ఇబ్బడిముబ్బడిగా లైట్లతో కూడిన వాహనాలు
సైరన్‌తో దూసుకెళుతున్న మరికొన్ని వాహనాలు
అనర్హులు వాడితే చర్యలు తీసుకునే అవకాశం
పట్టనట్లు వ్యవహరిస్తున్నట్రాఫిక్ పోలీసులు
ఎవరు వినియోగించాలన్న అంశంపై సందిగ్ధత
సాక్షి, హైదరాబాద్: అద్దాలపై పరిమితికి మించిన రంగుతో కూడిన ఫిల్మ్ వేసుకుని సంచరిస్తున్న వాహనాలే కాదు... టాప్‌పై ఎరుపు, నీలి రంగు లైట్లు (బుగ్గలు), సైరన్లు (Syren) పెట్టుకుని సంచరిస్తున్న వాహనాలకు కొదవే లేదు. వీటి వినియోగం కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు... భద్రత పరంగానే పెను సవాలే. అయినా మూడు కమిషనరేట్లకు చెందిన ట్రాఫిక్ విభాగం (Traffic) అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తొలుత తేలికపాటి వాహనాలైన కార్లు తదితరాల టాపులపై ఈ బుగ్గలు పెట్టుకోవడానికి ఎవరు అనర్హులనే దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ఎక్కడికైనా దూసుకెళ్లే అవకాశం...
సాధారణంగా ఈ తరహా లైట్లు, సైరన్‌తో వచ్చే వాహనాలను చూసి సామాన్యులే కాదు పోలీసులు కూడా అప్రమత్తం అవుతారు. సాధారణ వాహనచోదకులు దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తే... వాటిని ఆపడానికి విధుల్లో ఉన్న పోలీసులు సైతం సాధారణంగా ప్రయత్నించరు. ఆయా వాహనాల్లో ప్రముఖులు ఉంటారనే భావనే దీనికి ప్రధాన కారణం. దీనిని ఆసరాగా చేసుకునే కొందరు అనర్హులు, ఆకతాయిలు తమ వాహనాలపై ఈ తరహా లైట్లు పెట్టుకుని సంచరిస్తుంటారు. 2001లో ఢిల్లీలోని పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు ఇలాంటి లైట్లు ఉన్న వాహనాలనే వాడారు. ఈ తరహా లైట్లు, సైరన్లు ఉన్న కారణంగానే భద్రతా సిబ్బంది కూడా ఆ వాహనాలను పార్లమెంట్ ఆవరణలోకి రాకుండా అడ్డుకోలేదు.
వినియోగిస్తున్న వారిలో 90 శాతం అనర్హులే...
ఈ తరహా లైట్లు, సైరన్లు వినియోగిస్తున్న వారిలో 90 శాతం అనర్హులే ఉంటున్నారు. సెంట్రల్ మోటారు వెహికిల్ రూల్స్–1989 ప్రకారం కేవలం 43 మంది వీవీఐపీలు మాత్రమే వీటిని వినియోగించాలి. అయితే అసెంబ్లీ, సెక్రటేరియేట్‌తో పాటు కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు తమ వాహనాలపై ఎరుపు, నీలం లైట్లు (Blue Lights) ఏర్పాటు చేసుకుంటున్నారు. పలువురు వీఐపీలు సైతం ఈ లైట్లు, సైరన్లను అక్రమంగా వినియోగిస్తున్నారు. స్పెషల్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారులకు కూడా తమ కార్లపై ఈ తరహా లైట్లు పెట్టుకునే అవకాశం లేదు. అయినప్పటికీ వివిధ హోదాలకు చెందిన వాళ్లు వీటిని వినియోగిస్తున్నారు. అధికారుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఈ లైట్లు, సైరన్ కలిగి ఉండటం హోదాగా భావించే వాళ్లు అనేక మంది ఉంటున్నారు.
ఎవరు వినియోగించాలంటే...
ఫ్లాషర్‌తో కూడిన రెడ్‌లైట్:
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధాని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లోక్‌సభ స్పీకర్, కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ప్లానింగ్ కమిషనర్ ఉపాధ్యక్షుడు, మాజీ ప్రధానులు, ఉభయసభల ప్రతిపక్ష నేతలు, సుప్రీం కోర్టు జడ్జిలు (వీరు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఈ లైట్‌తో తిరగవచ్చు.)
ఫ్లాషర్ లేని రెడ్‌లైట్:
చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కాగ్, ఉభయసభల ఉపాధ్యక్షులు, కేంద్ర సహాయ మంత్రులు, ప్లానింగ్ కమిషన్ సభ్యులు, అటార్నీ జనరల్, క్యాబినెట్ సెక్రెటరీ, త్రివిధ దళాల అధిపతులు, కేంద్ర డిప్యూటీ మంత్రులు, క్యాట్ చైర్మన్, మైనార్టీ కమిషన్ చైర్మన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల అధ్యక్షులు, యూపీఎస్‌సీ చైర్మన్ (వీరు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఈ లైట్‌తో తిరగవచ్చు.)
చదవండి: కుంభమేళాలో ప్రత్యేక అట్రాక్షన్‌గా అయోధ్యరాముని రెప్లికా
కేవలం రెడ్‌లైట్:
రాష్ట్ర గవర్నర్, గవర్నర్ ఎస్కార్ట్ వాహనాలు, సీఎస్, డీజీపీ, సీజే ఆఫ్ తెలంగాణ, హైకోర్టు జడ్జిలు, లోకాయుక్త, టీజీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్, క్యాట్ వైస్ చైర్మన్.
బ్లూ లైట్...
ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అసెంబ్లీ స్పీకర్– డిప్యూటీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, ఉపాధ్యక్షుడు
వాహనంలో సదరు ప్రముఖులు ఉన్నప్పుడు మాత్రమే లైట్ వినియోగించాలని, లేని పక్షంలో దానిపై నల్ల కవర్ తప్పనిసరిగా వేయాలి.
Comments
Please login to add a commentAdd a comment