీపీలు, ఐజీల సదస్సును కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఈ సదస్సును ఆరంభించారు. అత్యుత్తమ సేవలు అందించిన హోం శాఖ, ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులకు భారత పోలీస్ పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. దేశ అంతర్గత భద్రతను కాపాడేందుకు పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఉగ్రవాద ప్రాబల్యం ఉన్న జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్రాల పోలీసు బలగాలు శాంతిభద్రతలు కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయని అన్నారు. అంతకుముందు రాజ్‌నాథ్ ఉక్కుమనిషి, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు కిరన్ రిజిజు, హన్సరాజ్ గంగారామ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి, అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశం ఎదుర్కొంటున్న భద్రత సమస్యలను చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ విచ్చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఆయన అక్కడ నుంచి నేరుగా పోలీస్ అకాడమీకి చేరుకున్నారు. ఈ రోజు రాత్రికి అక్కడే బస చేసి రేపు సదస్సులో పాల్గొంటారు.
ఆలిండియా డీజీపీల సదస్సు ప్రారంభం
Published Fri, Nov 25 2016 7:55 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement