bus fares
-
Odisha Train Accident: ఇటు రైలు ప్రమాదం.. అటు.. బస్సు ఛార్జీల పెంపు..!
ఒడిశా:ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైళ్ల భీకర ప్రమాదంతో పూరీకి వెళ్లే మార్గంలో అటు బంగాల్ నుంచి రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో బస్సుల ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. బస్సు యజమానులు ఛార్జీలను ఒక్కసారిగా మూడొంతులకు పెంచేశారని ప్రయాణికులు వాపోతున్నారు. 'జగన్నాథ్ స్నాన్ యాత్ర' రేపు జరగనుంది. భక్తులు పూరీకి పెద్ద సంఖ్యలో వెళుతుంటారు. బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంతో రైళ్ల రాకపోకలను సౌత్-ఈస్ట్రన్ రైల్వే నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు బస్సు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అవకాశాన్ని వాడుకుని బస్సు ఛార్జీలను యజమానులు అమాంతం పెంచేశారని ప్రయాణికులు తెలిపారు. భద్రక్, కటక్, పూరీ మీదుగా వెళ్లే బస్సు ఛార్జీ సాధారణంగా రూ.400, 600, 800 ఉండేది. కానీ ప్రస్తుతం రూ.1200 నుంచి 1500 వెచ్చించాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. మరికొంత మంది ఏజెంట్లు రూ.2000 నుంచి 2500 వరకు అడుగుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి:'కన్న కొడుకు మృతదేహాన్ని చేతులతో మోస్తూ..' రైలు ప్రమాదంలో చెదిరిన మధ్యతరగతి కుటుంబాలెన్నో.. -
అంతర్రాష్ట్ర ఏసీ బస్సుల చార్జీ తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర ఏసీ బస్సు చార్జీలను 10 శాతం తగ్గిస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవటంతో బస్సు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంది. ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో కూడా బాగా పడిపోయింది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో టికెట్ ధరలను బేసిక్‌పై పది శాతం తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. రెండు రోజుల క్రితం ఏపీఎస్ ఆర్టీసీ కూడా ఇదే కేటగిరీ బస్సుల్లో టికెట్ ధరలను తగ్గించుకుంది. దీంతో ఆంధ్ర ప్రాంతంవైపు వెళ్లే మార్గాల్లో, ప్రయాణికులు టీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల కంటే ఏపీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఎక్కేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తమ ఏసీ సర్వీసుల్లో కూడా టికెట్ చార్జీలను సవరించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. శనివారం నుంచి అమల్లోకి వచ్చే కొత్త చార్జీలు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నట్టు ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్–విజయవాడ మధ్య నడిచే గరుడప్లస్, రాజధాని సర్వీసుల్లో శుక్ర, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో 10 శాతం తగ్గింపు వర్తిస్తుందని, బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చే సర్వీసుల్లో శుక్రవారం, హైదరాబాద్ నుంచి బెంగుళూరు వైపు వెళ్లే ఏసీ బస్సుల్లో ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. -
టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్ఆర్టీసీకి రాబడి
సాక్షి, అమరావతి: తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు రెండోసారి పెంచడం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి అనుకూలంగా మారుతోంది. మన రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే ప్రయాణికులు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ రాబడి గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణ ఆర్టీసీ.. డీజిల్ సెస్ పేరుతో జూన్ 9న రెండోసారి చార్జీలు పెంచింది. దీంతో కనీసం రూ.5 నుంచి గరిష్టంగా రూ.170 వరకు ఆ రాష్ట్రంలో బస్సు చార్జీలు పెరిగాయి. ప్రధానంగా 100 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణంపై చార్జీల పెంపు భారం అధికంగా ఉంది. ఈ పరిణామం ఏపీఎస్ఆర్టీసీకి కలసివస్తోంది. ప్రధానంగా రెండు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉండే హైదరాబాద్ రూట్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు పెరుగుతోంది. విజయవాడ–హైదరాబాద్ రూట్లో ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులకు ప్రయాణికుల నుంచి ఆదరణ మరింతగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ముందస్తు రిజర్వేషన్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ రాబడి కూడా గణనీయంగా వృద్ధి చెందుతోంది. చదవండి: (AP: అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి) బస్ సర్వీసులు పెంచడంపై దృష్టి జూన్ 9 కంటే ముందు విజయవాడ –హైదరాబాద్ రూట్లో ఆర్టీసీకి రోజుకు గరిష్టంగా రూ.కోటి రాబడి వచ్చేది. కానీ తెలంగాణ ఆర్టీసీ చార్జీలు రెండోసారి పెంచాక ఏపీఎస్ఆర్టీసీ రాబడి పెరుగుతోంది. జూన్ 9న రూ.1.19 కోట్ల రాబడి రాగా.. జూన్ 10న రూ.1.21 కోట్లు వచ్చింది. జూన్ 11న రూ.1.26 కోట్లు, జూన్ 12న రూ.1.24 కోట్లు రాబడి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న రోజుల్లో విజయవాడ –హైదరాబాద్ రూట్‌తోపాటు తిరుపతి– హైదరాబాద్ రూట్,రాష్ట్రంలోని తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ రాబడి మరింతగా పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా బస్ సర్వీసులు పెంచడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాల కల్పనపై దృష్టిసారించారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ చార్జీలు ఇలా.. ►ఉదాహరణకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ చార్జీ తెలంగాణ ఆర్టీసీలో రూ.505. కానీ ఏపీఎస్ఆర్టీసీలో రూ.470 మాత్రమే. ►ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర బస్‌లో హైదరాబాద్ (కేపీహెచ్‌బీ)కి చార్జీ రూ.610 ఉండగా.. అదే రీతిలో ఉండే తెలంగాణ ఆర్టీసీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చార్జీ రూ.642. ►ఏపీఎస్ఆర్టీసీ గరుడ సర్వీసులో హైదరాబాద్ (కేపీహెచ్‌బీ)కి చార్జీ రూ.690 ఉండగా.. తెలంగాణ ఆర్టీసీలో చార్జీ రూ.783గా ఉంది. -
చార్జీల పెంపుపై త్వరలో సీఎంను కలుస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్ చార్జీల పెంపుపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సంప్రదిం చనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఆర్టీసీపై రూ.వందల కోట్ల భారం పడుతోందని, అయినప్ప టికీ ఇప్పటి వరకు ఆ భారం ప్రజలపై పడకుండా ఆర్టీసీ భరించిందని అన్నారు. తీవ్రమైన నష్టాల్లో నడుస్తున్న సంస్థను బలోపేతం చేసేందుకు చార్జీలు పెంచక తప్పనిపరిస్థితి నెలకొందన్నారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాలను మంత్రి గురువారం ప్రారంభించారు. మొదటి బ్యాచ్‌లో 50 మంది విద్యార్థినులతో దీనిని మొదలు పెట్టారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, పలువురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మళ్లీ బుసకొట్టిన సెస్.. ఈసారి డీజిల్ సెస్ వడ్డించిన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతివ్వడంలో జాప్యం జరుగుతుండటం, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆర్టీసీ తన స్థాయిలో సెస్‌లను ఎడాపెడా వడ్డిస్తోంది. ఇప్పటికే సేఫ్టీ సెస్, ప్యాసింజర్ ఎమినిటీస్ సెస్ పెంపుతో టికెట్ ధరలను సవరించిన ఆర్టీసీ తాజాగా డీజిల్ సెస్ విధించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ప్రతి టికెట్‌పై 2 రూపాయలు, ఎక్స్‌ప్రెన్, డీలక్స్, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ సర్వీసుల్లో ప్రతి టికెట్‌పై 5 రూపాయల చొప్పున సెస్ వడ్డించింది. సూపర్ లగ్జరీ సహా ఇతర ఏసీ కేటగిరీ సర్వీసుల్లో ఈ సెస్ పేరుకు 5 రూపాయలుగానే నిర్ధారించినా వాటిల్లో టికెట్ ధరలు రూ. 10 గుణిజంతో ఉన్నందున ప్రభావం నేరుగా రూ. 10గా ఉండనుంది. టికెట్ బేస్ ధరపై ఈ సెస్‌ను విధించి చిల్లర సమస్య రాకుండా ఆ మొత్తాన్ని రౌండ్ ఆఫ్ చేసింది. సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు బస్సుల్లో ధరను సమీపంలోని రూ. 5కు రౌండాఫ్ చేయగా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సిటీ ఇతర సర్వీసుల్లో దాన్ని తదుపరి రూ. 5కు పెరిగేలా రౌండాఫ్ చేశారు. సూపర్ లగ్జరీ, ఇతర ఏసీ కేటగిరీల్లో దాన్ని తదుపరి రూ. 10కి రౌండాఫ్ చేశారు. నిజామాబాద్ టూర్‌కు వెళ్లిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అక్కడ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. శనివారం తొలి సర్వీసు నుంచి డీజిల్ సెస్ అమల్లోకి తేనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. రూ. 100 కోట్ల భారం.. ఈ కొత్త సెస్, దాని రూపంలో టికెట్ చార్జీని రౌండ్ ఆఫ్ చేయడం... వెరసి ఆర్టీసీకి సాలీనా రూ. 100 కోట్ల అదనపు రాబడి సమకూరనుంది. గత కొద్ది రోజులుగా ఆర్టీసీ వడ్డించిన సెస్‌లు, ఇతర రౌండింగ్ ఆఫ్ సవరింపులతో జనంపై వార్షికంగా రూ. 350 కోట్ల అదనపు భారం పడినట్టయింది. ఇక ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న టికెట్ ధరల పెంపు ప్రతిపాదన అమలులోకి వస్తే సాలీనా మరో రూ. 900 కోట్లకుపైగా అదనపు భారం పడుతుంది. పెంపు భారం ఇలా.. పల్లెవెలుగు బస్సుల్లో 15 కి.మీ.తర్వాత (మూడో స్టేజీ) రూ.15గా ఉన్న టికెట్ ధర రూ.20గా, 20 కి.మీ. తర్వాత రూ. 20 టికెట్ రూ. 25గా, ఇలా ఐదు చొప్పున పెరుగుదల నమోదవుతుంది. సిటీ ఆర్డినరీ బస్సుల్లో రెండో స్టేజీ నుంచి కనీస టికెట్ చార్జీ రూ.10 నుంచి రూ. 15కు పెరుగుతుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో రూ. 15 నుంచి రూ. 20కి, మెట్రో డీలక్స్‌లో రూ. 20 నుంచి రూ. 25కు పెరుగుతుంది. జిల్లా ఏసీ కేటగిరీల్లో రూ.10 మేర పెరుగుదల నమోదవుతుంది. చదవండి: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం -
అన్నీ ఇక్కట్లే.. పెంపు తప్పట్లే.. తెలంగాణలో భారీగా ఆర్టీసీ చార్జీల మోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు పెం చేందుకు రంగం సిద్ధమైంది. భారీగా పెరిగిన డీజిల్ ధరలు, కరోనా కష్టాలు, భారీ నష్టాల నేపథ్యంలో భారీ మొత్తంలో చార్జీలు పెంచాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 25 పైసల చొప్పున, మిగతా కేటగిరీ బస్సుల్లో 30 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్వయంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ఈ వివరాలను ప్రకటించడం గమనార్హం. అన్ని అంశాలపై కసరత్తు చేసి.. కొద్దిరోజుల కింద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ దుస్థితిపై చర్చించారు. చార్జీల పెంపు అనివార్య మన్న అభిప్రాయానికి వచ్చారు. సమావేశంలో సీఎం చేసిన సూచనల మేరకు మేరకు చార్జీలపై ఆర్టీసీ కసరత్తు మొదలుపెట్టింది. కేబినెట్ భేటీలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో సీఎం ప్రకటించారు. మూడు రోజుల కింద కేబినెట్ భేటీ జరిగినా.. ఈ అంశంలో స్పష్టత ఇవ్వలేదు. తాజాగా కసరత్తు పూర్తిచేసిన ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనలను సమర్పించింది. సీఎం కేసీఆర్ వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రతిపాదనలకు ఆమోదం వస్తే.. కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. వరుసగా నష్టాలు, సమస్యలతో.. సీఎం కేసీఆర్ 2015లో ఆర్టీసీ కార్మికులకు భారీగా 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. దానితో సంస్థపై వార్షికంగా ఏకంగా రూ.850 కోట్ల భారం పడింది. దానితో ఆ తర్వాతి ఏడాది 2016 జూన్‌లో ఆర్టీసీ చార్జీలను స్వల్పంగా సవరించింది. పల్లెవెలుగులో 30 కిలోమీటర్ల వరకు ఒక రూపాయి, ఆ తర్వాత స్టేజీకి రూ.2 చొప్పున చార్జీలు పెంచారు. సుమారు 5 శాతం ధరలు పెరిగాయి. మిగతా కేటగిరీ బస్సుల్లో 10 శాతం పెంచారు. దానితో సుమారు ఏటా రూ.350 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరింది. తర్వాత 2019 అక్టోబర్‌లో 53 రోజుల సుదీర్ఘ సమ్మె, ఆర్టీసీకి తీవ్ర నష్టాల నేపథ్యంలో చార్జీలు సవరించారు. ఆ ఏడాది డిసెంబర్లో సగటున కిలోమీటర్‌కు 20పైసల చొప్పున పెంచారు. దానితో ఆర్టీసీకి సాలీనా రూ.550 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరింది. వ్యతిరేకత లేదంటూ.. ఇటీవల ఆర్టీసీ అధికారులు సంస్థ పనితీరు, ఇతర అంశాలపై ప్రజల నుంచి ఆన్లైన్లో అభిప్రా యాలు సేకరించారు. అందులో బస్సు చార్జీల పెంపు అంశాన్ని కూడా ప్రస్తావించారు. మెరుగైన వసతులు కల్పించాలని, మరిన్ని బస్సులు తిప్పాలని, సర్వీసుల ఫ్రీక్వెన్సీ పెంచాలని కోరిన ప్రజలు.. చార్జీల పెంపు అంశంపై పెద్దగా అభ్యంతరాలు తెలపలేదని అధికారులు చెప్తున్నారు. సర్వేలో అభిప్రాయాలు వెల్లడించిన వారిలో.. కేవలం 4.3 శాతం మంది మాత్రమే చార్జీల పెంపును వ్యతిరేకించారని అంటున్నారు. భారం ఎక్కువే.. రెండేళ్ల కింద కిలోమీటర్‌కు 20 పైసలు పెంచినప్పుడు ప్రజలపై రూ.550 కోట్ల భారం పడింది. ప్రస్తుత ప్రతిపాదనల మేరకు రూ.685 కోట్లు భారం పడుతుందని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ భారం రూ.850 కోట్లకుపైనే ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 2019లో 100 శాతం ఆక్యుపెన్సీ లెక్కన అంచనా వేశారని.. అందువల్ల వాస్తవంగా పడిన భారం రూ.450 కోట్లలోపేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈసారి కేవలం 65 శాతం ఆక్యుపెన్సీ లెక్కనే అంచనా వేశారని వివరిస్తున్నాయి. ఇక గత రెండేళ్లలో 2 వేల వరకు బస్సులు తగ్గిపోవటంతో.. ఆ మేర అదనపు ఆదాయం తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. ఆయన మరణం తర్వాత 2010 నుంచి 2014 వరకు వరుసగా నాలుగు సార్లు చార్జీలు పెంచారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఏడేళ్లలో చార్జీలు పెంచుతుండటం మూడోసారి కానుంది. డీజిల్ భారం.. కోవిడ్ నష్టాలతో.. కరోనా లాక్డౌన్లు, ప్రయాణాలు తగ్గిపోవడంతో ఆర్టీసీకి భారీగా నష్టాలు వచ్చాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.2,600 కోట్ల వరకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1,440 కోట్ల మేర నష్టం వచ్చినట్టు ఆర్టీసీ చెప్తోంది. మరోవైపు డీజిల్ ధరలు పెరగటంతో.. సంస్థపై రోజుకు రూ.1.8 కోట్ల అదనపు భారం పడింది. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు చార్జీలు పెంచా లని ఆర్టీసీ కొద్దినెలలుగా ప్రభుత్వాన్ని కోరుతోంది. దీనిపై ప్రతిపాదనలు ఇవ్వాలని కొద్దిరోజుల సీఎం సూచించడంతో.. కసరత్తు పూర్తిచేసి తాజాగా మంత్రి పువ్వాడ అజయ్‌కు అందజేసింది. ఆర్టీసీని గాడిన పెట్టేందుకే.. చార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ టికెట్ ఆదాయంపై ఆర్టీసీ మనుగడ ఉంది. కేంద్రం డీజిల్ ధరలు పెంచడంతో ఆర్టీసీపై తీవ్ర భారం పడింది. కరోనా కారణంగా నష్టాలు వస్తున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందాలంటే ఆర్టీసీ మెరుగుపడాలి. సంస్థ మనుగడ కోసం చార్జీలు పెంచక తప్పని పరిస్థితి. ఇటీవల ఆర్టీసీ నిర్వహించిన సర్వేలో కూడా చార్జీల పెంపుపై ప్రయాణికులు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి సమర్పించి ఆయన అనుమతితో తర్వాతి చర్యలు తీసుకుంటాం. – మంత్రి పువ్వాడ భారీగానే మోత రవాణా మంత్రి చెప్పిన మేరకు చార్జీలు పెంచితే.. సగటున ఏటా రూ.685 కోట్ల ఆదాయం అదనంగా సమకూరనుంది. కానీ చార్జీల సవరణ, సమీప ధరలకు సర్దుబాటు వంటివాటితో రూ.850 కోట్లకుపైనే భారం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏడేళ్లలో మూడోసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆర్టీసీ చార్జీలు పెంచనుండటం ఇది మూడోసారి. మొదట 2016 జూన్‌లో స్వల్పంగా చార్జీలను సవరించారు. సగటున ఆర్డినరీ పల్లెవెలుగు బస్సుల్లో 5 శాతం, మిగతా కేటగిరీల్లో 10 శాతం చార్జీలు పెరిగాయి. తర్వాత 2019 డిసెంబర్లో అన్ని బస్సుల్లో సగటున కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచారు. ఈసారి పెంపు కాస్త ఎక్కువగా ఉండనుంది. సీఎం అనుమతి వచ్చాకే..! సాధారణంగా ఎప్పుడైనా సీఎం అనుమతి వచ్చాకే ఆర్టీసీ చార్జీల పెంపు వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. కానీ ఈసారి సీఎంకు ప్రతిపాదనలు పంపాల్సి ఉందని చెప్తూనే.. మంత్రి అధికారికంగా వివరాలు వెల్లడించారు. చార్జీల పెంపుపై ప్రజలు ఎలా స్పందిస్తారు, వివిధ వర్గాల అభిప్రాయం ఏమిటన్నది తెలుసుకునేందుకే ఇలా చేశారన్న భావన వ్యక్తమవుతోంది. -
సిటీ ఏసీ బస్సు చార్జీల తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగర ప్రయాణికుల కు ‘చల్లటి’ ప్రయాణాన్ని అందించేందుకు ప్రారం భించిన ఏసీ మెట్రో లగ్జరీ బస్సుల చార్జీలను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే వాటి టికెట్ ధరలను ఎంతమేర తగ్గించాలనే విషయంలో అధికారులు కసరత్తు పూర్తి చేశారు. తుది ఆమోదం కోసం ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మకు పంపారు. ఆయ న ఆమోదం రాగానే కొత్త చార్జీలు అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 1 నుంచి సిటీ ప్రయాణికులకు కొత్త సంవత్సరం కానుకగా అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నగరంలో ఈ కేటగిరీకి సంబంధించి 80 బస్సులు తిరుగుతున్నాయి. వాటిని వోల్వో కంపెనీ నుంచి ఐదేళ్ల కింద కొనుగోలు చేశారు. ఉప్పల్ నుంచి వేవ్‌రాక్, లింగంపల్లి నుంచి ఎల్బీనగర్, లింగంపల్లి నుంచి దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్ నుంచి విమానాశ్రయం, సికింద్రాబాద్ నుంచి ఎల్బీనగర్.. ఇలా తిప్పుతున్నారు. ఎంత తగ్గిస్తారో..?! ఏసీ బస్సుల్లో ప్రస్తుతం లింగంపల్లి నుంచి ఎల్బీనగర్కు టికెట్ చార్జీ రూ.110గా ఉంది. అదే లింగంపల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు రూ.80గా ఉంది. ఉప్పల్ నుంచి వేవ్‌రాక్‌కు కూడా అంతే వసూలు చేస్తున్నారు. మెట్రో రైలు కంటే ఇది చాలా ఎక్కువ. దీంతో బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. ఇప్పుడు రూ.110గా ఉన్న టికెట్ ధరను రూ.75కు, రూ.80గా ఉన్న చార్జీని రూ.50కి తగ్గించబోతున్నట్లు సమాచారం. కనిష్ట టికెట్ ధర రూ.20 అలాగే కొనసాగిస్తూ, మూడు స్టాప్ల తర్వాత చార్జీలను సవరించనున్నట్లు సమాచారం. దీంతో కొన్ని స్టాపులకు మెట్రో డీలక్స్ బస్సు సర్వీసు కంటే రూ.5 చార్జీ మాత్రమే ఎక్కువగా ఉండబోతోంది. దీంతో ప్రయాణికులు ఈ బస్సుల వైపు మళ్లే అవకాశం ఉంటుందనేది ఆర్టీసీ ఆలోచన. -
చార్జీలు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్టీసీ.. ఊపిరి పీల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సమస్యల నుంచి కాస్తయినా బయటపడేందుకు మళ్లీ టికెట్ల ధరలు పెంచాలని యోచిస్తోంది. దాదాపు రూ.3,250 కోట్ల నష్టాల్లో ఉన్న సంస్థ జీతాలు చెల్లించేందుకు కూడా శక్తి లేక అంతర్గత అభివృద్ధి పనులకు దాదాపు ఫుల్స్టాప్ పెట్టేసింది. కచ్చితంగా చేయాల్సిన పనులకు నిధులు లేక చివరకు సిబ్బంది నుంచి చందాలు వసూలు చేసుకోవాల్సిన దుస్థితిలోకి చేరింది. ఇలా అయితే ప్రగతి రథం ఇక ముందుకు కదలటం సాధ్యం కాదని తేల్చిన అధికారులు ఇక టికెట్ చార్జీల పెంపే శరణ్యమని తేల్చారు. ఇదే విషయాన్ని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ ముందుంచారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, అది ముగియగానే ప్రభుత్వానికి ప్రతిపాదిద్దామని ఆయన పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. టికెట్ ధరలను 15% మేర పెంచాలని, ఇంతకు ఏమాత్రం తగ్గకూడదనే ప్రతిపాదనల్లో చేర్చారు. దీనికి ప్రభుత్వం పచ్చజెండా ఊపితే.. దాదాపు మూడేళ్ల తర్వాత టికెట్ ధరలకు రెక్కలొచ్చినట్టవుతుంది. అధికారులు ప్రతిపాదించినట్టుగా 15% మేర టికెట్ ధరలు పెరిగితే జనంపై రూ.550 కోట్ల వార్షిక భారం పడనుంది. 30శాతం పెంచితేనే! ఇటీవల ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ సమీక్ష నిర్వహించారు. సంస్థ ఆర్థిక పరిస్థితిపై ఇందులో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికారులు ముక్తకంఠంతో టికెట్ చార్జీల పెంపు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయం అందకపోతుండటం, గతంలో పెంచిన జీతాల భారాన్ని సంస్థ మోయలేకపోతుండటం, వేతన సవరణలో భాగంగా కొత్తగా ప్రకటించిన ఐఆర్ భారం మీద పడటంతో సంస్థ కుదేలైందని పేర్కొన్నారు. 2016లో చార్జీలను 10% పెంచిన తర్వాత మళ్లీ సవరించలేదని, అదే సమయంలో డీజిల్ ధరల భారం మాత్రం 37.5% మేర పెరిగిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల ముగిసేనాటికి నష్టాలు రూ.687 కోట్లకు చేరుకున్నాయని, మార్చి నెల నష్టాలను జోడిస్తే అది రూ.750 కోట్లను చేరుకుంటుందని వెల్లడించారు. ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయం నామమాత్రంగానే ఉండటం, నష్టాలు మాత్రం భారీగా పెరుగుతుండటంతో ఛార్జీలు పెంచక తప్పని స్థితి నెలకొందన్నారు. వీటిని పరిశీలించిన ఎండీ.. ప్రభుత్వానికి నివేదిస్తానని, సమగ్ర వివరాలతో కూడిన నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రస్తుతం నష్టాలు 3వేల కోట్లను మించిపోవటం, 2016 నుంచి ఇప్పటి వరకు డీజిల్ భారం 37.50% పెరిగినందున బస్సు చార్జీలను కూడా 30% పెంచితేనే వెసులుబాటు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సగటున ఆర్టీసీ సాలీనా రూ.700 కోట్లకు పైగా నష్టం నమోదవుతోందని, త్వరలో ఉద్యోగుల వేతనాలు సవరించాల్సి ఉండటం, గత వేతన సవరణ బకాయిలు చెల్లించాల్సి ఉన్నందున వార్షికంగా వేయి కోట్ల ఆదాయం పెరగాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇది జరగాలంటే చార్జీలను 30 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఇంతపెద్దమొత్తం పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఎండీ పేర్కొన్నట్టు సమాచారం. దీంతో కనీసం 15 శాతానికి తగ్గకుండా టికెట్ ధరలను సవరించాలని అధికారులు కోరారు. అప్పుడు వార్షికాదాయం రూ.500 కోట్లు పెరుగుతుందని, అప్పటికీ రూ.200 కోట్ల నష్టాలు తప్పవని పేర్కొన్నారు. దీంతో విషయాన్ని ప్రభుత్వానికి నివేదిద్దామని, ఎన్నికల కోడ్ తర్వాత ప్రతిపాదన పంపుతానని, అక్కడి నుంచి వచ్చే ఆదేశం మేరకు ఏర్పాట్లు చేద్దామని ఎండీ పేర్కొన్నట్టు సమాచారం. ఇదీ పరిస్థితి! ఉమ్మడి రాష్ట్రంలో 2013లో టికెట్ చార్జీలు పెరిగాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వెంటనే చార్జీలు పెంచకుండా ప్రభుత్వం జనంపై భారం మోపకుండా జాగ్రత్తపడింది. 2015లో ఏపీలో 10% టికెట్ ధరలు పెరిగినా ఇక్కడ పెంచలేదు. 2016లో తప్పనిసరి పరిస్థితుల్లోనేనంటూ ప్రభుత్వం 10% ధరలు పెంచింది. దానివల్ల జనంపై సాలీనా రూ.286 కోట్ల భారం పడింది. ప్రస్తుతం ఆర్టీసీ లెక్కల ప్రకారం రోజుకు రూ.9.5 కోట్లు ఆదాయం సమకూరుతుండగా.. ఖర్చు మాత్రం రూ.11.50 కోట్లుగా ఉంటోంది. అంటే రోజుకు రూ.2 కోట్ల నష్టం వాటిల్లుతోంది. తెలంగాణ వచ్చాక ఓ ఏడాదిపాటు కరీంనగర్, హైదరాబాద్ జోన్ల పరిధిలో లాభాలు నమోదయ్యాయి. కానీ ఆ తర్వాత ఆర్టీసీని పట్టించుకునేవారు లేక ఆ ఉత్సాహం కొరవడింది. దాదాపు మూడేళ్లపాటు.. రిటైర్ట్ అధికారి ఎండీగా ఉండటం, ఆ తర్వాత ఇన్‌చార్జులతోనే సంస్థను నడపడంతో ఆర్టీసీని గట్టెక్కించేందుకు వినూత్నంగా చర్యలు తీసుకోలేకపోయారు. 2015లో సీఎం ఆర్టీసీని సమీక్షించి ఇన్నోవేటివ్‌గా ఆలోచించాలంటూ చేసిన ఆదేశాన్ని పట్టించుకోలేదు. కొత్త బస్సులు కొనేందుకు డబ్బులు లేక 2వేల డొక్కు బస్సులే దిక్కవుతున్నాయి. ఇప్పటికీ వెయ్యి గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవటం గమనార్హం. ఎక్కువ మైలేజీ (కేఎంపీఎల్) విషయంలో దేశంలోనే తెలంగాణ ఆర్టీసీ ఉత్తమ రవాణా సంస్థగా ఉంది. అది అధమంగా ఉండి ఉంటే డీజిల్ ఖర్చు మరింత ఎక్కువగా ఉండేది. గతంలో మంత్రుల నోటా! ఆర్టీసీ ఆర్థికస్థితిని బట్టి టికెట్ చార్జీల ధరలను సవరించాల్సి ఉంటుందని గతం లో పలుమార్లు మంత్రులు పేర్కొన్నారు. 2016 లో చార్జీలు సవరించేప్పుడు కూడా ఇదే విషయా న్ని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పెం పు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2016 లో 10% టికెట్ ధరలను పెంచినా స్థూలంగా ఆర్టీసీకి 8% మేర మాత్రమే ఆదాయం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. -
చార్జీల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం
విద్యుత్‌సౌధ వద్ద నేతల ధర్నా హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, బస్సు చార్జీలను పెంచడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. శనివారం విద్యుత్‌సౌధ ఎదుట పార్టీ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్...నాంపల్లి చౌరస్తాలో అంజన్‌కుమార్‌యాదవ్, మల్లు రవి, శ్రీధర్‌బాబు తదితరులతో పాటు భారీ ఎత్తున కార్యకర్తలు బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పొన్నాల లక్ష్మయ్య, సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ... ప్రజావ్యతిరేక ప్రభుత్వం పతనం కాక తప్పదన్నారు. పన్నుల భారం వేయమని చెప్పిన సీఎం, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గాంధీభవన్ నుంచి ర్యాలీ... చార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ నుంచి తాజ్ ఐల్యాండ్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. సీనియర్ నాయకులు శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సుమారు గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ స్టేషన్‌కు తరలించారు. -
త్వరలో ఆర్టీసీ ఛార్జీల మోత!
-
త్వరలో ఆర్టీసీ ఛార్జీల మోత!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ప్రయాణికులపై భారం మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. బస్సు ఛార్జీలను10 నుంచి 15 శాతం వరకు పెంచే అవకాశముంది. ప్రభుత్వానికి ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్టు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోందని సాంబశివరావు తెలిపారు. నష్టాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బయటపడాలంటే బస్సు ఛార్జీలు పెంచడం మినహా మరో గత్యంతరం లేదని చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి విజయవాడ నుంచే ఏపీఎస్ ఆర్టీసీ పనిచేస్తుందని సాంబశివరావు చెప్పారు. -
బస్సు చార్జీలు పెరగవు
- రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సాక్షి, బెంగళూరు: కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీల్లో ఇప్పట్లో బస్‌చార్జీల పెంపు ఉండబోదని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డివెల్లడించారు. డీజిల్ ధరలు పెరిగినప్పటికీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చార్జీలను పెంచలేదని వివరించారు. ఈ నిర్ణయం ద్వారా రోడ్డు రవాణా సంస్థపై రూ.396కోట్ల భారం పడనుందని రామలింగారెడ్డి పేర్కొన్నారు. గురువారమిక్కడ తనను కలిసిన విలేకరులతో రామలింగారెడ్డి మాట్లాడారు. ఆరు నెలల క్రితం కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ చార్జీలను పెంచిన నేపథ్యంలో నష్టాలు కాస్తంత తగ్గాయని తెలిపారు. బీఎంటీసీలో ఖాళీగా ఉన్న 700 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రోడ్డు రవాణా సంస్థలోని ఉద్యోగుల బదీలలకు సంబంధించి మొట్టమొదటి సారిగా మార్గదర్శకాలను రూపొందించినట్లు వెల్లడించా రు. ప్రస్తుతం బీఎంటీసీతోపాటు కేఎస్ఆర్టీసీ ఇతర విభాగాలతో కలిపి రోడ్డు రవాణా సంస్థలో మొత్తం 1.2లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఉద్యోగుల బదిలీల్లో పారదర్శకతను పాటించేందుకు గాను ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి 30 లోపు ఉద్యోగుల బదిలీల ప్రకియను పూర్తి చేయనున్నట్లు మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. -
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుడు విలవిల
కూర‘గాయాలే’.. కూరగాయల ధరలు భగ్గుమన్నాయి. వీటిని కొనాలంటేనే ప్రజలు బెంబేలెత్తారు. కిలో కూరగాయలకు బదులు పావుకిలోతోనే సరిపెట్టుకున్న కుటుంబాలున్నాయంటే ధరలు ఏవిధంగా ఎగబాకాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో కూరగాయల కంటే చికెన్ కొనుగోలు సులువు అనిపించింది. సంవత్సరం మొదట్లో కిలోకు రూ 15 ఉన్న టమాట సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రూ 60కి తాకింది. వంకాయ రూ 15 నుంచి రూ 40, బెండ రూ 20 నుంచి రూ 40, మిర్చి రూ 20 నుంచి రూ 60, బీర రూ 25 నుంచి రూ 40, క్యాబేజీ రూ 20 నుంచి రూ 35, దోస రూ 10 నుంచి రూ 35కి పెరిగాయి. ఇంతటి భారీ స్థాయిలో ధరలు పెరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. మధ్యతరగతి కుంటుంబాల మాటేమోగాని.. సామాన్యుల కుటుంబాలు విలవిలలాడాయి. అయితే ఏడాది చివర డిసెంబర్లో కొంతమేర ధరలు క్షీణించాయి. అమ్మో ఉల్లి.. ఉల్లి.. అంటేనే జనాలు జంకారు. కోస్తే నీరొచ్చే ఉల్లి... అసలు ధర వింటే కంటతడి పెట్టించింది. రాష్ట్రంలో అకాల వర్షాలు, తుపానుల ప్రభావంతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో మహారాష్ట్రలోని షోలాపూర్, గుజరాత్, కర్నూలు ప్రాంతాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు. దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ఉల్లి రేటు మూడింతలైంది. మరోవైపు ఉద్యమ సెగలతో రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. దీంతో వ్యాపారులు కూడా తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు రూ 30 నుంచి ఒక దశలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రూ 70 వరకు ఉల్లిధర పలికింది. పెట్రో బాంబ్... ఏడాది పొడవునా పెట్రో బాంబు పేలుతూనే ఉంది. ప్రభుత్వం పలుమార్లు ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. జిల్లాలో ద్విచక్ర వాహనాలు 1.86 లక్షలు, 17 వేల కార్లు, 21 వేల ఆటోలు, మరో 9 వేల ఇతర వాహనాలు ఉన్నాయి. 170 బంకుల ద్వారా నిత్యం 7 లక్షల లీటర్ల డీజిల్, 2 లక్షల లీటర్ల పెట్రోలు అమ్ముడవుతోంది. పెట్రోలు లీటర్‌పై ఫిబ్రవరిలో రూ 1.42, జూన్‌లో రూ 2, ఇదే నెలలో మరోసారి రూ 1.82, జూలైలో రూ 1.55, ఆగస్టులో 70 పైసలు, సెప్టెంబర్‌లో ఏకంగా రూ 2.35 పెంచేసింది. అదేనెలలో మరోసారి రూ 1.65లు బాదింది. తాజాగా ఈనెల 20వ తేదీన మరో 41 పైసలు వడ్డించింది. అడపాదడపా స్వలంగా తగ్గించినా అందుకు రెట్టింపుగానే ధరల బాజా మోగించింది. ఏడాది మొదట్లో సుమారు రూ 70 ఉన్న లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ 77.60కు చేరుకుంది. అంటే ఒక్క ఏడాదిలోనే ఒక్కో లీటరుపై వినియోగదారులు రూ 7.60 అదనపు భారం మోశారన్నమాట. ఈ లెక్కన ఏడాదికి రూ 54 కోట్ల భారం ప్రజలపై సర్కారు మోపింది. జనవరిలో లీటరు డీజిల్ ధర రూ 50.23 ఉండగా ప్రస్తుతం రూ. 58.60కు చేరుకుంది. రూ 8.37 అదనంగా పెరగడంతో రవాణా వ్యవస్థపై పెనుభారం పడింది. ఏడాదికి రూ 210 కోట్ల భారం వినియోగదారులకు వడ్డించింది. ఈ పెంపుతో రవాణా చార్జీలు ఎగబాకడంతో పరోక్షంగా సామాన్యుడు విలవిలలాడాడు. గ్యాస్ మంట.. జిల్లాలో మూడు ఆయిల్ కంపెనీల పరిధిలో 6.54 లక్షల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ‘ఆధార్’ తప్పనిసరి చేసింది. అయితే అందరికీ పూర్తిస్థాయిలో ఆధార్ లేకపోవడంతో మరో మూడు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే. గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్, బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకున్న వినియోగదారులు పూర్తిస్థాయిలో గ్యాస్ ధర చెల్లిస్తున్నారు. వినియోగదారుడు సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ బ్యాంకులో జమవుతోంది. ప్రస్తుతం సబ్సిడీ కాకుండా సిలిండర్ ధర రూ 1,107. గ్యాస్ ధర రూ 420 పోను రూ 687 సబ్సిడీ బ్యాంకులో జమ చేయాల్సి ఉంది. రూ 50లను గతంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరించింది. కనెక్షన్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసిన వినియోగదారులకు ఈ రూ 50 ల సబ్సిడీని ఎత్తివేసింది. మిగిలిన రూ 637 మాత్రమే ఖాతాలో వేస్తోంది. ఈ లెక్కన జిల్లాలో 2.50 లక్షల మంది వినియోగదారులపై మూడు నెలలుగా భారం పడుతూనే ఉంది. ఈ లెక్కన రూ 3.75 కోట్ల భారం భరించారు. కష్టాల‘పాలు’.... ఈ ఏడాది ప్రతి నిత్యావసర సరుకు ధర ఎగబాకింది. సగటున ప్రతి వస్తువు ధర 20 నుంచి 50 శాతం వరకు పెరిగిందని అంచనా. లీటరు పాల ధర మూడు రూపాయల చొప్పున పెంచారు. ఏడాది ఆరంభంలో పాల పాకెట్ లీటర్ సుమారు రూ 33 ఉండగా.. ఏకంగా రూ 36 నుంచి రూ 38కి పెరిగింది. సరాసరి రోజుకు ప్రైవేటు డెయిరీలలో 2.15 లక్షల లీటర్లు, గ్రామాల్లో, పట్టణాల్లో విడిగా 6.50 లక్షల లీటర్లు అమ్ముతున్నారు. మొత్తం 8.65 లక్షల లీటర్ల పాలను జిల్లా ప్రజలు నిత్యం వినియోగిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ 25.95 లక్షలు, నెలకు రూ 7.78 కోట్లు, ఏడాదికి రూ 93.42 కోట్ల భారం ప్రజలపై పడింది. బస్సు ప్రయాణం భారం.. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ కూడా బస్‌చార్జీలు పెంచేసింది. రెండు సార్లు చార్జీలు పెంచి ప్రయాణికుల నెత్తిన రుద్దారు. చివరికి విద్యార్థుల బస్ పాస్ చార్జీలూ పెంచేసింది. 2012 సెప్టెంబర్ 24న సాధారణ చార్జీలను 9.5 శాతం పెంచారు. ఆర్డినరీ( పల్లెవెలుగు) బస్‌లకు కిలోమీటర్‌కు 5 పైసలు, ఎక్స్‌ప్రెస్‌కు, డీలక్స్‌కు 10 పైసలు, సూపర్ లగ్జరీకి 12 పైసలు పెంచి చుక్కలు చూపించింది. జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 739 సర్వీలు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. చార్జీల పెంపుతో ప్రయాణికులపై *రెండు కోట్ల భారం పడింది. సర్‌ర్‌ర్... షాక్ విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలకు సర్కారు షాకిచ్చింది. మార్చిలో చార్జీలను సగటున 15 శాతం పెంచి ఏప్రిల్ నుంచి అమలులోకి తెచ్చింది. సర్‌చార్జీల పేరుతో పెనుభారం మోపింది. పాన్‌డబ్బా నుంచి మొదలుకుని పరిశ్రమల వరకు అన్ని కేటగిరీల వినియోగదారులకూ వడ్డించింది. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకునే కుటుంబాలను సైతం వదిలిపెట్టలేదు. ఈ ఏడాది జిల్లా ప్రజలపై విద్యుత్ సర్‌చార్జీల రూపంలో అదనంగా సుమారు రూ 130 కోట్ల భారం పడిందని అంచనా. ఓ వైపు విద్యుత్ కోత లు పెడుతూనే.. మరోవైపు బిల్లుల రూపంలో వాతలు పెట్టింది. గత వేసవిలో చిన్న చిన్న పరిశ్రమలు అధిక సంఖ్యలో మూతబడ్డాయి. ఏప్రిల్ లో చార్జీలు పెంచి పదిశాతం అదనపు ఆదాయాన్ని రాబట్టేందుకు కార్యాచరణను అమలు చేసింది. ఇందులో భాగంగా గృ హ వినియోగ విద్యుత్‌కు యూనిట్‌పై 50 పైసల నుంచి రూ 1 వరకు పెంచింది. ఇంకా ఎల్టీ వినియోగంపై 58 పైసలు, హెచ్‌టీ వినియోగదారులపై రూ 1.12 యూనిట్‌పై అదనపు భారాన్ని మోపింది. పప్పు, బియ్యం ధర పైపైకి.. పప్పు, బియ్యం ధరలు ఈ ఏడాది పాడవునా పెరుగుతూనే వచ్చాయి. పెసరపప్పు రూ 70 నుంచి రూ 92, పల్లి నూనె రూ 90 నుంచి రూ 110 పలికింది. బియ్యం ధరలు అడ్డగోలుగా ఎగబాకాయి. సన్న బియ్యం ధరలైతే ఓ మోస్తరు సంపాదన ఉన్నవారు కూడా కొనలేనంతగా పెరిగాయి. బీపీటీ రకం రూ 30 నుంచి ఏకంగా రూ 37కి చేరింది. ఫలితంగా మధ్యతరగతివారికి కుటుంబం గడవడం కష్టంగా మారింది. అన్నదాత అతలాకుతలం.. పుడమి బిడ్డలపై ప్రకృతి కత్తి కట్టింది. ఖరీఫ్‌లో వచ్చిన పై-లీన్ తుపాను జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బకొట్టింది. తీరని నష్టాన్ని మిగిల్చింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐదు రోజుల పాటు ఏకధాటిగా వర్షం విరిసిన పంజాకు అన్నదాత విలవిలలాడిపోయాడు. దిగుబడి చేతికి వచ్చే దశలో పంటలన్నీ కొట్టుకుపోయాయి. పొలాలు జలసంద్రమయ్యాయి. 3.80 లక్షల ఎకరాల్లో పత్తి, 91,865 ఎకరాల్లో వరి పైరు పనికిరాకుండా పోయింది. అంతేగాక 15 వేల ఎకరాల మిరప, 5060 ఎకరాల కంది, 1035 ఎకరాల వేరుశనగ, 930 ఎకరాల మొక్కజొన్న, 256 ఎకరాల ఆముదం పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. దాదాపు రూ 900 కోట్ల మేర రైతులు నష్టపోయారని గుర్తించారు. అయితే పూర్తి స్థాయి సర్వే చేపట్టిన తర్వాత అధికారులు వెల్లడించిన వివరాలను చూసి రైతులు నిర్ఘాంతపోయారు. 50 శాతం, ఆపై పంట నష్టపోయిన వాటినే పరిగణనలోకి తీసుకోవడం శోచనీయం. జిల్లాలో పత్తి, వరి, ఇతర అన్ని పంటలు కలిపి 1.20 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. మొత్తం 1,35,603 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. వీరిని ఆదుకునేందుకు రూ 54.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వానికి నివేదిక పంపడం గమనార్హం. భారీ వర్షాల కారణంగా 15 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. బాధితుల్లో 95 శాతం పేదలే ఉన్నారు. మొత్తం రూ 60 కోట్ల నష్టం సంభవించిందని అధికారులు లెక్కలుగట్టారు. దీనికితోడు మత్స్య కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోయారు. -
భారీగా ఆర్టీసీ చార్జీల పెంపు
* నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి.. ప్రజలపై 600 కోట్ల మోత * కి.మీ.కి 4 -20 పైసల వరకు పెంపు * 9.5% వరకూ పెరిగిన టికెట్ల ధరలు * పల్లె వెలుగు బస్సులనూ వదల్లేదు * కనీస చార్జీలు యథాతథం.. రెండో స్టేజీ ప్రయాణానికి భారీగా వడ్డన * బస్‌పాస్‌ల ధరలూ పెంపు.. * నాలుగేళ్లలో 60% పెరిగిన చార్జీలు సాక్షి, హైదరాబాద్: సామాన్యుడి జేబుకు ప్రభుత్వం మళ్లీ చిల్లు పెట్టింది. ఇప్పటికే ధరల పెరుగుదలతో నడ్డి విరిగిన సగటు జీవిపై ఆర్టీసీ బస్సు చార్జీల మోత మోగించింది. అన్నిరకాల బస్సు సర్వీసుల్లో కలిపి సగటున 9.5 శాతం మేర టికెట్ల ధరలు పెంచేసింది. పేదలకు దిక్కయిన పల్లె వెలుగు దగ్గరి నుంచి లగ్జరీ బస్సుల దాకా భారీగా వడ్డించింది. కనీస చార్జీని పెంచలేదంటూనే.. దొడ్డిదారిన దోచుకోవడానికి రంగం సిద్ధం చేసింది. పెంచిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో ఇటీవలి ఉద్యమాల కారణంగా ఏర్పడ్డ నష్టాన్ని పూడ్చుకునేందుకు చార్జీలను పెంచాలన్న ఆర్టీసీ ప్రతిపాదనలకు ప్రభుత్వం సోమవారం పచ్చజెండా ఊపింది. ఆర్టీసీ ప్రతిపాదించిన స్థాయిలోనే పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో ప్రజలపై ఏటా రూ. 600 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా. అయితే, నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించడానికి ఎన్నో మార్గాలుండగా.. కిరణ్ ప్రభుత్వం చార్జీలు పెంచడానికే నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ నుంచి వసూలు చేస్తున్న పన్నులను మాఫీ చేయడం ద్వారానో, తాత్కాలిక విరామం ప్రకటించటం ద్వారా నో.. ప్రజలపై భారం పడకుండా చూడాల్సిన ప్రభుత్వం.. ప్రజల నెత్తిన భారం వేయడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెంపు ఇలా.. ప్రతి కిలోమీటరు దూరానికి పల్లె వెలుగు బస్సుల్లో 4 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లో 7, డీలక్స్‌లో 9, సూపర్ లగ్జరీ బస్సుల్లో 11, ఇంద్రలో 12, గరుడపై 20, గరుడ ప్లస్ బస్సుల్లో 15 పైసల చొప్పున పెంచారు. ఫలితంగా పల్లె వె లుగు బస్సుల్లో ప్రతి కిలోమీటరు ప్రయాణానికి 55 పైసల నుంచి 59 పైసలకు, ఎక్స్‌ప్రెస్‌లో 72 పైసల నుంచి 79 పైసలకు, డీలక్స్‌లో 80 పైసల నుంచి 89 పైసలకు, సూపర్ లగ్జరీలో 94 పైసల నుంచి రూ. 1.05కు, ఇంద్రలో రూ. 1.20 నుంచి రూ.1.32కు, గరుడలో రూ. 1.40 నుంచి రూ. 1.60కు, గరుడ ప్లస్‌లో రూ. 1.50 నుంచి రూ. 1.65కు టికెట్ల ధరలు పెరిగాయి. అత్యంత విలాసవంతమైన వెన్నెల బస్సు చార్జీలను మాత్రం కిలోమీటరుకు రూ. 2.30 గానే ఉంచడం గమనార్హం. కనీస చార్జీ జోలికి వెళ్లకుండా ప్రభుత్వం పేదలపై కొంత కనికరం చూపింది. ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగాకనీస చార్జీ పల్లె వెలుగు బస్సుల్లో రూ. 5, ఎక్స్ప్రెస్ల్లో రూ. 10, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ. 15, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో రూ. 25, వెన్నెల బస్సుల్లో రూ. 50 యధావిధిగా కొనసాగుతాయి. వైఎస్ మరణం తర్వాత ఏటా వడ్డింపే.. ప్రజలపై భారం మోపకుండా పాలన సాగించిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏటా చార్జీలు పెంచుతూపోతోంది. గత నాలుగేళ్లలో ఇప్పటికే నాలుగు సార్లు బస్సుల చార్జీల మోత మోగించిన సర్కారు.. తాజాగా ఐదోసారీ వాత పెట్టింది. తాజా పెంపుతో ఈ నాలుగేళ్లలో ఏకంగా 60 శాతం మేర టికెట్ ధరలు పెరగడం గమనార్హం కనీస చార్జి జోలికి వెళ్లలేదంటూనే.. తాజా చార్జీల సవరణలో కనీస టికెట్ చార్జీ జోలికి వెళ్లలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కానీ పల్లె వెలుగు నుంచి వెన్నెల సర్వీసు వరకూ కనీస చార్జీ తర్వాత ఉండే రెండో అంచె టికెట్ ధరను భారీగా పెంచటం ద్వారా సగటు ప్రయాణికుడిని దొంగదెబ్బ తీసింది. పేదల బస్సు పల్లె వెలుగునే ఉదాహరణగా తీసుకుంటే.. దాని కనీస చార్జీ రూ.5ను అలాగే ఉంచి... రెండో అంచె టికెట్ ధరను రూ. 6 నుంచి రూ. 7కు పెంచారు. ఈ లెక్కన కనీస చార్జీకి, రెండో అంచెకు మధ్య రూ. 2 వ్యత్యాసం వస్తోంది. 35 కిలోమీటర్లలోపు దూరానికి ప్రతీ అంచెకు రూ. 1 చొప్పున.. ఆపై ప్రతీ అంచెకు రూ. 2 చొప్పున టికెట్ల ధరలు పెంచారు. ఇలా వెన్నెల మినహా.. అన్ని రకాల సర్వీసుల్లో రెండో అంచె చార్జీల్లో భారీగా వడ్డించారు. మొత్తంగా అన్ని తరగతుల ప్రయాణికుల నుంచి భారీగా పిండుకోవటమే లక్ష్యంగా ఈ పెంపు విధానం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజూ 1.40 కోట్ల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వారిలో గ్రామీణ ప్రాంత సర్వీసుల్లో తిరిగే వారి సంఖ్యే ఎక్కువ. పల్లె వెలుగు, సిటీ బస్సుల్లోనే సగటున 75 లక్షల మంది ప్రయాణిస్తారు. తాజా పెంపు వీరిపై ఎక్కువ ప్రభావం చూపబోతోంది. ఇక సిటీబస్సుల్లో 14 కిలోమీటర్ల వరకు రూ. 1, ఆ తర్వాత దూరం ప్రయాణానికి రూ. 2 చొప్పున పెంచారు. ఇక ఈ పెంపుతో ఏర్పడిన రూపాయిలోపు చిల్లర వ్యత్యాసాన్ని సరిచేసేందుకు టికెట్ల ధరలను.. రూపాయల్లోకి సవరిస్తారు. ఉద్యమాల నష్టాన్ని పూడ్చుకొనేందుకే! రాష్ట్రంలో ఇటీవలి ఉద్యమాల ఫలితంగా ఆర్టీసీకి దాదాపు రూ. 800 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దానిని భర్తీ చేసుకొనేందుకు చార్జీలు పెంచక తప్పదని ప్రతిపాదించారు. అయితే, ఆ నష్టాన్ని భర్తీ చేసుకుని ఆర్టీసీని బయటపడేసేందుకు చార్జీలు పెంచాల్సిన అవసరం లేదని, మరెన్నో మార్గాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం డీజిల్, విడిభాగాల కొనుగోలుపై ఆర్టీసీ వ్యాట్ రూపంలో ఏటా దాదాపు రూ. 700 కోట్లు చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని రీయింబర్స్ చేయటం ద్వారా ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోవచ్చు. దాంతోపాటు మోటారు వాహనాల పన్ను రూపంలో ఆర్టీసీ మరో రూ. 450 కోట్లను చెల్లిస్తోంది. ఆర్టీసీ నష్టాలను పరిగణనలోకి తీసుకున్న నాటి సీఎం వైఎస్ 12 శాతంగా ఉన్న ఆ పన్నును 7 శాతానికి తగ్గించారు. అదే తరహాలో ఆ పన్నును మరికొంత తగ్గించటం ద్వారానో, ఒకటి రెండేళ్ల పాటు పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారానో ఆర్టీసీని ఆదుకోవచ్చు. ఇక బస్‌పాస్‌ల రూపంలో ఇచ్చే రాయితీని రీయింబర్స్ చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పుకొంటున్నా... అందులో ఏయేటికాయేడు ఎగనామం పెడుతూనే ఉంది. ఫలితంగా ఇప్పటికే రూ. 1,000 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించటం ద్వారా కూడా ఆర్టీసీకి చేయూతనిచ్చేందుకు అవకాశముంది. కానీ, కిరణ్ ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ గాలికి వదిలేసి, ప్రజల నడ్డి విరిచేందుకే సిద్ధమైంది. బస్‌పాస్‌ల ధరలూ భగ్గు.. అన్ని రకాల బస్సు చార్జీలతో పాటు బస్సు పాస్‌ల ధరలనూ భారీగా పెంచారు. ఒక్క విద్యార్థులు మినహా మిగతా కేటగిరీలకు చెందిన అన్ని రకాల పాస్‌ల ధరలను సవరించారు. ఎన్జీవో పాస్‌లపైనా వడ్డించారు. సాధారణ ప్రయాణికులకు సంబంధించి... సిటీ ఆర్డినరీ పాస్ ధరను రూ. 650 నుంచి రూ. 700కు, మెట్రో పాస్ రూ. 750 నుంచి రూ. 800కు, మెట్రో డీలక్స్ పాస్ రూ. 850 నుంచి రూ. 900కు, సిటీ శీతల్ పాస్ రూ.1,600 నుంచి రూ. 1,750కి, ఎయిర్‌పోర్టు మెట్రో బస్సు పాస్ ధరను రూ. 950 నుంచి రూ. 1,050కి పెంచింది. అలాగే ఎన్జీవోలకు సంబంధించి.. ఆర్డినరీ పాస్ ధరను రూ. 220 నుంచి రూ. 235కు, మెట్రో పాస్ ధరను రూ. 320 నుంచి రూ. 335కు, మెట్రో డీలక్స్ పాస్‌ను రూ. 420 నుంచి రూ. 435కు, ఎంఎంటీఎస్-ఆర్టీసీ కాంబో పాస్ ధరను రూ. 700 నుంచి రూ. 800కు, ఆర్డినరీ టూ మెట్రో కాంబినేషన్ టికెట్ ధరను రూ. 7 నుంచి రూ. 10కు పెంచారు. చార్జీలు పెంచొద్దు.. ఆర్టీసీకి సబ్సిడీ ఇవ్వాలి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపును వామపక్షాలు, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యులు సతమతమవుతోంటే మళ్లీ ఈ పెంపు ఏమిటని సోమవారం వేర్వేరు ప్రకటనల్లో ప్రశ్నించాయి. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న మాట నిజమే అయినా దానికి చార్జీల పెంపు ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డాయి. సిటీ బస్సుల నుంచి ఏసీ బస్సులదాకా అన్ని సర్వీసుల చార్జీలు పెంచి ప్రభుత్వం పేదల నడ్డివిరిచిందని మండిపడ్డాయి. ఆర్టీసీకి సబ్సిడీ ఇచ్చి నష్టాల నుంచి గట్టెక్కించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చార్జీల పెంపు వల్ల ప్రజలపై ఏటా రూ. 600 కోట్లు భారం పడుతుందని, అదే ప్రైవేటు బస్సుల్ని నియంత్రిస్తే ప్రభుత్వానికి రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని నారాయణ వివరించారు. కాగా, ప్రభుత్వ తప్పిదాలకు ప్రజలెందుకు భారాన్ని మోయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ప్రశ్నించారు. ఈ పెంపును తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ అసమర్థత వల్లే చార్జీలు పెంచాల్సి వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.