ప్రత్యేక అట్రాక్షన్‌గా రామ మందిరం
ప్రతిరూప నిర్మాణం 25 రోజుల్లో పూర్తి
హైదరాబాదీ రూపశిల్పి రమణ వంక ప్రతిభ
మహా కుంభమేళాకి వెళ్తున్నారా? వెళ్లట్లేదా! అయోధ్య నుంచి బాలరాముడు కూడా మహాకుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్ (Prayagraj) చేరుకున్నాడు. నిజమా! అవును నిజమే. అయోధ్య వెళ్లలేని వాళ్ల కోసం రాముడే స్వయంగా త్రివేణి సంగమానికి (Triveni Sangam) తరలి వచ్చాడని సంబరపడుతున్నారు భక్తులు. అచ్చం అయోధ్యలోని బాలరాముడి ఆలయాన్ని పోలిన నిర్మాణాన్ని యూపీలోని కుంభమేళాలో ఆవిష్కరించాడు మన హైదరాబాదీ. ఆయన పేరు రమణ వంక (Ramana Vanka). సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా సొబగులద్దే రమణ ఈ మహాకుంభమేళా సందర్భంగా అయోధ్యరాముడి ఆలయాన్ని, బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్
‘భీమ సినిమాకు టెంపుల్ సెట్ వేసిన అనుభవం ఉంది. అది తెలిసి ఆద్యశ్రీ ఎన్‌ఫోటైన్‌మెంట్, శ్రీ గరుడ రామ్‌మందిర్ వారు పిలిచారు. ‘శతమానం భవతి’ సినిమా కోసం దాదాపు యాభై రోజులు నియమనిష్ఠలు పాటించాను. అలాగే రాముడి మందిరానికి భూమి పూజ చేసిన డిసెంబర్ 26 నుంచి నిష్ఠలో ఉన్నాను. ఫిబ్రవరి 26తో మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగుస్తుంది. కానీ శ్రీరామనవమి వేడుకల వరకూ (మార్చి 15) మందిరాన్ని ఉంచాలని అనుకుంటున్నారు. అప్పటి వరకూ నిష్ఠను కొనసాగిస్తాను’ అన్నారు రమణ వంక.
అయోధ్య మందిరాన్ని చూడలేదు..
అయోధ్య మందిరానికి ప్రతిరూప నిర్మాణాన్ని 25 రోజుల్లో పూర్తి చేశారు రమణ. ఒక ఆలయానికి రూపకల్పన చేయాలంటే శాస్త్రాలను, మత విశ్వాసాలను, నిర్మాణశైలిని అధ్యయనం చేయాలి. ప్రతి చిన్న డీటెయిలింగ్ వెనుక ఒక అధ్యయనం ఉంటుంది. అప్పటికే ఉన్న ఆలయానికి రెప్లికా కాబట్టి రోజుల్లోనే చేయగలిగానని, ఇది నా అదృష్టమని రమణ చెబుతున్నారు. అయితే ‘అయోధ్య మందిరాన్ని సందర్శించలేదని, కానీ నిర్మాణాన్ని ఫొటోలో చూడగానే ఒక అవగాహన వచ్చిందని, ఈ నిర్మాణంలో వెదురు, ఫైబర్, ఫోమ్, క్లాత్ వాడామని, ఎనిమిది డిగ్రీల చలిలో, మంచుతో తడిసిన వెదురు కర్రల మీద 80 అడుగుల ఎత్తులో పని చేస్తున్నప్పుడు ఆందోళనగా ఉండేదని, ఎటువంటి చిన్న ప్రమాదం లేకుండా పని పూర్తి చేయగలిగామని, అవకాశం వచ్చినప్పుడే మనల్ని మనం నిరూపించుకోవాలి’ అని చెబుతున్నారు రమణ. కాగా కుంభమేళాలో అయోధ్య రాముడి నమూనా నిర్మాణం చేపట్టిన ఘనత హైదరాబాదీది, పైగా తెలుగువాడిది కావడం గర్వకారణం.
అయోధ్యలో సగం!
ప్రయాగ్‌రాజ్ రామ మందిరానికి అయోధ్య మందిరం కొలతల్లో యాభై శాతం తీసుకున్నారు. 161 అడుగుల ఎత్తును 81 చేశారు. 360 అడుగుల పొడవు, 161 అడుగుల వెడల్పు 140, 120గా తీసుకున్నారు. రాముడి విగ్రహాన్ని అసలు రూపం కంటే మూడు అంగుళాలు తక్కువగా తీసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ బదులు జల ప్రతిష్ఠ చేశారు. నిత్యపూజలు దర్శనాలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఉంటాయి. రోజుకు 15 నుంచి 20 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు.
చదవండి: ప్రత్యక్ష దైవమా.. ప్రణామం
సర్వమతం.. శ్రీరామం..
ప్రయాగ్‌రాజ్ రామమందిరం రూపశిల్పి రమణ తెలుగు వాడు. అయితే హిందీ, బెంగాలీ వాళ్లు మొత్తం రెండు వందల మంది కళాకారులు ఇందులో పాల్గొన్నారు. నిత్యం ‘జై శ్రీరామ్’ అంటూ దీక్షగా పని చేసుకుపోయిన వారిలో వివిధ భాషలే కాదు, మతాలు కూడా ఉన్నాయి. ఈ 200 మందిలో హిందూ, క్రిస్టియన్, ముస్లింలు ఉన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో చుంగ్లీ అనే ప్రదేశంలో ఉంది. త్రివేణి సంగమం, సెక్టార్ 1, గ్రౌండ్ 17లో ఉంది.
రాముడే పిలిచాడు!
బీఎస్సీ చదివి 10–5 జాబ్ చేశాను. సంతృప్తినివ్వలేదు. దీంతో నాకిష్టమైన డ్రాయింగ్‌లో ఎమ్‌ఎఫ్‌ఏ చేశాను. ఆర్ట్ డైరెక్టర్‌గా పాతికకు పైగా సినిమాలకు పనిచేసి నేషనల్ అవార్డు అందుకున్నాను. నా కెరీర్‌లో ది బెస్ట్ టాస్క్ అయోధ్య ఆలయ రెప్లికా నిర్మాణం. వెనక్కి తిరిగి చూసుకుంటే నా చరిత్రలో రాముడున్నాడు. జీవితానికి ఇది చాలు.
– రమణ వంక, సినీ ఆర్ట్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment