bus services
-
సమ్మర్ ఎఫెక్ట్: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: సిటీలో ఆర్టీసీ బస్సులపై సమ్మర్ ఎఫెక్ట్ పడింది. ఎండల తీవ్రతతో హైదరాబాద్ నగర పరిధిలో బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ తగ్గించనుంది. మధ్యాహ్నం 12 గంటల 4 గంటల వరకు గతం కంటే తక్కువ బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు వెల్లడించారు. అయితే సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సిటీలో బస్సులను యధావిధిగా నడపనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 17 నుంచి సిటీలో మధ్యాహ్నం వేళల్లో బస్సులు తగ్గనున్న విషయాన్ని ప్రయాణికులు గమనించాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ఇదీ చదవండి.. తెలంగాణకు వర్ష సూచన.. 10 రోజుల పాటు -
Ayodhya: అయోధ్యకు వెళ్లే బస్సులు రద్దు!
ఢిల్లీ: అయోధ్య బాలక్ రామ్ మందిర్‌కు ఎగబడుతున్న భక్తులకు, సందర్శకులకు పెద్ద షాకే తగిలింది. అయోధ్య వైపు వెళ్లే బస్సులను రద్దు చేస్తున్నట్లు బుధవారం అక్కడి రవాణా శాఖ ప్రకటించింది. తిరిగి బస్సులు ఎప్పుడు నడుస్తాయనేది ఇప్పట్లో చెప్పలేమని స్పష్టం చేసింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట తర్వాత ‘బాలక్ రామ్’ దర్శనం కోసం భక్తులు ఎగబడి పోతున్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య వైపు అడుగులేస్తున్నారు. తొలిరోజే ఏకంగా ఐదు లక్షల మంది దర్శించుకునేందుకు వచ్చినట్లు ఓ అంచనా. అందులో 3 లక్షల మందిదాకా దర్శించుకోగా.. మరో రెండు లక్షల మంది బయట ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో నిన్న అధికారులకు భక్తుల నియంత్రణ కష్టతరంగా మారింది. ఇదీ చదవండి: బాలక్ రామ్ కోసం.. ఈ నిరీక్షణ చూశారా? దీంతో ఇవాళ కేంద్ర బలగాలను సైతం మోహరించారు. మొత్తం అయోధ్యలో 8 వేలమంది సిబ్బందిని భద్రత కోసమే మోహరించారు. అదే సమయంలో లక్నో, ఇతర ప్రాంతాల నుంచి అయోధ్యకు బస్సుల్లో భక్తులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో రద్దీని నిలువరించేందుకు బస్సు సర్వీసులన్నింటినీ రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తేనే తిరిగి సర్వీసులు నడుపుతామని ఓ అధికారి మీడియాకు వివరించారు. ఇక.. దైవదర్శనం కోసం తొందరపడొద్దని.. రెండు వారాల తర్వాత రద్దీ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయని భక్తులకు, సందర్శకులకు అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు నిదానంగా రావాలని కోరుతున్నారాయన. -
ఏపీ, కర్ణాటక మధ్య మరిన్ని బస్ సర్వీసులు
సాక్షి, అమరావతి: కర్ణాటకకు మరిన్ని బస్ సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్ సర్వీసుల నిర్వహణ అంశంపై కర్ణాటక ఆర్టీసీతో ఏపీఎస్ ఆర్టీసీ గురువారం ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, కేఎస్ ఆర్టీసీ ఎండీ వి అంబుకుమార్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కేఎస్ ఆర్టీసీతో ఏపీఎస్ ఆర్టీసీ తొలిసారిగా గురువారం ఈ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఏపీఎస్ ఆర్టీసీ కర్ణాటకలో అదనంగా రోజూ 327 బస్ సర్వీసులను 69,284 కి.మీ. మేర నడుపుతుంది. దీంతో మొత్తమ్మీద ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 1,322 బస్సులు కర్ణాటకలో రోజూ 2,34,762 కి.మీ. మేర నడుస్తాయి. ఇక కేఎస్ ఆర్టీసీ ఏపీలో అదనంగా రోజూ 496 బస్ సర్వీసులను 69,372 కి.మీ. మేర నడపాలని నిర్ణయించారు. దీంతో మొత్తమ్మీద కేఎస్ ఆర్టీసీకి చెందిన 1,489 బస్సులు ఏపీలో రోజూ 2,26,044 కి.మీ. నడుస్తాయి. ఆర్టీసీ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, ఎ.కోటేశ్వరరావు, పి.కృష్ణమోహన్, కేఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఆంథోని జార్జ్, ఎస్.రాజేశ్ పాల్గొన్నారు. -
Hyderabad: సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం..
భీమవరం (ప్రకాశంచౌక్): సంక్రాంతికి నగరం మొత్తం పల్లెబాట పట్టింది. దీంతో హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చే జనాల్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన పండగ ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి జిల్లాల్లోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం డిపోలకు నడుస్తాయి. ఈ నెల 10 నుంచి హైదరాబాద్ నుంచి ప్రయాణికుల సంఖ్య పెరిగింది. హైదారాబాద్ నుంచి జిల్లాకు ఏర్పాటు చేసిన ఆర్టీసి బస్సులు దాదాపు కిక్కిరిసి ఉంటున్నాయి. 105 ప్రత్యేక బస్సులు ఏర్పాటు హైదారాబాద్ నుంచి జిల్లాలో పలు ప్రాంతాలకు పండుగకు వచ్చే ప్రయాణికులను తీసుకురావడానికి ఆర్టీసీ 105 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు నడుపుతోంది. గతేడాది మాదిరిగానే సాధారణ ధరలకే ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. సూపర్ లగ్జరీ టిక్కెట్ రూ.750, ఇంద్ర రూ.950, అల్ట్రా రూ.710 చొప్పున వసూలు చేస్తున్నారు. రిజర్వేషన్ కూడా 90 శాతం మేర పూర్తయ్యింది. బస్సుల సంఖ్య పెంచుతాం సంక్రాంతి పండుగకు ముందు, తర్వాత కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నాం. పండగకు ముందు 105, పండగ తర్వాత తిరుగు ప్రయాణానికి 84 ప్రత్యేక బస్సులు తిప్పుతాం. ప్రయాణికుల రద్దీ మేరకు బస్సుల సంఖ్య పెంచుతాం. «టిక్కెట్ చార్జీ పెంచకుండా సాధారణ చార్జీలకే సర్వీసులు నడుపుతున్నాం. ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. పండగకు ప్రజలు ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. – ఏ.వీరయ్య చౌదరి, ప్రజా రవాణా అధికారి, భీమవరం -
ఫేస్బుక్లో అభ్యర్థన.. ఆర్టీసీ బస్సు ఏర్పాటు
సాక్షి, అమరావతి: ఫేస్బుక్లో పోస్టు ద్వారా అభ్యర్థించిన వెంటనే ప్రయాణికులకు ఓ బస్సు సర్వీసును ఏర్పాటు చేసి ప్రజా సేవే తమ లక్ష్యమని ఆర్టీసీ నిరూపించిన ఆసక్తికరమైన ఘటన కృష్ణాజిల్లాలోని పామర్రులో జరిగింది. 40 మంది ప్రయాణికులు మంగళవారం రాత్రి పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్ల వెళ్లాల్సి ఉంది. వీరిలో ఒకరు తమకు బస్సు ఏర్పాటు చేయగలరా అని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) కె.ఎస్.బ్రహ్మానందరెడ్డిని ఫేస్బుక్ పోస్టు ద్వారా అభ్యర్థించారు. దీనిపై వెంటనే స్పందించిన బ్రహ్మానందరెడ్డి గుడివాడ బస్ డిపో మేనేజర్‌తో మాట్లాడి ఆ ప్రయాణికులకు పామర్రు నుంచి నెల్లిమర్లకు ప్రత్యేకంగా బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు. ఆ 40 మంది ప్రయాణికులు ఆ బస్సులో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానమైన నెల్లిమర్లకు బుధవారం ఉదయం చేరుకున్నారు. అడగంగానే సాయం చేసిన ఆర్టీసీ సేవలను అభినందించారు. -
టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్ఆర్టీసీకి రాబడి
సాక్షి, అమరావతి: తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు రెండోసారి పెంచడం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి అనుకూలంగా మారుతోంది. మన రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే ప్రయాణికులు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ రాబడి గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణ ఆర్టీసీ.. డీజిల్ సెస్ పేరుతో జూన్ 9న రెండోసారి చార్జీలు పెంచింది. దీంతో కనీసం రూ.5 నుంచి గరిష్టంగా రూ.170 వరకు ఆ రాష్ట్రంలో బస్సు చార్జీలు పెరిగాయి. ప్రధానంగా 100 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణంపై చార్జీల పెంపు భారం అధికంగా ఉంది. ఈ పరిణామం ఏపీఎస్ఆర్టీసీకి కలసివస్తోంది. ప్రధానంగా రెండు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉండే హైదరాబాద్ రూట్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు పెరుగుతోంది. విజయవాడ–హైదరాబాద్ రూట్లో ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులకు ప్రయాణికుల నుంచి ఆదరణ మరింతగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ముందస్తు రిజర్వేషన్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ రాబడి కూడా గణనీయంగా వృద్ధి చెందుతోంది. చదవండి: (AP: అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి) బస్ సర్వీసులు పెంచడంపై దృష్టి జూన్ 9 కంటే ముందు విజయవాడ –హైదరాబాద్ రూట్లో ఆర్టీసీకి రోజుకు గరిష్టంగా రూ.కోటి రాబడి వచ్చేది. కానీ తెలంగాణ ఆర్టీసీ చార్జీలు రెండోసారి పెంచాక ఏపీఎస్ఆర్టీసీ రాబడి పెరుగుతోంది. జూన్ 9న రూ.1.19 కోట్ల రాబడి రాగా.. జూన్ 10న రూ.1.21 కోట్లు వచ్చింది. జూన్ 11న రూ.1.26 కోట్లు, జూన్ 12న రూ.1.24 కోట్లు రాబడి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న రోజుల్లో విజయవాడ –హైదరాబాద్ రూట్‌తోపాటు తిరుపతి– హైదరాబాద్ రూట్,రాష్ట్రంలోని తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ రాబడి మరింతగా పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా బస్ సర్వీసులు పెంచడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాల కల్పనపై దృష్టిసారించారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ చార్జీలు ఇలా.. ►ఉదాహరణకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ చార్జీ తెలంగాణ ఆర్టీసీలో రూ.505. కానీ ఏపీఎస్ఆర్టీసీలో రూ.470 మాత్రమే. ►ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర బస్‌లో హైదరాబాద్ (కేపీహెచ్‌బీ)కి చార్జీ రూ.610 ఉండగా.. అదే రీతిలో ఉండే తెలంగాణ ఆర్టీసీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చార్జీ రూ.642. ►ఏపీఎస్ఆర్టీసీ గరుడ సర్వీసులో హైదరాబాద్ (కేపీహెచ్‌బీ)కి చార్జీ రూ.690 ఉండగా.. తెలంగాణ ఆర్టీసీలో చార్జీ రూ.783గా ఉంది. -
అదనపు ఛార్జీలు లేకుండా బస్సు సర్వీసులు: సజ్జనార్
-
Sankranthi: రైళ్లు, బస్సులు ఫుల్..
సాక్షి, అమరావతి బ్యూరో: సంక్రాంతికి ఇంటికెళదామనుకునే వారికి కష్టాలు తప్పని పరిస్థితి తలెత్తింది. జనవరి 7 నుంచి 14 వరకు రైళ్లు, బస్సుల్లో బెర్తులు, సీట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. ప్రధానంగా విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్లే రైళ్లు, బస్సులకు డిమాండ్ అధికంగా ఉంటోంది. ఈ రూట్లో జనవరి 7వ తేదీ నుంచి 14 వరకు రైళ్లలో బెర్తులు దొరకని పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్ చేయించుకుందామంటే చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంటోంది. కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇప్పటికే ‘రిగ్రెట్’ అని వస్తోంది. విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా నిత్యం 85 రైళ్లకు పైగా వెళ్తుంటాయి. వీటిలో రోజూ నడిచే రెగ్యులర్ రైళ్లు 27 కాగా, వీక్లీ, బై వీక్లీ రైళ్లు 58 వరకు ఉన్నాయి. సెకండ్ సిట్టింగ్‌తో నడిచే విజయవాడ–విశాఖ (రత్నాచల్), గుంటూరు–విశాఖ (సింహాద్రి), లింగంపల్లి–విశాఖ(జన్మభూమి) రైళ్లలో మాత్రమే ప్రస్తుతానికి కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన అన్ని రైళ్లలో.. అన్ని క్లాసులూ వెయిటింగ్ లిస్టులతోనే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. వీరంతా సంక్రాంతికి తమ స్వస్థలాలకు వెళ్లడానికి ముందస్తుగానే రిజర్వేషన్లు చేయించుకోవడంతో రైళ్లలో సీట్లు, బెర్తులు లభ్యం కావడం లేదు. బస్సులదీ అదే దారి మరోవైపు బస్సుల్లోనూ విజయవాడ–విశాఖపట్నం రూటుకే అత్యధిక డిమాండ్ కనిపిస్తోంది. విశాఖపట్నం మీదుగా విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల వైపు వెళ్లే రెగ్యులర్ బస్సుల్లో నూరు శాతం రిజర్వేషన్లు అయిపోయాయి. ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి రాష్ట్రంలోని వివిధ దూరప్రాంతాలకు రోజూ 463 రెగ్యులర్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో ఇప్పటివరకు సంక్రాంతి సమయంలో (జనవరి 8–14 మధ్య) అధిక శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రెగ్యులర్ బస్సుల్లో సీట్లు ఫుల్ అయ్యాక స్పెషల్ సర్వీసులకు రిజర్వేషన్లు తెరుస్తారు. హైదరాబాద్ వైపు రైళ్లలో ఖాళీలు కాగా, సంక్రాంతి సీజన్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లలో సీట్లు, బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ రూట్లో 36 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తుండగా రోజువారీ 19, వీక్లీ/బైవీక్లీ ట్రైన్లు 17 వరకు నడుస్తున్నాయి. వీటిలో శాతవాహన, గోల్కొండ, జన్మభూమి, ఇంటర్సిటీ రైళ్లు సెకండ్ సీటింగ్వి కాగా.. మిగిలినవి స్లీపర్ క్లాసులున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లే. ప్రస్తుతం ఈ రైళ్లలో దాదాపు అన్ని క్లాసుల బెర్తులు, సీట్లు పదులు, వందల సంఖ్యలో ఖాళీలున్నాయి. సంక్రాంతికి 1,266 స్పెషల్ బస్సులు ఈ సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి 1,266 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. వీటిలో విశాఖపట్నానికి 390, రాజమండ్రికి 360, హైదరాబాద్‌కు 362, చెన్నైకి 20, బెంగళూరుకు 14, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 120 బస్సులను నడపాలని నిర్ణయించినట్టు రీజనల్ మేనేజర్ ఎంవై దానం ‘సాక్షి’కి చెప్పారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మరిన్ని స్పెషల్ సర్వీసులను నడపనున్నట్టు తెలిపారు. కాగా కోవిడ్ ప్రభావం వల్ల గత సంక్రాంతికి ఈ రీజియన్ నుంచి 1,093 స్పెషల్ బస్సులు నడిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 173 సర్వీసులు ఎక్కువ. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ సంక్రాంతికి స్పెషల్ సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు. -
పరుగందుకుంటున్న ప్రగతి రథ చక్రాలు
రాష్ట్రంలో ప్రగతి రథ చక్రం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. కరోనా రక్కసిని దాటుకొని జనజీవనాన్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు పదపదమని ప్రయాణిస్తోంది. సగానికిపైగా సర్వీసులు నిలిచిపోయిన పరిస్థితి నుంచి ముప్పావు శాతం బస్సులు కదిలాయి. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు మరింత చేరువవుతోంది. – సాక్షి, అమరావతి రోజుకు 7,800 సర్వీసులు.. రోజుకు 10,600 షెడ్యూల్ బస్ సర్వీసులు నిర్వహించే సామర్థ్యం ఆర్టీసీకి ఉంది. వాటిలో 8,200 ఆర్టీసీ సొంత బస్సులు కాగా 2,400 అద్దె బస్సులు. ప్రస్తుతం ఆర్టీసీ సొంత బస్సుల్లో రోజుకు 7,800 సర్వీసులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో పల్లె వెలుగు, డీలక్స్, సూపర్ డీలక్స్ సర్వీసులతోపాటు అంతర్రాష్ట్ర సర్వీసులను నిర్వహిస్తోంది. తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులోనూ, దూరప్రాంత, అంతర్రాష్ట్ర ఏసీ సర్వీసుల్లోనే దాదాపు 1,600 బస్సులు మినహా మిగిలిన అన్ని బస్సులు యథాతథంగా నిర్వహిస్తోంది. ఈ నెలాఖరుకు ఆ 1,600 బస్ సర్వీసులనూ క్రమంగా ప్రవేశపెట్టాలని ఆర్టీసీ భావిస్తోంది. అద్దె బస్సులను బుధవారం నుంచి క్రమంగా ప్రవేశపెడుతోంది. అద్దె బస్సుల యజమానులు తమ వాహనాల బీమా సర్టిఫికెట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంది. పత్రాలను పరిశీలించి ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు అద్దె బస్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇస్తారు. పది రోజుల్లో మొత్తం 2,400 అద్దె బస్సుల సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. పుంజుకున్న ఆక్యుపెన్సీ జనజీవనం క్రమంగా గాడిలో పడుతుండటంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు పుంజుకుంది. ప్రస్తుతం సగటున దాదాపు 70 శాతానికి చేరడం విశేషం. ఆక్యుపెన్సీ రేటులో అనంతపురం జిల్లా (76 శాతం) మొదటి స్థానం, కర్నూలు జిల్లా (74 శాతం) రెండోస్థానంలో ఉండగా.. కృష్ణా జిల్లా (60 శాతం) చివరి స్థానంలో ఉంది. సంస్థకు రాబడి కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు సగటున రూ.10 కోట్ల వరకు రాబడి వస్తోంది. ఈ నెల రెండోవారం ముగిసేసరికి సాధారణ లక్ష్యం రోజుకు రూ.15 కోట్ల రాబడి వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో ఆర్టీసీకి దాదాపు రూ.2,300 కోట్లు, ఈ ఏడాది రెండో వేవ్ తీవ్రంగా ఉన్న ఏప్రిల్–జూలైలలో రూ.1,200 కోట్ల వరకు ఆర్టీసీ రాబడికి గండిపడింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గి ఆర్టీసీ పూర్తిస్థాయి సర్వీసులను ప్రవేశపెడుతుండటంతో పూర్వవైభవం సాధించవచ్చని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా పూర్తిస్థాయి సేవలు ఆర్టీసీ బస్సు సర్వీసులను క్రమంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూనే ప్రజలకు విస్తృత స్థాయిలో ఆర్టీసీ సేవలు అందిస్తాం. సంస్థను మళ్లీ పుంజుకొనేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ -
నేటి నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ప్రారంభించనుండగా, మంగళవారం నుంచి మహారాష్ట్రలోని ప్రాంతాలకు మొదలుకానున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లాక్డౌన్ సడలింపు అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల తర్వాత ఏపీ సరిహద్దు దాటి, సాయంత్రం 6 లోపు తిరిగి తెలంగాణ సరిహద్దులోకి బస్సులు రాకపోకలు సాగించేలా ప్రణాళిక రూపొందించారు. ఇక కర్ణాటకకూ సోమవారం నుంచే బస్సులు ప్రారంభం అవుతున్నా.. పరిమితంగానే తిరగనున్నాయి. ఎన్ఈకేఆర్టీసీ (కర్ణాటకలోని ఈశాన్య ఆర్టీసీ) మాత్రమే పచ్చజెండా ఊపింది. దాని పరిధిలోని యాద్గిర్, రాయచూర్, బీదర్, గుల్బర్గాలకు సోమవారం నుంచి బస్సులు తిరుగుతాయి. ఉదయం 5 నుంచి రాత్రి 7 వరకు ఆ ప్రాంతంలో లాక్డౌన్ మినహాయింపు ఉండటంతో ఆ సమయాల్లో బస్సులు వెళ్లి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక కర్ణాటక ఆర్టీసీ పరిధిలోని బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాలకు ఇంకా అనుమతి రాలేదు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, చంద్రాపూర్, నాందేడ్ తదితర ప్రాంతాలకు మంగళవారం నుంచి బస్సులు తిరుగుతాయి. ముంబై, పుణే లాంటి దూరప్రాంతాలకు ప్రస్తుతం బస్సులు తిప్పే అవకాశం లేదు. -
TSRTC: ఆర్టీసీ.. చతికిల!
మిర్యాలగూడ టౌన్: కార్మికుల సమ్మె, మొదటి విడత కరోనా లాక్డౌన్.. సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌తో నల్లగొండ జిల్లా ఆర్టీసీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఆదాయం లేక కోలుకోలేకపోతోంది. ప్రస్తుతం ఆ.. నాలుగు గంటల మినహాయింపు సమయంలో అరకొర బస్సులు నడుపుతున్నా ప్రయాణికులనుంచి పెద్దగా స్పందన ఉండడం లేదు. దీంతో ఆదాయం అంతంతే సమకూరుతోంది. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2019 అక్టోబర్‌లో సమ్మెలోకి దిగిన విషయం తెలిసిందే. మొత్తం 55 రోజులపాటు సమ్మె చేశారు. దీంతో కొంతవరకు ఆర్టీసీ సంస్థ నష్టాల్లోకి వెళ్లింది. ఆ సమ్మెనుంచి తేరుకోకముందే కరోనా వైరస్ విజృంభించడంతో కేంద్రం జనత కర్ఫ్యూ విధించడంతో ఆర్టీసీ బస్సులు 59రోజులపాటు డిపోకే పరి మితమయ్యాయి. సంస్థకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. కార్గో సర్వీసులను ప్రారంభించి మెయింటనెన్స్ వరకు ఖర్చులు వచ్చాయి. ప్రధాన రూట్లలో సర్వీసులు రెండో దశ విజృంభణలో భాగంగా లాక్డౌన్ మినహాయించిన ఆ నాలుగు గంటలు ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల ఆదరణ పూర్తిగా కరువైంది. లాక్డౌన్ వి«ధించడంతో సర్వీసులన్నీ తగ్గించారు. కొన్ని బస్సులు మాత్రమే ప్రధాన రూట్లల్లో నడిపిస్తున్నారు. కరోనా ఉధృతికి పలు డిపోలలో బస్సులకు శానిటైజేషన్ చేయించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ప్రతి డిపోలలో ఉద్యోగులకు ఉదయాన్నే టెంపరేచర్ చెక్ చేసి విధులకు పంపిస్తున్నారు. ప్రతి ఉద్యోగి మాస్క్‌లను ధరిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజర్‌ను వాడుతున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రయాణీకుల సౌకర్యార్ధం బస్సులను నడిపిస్తున్నప్పటికి ఎవరు కూడా బస్సులను ఎక్కకపోవడంతో బస్టాండ్లన్నీ వెలవెలబోతున్నాయి. నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఏడు డిపోలు యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ ఉన్నాయి. ఆయా డిపోల పరిధిలో సాధారణ సమయంలో పెద్ద సంఖ్యల్లో ప్రయాణికులు ఉంటారు. లాక్డౌన్ సమయంలో కనీసం 10 మంది కూడా బస్సు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. కోవిడ్ జాగ్రత్తల్లో భాగంగా ప్రయాణికులు సొంత వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరికొందరు ప్రయాణాలను మానుకొని ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో జిల్లా ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పడిపోయి సంస్థ నష్టాల్లోకి వెళ్తోంది. రీజియన్ పరిధిలో 57శాతం ఓఆర్ నల్లగొండ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల పరిధిలో మొత్తం 735 బస్సులున్నాయి. ఆర్టీసీ బస్సులు 448 ఉండగా, అద్దె బస్సులు 286 ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా అద్దె బస్సులన్నీ బస్టాండ్లకే పరిమితం అయ్యాయి. 448 ఆర్టీసీ బస్సులకు రోజు 130 నుంచి 153 బస్సుల వరకు ప్రయాణికుల రద్దీని నడిపిస్తున్నారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు ఈనెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏడు డిపోలలో రూ.57,30,309 ఆదాయం సమకూరింది. 57 ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థ్యం సర్వీసులు ప్రయాణికుల సౌకర్యార్థ్యం కోసం లాక్డౌన్ మినహాయింపు సమయమైన ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే బస్సులను నడిపిస్తున్నాం. ప్రధాన రూట్లలో సర్వీసులు నడుస్తున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ బస్సులను శానిటైజేషన్ చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగుకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆదరించి అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరుకుంటున్నాం. - రాజేంద్రప్రసాద్, ఆర్టీసీ ఆర్ఎం, నల్లగొండ చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. చేయి విరిగిందని వెళ్తే రూ.25 లక్షల బిల్లు -
ఏపీకి వెళ్లే బస్సులు నిలిపేసిన టీఎస్ ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను టీఎస్ ఆర్టీసీ నిలిపివేసింది. ఏపీలో కర్ఫ్యూ దృష్ట్యా తాత్కాలికంగా తెలంగాణ బస్సులను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, తెలంగాణ, ఏపీ మధ్య మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాహనాలకు అనుమతినిచ్చింది. ఏపీ ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నిబంధనలు వర్తించనున్నాయని తెలిపింది. నిన్న హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ముందస్తు రిజర్వేషన్లను కూడా అధికారులు రద్దు చేశారు. చదవండి : TSRTC: ఏపీకి వచ్చే బస్సులు రద్దు -
50% ప్రయాణికులతోనే ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను ఆర్టీసీ అమల్లోకి తీసుకువచ్చింది. బస్సుల్లో గరిష్టంగా 50 శాతం మంది ప్రయాణికులనే మంగళవారం నుంచి అనుమతిస్తోంది. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఈ నెలలో రోజుకు సగటున 57 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. సోమవారం ఆక్యుపెన్సీ రేటు 50 శాతానికే పరిమితమైంది. దాంతో ఆర్టీసీ ఆదాయంపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. సగటున రోజుకు రూ.14 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.7 కోట్లే వస్తోంది. దాంతో ఆర్టీసీ తమ బస్సు సర్వీసులను తగ్గించింది. డిమాండ్ అంతగాలేని రూట్లలో సర్వీసుల్లో కోత విధించింది. ఆర్టీసీ రోజూ 10,553 షెడ్యూళ్లలో బస్సు సర్వీసులు నిర్వహించాలి. కానీ వాటిలో 25 శాతం సర్వీసులను తగ్గించింది. ఆర్టీసీ బస్ స్టేషన్లు, కార్యాలయాల్లో కూడా కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారు. -
ఆర్టీసీ వింత నిర్ణయం.. ‘కరోనా’ముప్పున్నా రాకపోకలు షురు..
సాక్షి, బోధన్: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోన్న తరుణంలో.. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. పొరుగు రాష్ట్రంలో నిత్యంవేలాది కేసులు నమోదవుతుండగా, ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. సోమవారంనుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు బస్సులునడుపుతోంది. అయితే, వైరస్ వ్యాప్తి ఎక్కువగాఉన్న ఆయా ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించడం ఆందోళన కలిగిస్తోంది. ‘మహా’ ప్రభావంకారణంగా ఇప్పటికే సరిహద్దుల్లోని మన పల్లెల్లోపాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆ రాష్ట్రానికి సర్వీసులను పునరుద్ధరించడం విమర్శలకు తావిస్తోంది. ఏడాదికి పైగా నిలిపివేత.. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 24 నుంచి ఆర్టీసీ పొరుగు రాష్ట్రానికి బస్సు సర్వీసులను నిలిపి వేసింది. మహారాష్ట్రలో మొదటి నుంచి వైరస్ ఉద్ధృతి ఎక్కువగానే ఉంది. ఇటీవల అది మరింత ఎక్కువైంది. నిత్యం వేల సంఖ్యలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రంలో కర్ఫ్యూతో పాటు కొన్ని నగరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరింత అప్రమత్తంగా మన ఆర్టీసీ అధికారులు వింతనిర్ణయం తీసుకున్నారు. కాగా,గత సోమవారం నుంచి బస్సుసర్వీసులను పునరుద్ధరించారు. పొంచి ఉన్న ‘మహా’ ముప్పు.. తెలంగాణ–మహారాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించడం ఆందోళన కలిగిస్తోంది.జిల్లాలోని బోధన్ రెవెన్యూ డివిజన్ మండలం పరిధిలోని కోటగిరి, బోధన్ రెవెన్యూ, రెంజెల్ మండలంలోని అనేక గ్రామాలు మహారాష్ట్ర ప్రాంత సరిహద్దులకు ఆనుకుని ఉన్నాయి. బోధన్ మండలంలోని సాలూర గ్రామం నుంచి 80 కిలో మీటర్ల దూరంలోగల మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ జిల్లా కేంద్రం ఉండగా, ఇదే జిల్లా పరిధిలోని బిలోలి,దెగ్లూర్, కొండల్‌వాడీ, ధర్మాబాద్ పట్టణ కేంద్రాలు,అనేక పల్లెలు తెలంగాణ ప్రాంత సరిహద్దు పల్లెలకు ఆనుకుని ఉన్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దుపట్టణ కేంద్రాలు, పల్లెల నుంచి రాకపోకాలు సాగుతున్నాయి. గతంలో నిత్యం 10–12 బస్సు సర్వీసులలు నడిపే వారు. కరోనా కారణంగా వాటిని నిలిపి వేయగా, తాజాగా సోమవారం నుంచి ఐదు సర్వీసులను నడుపుతున్నారు. ప్రస్తుతానికి నాందెడ్, దెగ్లూర్ పట్టణాలకు బస్సులు నడుస్తున్నాయి.కార్లు, ప్యాసింజర్ ఆటోలు ఎప్పడి నుంచో తిరుగుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో కేసులు.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూర వద్ద చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రం నుంచివస్తున్న ప్రయాణికులకు టెస్టులు చేస్తున్నారు. ఇక్కడ నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనాకేసులు సరిహద్దు ప్రాంత ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రాంతానికి సరిహద్దులోగల సాలూర క్యాంప్ గ్రామంలోపాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు. ఐదు సర్వీసుల పునరుద్ధరణ.. కరోనా నేపథ్యంలో మార్చి 24 నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి బస్సు సర్వీసులను నిలిపివేశాం. అయితే, సోమవారం నుంచి నాందేడ్, దెగ్లూర్‌లకు ఐదుబస్సు సర్వీసులు పునరుద్ధరించాం. కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులునడుపుతున్నాం. సిట్టింగ్‌సీట్ల మేరకే ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నాం. రమణ, బోధన్ డిపో మేనేజర్ -
గాడిన పడుతున్న ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా గత ఏడాది భారీగా ఆదాయాన్ని కోల్పోయిన ఏపీఎస్ ఆర్టీసీ ఈ ఏడాది ఆరంభం నుంచి రాబడి క్రమంగా పెరుగుతుండటంతో గాడిన పడుతోంది. గతేడాది మార్చి 22 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు రూ.2,603 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి పుంజుకోవడంతో రోజువారీ సగటు ఆదాయం రూ.12 కోట్లకు చేరింది. గత ఏడాది జనవరిలో 69 శాతం ఆక్యుపెన్సీతో రూ.420 కోట్ల ఆదాయం లభించగా.. ఈ ఏడాది జనవరిలో 64 శాతం ఆక్యుపెన్సీతో రూ.360 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ నెలలో 12వ తేదీ వరకు లభించిన ఆదాయం రూ.145 కోట్లకు చేరింది. మార్చి నాటికి టికెట్ రెవెన్యూ రూ.400 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దూరప్రాంత సర్వీసులపై ప్రత్యేక దృష్టి దూర ప్రాంత సర్వీసులను మరింతగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. తెలంగాణతో అంతర్ రాష్ట్ర సర్వీసుల ఒప్పంద సమయంలో.. కోవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే తెలంగాణకు నడిపే 1,60,999 కిలోమీటర్ల మేర సర్వీసులను 2,08,856 కిలోమీటర్లకు పెంచుకుంటామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ దిశగా దృష్టి సారించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో హైదరాబాద్ నుంచి వచ్చే సర్వీసులకు డిమాండ్ పెరిగింది. ఎక్కువమంది ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తుండటంతో స్పెషల్ సర్వీసులను నడుపుతున్నారు. శుక్రవారం ఏపీలోని అన్ని ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి 81 స్పెషల్ సర్వీసులు తిప్పారు. మరోవైపు తిరుపతికి కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆర్టీసీ ప్రవేశపెట్టిన తిరుమల శీఘ్రదర్శనం టికెట్ ఆఫర్‌కు మంచి స్పందన వస్తోంది. రోజుకు సగటున 20 వేల మంది తిరుపతి వెళ్లేందుకు ఆర్టీసీ టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. దూరప్రాంత సర్వీసుల్లో 10 శాతం రాయితీ విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాలకు వెళ్లే డాల్ఫిన్, అమరావతి, ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో ప్రయాణించే వారు 48 గంటల ముందే టికెట్లను రిజర్వేషన్ చేయించుకుంటే టికెట్ ధరలో 10 శాతం రాయితీ కల్పించనున్నారు. అయితే బస్సులో నాలుగైదు సీట్లకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుంది. డాల్ఫిన్ బస్సులో 58 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి.. అమరావతి బస్సులోలో 49 సీట్ల కెపాసిటీకి గాను ఐదుగురికి, ఇంద్రలో 40 సీట్లుంటే నలుగురికి, సూపర్ లగ్జరీలో 35 సీట్లకు గాను నలుగురికి, అల్ట్రా డీలక్స్‌లో 39 సీట్లకు గాను నలుగురు, ఎక్స్‌ప్రెస్ బస్సులో 49 సీట్లకు ఐదుగురికి రాయితీ అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మార్చి నెలాఖరు వరకు అమల్లో ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఆర్టీసీ ఐటీ అధికారులు సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. -
ఆర్టీసీలో మెరుగైన స్క్రాపేజీ పాలసీ!
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో 15 ఏళ్లు పైబడిన బస్సులు కేవలం 19 మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా అర్బన్ ప్రాంతాల్లో 12, గ్రామీణ ప్రాంతాల్లో 9 మాత్రమే తిరుగుతున్నాయి. ఆర్టీసీలో కాల వ్యవధితో సంబంధం లేకుండా కి.మీ. ప్రాతిపదికగా బస్సుల్ని మార్చేస్తున్నారు. వీటి స్థానంలో ఏటా వెయ్యి కొత్త బస్సుల్ని అందుబాటులోకి తెస్తున్నారు. అతి పెద్ద రవాణా వ్యవస్థ అయిన ఏపీఎస్ ఆర్టీసీలో మెరుగైన స్క్రాపేజీ పాలసీని అమలు చేస్తున్నారు. ఇటీవలే కేంద్రం బడ్జెట్లో.. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను కచ్చితంగా తుక్కుగా మార్చేయాలని కేంద్రం పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పాలసీని తప్పనిసరి చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ గత రెండు రోజుల కిందట సంస్థలో బస్సుల పరిస్థితిపై సమీక్షించింది. కేంద్రం ప్రకటించిన స్క్రాపేజీ పాలసీతో ఏపీఎస్ ఆర్టీసీపై ప్రభావం ఉండదని సంస్థ అధికారులు నిర్ణయానికొచ్చారు. ఆర్టీసీలో కేవలం 19 బస్సులే 15 ఏళ్లు పైబడి ఉన్నట్టు గుర్తించారు. ఆర్టీసీ గతం నుంచి స్క్రాపేజీకి సంబంధించి విధాన పరమైన నిర్ణయాలను అమలు చేస్తోంది. ఆర్టీసీ అధికారులు డిపోల్లో వినియోగించే వ్యక్తిగత, ఇతర వాహనాల విషయంలోనూ కాల వ్యవధితో సంబంధం లేకుండా కి.మీ. పూర్తయితే వాటిని స్క్రాప్ కింద తీసేసి అద్దెకు వాహనాలు తీసుకుని నడుపుతున్నారు. ఆ బస్సులు ఇతర అవసరాలకు.. ఆర్టీసీలో ఓ బస్సు 12 లక్షల కి.మీ. తిరిగితే ఆ బస్సును ప్రజా రవాణాకు అసలు వినియోగించడం లేదు. గూడ్స్ వాహనంగానో, లేకుంటే ఆ బస్సును టాయిలెట్‌గా మార్చి వినియోగించుకుంటున్నారు. ఆర్టీసీలో బస్సులు నిత్యం 41.73 లక్షల కి.మీ. తిరుగుతున్నాయి. ఆర్టీసీలో అధిక శాతం బస్సులు పది నుంచి పన్నెండేళ్ల కాల వ్యవధిలోనే 12 లక్షల కి.మీ. పూర్తి చేసుకుంటున్నాయి. 12 లక్షల కి.మీ. దాటితే ఆ బస్సును స్క్రాప్ కింద మార్చేస్తున్నారు. అంతేకాకుండా ఏటా ఆర్టీసీ కొత్త బస్సుల్ని సంస్థలో ప్రవేశపెట్టి పాత బస్సుల్ని మారుస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ అమలు చేస్తున్న స్క్రాపేజీ విధానం కేంద్రం ప్రకటించిన పాలసీ కంటే సమర్థంగా ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
తిరుగు ప్రయాణానికి ‘ప్రత్యేక’ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: స్వగ్రామాల్లో కుటుంబసభ్యులు, బంధువుల మధ్య సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకున్నవారంతా మళ్లీ ‘నగర’బాట పట్టారు. వీరందరితో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు 2,057 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక సర్వీసులు తిప్పుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతాలకు ఆర్టీసీ రెగ్యులర్‌గా 3 వేల సర్వీసులు నడుపుతోంది. ఇప్పుడు 2,057 సర్వీసులు అదనంగా చేరాయి. హైదరాబాద్‌కు అత్యధిక సర్వీసులు.. ఆర్టీసీ ఈనెల 19 వరకు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు అత్యధికంగా 954 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఆ తర్వాత బెంగళూరుకు 409, చెన్నైకి 131 ప్రత్యేక సర్వీసులు కేటాయించింది. ఆదివారం(17వ తేదీ) ఒక్క రోజే ఏకంగా 359 సర్వీసులు అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తిప్పనున్నారు. ఇక బెంగళూరుకు 142, చెన్నైకి 51 సర్వీసులు నడుపుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌పై 816 కేసులు నమోదు.. ప్రైవేటు బస్సుల్ని రవాణా శాఖ కట్టడి చేయడంతో ఈ ఏడాది ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలంతా తమ సొంతూళ్లలో పండుగ జరుపుకోగలిగారు. ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకుందామని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రైవేటు ట్రావెల్స్‌కు రవాణా శాఖ అధికారులు మళ్లీ హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే పర్మిట్ రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. పండుగ నేపథ్యంలో ఇప్పటికే అధిక టికెట్ రేట్లు వసూలు చేసిన ప్రైవేట్ ట్రావెల్స్‌పై అధికారులు 816 కేసులు నమోదు చేశారు. -
సంక్రాంతి నుంచే ఆంధ్రాకు సర్వీసులు!
ప్రయాణికుల ఆదరణ లేక సంస్థకు భారంగా మారిన హైదరాబాద్ సిటీ సర్వీసుల్లోని మెట్రో లగ్జరీ బస్సులను రాజధాని సర్వీసులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటి వరకు రాజధాని కేటగిరీ సర్వీసుల్లో వోల్వో లాంటి ప్రీమియం బస్సులు లేవు. ప్రస్తుతం సిటీ సర్వీసుల్లోంచి ఉపసంహరించుకుంటున్న లగ్జరీ బస్సులన్నీ వోల్వో కంపెనీవే. దీంతో తొలిసారి రాజధాని కేటగిరీలో ప్రీమియం మోడల్ బస్సులు చేరనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో మెట్రో లగ్జరీ కేటగిరీలో 80 వోల్వో బస్సులు ఉన్నాయి. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ ప్రారంభం నుంచి ఇవి డిపోలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత బస్సు సర్వీసులను పునరుద్ధరించినా, వీటిని మాత్రం బయటకు తీయలేదు. ఇటీవలే వీటిని సిటీ సర్వీసు నుంచి తప్పిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వీటిని రాజధాని బస్సులుగా మార్చాలని నిర్ణయించిన నేపథ్యంలో 40 బస్సులను విజయవాడ రూట్‌కు కేటాయించింది. సంక్రాంతి పండుగ నుంచి ఇవి తిరిగే అవకాశం ఉంది. – సాక్షి, హైదరాబాద్ మళ్లీ రూ.లక్షన్నరకుపైగా ఖర్చుతో మార్పులు.. వోల్వో కంపెనీ బస్సులు అయినప్పటికీ సిటీ సర్వీసు కావటంతో వీటిల్లో కుషన్ లేని సాధారణ సీట్లే అమర్చారు. కొత్తగా విజయవాడ మార్గంలో 40 బస్సులు కేటాయించిన నేపథ్యంలో వీటిల్లో సీట్లను మార్చాల్సి ఉంది. దాదాపు నాలుగున్నర గంటల ప్రయాణం అయినందున పుష్ బ్యాక్ సీట్లే అవసరం ఉంటుంది. రాజధాని బస్సుల్లో అలాంటి సీట్లే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న సీట్లపై అంత సేపు ప్రయాణించాలంటే ఇబ్బందిగా ఉంటుంది. దీంతో వీటిల్లో రూ.లక్షన్నర వ్యయం చేసి పుష్ బ్యాక్ సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇవి లోఫ్లోర్ మోడల్ బస్సులు కావడంతో వీటిల్లో 32 సీట్లు మాత్రమే ఉంటాయి. కానీ సాధారణ రాజధాని బస్సుల్లో సీట్ల సంఖ్య 40 ఉంటుంది. తాజా మార్పుల్లో సీట్లను నలభైకి పెంచుతున్నారు. అలాగే ఈ బస్సుల రంగు మార్చి, మధ్యలో డబుల్ డోర్‌ను మూసి ఆ ఖాళీలో 8 సీట్లు కొత్తవి అమరుస్తున్నారు. ముందునుంచీ అంతంతే.. మెట్రో లగ్జరీ సర్వీసుల కింద 80 వోల్వో కంపెనీ బస్సులను జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద 2015లో రాష్ట్రానికి మంజూరు చేశారు. కోటి జనాభాతో ఉన్న నగరం కావటంతో హైదరాబాద్‌లో ప్రీమియం స్థాయి బస్సులుండాలన్న ఉద్దేశంతో అప్పట్లో కేంద్రం మంజూరు చేసిన ఈ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం సిటీ సర్వీసుల్లో చేర్చింది. కానీ వీటికి తొలి నుంచీ ఆదరణ అంతంత మాత్రంగానే ఉండటంతో అప్పటినుంచే తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయి. పలు మార్లు వాటి రూట్లు మార్చి చివరకు సాఫ్ట్వేర్ కంపెనీ లు ఎక్కువగా ఉండే మాదాపూర్ వైపు ఎక్కువ సర్వీసులు ఏర్పాటు చేశారు. వీటిల్లో ప్రయాణం సౌకర్యంగా ఉండటంతో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీటి పాస్‌లు కొనటం వల్ల కాస్త ఆదాయం పెరిగింది. కానీ మెట్రో రైలు సర్వీసు ప్రారంభంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా మెట్రోరైలు వైపు మొగ్గు చూపడంతో మళ్లీ ఇవి ఖాళీగానే తిరగాల్సి వచ్చింది. గతేడాది ఆర్టీసీలో సమ్మె సుదీర్ఘకాలం కొనసాగటం కూడా తీవ్రంగా నష్టాలు రావడానికి కారణమైంది. ఇక సిటీ బస్సులుగా వీటిని నడపటం వృథా ప్రయాస అన్న ఉద్దేశంతో ఆర్టీసీ తాజాగా ఈ బస్సులను సిటీ సర్వీసు నుంచి ఉపసంహరించుకుంది. కొత్త బస్సుల్లేక.. అంతర్రాష్ట్ర ఒప్పందం తర్వాత ఏపీకి తిప్పే తెలంగాణ సర్వీసుల సంఖ్య పెంచారు. కానీ చాలినన్ని కొత్త బస్సుల్లేక సిటీ లగ్జరీ వోల్వో బస్సులను విజయవాడకు తిప్పాలని నిర్ణయించారు. ఈ మార్గంలో స్పందన బాగుంటే మరిన్ని వోల్వో బస్సులను కేటాయించాలని యోచిస్తున్నారు. లేకుంటే వాటిని హైదరాబాద్–రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల మధ్య తిప్పాలని భావిస్తున్నారు. -
వైజాగ్ రూట్
సాక్షి, అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్– తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కారణంగా ఏపీఎస్ ఆర్టీసీ.. తెలంగాణలో 1.03 లక్షల కి.మీ. బస్సులు నడపే అవకాశం కోల్పోయింది. అలాగే తెలంగాణకు సర్వీలు తగ్గించడంతో మరో 80 వేల కి.మీ. కోల్పోయింది. అంటే మొత్తం 1.83 లక్షల కి.మీ.లను తిప్పడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేసుకొనేందుకు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో రూట్ల వారీగా బ్లూ ప్రింట్ రూపొందించింది. సోమవారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ఈడీల) కమిటీకి దీన్ని అందించనున్నారు. కమిటీ ఆమోదించగానే, గుర్తించిన 223 డిమాండ్ రూట్లలో ఆర్టీసీ బస్సులను నడపనుంది. తెలంగాణతో ఏపీఎస్ఆర్టీసీ అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా గతం కంటే 371 బస్సులు తగ్గించుకుంది. దీంతో ఏపీకి ఏటా రూ.265 కోట్లు నష్టం వాటిల్లుతోంది. ప్రజా రవాణాలో బస్సులు తగ్గించుకోకుండా డిమాండ్ ఉన్న పట్టణాల నుంచి చెన్నై, బెంగళూరు, ఏపీలోని అన్ని ముఖ్య నగరాలకు బస్సు సర్వీసులు తిప్పనున్నారు. జిల్లాల్లో అంతర్గత రూట్లపై ఆర్టీసీ అధికారులు సర్వే పూర్తి చేశారు. నగరాల నుంచి పగటిపూట విశాఖకు సర్వీసులు – ఏపీలోని అన్ని పట్టణాల నుంచి నగరాలకు, ముఖ్య మండల కేంద్రాల నుంచి పొరుగు జిల్లాలకు సర్వీసులు తిప్పేందుకు నిర్ణయించారు. – మొత్తం 223 డిమాండ్ రూట్లు గుర్తించారు. ప్రతి పట్టణం నుంచి విశాఖపట్నానికి సర్వీసులు ఏర్పాటు చేయనున్నారు. – ఇతర నగరాల నుంచి పగటి పూట సైతం విశాఖకు బస్సులు నడవనున్నాయి. – విజయవాడ నుంచి తిరుపతికి మినహాయిస్తే, రాయలసీమకు కనెక్టివిటీ తక్కువగా ఉంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఏసీ సర్వీసులు మరీ తక్కువగా ఉన్నాయి. – కడప, కర్నూలుకు ఏసీ సర్వీసులు మూడు చొప్పున మాత్రమే నడుస్తున్నాయి. అనంతపురానికి అసలు ఏసీ సర్వీసు లేదు. – నాన్ ఏసీ సర్వీసులు కూడా రాయలసీమ జిల్లాలకు పెద్దగా లేవు. దీంతో విజయవాడ నుంచి కడప, కర్నూలు, అనంతపురానికి మరిన్ని ఎక్కువ సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించారు. ఏసీ సర్వీసులు పెంచేందుకు నిర్ణయం.. – ప్రస్తుతం ఏసీ బస్సులు 243 ఉండగా, కేవలం 84 మాత్రమే నడుస్తున్నాయి. కోవిడ్ కారణంగా ఏసీ సర్వీసులకు ఆదరణ లభించనందున ఏసీ సర్వీసులు తగ్గించారు. జనవరి నుంచి ఏసీ సర్వీసులు పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. – సిటీ సర్వీసులు విజయవాడ, విశాఖపట్నంలో కలిపి 1,009 వరకు ఉండగా, 740 వరకు సిటీ సర్వీసుల్ని తిప్పుతున్నారు. – అద్దె బస్సులను పెంచి డిమాండ్ ఉన్న రూట్లలో తిప్పేందుకు నిర్ణయించారు. -
త్వరలో సిటీలో డబుల్ డెక్కర్ సర్వీసులు
సాక్షి, హైదరాబాద్ : త్వరలో భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు పరుగుపెట్టే అవకాశం ఉంది. గత నెల ఓ వ్యక్తి ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్ సూచనతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సర్వే చేసిన అధికారులు డబుల్ డెక్కర్ బస్సులను నడిపించగలిగే 5 మార్గాలను ప్రాథమికంగా గుర్తించారు. ఈ మార్గాల్లో తొలుత పది డబుల్ డెక్కర్ బస్సులు నడపాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరు వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దూరప్రాంతాలకు నడిపేలా.. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు మార్గాలను నిర్మించడంతో డబుల్ డెక్కర్ బస్సులు ఆయా మార్గాల్లో తిరగటం సాధ్యం కాదు. ఇవి అడ్డురాని మార్గాల్లో మాత్రమే తిప్పాల్సి ఉంటుంది. ఇందుకు వాటితో ఇబ్బంది లేని మార్గాలను గుర్తించారు. నగరంలో 2004 వరకు డబుల్ డెక్కర్ బస్సులు తిప్పారు. వాటిని రద్దు చేసే సమయానికి మెహిదీపట్నం–సికింద్రాబాద్, మెహిదీపట్నం–చార్మినార్, సికింద్రాబాద్–చార్మినార్, సికింద్రాబాద్–జూపార్కు మార్గాల్లో నడిపారు. మళ్లీ పటాన్‌చెరుకు సర్వీసులు.. నగరం నుంచి పటాన్చెరు వరకు మళ్లీ నడపాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, కోఠి నుంచి ప్రస్తుతం పటాన్‌చెరుకు సాధారణ బస్సులు మంచి ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్నాయి. ఆ మార్గానికి మంచి డిమాండ్ ఉండటంతో ఆయా మార్గాల్లో వీటిని తిప్పితే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే మేడ్చల్ రూట్లో ఉండే సుచిత్ర, కొంపల్లి వరకు మంచి రద్దీతో బస్సులు తిరుగుతున్నాయి. ఆ మార్గంలో కూడా తిప్పితే బాగుంటుందని యోచిస్తున్నారు. పాత బస్తీ నుంచి మెహిదీపట్నం, అక్కడి నుంచే జీడిమెట్ల వైపు కూడా సర్వీసులు తిప్పితే బాగుంటుందని భావిస్తున్నారు. దుర్గం చెరువు వద్దకు కూడా ఓ సర్వీసు ఉండేలా చూడా లని భావిస్తున్నారు. త్వరలో మంత్రి పువ్వాడ, ఎండీ సునీల్‌శర్మలతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే కొత్త బస్సుల తయారీకి ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదివరకు నడిచిన డిజైన్లోనే కొత్త బస్సులు కూడా రూపొందించాలని నిర్ణయించారు. -
25 నుంచి తమిళనాడుకు బస్సులు
సాక్షి, అమరావతి: తమిళనాడు రాష్ట్రానికి ఈ నెల 25 నుంచి బస్సు సర్వీసులు పునరుద్ధరించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సంసిద్ధమయ్యింది. కోవిడ్ కారణంగా మార్చి 21 నుంచి బస్సు సర్వీసులను ఆపేసిన విషయం విదితమే. ఏపీ నుంచి చెన్నైకి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని ఇటీవల ఏపీ ప్రభుత్వం కోరడంతో తమిళనాడు ప్రభుత్వం అంగీకరించింది. లాక్డౌన్ ప్రారంభానికి ముందు చెన్నైకి ప్రతిరోజూ ఏపీ నుంచి 273 సర్వీసులు తిరిగేవి. ఇప్పుడు వీటిని దశల వారీగా తిప్పేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. తిరుమల, తిరుపతి నుంచి సర్వీసులు ఎక్కువగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
పంచారామాలకు 1,750 ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: కార్తీక మాసంలో రాష్ట్రంలో ఐదు పంచారామాలైన పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతికి అన్ని జిల్లాల నుంచి 1,750 బస్సులను తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. భక్తులకు అసౌకర్యం లేకుండా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల రీజనల్ మేనేజర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఒక్కరోజే పంచారామాలు దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. దీనికి అనుగుణంగా ఆర్టీసీ రవాణా సదుపాయం కల్పిస్తోంది. మొదటి సోమవారం ఆర్టీసీ తొమ్మిది జిల్లాల నుంచి పంచారామాలకు, నాలుగు జిల్లాల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడిపింది. మొదటివారం 106 సర్వీసులు ► పంచారామాలకు మొదటివారం తొమ్మిది జిల్లాల నుంచి 106 ప్రత్యేక సర్వీసులు, శ్రీశైలం, కోటప్పకొండకు కర్నూలు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 16 బస్సులు నడిపారు. ► దూరాన్ని బట్టి ఆదివారం అర్ధరాత్రి నుంచి బస్సులు బయలుదేరి సోమవారం రాత్రికల్లా పంచారామాల్లో దర్శనాలు చేసుకుని తిరుగు పయనమయ్యేందుకు వీలుగా శీఘ్ర దర్శనాలు చేయించనున్నారు. -
ఇక్కడ తగ్గించి.. ఏపీకి మళ్లించి!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ సర్వీసులు నడపాల్సిరావడంతో చాలినన్ని బస్సులు లేక హైదరాబాద్ నుంచి ఇతర పట్టణాలకు నడిచే ట్రిప్పులను తగ్గించి వాటిని సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏపీతో ఇటీవల అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం ఖరారు కావటంతో, లాక్డౌన్ సమయం నుంచి 7 నెలలపాటు నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఇంతకాలం తెలంగాణతో పోలిస్తే ఏపీఎస్ఆర్టీసీ 1.03 లక్షల కి.మీ. మేర ఎక్కువగా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిప్పుతోంది. అంతమేర ట్రిప్పుల్లో కోత విధించుకోవాలని, అప్పటి వరకు ఒప్పందం చేసుకోబోమని తెలంగాణ తేల్చిచెప్పడంతో ఏపీఎస్ఆర్టీసీ అంతమేర తగ్గించుకుంది. ఈ ఒప్పం దంలో భాగంగా టీఎస్ఆర్టీసీ ఏపీకి 826 బస్సు లు తిప్పాల్సి వస్తోంది. ఇది అంతకుముందు కంటే దాదాపు 85 బస్సులు ఎక్కువ. ఇప్పుడు ఈ పెరిగిన సంఖ్యకు తగ్గట్టుగా ఆర్టీసీ వద్ద అదనపు బస్సుల్లేవు. ఇప్పటికే ఏపీకి నడుస్తున్న బస్సుల్లో 30% పాతవే. వీటి స్థానంలో కొత్తవి తీసుకోవాల్సి ఉంది. కొత్తవి కొనేందుకు డబ్బు లేక అలాగే నడుపుతున్నారు. ఈ తరుణంలో అదనంగా 85 బస్సులు తిప్పాల్సి రావడం ఆర్టీసీకి ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. గత్యంతరం లేని పరిస్థితిలో హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ఇతర పట్టణాలకు తిరిగే సర్వీసులకు సంబంధించి కొన్ని ట్రిప్పులను తగ్గించి ఆ బస్సులను ఏపీకి తిప్పాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్, హన్మకొండ.. ఇలా ఎక్కువ ట్రిప్పులున్న మార్గాల్లోంచి కొన్నింటిని తగ్గించనున్నారు. ఆయా మార్గాల్లో ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఏయే ట్రిప్పులు తగ్గించాలో తేల్చారు. (చదవండి: ఆర్టీసీపై ‘పోలవరం’ భారం) ఎక్స్‌ప్రెస్‌లే ఎక్కువ.. కొత్త ఒప్పందం ప్రకారం.. హైదరాబాద్–విజయవాడ మార్గంలో 107 బస్సులు కొత్తగా తిప్పాలి. విజయవాడ–ఖమ్మం మార్గంలో కొన్ని పల్లెవెలుగు సర్వీసులు తగ్గించనున్నారు. ఇలా విజయవాడ మార్గంలో వందకు పైగా అదనంగా తిప్పాల్సి రావడం, ఖమ్మం–విజయవాడ మార్గంలో పల్లెవెలుగు బస్సుల సంఖ్య తగ్గించడం వెరసి కొత్తగా 85 బస్సులు అవసరం. విజయవాడ మార్గంలో డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కువ అవసరమవుతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ల సంఖ్య పెం చాల్సి రావడంతో వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌లలోనే కోతపెట్టి మళ్లిస్తున్నా రు. ఆరు నెలల తర్వాతే.. కొత్త బస్సులు కావాలంటూ ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించనుంది. వేయి కొత్త బస్సులు కావాలంటూ గతంలోనే ఓ ప్రతిపాదన సిద్ధం చేసింది. బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు పూచీకత్తు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనుంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చి, రుణం మంజూరై, కొత్త బస్సులు కొని, బస్ బాడీ సిద్ధం చేసుకుని నడిపేందుకు ఆరు నెలల సమయం పట్టనుంది. అప్పటి వరకు ఇతర ప్రాంతాల నుంచి తగ్గించిన బస్సులతోనే నెట్టుకురానుంది. -
ఏపీ–తెలంగాణ బస్సు రూట్లు ఖరారు
సాక్షి, అమరావతి: ప్రతిరోజూ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్లే బస్సు రూట్లను ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. 13 జిల్లాల్లోని 12 రూట్లలో మొత్తం 638 బస్సులు తిప్పనుంది. ఇందులో ఒక్క హైదరాబాద్‌కే 534 బస్సులు నడపనుంది. తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 104 బస్సులు తిప్పేలా ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. విజయవాడ నుంచి తెలంగాణకు వెళ్లే రూట్లో బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో 264 బస్సుల్ని నడపగా.. ఇప్పుడు 166కు పరిమితమైంది. ఇక 1,60,999 కిలోమీటర్లలో హైదరాబాద్‌కు 1,49,998 కిలోమీటర్లు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 11,001 కిలోమీటర్ల మేర నడిపేందుకు సిద్ధమైంది. గతంలో ఏపీఎస్ఆర్టీసీ 2,65,367 కిలోమీటర్ల మేర తెలంగాణ భూ భాగంలో బస్సులు తిప్పేది. కాగా, ఖరారైన బస్సు రూట్లను టీఎస్ఆర్టీసీకి ఏపీఎస్ఆర్టీసీ పంపించింది. టీఎస్ఆర్టీసీ కూడా తెలంగాణ నుంచి ఏపీకి ఇవే రూట్లలో తమ సర్వీసులు నడపనుంది. ఈ నెల 2న ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం ఖరారైన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఏపీఎస్ ఆర్టీసీ 452 బస్సులు తెలంగాణకు నడుపుతుండగా.. ఆక్యుపెన్సీ 67 శాతంగా నమోదవుతోంది. 452 బస్సుల్లో 389 హైదరాబాద్‌కు, 63 తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నారు. వీటి ద్వారా ఏపీఎస్ ఆర్టీసీకి రోజుకు రూ.68.17 లక్షల ఆదాయం వస్తోంది. ఒక్క హైదరాబాద్ రూట్ ద్వారా రూ.59.30 లక్షల ఆదాయం వస్తోంది. -
రాష్ట్రంలో మరో లక్ష కి.మీ. లక్ష్యం
సాక్షి, అమరావతి: అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో కోల్పోయిన లక్ష కిలోమీటర్లను రాష్ట్రంలో పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న అంతర్గత రూట్లపై ఆర్టీసీ అధికారులు సర్వే ప్రారంభించారు. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో డిమాండ్ ఉన్న కర్ణాటక, తమిళనాడుకు సర్వీసులు పెంచనున్నారు. దీన్లో భాగంగా విజయవాడ–విశాఖపట్టణం మధ్య ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేషన్స్‌పై సర్వే చేసిన అధికారులు ఈ మార్గంలో బస్సులు పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. డిమాండ్ ఉన్న తిరుపతికి బస్సులు పెంచడంపై దృష్టి సారించారు. విశాఖపట్నం–బెంగళూరు, విశాఖపట్నం –చెన్నైలకు సర్వీసుల పెంపుపై అధ్యయనం చేయనున్నారు. రెండు రోజుల నుంచి తెలంగాణకు 440 బస్సులు నడిపిన ఏపీఎస్ఆర్టీసీ వీటిని క్రమంగా పెంచనుంది. ఈ నెల రెండు నుంచి తెలంగాణకు ప్రారంభమైన బస్సుల్లో ఆక్యుపెన్సీ 80 శాతం వరకు ఉంది. విజయవాడ–హైదరాబాద్‌కు ఏపీఎస్ఆర్టీసీ 45 సర్వీసులు నడిపితే, టీఎస్ఆర్టీసీ ఈ రూట్లో 39 సర్వీసులు నడిపింది. మొత్తం కర్ణాటక, తెలంగాణ అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఆక్యుపెన్సీ 65 శాతం ఉంది. తమిళనాడుకు త్వరలో సర్వీసులు నడిపేందుకు తమిళనాడు ఆర్టీసీకి సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి ఆమోదం రాగానే చెన్నైకి బస్సులు నడపనున్నారు. విజయవాడ–విశాఖ మధ్య 107 సర్వీసులు ► విజయవాడ–విశాఖ మధ్య ఆర్టీసీ నిత్యం 107 సర్వీసులు నడుపుతోంది. అదే ప్రైవేటు ట్రావెల్స్ వారు 117 సర్వీసులు తిప్పుతున్నారు. ► ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు పగటిపూట సైతం విజయవాడ నుంచి విశాఖకు బస్సులు నడుపుతున్నారు. అయితే కాంట్రాక్టు క్యారేజీలకు అనుమతి తీసుకుని స్టేజి క్యారియర్లుగా తిప్పుతున్నారు. ► నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ను కట్టడిచేయాలని ఆర్టీసీ ఇప్పటికే రవాణాశాఖకు లేఖ రాసింది. ► విజయవాడ–తిరుపతి రూట్లో ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు గతంలో నిర్వహించిన విధంగానే తిరుమల దర్శనసేవలను పునరుద్ధరించనుంది. ► మిగిలిన ఆర్టీసీలతో పోలిస్తే ఏపీఎస్‌ఆర్టీసీకే ప్రజాదరణ ఉంది. ఆక్యుపెన్సీ రేషియో కూడా అధికంగా ఉంది. ఆదరణ ఉన్న అన్ని రూట్లు సర్వే చేస్తాం ప్రయాణికుల ఆదరణ ఉన్న అన్ని రూట్లను సర్వే చేస్తాం. డిమాండ్‌ను బట్టి బస్సులు నడిపి ప్రైవేటుకు పోటీగా సేవలందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఆర్టీసీలో ప్రమాదరేటు తక్కువ. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాం. – బ్రహ్మానందరెడ్డి, ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్)