
నాసిక్: ఇటీవలే యూపీలోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో అత్యంత వైభవంగా మహాకుంభమేళా జరిగింది. ఇప్పుడు దీనికి పోటీనిచ్చే రీతిలో మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళా జరగనుంది. దీనికి త్రయంబకేశ్వర్-నాసిక్ సింహస్థ కుంభమేళాగా నామకరణం చేయనున్నారని తెలుస్తోంది.
ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Chief Minister Devendra Fadnavis) నాసిక్‌లో పర్యటించిన తరువాత 2027లో నాసిక్‌లో జరగబోయే కుంభమేళాకు సన్నాహాలు ఊపందుకున్నాయి. అయితే ఈ మేళాకు తగిన పేరు పెట్టే విషయంలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా త్రయంబకేశ్వర్ అఖాఢాల ప్రతినిధులు ఈ ఉత్సవానికి త్రయంబకేశ్వర్-నాసిక్ సింహస్థ కుంభమేళా అనే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో నాసిక్ అఖాఢాల నేతలు ఈ కుంభమేళా పేరును నాసిక్ కుంభమేళాగానే కొనసాగించాలని కోరారు.
నాసిక్ అఖాడాల సాధువులు సింహస్థ కుంభమేళా అథారిటీలో తమను భాగస్వాములను చేయాలని, కుంభమేళా నిర్వహణకు 500 ఎకరాలకు పైగా భూమిని శాశ్వతంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. నాసిక్ జిల్లా మేజిస్ట్రేట్ జలజ్ శర్మ మాట్లాడుతూ నాసిక్ కుంభమేళా పేరుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందన్నారు. రికార్డులను తనిఖీ తర్వాత ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. నాసిక్‌లో 2027 జూలై 14 -సెప్టెంబర్ 25 మధ్య గోదావరి నది ఒడ్డున జరగనుంది. ఇది 12 సంవత్సరాల తర్వాత జరుగుతోంది. ఇటీవల మహారాష్ట్ర జలవనరులు, విపత్తు నిర్వహణ మంత్రి గిరీష్ మహాజన్ కుంభమేళా ఏర్పాట్లను సమీక్షించేందుకు త్రయంబకేశ్వర్‌ను సందర్శించారు. సాధువులు, మహంతుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాకు ధీటుగా నాసిక్ కుంభమేళాను నిర్వహించాలని మహారాష్ట్ర సర్కారు(Government of Maharashtra) యోచిస్తోంది.
ఇది కూడా చదవండి: Nepal: మాజీ రాజు జ్ఞానేంద్ర షా అరెస్టుకు రంగం సిద్ధం?