ఢిల్లీ: అయోధ్య బాలక్ రామ్ మందిర్‌కు ఎగబడుతున్న భక్తులకు, సందర్శకులకు పెద్ద షాకే తగిలింది. అయోధ్య వైపు వెళ్లే బస్సులను రద్దు చేస్తున్నట్లు బుధవారం అక్కడి రవాణా శాఖ ప్రకటించింది. తిరిగి బస్సులు ఎప్పుడు నడుస్తాయనేది ఇప్పట్లో చెప్పలేమని స్పష్టం చేసింది.
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట తర్వాత ‘బాలక్ రామ్’ దర్శనం కోసం భక్తులు ఎగబడి పోతున్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య వైపు అడుగులేస్తున్నారు. తొలిరోజే ఏకంగా ఐదు లక్షల మంది దర్శించుకునేందుకు వచ్చినట్లు ఓ అంచనా. అందులో 3 లక్షల మందిదాకా దర్శించుకోగా.. మరో రెండు లక్షల మంది బయట ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో నిన్న అధికారులకు భక్తుల నియంత్రణ కష్టతరంగా మారింది.
ఇదీ చదవండి: బాలక్ రామ్ కోసం.. ఈ నిరీక్షణ చూశారా?
దీంతో ఇవాళ కేంద్ర బలగాలను సైతం మోహరించారు. మొత్తం అయోధ్యలో 8 వేలమంది సిబ్బందిని భద్రత కోసమే మోహరించారు. అదే సమయంలో లక్నో, ఇతర ప్రాంతాల నుంచి అయోధ్యకు బస్సుల్లో భక్తులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో రద్దీని నిలువరించేందుకు బస్సు సర్వీసులన్నింటినీ రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తేనే తిరిగి సర్వీసులు నడుపుతామని ఓ అధికారి మీడియాకు వివరించారు.
ఇక.. దైవదర్శనం కోసం తొందరపడొద్దని.. రెండు వారాల తర్వాత రద్దీ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయని భక్తులకు, సందర్శకులకు అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు నిదానంగా రావాలని కోరుతున్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment