టీఎస్‌ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్‌ఆర్టీసీకి రాబడి | Increase in TSRTC Chareges is Turning in Favor of APSRTC | Sakshi
Sakshi News home page

టీఎస్‌ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్‌ఆర్టీసీకి రాబడి

Published Tue, Jun 14 2022 7:29 AM | Last Updated on Tue, Jun 14 2022 2:37 PM

Increase in TSRTC Chareges is Turning in Favor of APSRTC - Sakshi

సాక్షి, అమరావతి: తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు రెండోసారి పెంచడం ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీకి అనుకూలంగా మారుతోంది. మన రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులకే ప్రయాణికులు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ రాబడి గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణ ఆర్టీసీ.. డీజిల్‌ సెస్‌ పేరుతో జూన్‌ 9న రెండోసారి చార్జీలు పెంచింది. దీంతో కనీసం రూ.5 నుంచి గరిష్టంగా రూ.170 వరకు ఆ రాష్ట్రంలో బస్సు చార్జీలు పెరిగాయి.

ప్రధానంగా 100 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణంపై చార్జీల పెంపు భారం అధికంగా ఉంది. ఈ పరిణామం ఏపీఎస్‌ఆర్టీసీకి కలసివస్తోంది. ప్రధానంగా రెండు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉండే హైదరాబాద్‌ రూట్లో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు పెరుగుతోంది. విజయవాడ–హైదరాబాద్‌ రూట్లో ఏపీఎస్‌ఆర్టీసీ బస్‌ సర్వీసులకు ప్రయాణికుల నుంచి ఆదరణ మరింతగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ముందస్తు రిజర్వేషన్లకు డిమాండ్‌ కూడా పెరుగుతోంది. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ రాబడి కూడా గణనీయంగా వృద్ధి చెందుతోంది. 

చదవండి: (AP: అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి)

బస్‌ సర్వీసులు పెంచడంపై దృష్టి
జూన్‌ 9 కంటే ముందు విజయవాడ –హైదరాబాద్‌ రూట్లో ఆర్టీసీకి రోజుకు గరిష్టంగా రూ.కోటి రాబడి వచ్చేది. కానీ తెలంగాణ ఆర్టీసీ చార్జీలు రెండోసారి పెంచాక ఏపీఎస్‌ఆర్టీసీ రాబడి పెరుగుతోంది. జూన్‌ 9న రూ.1.19 కోట్ల రాబడి రాగా.. జూన్‌ 10న రూ.1.21 కోట్లు వచ్చింది. జూన్‌ 11న రూ.1.26 కోట్లు, జూన్‌ 12న రూ.1.24 కోట్లు రాబడి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న రోజుల్లో విజయవాడ –హైదరాబాద్‌ రూట్‌తోపాటు తిరుపతి– హైదరాబాద్‌ రూట్,రాష్ట్రంలోని తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కూడా ఏపీఎస్‌ఆర్టీసీ రాబడి మరింతగా పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా బస్‌ సర్వీసులు పెంచడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాల కల్పనపై దృష్టిసారించారు. 

రెండు రాష్ట్రాల ఆర్టీసీ చార్జీలు ఇలా..
ఉదాహరణకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సూపర్‌ లగ్జరీ చార్జీ తెలంగాణ ఆర్టీసీలో రూ.505. కానీ ఏపీఎస్‌ఆర్టీసీలో రూ.470 మాత్రమే. 
ఏపీఎస్‌ఆర్టీసీ ఇంద్ర బస్‌లో హైదరాబాద్‌ (కేపీహెచ్‌బీ)కి చార్జీ రూ.610 ఉండగా.. అదే రీతిలో ఉండే తెలంగాణ ఆర్టీసీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చార్జీ రూ.642.
ఏపీఎస్‌ఆర్టీసీ గరుడ సర్వీసులో హైదరాబాద్‌ (కేపీహెచ్‌బీ)కి చార్జీ రూ.690 ఉండగా.. తెలంగాణ ఆర్టీసీలో చార్జీ రూ.783గా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement