హైదరాబాద్: నగర శివారు రాజేంద్రనగర్ సమీపంలోని జాతీయ పోలీసు అకాడమీలో తుపాకీ మిస్ఫైర్ అయి... గార్డెనర్గా పని చేస్తున్న హబీబ్ నడుమ భాగంలోకి దూసుకు వెళ్లింది. దీంతో అతడు కుప్పకూలిపోయాడు. అకాడమీ సిబ్బంది వెంటనే స్పందించి హబీబ్ను నగరంలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. అతడికి శస్త్ర చికిత్స చేసి నడుమ భాగంలోని చొచ్చుకుని పోయిన బుల్లెట్ను వెలికి తీశారు. అతడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
క్షతగాత్రుడు హబీబ్ మైలార్దేవ్ పల్లి గ్రామానికి చెందిన వాడని... దాదాపు 18 ఏళ్లుగా పోలీసు అకాడమీలో గార్డెనర్గా విధులు నిర్వహిస్తున్నాడని అకాడమీ అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు అకాడమీ అధికారులు తెలిపారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. అయితే గత అర్థరాత్రి వెలుగులోకి వచ్చింది.
గురువారం అకాడమీలోని ఐపీఎస్ పాసింగ్ అవుట్ పేరెడ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయుధాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రేపు జరగనున్న ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పేరెడ్కు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.