Amit garg
-
అన్ని అంశాల్లో మెరికల్లా శిక్షణ
సాక్షి, హైదరాబాద్: అకాడమీ శిక్షణలో భాగంగా శాంతిభద్రతల నిర్వహణ, సైబర్ నేరాల కట్టడి, డ్రగ్స్ మహమ్మారిని తుద ముట్టించడం సహా అనేక అంశాల్లో యువ ఐపీఎస్‌లను సుశిక్షితులైన అధికారులుగా మార్చినట్టు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ చెప్పారు. 76వ బ్యాచ్ ఆర్ఆర్ (రెగ్యులర్ రిక్రూటీస్)కు చెందిన 188 మంది ఐపీఎస్ అధికారులు, నేపాల్, రాయల్ భూటాన్, మారిషస్, మాల్దీవులకు చెందిన 19 మంది విదేశీ అధికారులు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నట్టు తెలిపారు. వీరిలో 58 మంది మహిళా అధికారులు ఉన్నారన్నారు. వీరంతా శుక్రవారం అకాడమీలో జరిగే దీక్షాంత్ పరేడ్‌లో పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ హాజరుకానున్నట్టు చెప్పా రు. బుధవారం అకాడమీ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళా అధికారులు పెరిగారుసైబర్ నేరాలు, డ్రోన్ టెక్నాలజీ, కొత్త చట్టాలపై అవగాహన, శారీరక, మానసిక ధృఢత్వాన్ని పెంచడం, అన్ని రకాల ఆయుధాలను వాడే విధానం, వివిధ పోలీస్ విభాగాల్లో, సరిహద్దుల్లో మిలిటరీ విభాగాల్లో పనిచేయడం సహా అనేక అంశాల్లో యువ ఐపీఎస్ అధికారులు శిక్షణ పొందినట్లు అమిత్ గార్గ్ తెలిపారు. ఐపీఎస్ అధికారులు కేటాయించబడే రాష్ట్రంలోని స్థానిక భాష, అక్కడి భౌగోళిక పరిస్థితులు, స్థానిక సమస్యలు, సాంప్రదాయాలపై పట్టు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఈ బ్యాచ్ అధికారుల్లో విద్యార్హత పరంగా చూస్తే ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు 109 మంది, ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు 15 మంది ఉన్నట్టు తెలిపారు. మహిళా అధికారుల సంఖ్యలో ఈసారి పెరుగుదల ఉందని, 75వ బ్యాచ్‌లో 21 శాతం మహిళలుండగా, ఈసారి 29% మంది ఉన్నట్టు చెప్పారు. పరేడ్ కమాండర్‌గా అచ్యుత్ అశోక్ వ్యవహరిస్తారని, ఈ బ్యాచ్‌లో టాపర్స్‌గా నిలిచిన 8 మంది పరేడ్ అనంతరం ట్రోఫీలు అందుకోనున్నట్టు తెలిపారు. తెలంగాణ, ఏపీకి నలుగురు చొప్పున ఐపీఎస్‌లు 76వ ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు నలుగురు, ఏపీకి నలుగురు చొప్పున అధికారులను కేటాయించారు. తెలంగాణ కేడర్‌కు తెలంగాణకు చెందిన రుత్విక్ సాయి కొట్టె, పత్తిపాక సాయికిరణ్, జమ్మూకశీ్మర్‌కు చెందిన మనన్ భట్, యూపీకి చెందిన యాదవ్ వసుంధర ఫరెబీలను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మనీశరెడ్డి వంగాల, హేమంత్ బొడ్డు, హరియాణాకు చెందిన దీక్ష, తమిళనాడుకు చెందిన ఆర్ సుస్మితలను కేటాయించారు. తప్పుల్లోంచి పాఠాలు నేర్చుకున్నా.. మాది వరంగల్ జిల్లా భీందేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం. నాన్న పేరు కొమరెల్లి, అమ్మపేరు లక్షి్మ. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా కుటుంబం నుంచి మొదటి ఐపీఎస్ అధికారిని. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో 2019లో జాబ్‌కు రిజైన్ చేసి, నేనే సొంతంగా ఇంటి వద్ద ప్రిపరేషన్ కొనసాగించా. రోజుకు 8 గంటలు చదివేవాడిని. మా తల్లిదండ్రులు, సిస్టర్స్, ఇతర కుటుంబసభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభించింది. అయితే నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్లా. మొత్తం మీద మూడో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించా. తెలంగాణ కేడర్‌కు రావడం, మన రాష్ట్ర ప్రజలకే సేవ చేసే అవకాశం దక్కడంతో సంతోషంగా ఉంది. – పత్తిపాక సాయికిరణ్డ్రగ్స్ విషయంలో గట్టిగా పని చేయాలనుకుంటున్నా నా స్వస్థలం వరంగల్. అక్కడే స్కూల్, ఇంటర్ చదివా. నాన్న రాధాకృష్ణరావు సోషల్ వెల్ఫేర్ విభాగంలో లైబ్రేరియన్. మా అమ్మ టీచర్‌గా కొంత కాలం పనిచేశారు. నాన్న చిన్నప్పటి నుంచి చెప్పే మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. బీటెక్ పూర్తయిన తర్వాత 2017 నుంచి సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టా. 2022లో నాకు ఐపీఎస్ వచ్చి0ది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళితే తప్పకుండా విజయం సాధించవచ్చు. ఐపీఎస్ శిక్షణ మనలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. తెలంగాణ కేడర్‌కు రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఏదైనా సమస్య ఉంటే ప్రజలు స్వేచ్ఛగా, ధైర్యంగా రాగలిగేలా పోలీసులపై విశ్వాసం పెంచడమే నా లక్ష్యం. డ్రగ్స్ విషయంలో నేను గట్టిగా పనిచేయాలనుకుంటున్నా. – రిత్విక్ సాయి కొట్టే -
ఐపీఎస్ పాఠ్యాంశాల్లో ప్రవర్తన, నైతిక విలువలు
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో (ఎస్వీపీఎన్పీఏ) ఐపీఎస్ ట్రైనీలకు ఇచ్చే శిక్షణలో ప్రవర్తనకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు డైరెక్టర్ అమిత్ గార్గ్ చెప్పారు. ఇందులోభాగంగా ఈ ఏడాది నుంచి ప్రవర్తన, నైతి క విలువలు, మానవ హక్కులు అనే కొత్త పాఠ్యాంశాన్ని చేర్చామన్నారు. అకాడమీలో తొలి దశ శిక్షణ పూర్తి చేసుకున్న 75వ రెగ్యులర్ రిక్రూటీస్ (ఆర్ ఆర్) బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరగనుందని, దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. అకాడమీలో శిక్షణ పొందిన వాటిలో ఇది 75వ బ్యాచ్ కావడంతో ‘అమృత్కాల్ బ్యాచ్’గా పరిగణిస్తూ ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బుధవారం అకాడమీలో జాయింట్ డైరెక్టర్ ఎన్.మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన వెల్లడించిన వివరాలివీ... ఎప్పటికప్పుడు శిక్షణను విశ్లేషిస్తూ... సమకాలీన అవసరాలకు తగ్గట్టు ట్రైనింగ్, పాఠ్యాంశాల్లో మార్పుచేర్పులు చేస్తున్నారు. ప్రవర్తనకు సంబంధించిన అంశాలతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సైబర్ క్రైమ్ మాడ్యుల్‌ను కొత్తగా చేర్చారు. దేశంలోని ఒక్కో రాష్ట్ర పోలీసు విభాగం ఒక్కోఅంశంలో ప్రత్యేకత కలిగి ఉంది. అవన్నీ సమ్మిళితం చేసి ట్రైనీలకు నేరి్పస్తున్నారు. కీలక, సంచలనాత్మక కేసుల్ని దర్యాప్తు చేసిన వారినే గెస్ట్ ఫ్యాకల్టిలుగా పిలిపించి వారి అనుభవాలను ట్రైనీలకు తెలియజేస్తున్నారు. శిక్షణలో అనుష్త కాలియా ఓవరాల్ టాపర్‌గా నిలిచారు. వచ్చే నెల 14 నుంచి 76వ బ్యాచ్ ట్రైనింగ్ మొదలు కానుంది. మాక్ కోర్టులు సైతం నిర్వహిస్తూ... సాధారణంగా ఐపీఎస్ అధికారులకు ఎఫ్ఐఆర్, పంచనామా సహా ఇతర రికార్డులు రాసే అవసరం, అవకాశం ఉండదు. అయితే వీటిపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో వారి విధి నిర్వహణ పక్కాగా ఉంటుంది. దీంతో వారితోనే కొన్ని చార్జ్షీట్లు తయారు చేయిస్తున్నారు. న్యాయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తులతో మాక్ కోర్టులు నిర్వహిస్తూ విచారణ చేయించి రికార్డుల్లోని లోపాలు వారికి తెలిసేలా చేస్తున్నారు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న 75వ బ్యాచ్‌లో 155 మంది (2021, 2022 బ్యాచ్‌ల ఐపీఎస్‌లు) ఉన్నారు. వీళ్లు శిక్షణలోనే కర్ణాటక ఎన్నికలు, హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు తదితర బందోబస్తుల్లో పాల్గొన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకోవడం, ఆయన సెక్యూరిటీలో తలెత్తిన లోపాలను ఓ కేస్‌స్టడీగా పరిచయం చేశారు. ఇప్పుడు శిక్షణ పొందిన వారిలో తెలంగాణకు 14 (మహిళలు–5, పురుషులు–9) మంది, ఏపీకి 15 (మహిళలు–5, పురుషులు–10) మందిని కేటాయించారు. ఐఆర్ఎస్ నుంచి ఐపీఎస్‌కు.. అల్వాల్ మా స్వస్థలం. బీ ఫార్మసీ, ఎంబీఏ పూర్తి చేశా. తండ్రి రిటైర్డ్ జడ్జి. ఆయనకు ఇచ్చిన మాట కోసమే ఐపీఎస్ కావాలనుకున్నా. 2016లో 10 మార్కులు తక్కువ రావడంతో ఐఆర్ఎస్కు ఎంపికయ్యా. బెంగళూరు, గోవాల్లో ఆదాయపు పన్ను శాఖలో ఐదేళ్ల పాటు పని చేశా. 2021లో చివరి ప్రయత్నంలో 155వ ర్యాంక్‌తో ఐపీఎస్ సాధించా. తెలంగాణ కేడర్‌కే అలాట్ కావడం సంతోషంగా ఉంది. – ఎస్.చిత్తరంజన్, ఐపీఎస్ ట్రైనీ తెలుగు నేర్చుకోవడమే తొలి లక్ష్యం మాది మహారాష్ట్ర. ముంబైలోని ఐసీటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. తండ్రి అక్కడే ఏఎస్సై, మేనమామ హెడ్–కానిస్టేబుల్. వీరి ప్రోద్బలంతోనే పోలీసు కావాలనుకున్నా. రెండో ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చింది. తెలంగాణ కేడర్‌కు అలాట్ అయ్యా. అందుకే తెలుగు నేర్చుకోవడమే నా తొలి లక్ష్యం. అప్పుడే ఇక్కడి ప్రజలతో మమేకం కాగలం. – చేతన్ పందేరి, ఐపీఎస్ ట్రైనీ -
ప్రతీదానికి 'పద్ధతి' అంటాడు...
సీపీ అమిత్‌గార్గ్ బదిలీకి టీడీపీ ఎమ్మెల్యేల పట్టు హైదరాబాద్ స్థాయిలో జోరుగా లాబీయింగ్ హోంమంత్రితో భేటీ... మా పనులు చేయడంలేదని ఫిర్యాదు సీఎంకు చెప్పండంటూ తప్పించుకున్న చినరాజప్ప చక్రం తిప్పుతున్న వివాదాస్పద ఎమ్మెల్యే 'అన్నింటికీ రూల్స్ అంటారు.. పద్ధతిగా వెళ్లాలంటారు... పోలీసులే అలా ఉంటే ఇక మేమెందుకు?.. అతని అండ చూసుకొని దిగువస్థాయి అధికారులూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలమైనప్పటికీ పోలీస్ స్టేషన్లో మా మాట చెల్లడం లేదు... మావాళ్ల పనులు జరగడం లేదు. ఈ పరిస్థితికి కారణమైన పోలీస్ బాస్ మాకొద్దే వద్దు.. అతన్ని తక్షణమే బదిలీ చేయండి'.. ఇదీ నగర టీడీపీ ఎమ్మెల్యేల డిమాండ్. నిబంధనల మేరకు వ్యవహరిస్తున్న నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్‌ను వదిలించుకోవాలన్న తమ డిమాండ్‌పై అధికార టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై మళ్లీ ఒత్తిడి ప్రారంభించారు. అమిత్గార్గ్పై టీడీపీ ఎమ్మెల్యేలు కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. తాజాగా మళ్లీ గళమెత్తి ఆయన్ను బదిలీ చేయాల్సిందేనని హోంమంత్రితో పాటు సీఎం కార్యాలయం ఉన్నతాధికారుల వద్ద పట్టుబట్టినట్టు సమాచారం. ప్రధానంగా నగరానికి చెందిన ఓ వివాదాస్పద ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఒత్తిడి తీసుకురావస్తుండటం గమనార్హం. తమ అడ్డగోలు వ్యవహారాలకు అడ్డంకిగా నిలుస్తున్నందునే సీపీని బదిలీ చేయించడానికి చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఆయన ఉంటే మేం పమీ చేయలేం ... సీపీని ఈసారి ఎలాగేనా బదిలీ చేయించాలన్న ధేయ్యంతో నగర టీడీపీ ఎమ్మెల్యేలు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే వారు నగరంలో రెండుమూడుసార్లు సమావేశమై సీపీ వ్యవహారంపై చర్చించారు. ఆయన్ని బదిలీ చేయించాలని మంత్రుల ద్వారా చెప్పించారు. కానీ పోలీసు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించకపోవడంపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. త్వరలో ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయన్న సమాచారంతో మరోసారి బదిలీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. హోంమంత్రి చినరాజప్ప దృష్టికి సీపీ వ్యవహరాన్ని తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్లలో కూడా తమ మాట చెల్లడం లేదని.. ఎమ్మెల్యేగా తమను గుర్తించడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీపీని చూసుకునే ఇతర పోలీస్ అధికారులు కూడా తమను పట్టించుకోవడం లేదని కూడా చెప్పుకొచ్చారు. కాగా దీనిపై హోం మంత్రి చినరాజప్ప నుంచి వారికి స్పష్టమైన హామీ లభించలేదని సమాచారం. ఐపీఎస్ స్థాయి అధికారుల పోస్టింగులు నేరుగా సీఎం చేంద్రబాబే చూసుకుంటున్నారని చెప్పి ఆయన తప్పుకున్నారు. దాంతో ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును అసెంబ్లీలో కలిసేందుకు ప్రయత్నించారు. కానీ మహిళా దినోత్సవ కార్యక్రమల్లోపాల్గొనేందుకు ఆయన వెళ్లిపోవడంతో అవకాశం దక్కలేదు. దాంతో సీఎం కార్యాలయ ఉన్నతాధికారులను కలిసి సీపీ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. జీవీఎంసీ ఎన్నికలనాటికి తాము పట్టుసాధించాలంటే సీపీని బదిలీ చేసి తమకు ఉఅనుకూలుడైన అదికారిని నియమించాలని కోరారు. ఆ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. చక్రం తిప్పుతున్నది ఆయనే.... నగరానికి చెందిన ఓ వివాదాస్పద ఎమ్మెల్యేనే సీపీ అమిత్ గార్గ్ బదిలీకి ప్రధానంగా పట్టుబడుతున్నారు. నగర పార్టీ బాధ్యత తనదిగా చెప్పుకుంటూ ఆయన ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నగరంలో కొన్ని నెలలు క్రితం జరిగిన ఓ అనుమానస్పద మృతి కేసులో ఆ ఎమ్మెల్యే పాత్ర వివాదాస్పదమైంది. అదే విధంగా ఆయన పరిధిలోనే ప్రైవేట్ గ్యాంగ్‌లు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. దీనిపై కూడా పోలీసులు కఠినంగా వ్యవహరించారు. పోలీసు అధికారులు తన మాట వినకుండా రూల్స్‌కు కట్టుబడటం ఆ ఎమ్మెల్యేకు ఆగ్రహం తెప్పించింది. దాంతో సీపీపై కొంత అసంతృప్తితో ఉన్న సహచర ఎమ్మెల్యేలను కూడగట్టి ఆయన్ను బదిలీ చేయించడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా జీవీఎంసీ ఎన్నికల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ సీపీ అమిత్ గార్గ్ బదిలీకి పట్టుబడుతున్నారు. ఈ బదిలీ రాజకీయాలు పోలీస్ అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
'బల్జిత్ సింగ్ చనిపోవడం దురదృష్టకరం'
విశాఖపట్టణం: ఉగ్రదాడిలో పంజాబ్ ఎస్పీ బల్జిత్ సింగ్ చనిపోవడం దురదృష్టకరమని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ అన్నారు. బల్జిత్ సింగ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సోమవారం ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. విశాఖలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించామన్నారు. అదే విధంగా నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విశాఖకు వచ్చే ప్రముఖులకు భద్రతా ఏర్పాట్లపై పరిశీలిస్తున్నామని చెప్పారు. -
మరో 16 మంది ‘నిషా’చరులకు జైలు
హైదరాబాద్: ప్రమాదకర స్థాయిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ గత వారాంతంలో ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన 328 మంది వాహనచోదకుల్లో మరో 16 మందికి గురువారం జైలు శిక్ష పడిందని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అమిత్ గార్గ్ వెల్లడించారు. మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బి.చెంగల్రాయనాయుడు 28 మందికి మంగళవారం మూడు రోజుల చొప్పున శిక్ష వేయగా... తాజాగా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.సుధ 16 మందికి ఒక రోజు చొప్పున జైలు శిక్ష విధించారు. వీరితో పాటు మిగిలిన వారికి సైతం రూ.2,600 వరకు జరిమానా విధించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు మద్యం తాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వారి సంఖ్య 11,103కు, జైలు శిక్షపడిన వారి సంఖ్య 986కి చేరిందని అమిత్ గార్గ్ వివరించారు. గత వారాంతంలో చిక్కినవారిలో 251 మంది ద్విచక్ర వాహనచోదకులు, 24 మంది ఆటోడ్రైవర్లు, మరో 46 మంది తేలికపాటి వాహనచోదకులు, ఏడుగురు ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారితో పాటు ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి పోలీసులకు చిక్కిన వారికి మంగళ-బుధవారాల్లో గోషామహల్, బేగంపేటల్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (టీటీఐ)ల్లో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశారు.