కుంభమేళా నుంచి వస్తుండగా కారు ప్రమాదం.. ఎంపీకి తీవ్ర గాయాలు | JMM MP Mahua Maji Car Accident And Injured while returning Maha Kumbh | Sakshi

కుంభమేళా నుంచి వస్తుండగా కారు ప్రమాదం.. ఎంపీకి తీవ్ర గాయాలు

Feb 26 2025 11:59 AM | Updated on Feb 26 2025 1:16 PM

JMM MP Mahua Maji Car Accident And Injured while returning Maha Kumbh

లతేహార్: ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో కుంభమేళాకు వచ్చారు. ఇక, తాజాగా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించి తిరిగి వెళ్తుండగా రాజ్యసభ ఎంపీ మహువా మాజీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎంపీకి గాయాలు కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన ఎంపీ మహువా మాజీ కుంభమేళాకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో జార్ఖండ్‌లోని లతేహర్‌ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హాట్‌వాగ్ గ్రామ సమీపంలోని NH-75పై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును ఆమె కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే ఆమెను రాంచీలోకి రిమ్స్‌కు తరలించారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంపీ కుమారుడు, కోడలు కూడా ఉన్నారు. 

ఈ ప్రమాద ఘటనపై ఎంపీ కుమారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం వైద్య చికిత్స జరుగుతోంది. ఉదయం 3:45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఆమె ఎడమ చేతికి బలమైన గాయమైనట్టు వైద్యులు తెలిపారు. కొన్ని టెస్టులు కూడా చేశారు. కాసేపట్లో చేతికి సర్జరీ చేయనున్నారు. ప్రస్తుతం ఆమె మాతో మాట్లాడుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. 

ఇదిలా ఉండగా.. ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది ఈక్రమంలో బుధవారం మహా శివరాత్రి (Maha siva rathri) పర్వదినం సందర్భంగా భక్తులు తరలివస్తున్నారు. ఈ కుంభమేళాలో నేడు చివరి అమృత్‌ స్నానం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారులు భక్తులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు.

శివరాత్రి రోజున భక్తులు ట్రాఫిక్‌లో చిక్కకుపోకుండా ఉండేందుకు కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్‌ జోన్‌ (No Vehicle Zone)గా అధికారులు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి దీన్ని అమలుచేశారు. కుంభమేళా ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనం అయ్యేలా ప్రయాగ్‌రాజ్‌ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు బుధవారం 350 రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇక, ఇప్పటివరకు 64 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement