రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో సోమవారం హైదరాబాద్‌లో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు, టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ
సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల తర్వాత తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. సోమవారం ట్రాన్స్‌పోర్టు భవన్‌లో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు.. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో అంతర్రాష్ట్ర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో కొన్ని నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. ఆ వెంటనే ఆర్టీసీ బస్సులు సరిహద్దులు దాటి ముందుకు వెళ్లటం విశేషం. కొత్త ఒప్పందం ప్రకారం.. తెలంగాణకు వచ్చే ఏపీ బస్సుల కంటే, ఏపీకి వెళ్లే తెలంగాణ బస్సులే ఎక్కువ. సరిహద్దు నుంచి పరిశీలిస్తే తెలంగాణ భూభాగమే ఎక్కువగా ఉన్నందున టీఎస్‌ఆర్టీసీ బస్సుల సంఖ్య ఎక్కువగా నిర్ధారించారు. 826 టీఎస్‌ఆర్టీసీ బస్సులు ఏపీలో 1,61,258 కి.మీ.లు.. 638 ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణలో 1,60,999 కి.మీ. మేర తిరగనున్నాయి.
తెలంగాణ ప్రతిపాదన ప్రకారమే..
రాష్ట్రం విడిపోక ముందు ఆంధ్రప్రాంత భూ భాగంలో వెసులుబాటు ఆధారంగా సింహ భాగం ఆ ప్రాంత డిపో బస్సులే తిరిగేలా షెడ్యూల్స్ రూపొందించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒప్పందం జరగకపోవడంతో అవి అలాగే కొనసాగాయి. ఫలితంగా ఏపీ పరిధిలో టీఎస్‌ఆర్టీసీ బస్సులు తక్కువగా, తెలంగాణ పరిధిలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఎక్కువగా తిరుగుతూ వచ్చాయి. ఇప్పుడు దాన్ని మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సూచించారు. ఆ మేరకే అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దా ని ప్రకారం.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు 1.03 లక్షల కి.మీ. మేర తెలంగాణలో తక్కువగా తిరగాల్సి వస్తోంది. దీనికి బదులు టీఎస్ ఆర్టీ సీ కూడా అంతమేర ఎక్కువగా బస్సులు తిప్పుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ కోరింది.
కానీ అది నష్టమే తెస్తుందని గట్టిగా పేర్కొన్న తెలంగాణ, ఏపీ కూడా అంతమేర తగ్గించడమే రెండు ఆర్టీసీలకు మంచిదని వాదించింది. ఇప్పుడు ఆ మేరకే రెండు ఆర్టీసీలు ఒప్పం దం చేసుకున్నాయి. ఈ సమావేశంలో తెలంగాణ ఈడీలు వినోద్‌కుమార్, వెంకటేశ్వర్లు, పురుషోత్తంనాయక్, యాదగిరి, ఏపీ ఈడీలు బ్రహ్మానందరెడ్డి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే బస్సులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఒప్పందంపై ప్రజలకు అవగాహన లేకపోవటంతో బస్టాండ్లకు పెద్దగా ప్రయాణికులు రాలేదు. దీంతో పరిమిత సంఖ్యలో సర్వీసులు నడిపారు. రాత్రి సర్వీసులకు కొంత రద్దీ పెరిగింది. మంగళవారం నుంచి ప్రయాణికుల సంఖ్య ఆధారంగా సర్వీసుల సంఖ్య పెంచుతామని అధికారులు పేర్కొన్నారు.
కాస్త ఆలస్యమైనా.. మంచి ఒప్పందం
కోవిడ్ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందంలో కొంత జాప్యంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగలేదు. కాస్త ఆలస్యమైనా ఇప్పుడు మంచి ఒప్పందం కుదిరింది. ఇది రెండు ఆర్టీసీలకు మేలు చేస్తుంది. ఈ ఒప్పందం సామరస్యపూర్వకంగా కుదరడంలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ రవాణా మంత్రి పేర్నినాని, ఏపీ–తెలంగాణ ఎండీలు కృష్ణబాబు, సునీల్‌శర్మ, ఈడీలు ఎంతో కృషి చేశారు. వారందరికీ కృతజ్ఞతలు.
– మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment