సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి తర్వాత ఘనంగా జరుపుకొనే వేడుక. ఈ పండుగ వేళ హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు ఏడెనిమిది లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారు. పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి వారి ప్రయాణాలు మొదలవుతాయి. ఆర్టీసీకి కూడా దసరా సీజన్ కలెక్షన్లు కురిపిస్తుంది. పెద్దెత్తున ఆదాయం వస్తుంది. ఈ సమయంలో చార్జీలు అధికారికంగా 50 శాతం పెంచినా ప్రజలు దాన్ని అంతగా పట్టించుకోరు. అయితే.. ఈసారి తెలంగాణలో ఉండే ఏపీ ప్రజలకు పెద్ద సమస్యే వచ్చిపడింది.
రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం కుదరకపోవడంతో బస్సులు సరిహద్దులు దాటడం లేదు. రెండు నెలలుగా అధికారులు కుస్తీ పడుతున్నా సయోధ్య కుదరలేదు. పండుగలోపు కుదురుతుందో.. లేదో.. తెలియని పరిస్థితి. దీంతో ఈసారి ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి ప్రయాణం కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు కోవిడ్ నిబంధనలతో రైళ్లు కూడా తక్కువ సంఖ్యలోనే నడుస్తున్నాయి. వాటిల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. దీంతో విధిలేక ప్రజలు ప్రైవేటు బస్సుల కోసం పరుగుపెట్టాల్సి వస్తోంది. దొరికిందే అదునుగా వారు టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆర్టీసీ చార్జీ రూ.290 ఉంటే.. ప్రైవేట్‌లో రూ.500కుపైగా వసూలు చేస్తున్నారు.
ఆదాయ నష్టం ఐదారు కోట్లు..
ప్రతీ సంవత్సరం పండుగ వేళ తిరిగే అదనపు బస్సుల్లో 50 శాతం చార్జి ఎక్కువ ఉంటుంది. దసరా సమయంలో తెలంగాణ ఆర్టీసీకి ఏపీకి తిప్పే స్పెషల్ బస్సుల ద్వారా రోజుకు అదనంగా రూ.70 లక్షల ఆదాయం వస్తుంది. ఒప్పందం కుదరక ఈ సారి బస్సులు తిరిగే అవకాశం లేకపోవడంతో దాదాపు రూ.ఐదారు కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ఈ సంవత్సరం ఇలా ఉంటే.. గతేడాది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు దసరా వేళ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో టీఎస్‌ఆర్టీసీ బస్సులు సరిగాలేక ప్రజలు అప్పుడు కూడా ఇబ్బందులు పడ్డారు.
లాక్‌డౌన్‌కు ముందు..
►తెలంగాణ పరిధిలో ఏపీ ఆర్టీసీ బస్సులు తిరిగే కి.మీ.: 2.64 లక్షలు
►తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఏపీ భూభాగంలో తిరిగే కి.మీ.: 1.61 లక్షలు
తెలంగాణ వాదన: తెలంగాణ పరిధిలో ఏపీ బస్సు లు.. ఏపీలో తిరిగే తెలంగాణ బస్సుల పరిధి కంటే 1.03 లక్షల కి.మీ. ఎక్కువ తిరుగుతున్నాయి. దాన్ని తగ్గించుకోవాలి.
ఏపీ వాదన: తెలంగాణతో పోలిస్తే ఏపీ బస్సులు ఎక్కువ తిరుగుతున్న మాట వాస్తవమే. కాలం గడిచేకొద్దీ సర్వీసుల సంఖ్య పెంచుకోవాలి కాబట్టి.. టీఎస్ ఆర్టీసీ కూడా ఏపీలో అంతమేర పెంచుకుంటే సరిపోతుంది. కాదంటే మేం 50 వేల కి.మీ. తగ్గించుకుంటాం.. తెలంగాణ అంతమేర పెంచుకున్నా చాలు.
పెంచుకోవడం సాధ్యం కాదు..
ఇప్పటికే టీఎస్‌ఆర్టీసీ నష్టాల్లో ఉంది. బస్సులు పెంచుకోవడం సాధ్యం కాదు. ఇక లాభదా యకంగా ఉండే విజయవాడ–హైదరాబాద్, కర్నూలు–హైదరాబాద్, గుంటూరు–హైదరాబాద్, ఒంగోలు–హైదరాబాద్ తదితర ప్రాంతాల మధ్య ఏపీ బస్సులను తగ్గించుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది.
ఆదాయం కోల్పోవడమే సమస్య...
తెలంగాణకు పెద్ద సంఖ్యలో బస్సులు తిప్పడం ద్వారా ఏపీ ఆర్టీసీ సాలీనా రూ.575 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. తెలంగాణ వాదన మేరకు సంఖ్య తగ్గించుకుంటే దాదాపు రూ.260 కోట్ల ఆదాయం తగ్గుతుంది. అసలే నష్టాల్లో ఉండే ఆర్టీసీలు ఇంత ఆదాయం కోల్పోవటం పెద్ద సమస్యనే. కానీ ఏపీ బస్సులు ఎక్కువ తిరగటం వల్ల టీఎస్ ఆర్టీసీకి 250 కోట్ల కంటే ఎక్కువ నష్టమొస్తోందని తెలంగాణ వాపోతోంది.
ఇద్దరికి రూ.1,100...
దసరా వేళ హైదరాబాద్ నుంచి గుడివాడ వెళ్లాలంటే ప్రైవేట్ బస్సులో ఇద్దరికి కలిపి టికెట్ ధర రూ.1,100 అడిగారు. రైళ్లు ఫుల్ అయ్యాయి. ఆర్టీసీ బస్సుల్లేవు. దీంతో మాలాంటోళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు.
– సీతారామ్, యశ్వంత్, గుడివాడ
మేం సిద్ధమే.. కానీ..
దసరాకి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా బస్సులు తిప్పేందుకు మేం సిద్ధం. కానీ.. ఏపీఎస్ ఆర్టీసీ మా ప్రతిపాదనకు అంగీకరించాలి. మా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రతిపాదన చేశారు. బస్సులు, కిలోమీటర్లు, రూట్లు.. ఈమూడింటిలో రెండు ఆర్టీసీలు సమంగా అనుసరించాలన్నారు. దాని ప్రకారమే మేం ప్రతిపాదించాం. మా ప్రతిపాదనతో రెండు ఆర్టీసీలు సమంగా లాభపడతాయి.
– పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment