రైట్‌.. రైట్‌.. | 371 services to be reduced to APSRTC | Sakshi
Sakshi News home page

రైట్‌.. రైట్‌..

Published Tue, Nov 3 2020 3:10 AM | Last Updated on Tue, Nov 3 2020 7:32 AM

371 services to be reduced to APSRTC - Sakshi

అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం ఏపీఎస్‌ఆర్టీసీ 371 సర్వీసుల్ని తగ్గించుకుంది. అంతకుముందు ఏపీ నుంచి తెలంగాణకు 1,009 సర్వీసులు నడిచేవి. ఇప్పుడు 638 సర్వీసులకు పరిమితం కావాల్సి ఉంది.
టీఎస్‌ఆర్టీసీకి 76 సర్వీసులు పెరగనున్నాయి. గతంలో టీఎస్‌ఆర్టీసీ ఏపీకి 750 సర్వీసులు నడిచేవి. ఒప్పందం ప్రకారం ఇప్పుడు 826 సర్వీసులు తిరుగుతాయి.

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ మధ్య ఎట్టకేలకు అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరింది. గత ఏడు నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ సమక్షంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందాలపై ఇరు రాష్ట్రాల ఎండీలు ఎంటీ కృష్ణబాబు, సునీల్‌శర్మ హైదరాబాద్‌లో సంతకాలు చేశారు. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 1,61,258 కి.మీ మేర బస్సు సర్వీసులను నడపనుంది. తెలంగాణలో ఏపీఎస్‌ఆర్టీసీ 1,60,999 కి.మీ నడపనుంది. ఇకపై ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు 638 బస్సులు నడపనుంది. టీఎస్‌ఆర్టీసీ 826 బస్సులు తిప్పనుంది. అంతర్రాష్ట్ర ఒప్పందంపై సంతకాల అనంతరం తక్షణమే ఈ ఒప్పందం అమలులోకి వస్తుందని ఇరు రాష్ట్రాల ఎండీలు వెల్లడించారు. ఒప్పందం కుదిరిన వెంటనే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు 36 మంది ప్రయాణికులతో సూపర్‌ లగ్జరీ బస్సు బయలుదేరి వెళ్లింది. 

ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీల మధ్య అంతర్రాష్టఒప్పందం ఇదే..
► టీఎస్‌ఆర్టీసీ 826 బస్సులతో ఏపీలో 1,61,258 కి.మీ, ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణలో 638 బస్సులతో 1,60,999 కి.మీ. బస్సులు తిరుగుతాయి. 
► విజయవాడ మార్గంలో, టీఎస్‌ ఆర్టీసీ 273 బస్సులతో 52,944 కి.మీ. రోజూ తిప్పుతుంది. ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణలో 192 బస్సులతో 52,524 కి.మీ. నడపనుంది. 
► కర్నూలు–హైదరాబాద్‌ మార్గంలో, టీఎస్‌ఆర్టీసీ ఏపీలో 213 బస్సులతో 43,456 కి.మీ. నడుపుతుంది. అదే ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణలో 146 బస్సులతో 43,202 కి.మీ. నడుపుతుంది. 
► పిడుగురాళ్ల–గుంటూరు మార్గంలో వాడపల్లి మీదుగా టీఎస్‌ఆర్టీసీ ఏపీలో 67 బస్సులతో 19,044 కి.మీ., ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణలో 88 బస్సులతో 20,238 కి.మీ. తిప్పుతుంది.
► మాచర్ల మార్గంలో, టీఎస్‌ఆర్టీసీ ఏపీలో 66 బస్సులతో 14,158 కి.మీ. నడపనుంది. ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణలో 61 బస్సులతో 16,060 కి.మీ. నడపనుంది. 
​​​​​​​► నూజివీడు, తిరువూరు, భద్రాచలం–విజయవాడ మార్గంలో టీఎస్‌ఆర్టీసీ అదే కిలోమీటర్లు నడిపేందుకు సిద్ధం. అంటే తెలంగాణ ఆర్టీసీ ఏపీలో 48 బస్సులతో 12,453 కి.మీ. ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణలో 65 బస్సులతో 14,026 కి.మీ. నడుస్తాయి. 
​​​​​​​► ఖమ్మం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం మార్గంలో టీఎస్‌ఆర్టీసీ ఇప్పుడు ఏపీలో 35 బస్సులతో 9,140 కి.మీ. నడుపుతుంది. ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణలో 58 బస్సులతో 11,541 కి.మీ. తిప్పనుంది.
​​​​​​​► హైదరాబాద్‌–శ్రీశైలం మార్గంలో టీఎస్‌ఆర్టీసీ ఏపీలో 62 బస్సులతో 1,904 కి.మీ. కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఏపీఎస్‌ఆర్టీసీ ఈ మార్గంలో బస్సులు నడపబోదు. సత్తుపల్లి–ఏలూరు, భద్రాచలం ఇంకా కుంట వయా మార్గాల్లో కల్లుగూడెం, సత్తుపల్లి– విజయవాడ మార్గంలో, ఇతర మార్గాల ద్వారా టీఎస్‌ఆర్టీసీ ఏపీలో 62 బస్సులతో 8,159 కి.మీ., ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణలో 28 బస్సులతో 3,408 కి.మీ. బస్సులు నడపనున్నాయి. 

ఏపీఎస్‌ఆర్టీసీకి ఆర్నెల్లలో రూ.2,400 కోట్లు నష్టం
ఏపీఎస్‌ఆర్టీసీకి గత ఆర్నెల్లలో రూ.2,400 కోట్లు నష్టం వాటిల్లింది. త్వరలోనే అంతర్రాష్ట్ర ట్యాక్స్‌ చెల్లింపుల కోసం ఇరు రాష్ట్రాల రవాణా మంత్రుల భేటీ జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు లక్ష కిలోమీటర్లు తిప్పాలంటే కష్టమే. కరోనా పరిస్థితుల కారణంగా లక్ష కిలోమీటర్లు తిప్పకపోతే పునరాలోచన చేయాల్సి ఉంటుంది. ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ఉండాలనే ఒప్పందం చేసుకున్నాం.
– కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement