సైబర్ నేరాలు, కొత్త చట్టాలపై ప్రత్యేక ఫోకస్
రేపు దీక్షాంత్ పరేడ్‌లో పాల్గొననున్న ఐపీఎస్‌లు, విదేశీ అధికారులు
ఎన్‌పీఏ డైరెక్టర్ అమిత్ గార్గ్
సాక్షి, హైదరాబాద్: అకాడమీ శిక్షణలో భాగంగా శాంతిభద్రతల నిర్వహణ, సైబర్ నేరాల కట్టడి, డ్రగ్స్ మహమ్మారిని తుద ముట్టించడం సహా అనేక అంశాల్లో యువ ఐపీఎస్‌లను సుశిక్షితులైన అధికారులుగా మార్చినట్టు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ చెప్పారు.
76వ బ్యాచ్ ఆర్‌ఆర్ (రెగ్యులర్ రిక్రూటీస్)కు చెందిన 188 మంది ఐపీఎస్ అధికారులు, నేపాల్, రాయల్ భూటాన్, మారిషస్, మాల్దీవులకు చెందిన 19 మంది విదేశీ అధికారులు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నట్టు తెలిపారు. వీరిలో 58 మంది మహిళా అధికారులు ఉన్నారన్నారు.
వీరంతా శుక్రవారం అకాడమీలో జరిగే దీక్షాంత్ పరేడ్‌లో పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ హాజరుకానున్నట్టు చెప్పా రు. బుధవారం అకాడమీ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మహిళా అధికారులు పెరిగారు
సైబర్ నేరాలు, డ్రోన్ టెక్నాలజీ, కొత్త చట్టాలపై అవగాహన, శారీరక, మానసిక ధృఢత్వాన్ని పెంచడం, అన్ని రకాల ఆయుధాలను వాడే విధానం, వివిధ పోలీస్ విభాగాల్లో, సరిహద్దుల్లో మిలిటరీ విభాగాల్లో పనిచేయడం సహా అనేక అంశాల్లో యువ ఐపీఎస్ అధికారులు శిక్షణ పొందినట్లు అమిత్ గార్గ్ తెలిపారు.
ఐపీఎస్ అధికారులు కేటాయించబడే రాష్ట్రంలోని స్థానిక భాష, అక్కడి భౌగోళిక పరిస్థితులు, స్థానిక సమస్యలు, సాంప్రదాయాలపై పట్టు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఈ బ్యాచ్ అధికారుల్లో విద్యార్హత పరంగా చూస్తే ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు 109 మంది, ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు 15 మంది ఉన్నట్టు తెలిపారు.
మహిళా అధికారుల సంఖ్యలో ఈసారి పెరుగుదల ఉందని, 75వ బ్యాచ్‌లో 21 శాతం మహిళలుండగా, ఈసారి 29% మంది ఉన్నట్టు చెప్పారు. పరేడ్ కమాండర్‌గా అచ్యుత్ అశోక్ వ్యవహరిస్తారని, ఈ బ్యాచ్‌లో టాపర్స్‌గా నిలిచిన 8 మంది పరేడ్ అనంతరం ట్రోఫీలు అందుకోనున్నట్టు తెలిపారు.
తెలంగాణ, ఏపీకి నలుగురు చొప్పున ఐపీఎస్‌లు
76వ ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు నలుగురు, ఏపీకి నలుగురు చొప్పున అధికారులను కేటాయించారు. తెలంగాణ కేడర్‌కు తెలంగాణకు చెందిన రుత్విక్ సాయి కొట్టె, పత్తిపాక సాయికిరణ్, జమ్మూకశీ్మర్‌కు చెందిన మనన్ భట్, యూపీకి చెందిన యాదవ్ వసుంధర ఫరెబీలను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మనీశరెడ్డి వంగాల, హేమంత్ బొడ్డు, హరియాణాకు చెందిన దీక్ష, తమిళనాడుకు చెందిన ఆర్ సుస్మితలను కేటాయించారు.
తప్పుల్లోంచి పాఠాలు నేర్చుకున్నా..
మాది వరంగల్ జిల్లా భీందేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం. నాన్న పేరు కొమరెల్లి, అమ్మపేరు లక్షి్మ. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా కుటుంబం నుంచి మొదటి ఐపీఎస్ అధికారిని. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో 2019లో జాబ్‌కు రిజైన్ చేసి, నేనే సొంతంగా ఇంటి వద్ద ప్రిపరేషన్ కొనసాగించా. రోజుకు 8 గంటలు చదివేవాడిని.
మా తల్లిదండ్రులు, సిస్టర్స్, ఇతర కుటుంబసభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభించింది. అయితే నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్లా. మొత్తం మీద మూడో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించా. తెలంగాణ కేడర్‌కు రావడం, మన రాష్ట్ర ప్రజలకే సేవ చేసే అవకాశం దక్కడంతో సంతోషంగా ఉంది. – పత్తిపాక సాయికిరణ్
డ్రగ్స్ విషయంలో గట్టిగా పని చేయాలనుకుంటున్నా
నా స్వస్థలం వరంగల్. అక్కడే స్కూల్, ఇంటర్ చదివా. నాన్న రాధాకృష్ణరావు సోషల్ వెల్ఫేర్ విభాగంలో లైబ్రేరియన్. మా అమ్మ టీచర్‌గా కొంత కాలం పనిచేశారు. నాన్న చిన్నప్పటి నుంచి చెప్పే మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. బీటెక్ పూర్తయిన తర్వాత 2017 నుంచి సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టా. 2022లో నాకు ఐపీఎస్ వచ్చి0ది.
పక్కా ప్రణాళికతో ముందుకు వెళితే తప్పకుండా విజయం సాధించవచ్చు. ఐపీఎస్ శిక్షణ మనలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. తెలంగాణ కేడర్‌కు రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఏదైనా సమస్య ఉంటే ప్రజలు స్వేచ్ఛగా, ధైర్యంగా రాగలిగేలా పోలీసులపై విశ్వాసం పెంచడమే నా లక్ష్యం. డ్రగ్స్ విషయంలో నేను గట్టిగా పనిచేయాలనుకుంటున్నా. – రిత్విక్ సాయి కొట్టే
Comments
Please login to add a commentAdd a comment