ప్రయాణికుల ఆదరణ లేక సంస్థకు భారంగా మారిన హైదరాబాద్ సిటీ సర్వీసుల్లోని మెట్రో లగ్జరీ బస్సులను రాజధాని సర్వీసులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటి వరకు రాజధాని కేటగిరీ సర్వీసుల్లో వోల్వో లాంటి ప్రీమియం బస్సులు లేవు. ప్రస్తుతం సిటీ సర్వీసుల్లోంచి ఉపసంహరించుకుంటున్న లగ్జరీ బస్సులన్నీ వోల్వో కంపెనీవే. దీంతో తొలిసారి రాజధాని కేటగిరీలో ప్రీమియం మోడల్ బస్సులు చేరనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో మెట్రో లగ్జరీ కేటగిరీలో 80 వోల్వో బస్సులు ఉన్నాయి. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ ప్రారంభం నుంచి ఇవి డిపోలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత బస్సు సర్వీసులను పునరుద్ధరించినా, వీటిని మాత్రం బయటకు తీయలేదు. ఇటీవలే వీటిని సిటీ సర్వీసు నుంచి తప్పిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వీటిని రాజధాని బస్సులుగా మార్చాలని నిర్ణయించిన నేపథ్యంలో 40 బస్సులను విజయవాడ రూట్‌కు కేటాయించింది. సంక్రాంతి పండుగ నుంచి ఇవి తిరిగే అవకాశం ఉంది. – సాక్షి, హైదరాబాద్
మళ్లీ రూ.లక్షన్నరకుపైగా ఖర్చుతో మార్పులు..
వోల్వో కంపెనీ బస్సులు అయినప్పటికీ సిటీ సర్వీసు కావటంతో వీటిల్లో కుషన్ లేని సాధారణ సీట్లే అమర్చారు. కొత్తగా విజయవాడ మార్గంలో 40 బస్సులు కేటాయించిన నేపథ్యంలో వీటిల్లో సీట్లను మార్చాల్సి ఉంది. దాదాపు నాలుగున్నర గంటల ప్రయాణం అయినందున పుష్ బ్యాక్ సీట్లే అవసరం ఉంటుంది. రాజధాని బస్సుల్లో అలాంటి సీట్లే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న సీట్లపై అంత సేపు ప్రయాణించాలంటే ఇబ్బందిగా ఉంటుంది. దీంతో వీటిల్లో రూ.లక్షన్నర వ్యయం చేసి పుష్ బ్యాక్ సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇవి లోఫ్లోర్ మోడల్ బస్సులు కావడంతో వీటిల్లో 32 సీట్లు మాత్రమే ఉంటాయి. కానీ సాధారణ రాజధాని బస్సుల్లో సీట్ల సంఖ్య 40 ఉంటుంది. తాజా మార్పుల్లో సీట్లను నలభైకి పెంచుతున్నారు. అలాగే ఈ బస్సుల రంగు మార్చి, మధ్యలో డబుల్ డోర్‌ను మూసి ఆ ఖాళీలో 8 సీట్లు కొత్తవి అమరుస్తున్నారు.
ముందునుంచీ అంతంతే..
మెట్రో లగ్జరీ సర్వీసుల కింద 80 వోల్వో కంపెనీ బస్సులను జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద 2015లో రాష్ట్రానికి మంజూరు చేశారు. కోటి జనాభాతో ఉన్న నగరం కావటంతో హైదరాబాద్‌లో ప్రీమియం స్థాయి బస్సులుండాలన్న ఉద్దేశంతో అప్పట్లో కేంద్రం మంజూరు చేసిన ఈ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం సిటీ సర్వీసుల్లో చేర్చింది. కానీ వీటికి తొలి నుంచీ ఆదరణ అంతంత మాత్రంగానే ఉండటంతో అప్పటినుంచే తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయి. పలు మార్లు వాటి రూట్లు మార్చి చివరకు సాఫ్ట్‌వేర్ కంపెనీ లు ఎక్కువగా ఉండే మాదాపూర్ వైపు ఎక్కువ సర్వీసులు ఏర్పాటు చేశారు. వీటిల్లో ప్రయాణం సౌకర్యంగా ఉండటంతో చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వీటి పాస్‌లు కొనటం వల్ల కాస్త ఆదాయం పెరిగింది. కానీ మెట్రో రైలు సర్వీసు ప్రారంభంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా మెట్రోరైలు వైపు మొగ్గు చూపడంతో మళ్లీ ఇవి ఖాళీగానే తిరగాల్సి వచ్చింది. గతేడాది ఆర్టీసీలో సమ్మె సుదీర్ఘకాలం కొనసాగటం కూడా తీవ్రంగా నష్టాలు రావడానికి కారణమైంది. ఇక సిటీ బస్సులుగా వీటిని నడపటం వృథా ప్రయాస అన్న ఉద్దేశంతో ఆర్టీసీ తాజాగా ఈ బస్సులను సిటీ సర్వీసు నుంచి ఉపసంహరించుకుంది.
కొత్త బస్సుల్లేక..
అంతర్రాష్ట్ర ఒప్పందం తర్వాత ఏపీకి తిప్పే తెలంగాణ సర్వీసుల సంఖ్య పెంచారు. కానీ చాలినన్ని కొత్త బస్సుల్లేక సిటీ లగ్జరీ వోల్వో బస్సులను విజయవాడకు తిప్పాలని నిర్ణయించారు. ఈ మార్గంలో స్పందన బాగుంటే మరిన్ని వోల్వో బస్సులను కేటాయించాలని యోచిస్తున్నారు. లేకుంటే వాటిని హైదరాబాద్–రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల మధ్య తిప్పాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment