హైదరాబాద్: ప్రమాదకర స్థాయిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ గత వారాంతంలో ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన 328 మంది వాహనచోదకుల్లో మరో 16 మందికి గురువారం జైలు శిక్ష పడిందని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అమిత్ గార్గ్ వెల్లడించారు. మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బి.చెంగల్రాయనాయుడు 28 మందికి మంగళవారం మూడు రోజుల చొప్పున శిక్ష వేయగా... తాజాగా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.సుధ 16 మందికి ఒక రోజు చొప్పున జైలు శిక్ష విధించారు. వీరితో పాటు మిగిలిన వారికి సైతం రూ.2,600 వరకు జరిమానా విధించారు.
దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు మద్యం తాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వారి సంఖ్య 11,103కు, జైలు శిక్షపడిన వారి సంఖ్య 986కి చేరిందని అమిత్ గార్గ్ వివరించారు. గత వారాంతంలో చిక్కినవారిలో 251 మంది ద్విచక్ర వాహనచోదకులు, 24 మంది ఆటోడ్రైవర్లు, మరో 46 మంది తేలికపాటి వాహనచోదకులు, ఏడుగురు ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారితో పాటు ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి పోలీసులకు చిక్కిన వారికి మంగళ-బుధవారాల్లో గోషామహల్, బేగంపేటల్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ (టీటీఐ)ల్లో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశారు.