Ayodhya Balak Ram Mandir
-
అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు
అయోధ్య: దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల ఉత్సాహం నెలకొంది. యూపీలోని అయోధ్యలోనూ దసరా వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ శరన్నవరాత్రులలో రామ్‌లల్లా దర్శన, మంగళ హారతుల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. నవరాత్రుల మొదటి రోజు నుండి ఈ మార్పులు అమలులోకి వస్తాయని ట్రస్ట్ పేర్కొంది. తెల్లవారుజామున 4:30 నుంచి 4:40 గంటల వరకు మంగళ హారతి, 4:40 నుంచి 6:30 గంటల వరకు స్వామివారి అలంకారాలు జరగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు శృంగార ఆరతి ఉంటుందని సమాచారం. ఇక రామ్‌లల్లా దర్శనం ఉదయం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 9:00 గంటలకు బాలభోగం నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆలయ తలుపులు ఐదు నిమిషాల పాటు మూసివేయనున్నారు.నవరాత్రులలో లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తారని ట్రస్ట్ భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు ట్రస్ట్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దర్శన వేళల్లో చేసిన నూతన మార్పుల విషయానికొస్తే.. బాలభోగం అనంతరం ఉదయం 9:05కు ఆలయ తలుపులు తెరుస్తారు. 11:45 వరకు దర్శనాలు ఉంటాయి. 11:45 నుండి 12:00 వరకు ప్రభువు ఏకాంతం ఉంటుంది. తిరిగి 12:00 గంటలకు భోగ్ హారతి ఉంటుంది. ఆలయంలో స్వామివారు మధ్యాహ్నం 12:15 గంటలకు నిద్రిస్తారు. ఈ సమయంలో ఆలయ తలుపులను 12:30 నుండి 1:30 వరకు మూసివేస్తారు. అదే సమయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు.మధ్యాహ్నం 1:30కి ఆలయంలోని తలుపులు తెరుస్తారు. దేవతా హారతి నిర్వహిస్తారు. దర్శనాలు మధ్యాహ్నం 1:35 నుండి ప్రారంభమై, సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఐదు నిమిషాల పాటు ఆలయ తలుపు మూసివేస్తారు. ఆ తర్వాత 4:05 నుంచి 6:45 వరకు నిరంతర దర్శనం ఉంటుంది. దీని తరువాత సాయంత్రం 6:45 నుండి 7:00 గంటల వరకు 15 నిమిషాల పాటు స్వామివారి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ సమయంలో భోగ్ అందిస్తారు. సాయంత్రం 7:00 గంటలకు హారతి కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 7:00 నుండి 8:30 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. రాత్రి 9:00 గంటలకు భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు. 9:30 గంటలకు స్వామివారికి ప్రసాదం సమర్పించి, శయన హారతి అందిస్తారు. అనంతరం 9:45 గంటలకు స్వామివారు నిద్రించేందుకు ఆలయ తలుపులు మూసి వేస్తారు.ఇది కూడా చదవండి: దుర్గా పూజల వేళ.. మెట్రో శుభవార్త -
అరుణ్ యోగిరాజ్‌కు చేదు అనుభవం.. వీసాపై అమెరికా ట్విస్ట్!
బెంగళూరు: యూపీలోని అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అరుణ్ సహా అతడి కుటుంబ సభ్యులకు అమెరికా వీసాను నిరాకరించింది. దీంతో, ఆయన అమెరికా పర్యటన రద్దు అయ్యినట్టు తెలుస్తోంది.కాగా, వర్జీనియాలోని రిచ్మండ్లో ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్-2024 కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్‌ను ఆహ్వానించారు. దీంతో, అరుణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అమెరికా వీసా కోసం రెండు నెలల కిందట అరుణ్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, తాజాగా ఆగస్టు పదో తేదీన అరుణ్ యోగిరాజ్ వీసాను తిరస్కరించినట్లు అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. కాగా, వీసా నిరాకరణకు మాత్రం ఎలాంటి కారణాలను వెల్లడించలేదు.ఈ నేపథ్యంలో వీసా తిరస్కరణ విషయం తెలుసుకున్న అరుణ్, అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేకపోవడంపై నిరాశ చెందారు. ఇక, వీసా నిరాకరణపై తాజాగా అరుణ్ స్పందిస్తూ.. వీసా ఎందుకు తిరస్కరించారో నాకు తెలియదు. కానీ, మేము మాత్రం వీసాకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్చించాము అంటూ కామెంట్స్ చేశారు. BREAKING NEWS 🚨 US refuses visa to Ayodhya Ram Lalla sculptor Arun Yogiraj.US Embassy hasn't given any reason so far as to why it rejected the application.Yogiraj had applied to visit an event by the Association of Kannada Kootas of America, World Kannada Conference-2024. pic.twitter.com/0EWLTqEoJQ— Satyaagrah (@satyaagrahindia) August 14, 2024 -
అయోధ్య బాలరామునికి పెడన కలంకారి వస్త్రాలు
పెడన: అయోధ్య బాలరాముని ఆలయానికి కృష్ణా జిల్లా పెడన నుంచి సహజ సిద్ధ కలంకారి వస్త్రాలను పంపించగా వాటిని మంగళవారం అలంకరించినట్లు పెడన కోరమండల్ కలంకారి వస్త్ర సంస్థ యాజమాని పిచ్చుక వరుణ్ కుమార్ మంగళవారం తెలిపారు. అయోద్య బాలరాముని ఆలయానికి చెందిన డిజైనర్ సహజ సిద్ధ కలంకారి వస్త్రాలు కావాలని కోరడంతో ఇటీవల ఆల్ ఆవర్, ఫ్లోరల్ డిజైన్‌తో రూపొందించిన ఎరుపు వస్త్రాన్ని పంపించామన్నారు. 10.5 మీటర్ల వస్త్రాన్ని స్వామి వారికి అలంకరించి ఆలయ వర్గాలు ఫొటోలు పంపించారని తెలిపారు. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్ కలర్, శనివారం నీలం, ఆదివారం పింకు రంగులలోని వస్త్రాలను కావాలని సూచించారని, ప్రస్తుతం ఎరుపు రంగు వస్త్రాన్ని డిజైన్ చేసి పంపించామన్నారు. మిగిలిన రంగులలో వస్త్రాలను కూడా త్వరలోనే పంపుతామన్నారు. డాక్టర్ వైఎస్సార్ లైఫ్ ఎచీవ్మెంట్ అవార్డు గ్రహీత పిచ్చుక శ్రీనివాసరావు కుమారుడినయిన తనకు ఈ అవకాశం రావడం స్వామి అనుగ్రహమని వరుణ్ కుమార్ తెలిపారు. -
Draupadi Murmu: అయోధ్యలో రాష్ట్రపతి
అయోధ్య: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం అయోధ్య సందర్శించారు. నూతన మందిరంలో ఇటీవలే కొలువుదీరిన బాలరామున్ని తొలిసారిగా దర్శించుకున్నారు. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి హారతిచ్చారు. అంతకుముందు సరయూ నది హారతి కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి పాల్గొన్నారు. అంగవస్త్రం ధరించి సంప్రదాయబద్ధంగా హారతిచ్చారు. అనంతరం నదికి పూలమాలలు సమరి్పంచి మొక్కుకున్నారు. తర్వాత ప్రఖ్యాత హనుమాన్ గఢి ఆలయాన్ని సందర్శించారు. పూజల్లో పాల్గొని ఆంజనేయునికి హారతిచ్చారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం రామాలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్ రాష్ట్రపతికి దగ్గరుండి దర్శనం చేయించారు. రామ్ లల్లా పట్ల ఆమె భక్తిశ్రద్ధలు అపూర్వమని కొనియాడారు. ‘‘స్వామికి రాష్ట్రపతి హారతిచ్చారు. సాష్టాంగం చేసి భక్తిని చాటుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని ఇద్దరూ గొప్ప రామ భక్తులు కావడం నిజంగా గొప్ప విషయం’’ అని సత్యేంద్రదాస్ అన్నారు. అప్పట్లో విపక్షాల రగడ... అయోధ్యలో నూతన రామాలయం నిర్మాణానంతరం రాష్ట్రపతి అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఆలయం జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమవడం తెలిసిందే. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులను కార్యక్రమానికి ఆహా్వనించారు. రాష్ట్రపతి మాత్రం అందులో పాల్గొనలేదు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తాయి. ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని పూర్తిగా పక్కన పెట్టి సర్వం మోదీమయంగా కార్యక్రమం జరిపించారని కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ తదితరులు దుయ్యబట్టారు. ముర్ము ఆదివాసీ కాబట్టే రాష్ట్రపతి అని కూడా చూడకుండా కావాలనే కార్యక్రమానికి దూరంగా ఉంచారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ బుధవారం ఆమె అయోధ్య వెళ్లి నూతన ఆలయాన్ని, బాలరామున్ని దర్శించుకోవడం విశేషం. -
sri rama navami 2024: బాలరాముడికి సూర్య తిలకం
అయోధ్య: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య బాలరాముడికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్ది ఆశీస్సులందించాడు. సరిగ్గా నుదుటిన చుంబించి రఘుకుల పురుషోత్తముడి పట్ల ఆతీ్మయత చాటుకున్నాడు. భవ్య రామమందిరంలోని గర్భాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత తొలిసారిగా కనిపించిన ఈ అద్భుత దృశ్యాలను భక్తులు కనులారా తిలకించి పరవశించిపోయారు. జైశ్రీరామ్ అంటూ నినదించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో దర్శించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సూర్యతిలకం ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ సమయంలో గర్భగుడిలో అర్చకులు ప్రత్యేక హారతి ఇచ్చారు. అరుదైన వజ్రాలు, రత్నాలు పొదిగిన కిరీటంతోపాటు ప్రత్యేక ఆభరణాల అలంకరణతో బాలరాముడు మరింత సుందరంగా మెరిసిపోయాడు. ప్రతిఏటా శ్రీరామనవమి సందర్భంగా రాముడికి 58 మిల్లీమీటర్ల పరిమాణంలో సూర్యతిలకం దిద్దేలా ఆలయంలో దర్పణాలు, కటకాల సాయంతో ప్రత్యేక ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సూర్యతిలకం దృశ్యం 4 నుంచి 5 నిమిషాల పాటు కొనసాగిందని ఆలయ ప్రతినిధి ప్రకాశ్ గుప్తా చెప్పారు. సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి విగ్రహం నుదుటి భాగంపైకి ప్రసరించాయని వెల్లడించారు. ఈ సమయంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించలేదని అన్నారు. వారు బయటి నుంచే దర్శించుకున్నారని తెలిపారు. మరోవైపు, అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రాణప్రతిష్ట తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉత్సవాలు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది దర్శనం కోసం బారులు తీరారు. భావోద్వేగపూరిత క్షణం: ప్రధాని మోదీ దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి తనకెంతో ఆనందంగా కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ రోజు కోస మే కోట్లాది మంది ఎదురుచూశారని వెల్లడించారు. అస్సాంలోని నల్బారీలో ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని మోదీ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ బాలరాముడి సూర్యతిలకం ఘట్టాన్ని ఆన్లైన్లో వీక్షించి, భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాన్ని చూసి తరించానని చెప్పారు. కోట్లాది మంది ప్రజల్లాగే తనకు కూడా ఇది భావోద్వేగపూరిత క్షణమని వెల్లడించారు. -
అయోధ్యలో మెగా కోడలు.. బాలరామునికి ప్రత్యేక పూజలు!
మెగా కోడలు, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన అయోధ్య బలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాసన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసన తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య రామునికి పూజలు చేశారు. ఆలయంలో దాదాపు 48 రోజుల పాటు నిర్వహించిన రామరాగ్ సేవ ముగింపు వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకలకు తన తాతయ్య, నానమ్మతో సహా కలిసి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
అయోధ్య చేరేదెలా?
సాక్షి, హైదరాబాద్: ప్రతి సంవత్సరం కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ ఒక ప్రహసనంగా మారింది. ఏటేటా బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. కానీ హైదరాబాద్ ప్లాట్‌ఫాంపైన ఆగడం లేదు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ పడడం లేదు. లక్షలాది మంది భక్తులు, యాత్రికులు సందర్శించుకొనే పుణ్యక్షేత్రాలకు రైళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆబాల గోపాలాన్ని అలరించే అయోధ్య బాలరాముడు కొలువైన అయోధ్యకు చేరుకొనేందుకు హైదరాబాద్ నుంచి ఒక్క రైలు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. అలాగే షిరిడీ, వారణాసి తదితర ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకున్నా అరకొర రైళ్లు వెక్కిరిస్తున్నాయి. సుమారు 10 సంవత్సరాలుగా కొత్త రైళ్లు అందుబాటులోకి రాలేదు. అయోధ్యకు ప్రత్యేక రైళ్లా... అయోధ్యకు వెళ్లేందుకు రెగ్యులర్ రైళ్లు లేవు. ప్రయాణికులు దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో వారణాసి లేదా, దానాపూర్ వరకు చేరుకొని అక్కడి నుంచి మరో ట్రైన్లో కానీ, రోడ్డు మార్గంలో కానీ అయోధ్యకు వెళ్లవలసి ఉంటుంది. అలాగే జంటనగరాల మీదుగా వెళ్లే రైళ్లలో గోరఖ్‌పూర్, లక్నో నగరాలకు చేరుకొని అక్కడి నుంచి అయోధ్యకు వెళ్లాలి. ఇంటిల్లిపాది కలిసి వెళ్లాలంటే ఇది ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణం. పైగా ఆర్ధికంగా కూడా భారమే. ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రయాణికులు ప్రతి రోజు రాకపోకలు సాగించే విధంగా సికింద్రాబాద్–అయోధ్య మధ్య కొత్తగా రైళ్లను ప్రవేశపెట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వరకు ఒకే ఒక్క రెగ్యులర్ రైలు నడుస్తోంది. ఈ ట్రైన్లో యూపీ, బీహార్, తదితర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే వలస కార్మికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారణాసి వరకు భక్తులు కూడా వెళ్తారు. కానీ ప్రయాణికుల డిమాండ్ కారణంగా రిజర్వేషన్ లభించడం కష్టం. అయోధ్యకు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న ట్రైన్ కూడా ఇదొక్కటే. బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసినప్పటి నుంచి ఈ ట్రైన్‌కు ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం రైల్వేశాఖ నియోజకవర్గాల వారీగా ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లలో వెళ్లాలంటే ఆధ్యాత్మిక సంస్థల్లో నమోదు చేసుకొన్న వాళ్లకు మాత్రమే అవకాశం లభిస్తుంది.పైగా ఫిబ్రవరి నెలాఖరు వరకే ఈ రైళ్లు పరిమితం.ఆ తరువాత అయోధ్య టూర్‌కు ఐఆర్సీటీసీ ప్యాకేజీలే శరణ్యం. ఈ పర్యాటక ప్యాకేజీలు వారం నుంచి 10 రోజుల వరకు ఉంటాయి.ఇది ఆర్ధికంగా భారమే కాకుండా కేవలం అయోధ్య వరకే వెళ్లి రావాలనుకొనేవాళ్లకు సాధ్యం కాదు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ తరహాలో అయోధ్య ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. వారణాసికి ఉన్నది ఒక్కటే... కోట్లాదిమంది భక్తులు సందర్శించే మరో అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి0. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి దేశవ్యాప్తంగా భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వారణాసికి వెళ్లాలన్నా ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు వెళ్లే రైలే దిక్కు. ఈ రైల్లో ప్రతి రోజు 180 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంటుంది. షిరిడీకి ఉన్నది ఒక్కటే... లక్షలాది మంది భక్తులు సందర్శించే షిరిడీకి సైతం రైళ్ల కొరత వెంటాడుతోంది. అజంతా ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ప్రస్తుతం అందుబాటులో ఉంది. కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా సాయినగర్ వరకు మరో రైలు రాకపోకలు సాగిస్తుంది. కానీ ఈ ట్రైన్ కాకినాడలోనే 100 శాతం ఆక్యుపెన్సీతో బయలుదేరుతుంది. హైదరాబాద్‌లో హాల్టింగ్ సదుపాయం ఉన్నా రిజర్వేషన్లు లభించవు. దీంతో నగరవాసులు ఒక్క అజంతాపైన ఆధారపడవలసి వస్తోంది. -
Ayodhya: అయోధ్యకు వెళ్లే బస్సులు రద్దు!
ఢిల్లీ: అయోధ్య బాలక్ రామ్ మందిర్‌కు ఎగబడుతున్న భక్తులకు, సందర్శకులకు పెద్ద షాకే తగిలింది. అయోధ్య వైపు వెళ్లే బస్సులను రద్దు చేస్తున్నట్లు బుధవారం అక్కడి రవాణా శాఖ ప్రకటించింది. తిరిగి బస్సులు ఎప్పుడు నడుస్తాయనేది ఇప్పట్లో చెప్పలేమని స్పష్టం చేసింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట తర్వాత ‘బాలక్ రామ్’ దర్శనం కోసం భక్తులు ఎగబడి పోతున్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య వైపు అడుగులేస్తున్నారు. తొలిరోజే ఏకంగా ఐదు లక్షల మంది దర్శించుకునేందుకు వచ్చినట్లు ఓ అంచనా. అందులో 3 లక్షల మందిదాకా దర్శించుకోగా.. మరో రెండు లక్షల మంది బయట ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో నిన్న అధికారులకు భక్తుల నియంత్రణ కష్టతరంగా మారింది. ఇదీ చదవండి: బాలక్ రామ్ కోసం.. ఈ నిరీక్షణ చూశారా? దీంతో ఇవాళ కేంద్ర బలగాలను సైతం మోహరించారు. మొత్తం అయోధ్యలో 8 వేలమంది సిబ్బందిని భద్రత కోసమే మోహరించారు. అదే సమయంలో లక్నో, ఇతర ప్రాంతాల నుంచి అయోధ్యకు బస్సుల్లో భక్తులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో రద్దీని నిలువరించేందుకు బస్సు సర్వీసులన్నింటినీ రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తేనే తిరిగి సర్వీసులు నడుపుతామని ఓ అధికారి మీడియాకు వివరించారు. ఇక.. దైవదర్శనం కోసం తొందరపడొద్దని.. రెండు వారాల తర్వాత రద్దీ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయని భక్తులకు, సందర్శకులకు అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు నిదానంగా రావాలని కోరుతున్నారాయన.