నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుడు విలవిల | 2013 roundup of district | Sakshi
Sakshi News home page

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుడు విలవిల

Published Mon, Dec 30 2013 2:53 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM

2013 roundup of district

కూర‘గాయాలే’..
 కూరగాయల ధరలు భగ్గుమన్నాయి. వీటిని కొనాలంటేనే ప్రజలు బెంబేలెత్తారు. కిలో కూరగాయలకు బదులు పావుకిలోతోనే సరిపెట్టుకున్న కుటుంబాలున్నాయంటే ధరలు ఏవిధంగా ఎగబాకాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో కూరగాయల కంటే చికెన్ కొనుగోలు సులువు అనిపించింది. సంవత్సరం మొదట్లో కిలోకు రూ 15 ఉన్న టమాట సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రూ 60కి తాకింది. వంకాయ రూ 15 నుంచి రూ 40, బెండ రూ 20 నుంచి రూ 40, మిర్చి రూ 20 నుంచి రూ 60, బీర రూ 25 నుంచి రూ 40, క్యాబేజీ రూ 20 నుంచి రూ 35, దోస రూ 10 నుంచి రూ 35కి పెరిగాయి. ఇంతటి భారీ స్థాయిలో ధరలు పెరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. మధ్యతరగతి కుంటుంబాల మాటేమోగాని.. సామాన్యుల కుటుంబాలు విలవిలలాడాయి. అయితే ఏడాది చివర డిసెంబర్‌లో కొంతమేర ధరలు క్షీణించాయి.
 
 అమ్మో ఉల్లి..
 ఉల్లి.. అంటేనే జనాలు జంకారు. కోస్తే నీరొచ్చే ఉల్లి... అసలు ధర వింటే కంటతడి పెట్టించింది. రాష్ట్రంలో అకాల వర్షాలు, తుపానుల ప్రభావంతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో మహారాష్ట్రలోని షోలాపూర్, గుజరాత్, కర్నూలు ప్రాంతాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు. దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ఉల్లి రేటు మూడింతలైంది.  మరోవైపు ఉద్యమ సెగలతో రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. దీంతో వ్యాపారులు కూడా తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు రూ 30 నుంచి ఒక దశలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రూ 70 వరకు ఉల్లిధర పలికింది.
 
 పెట్రో బాంబ్...
 ఏడాది పొడవునా పెట్రో బాంబు పేలుతూనే ఉంది. ప్రభుత్వం పలుమార్లు ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. జిల్లాలో ద్విచక్ర వాహనాలు 1.86 లక్షలు, 17 వేల కార్లు, 21 వేల ఆటోలు, మరో 9 వేల ఇతర వాహనాలు ఉన్నాయి. 170 బంకుల ద్వారా నిత్యం 7 లక్షల లీటర్ల డీజిల్, 2 లక్షల లీటర్ల పెట్రోలు అమ్ముడవుతోంది. పెట్రోలు లీటర్‌పై ఫిబ్రవరిలో రూ 1.42, జూన్‌లో రూ 2, ఇదే నెలలో మరోసారి రూ 1.82, జూలైలో రూ 1.55, ఆగస్టులో 70 పైసలు, సెప్టెంబర్‌లో ఏకంగా రూ 2.35 పెంచేసింది. అదేనెలలో మరోసారి రూ 1.65లు బాదింది. తాజాగా ఈనెల 20వ తేదీన మరో 41 పైసలు వడ్డించింది. అడపాదడపా స్వలంగా తగ్గించినా అందుకు రెట్టింపుగానే ధరల బాజా మోగించింది.

ఏడాది మొదట్లో సుమారు రూ 70 ఉన్న లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ 77.60కు చేరుకుంది. అంటే ఒక్క ఏడాదిలోనే ఒక్కో లీటరుపై వినియోగదారులు రూ 7.60 అదనపు భారం మోశారన్నమాట. ఈ లెక్కన ఏడాదికి రూ 54 కోట్ల భారం ప్రజలపై సర్కారు మోపింది. జనవరిలో లీటరు డీజిల్ ధర రూ 50.23 ఉండగా ప్రస్తుతం  రూ. 58.60కు చేరుకుంది. రూ 8.37 అదనంగా పెరగడంతో రవాణా వ్యవస్థపై పెనుభారం పడింది. ఏడాదికి రూ 210 కోట్ల భారం వినియోగదారులకు వడ్డించింది. ఈ పెంపుతో రవాణా చార్జీలు ఎగబాకడంతో పరోక్షంగా సామాన్యుడు విలవిలలాడాడు.
 
 గ్యాస్ మంట..
 జిల్లాలో మూడు ఆయిల్ కంపెనీల పరిధిలో 6.54 లక్షల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ‘ఆధార్’ తప్పనిసరి చేసింది. అయితే అందరికీ పూర్తిస్థాయిలో ఆధార్ లేకపోవడంతో మరో మూడు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే. గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్, బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకున్న వినియోగదారులు పూర్తిస్థాయిలో గ్యాస్ ధర చెల్లిస్తున్నారు.  వినియోగదారుడు సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ బ్యాంకులో జమవుతోంది.

ప్రస్తుతం సబ్సిడీ కాకుండా సిలిండర్ ధర రూ 1,107. గ్యాస్ ధర రూ 420 పోను రూ 687 సబ్సిడీ బ్యాంకులో జమ చేయాల్సి ఉంది. రూ 50లను గతంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరించింది. కనెక్షన్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసిన వినియోగదారులకు ఈ రూ 50 ల సబ్సిడీని ఎత్తివేసింది. మిగిలిన రూ 637 మాత్రమే ఖాతాలో వేస్తోంది. ఈ లెక్కన జిల్లాలో 2.50 లక్షల మంది వినియోగదారులపై మూడు నెలలుగా భారం పడుతూనే ఉంది. ఈ లెక్కన రూ 3.75 కోట్ల భారం భరించారు.
 
 కష్టాల‘పాలు’....
 ఈ ఏడాది ప్రతి నిత్యావసర సరుకు ధర ఎగబాకింది. సగటున ప్రతి వస్తువు ధర 20 నుంచి 50 శాతం వరకు పెరిగిందని అంచనా. లీటరు పాల ధర మూడు రూపాయల చొప్పున పెంచారు. ఏడాది ఆరంభంలో పాల పాకెట్ లీటర్ సుమారు రూ 33 ఉండగా.. ఏకంగా రూ 36 నుంచి రూ 38కి పెరిగింది. సరాసరి రోజుకు ప్రైవేటు డెయిరీలలో 2.15 లక్షల లీటర్లు, గ్రామాల్లో, పట్టణాల్లో విడిగా 6.50 లక్షల లీటర్లు అమ్ముతున్నారు. మొత్తం 8.65 లక్షల లీటర్ల పాలను జిల్లా ప్రజలు నిత్యం వినియోగిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ 25.95 లక్షలు, నెలకు రూ 7.78 కోట్లు, ఏడాదికి రూ 93.42 కోట్ల భారం ప్రజలపై పడింది.
 
 బస్సు ప్రయాణం భారం..
 డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ కూడా బస్‌చార్జీలు పెంచేసింది. రెండు సార్లు చార్జీలు పెంచి ప్రయాణికుల నెత్తిన రుద్దారు. చివరికి విద్యార్థుల బస్ పాస్ చార్జీలూ పెంచేసింది. 2012 సెప్టెంబర్ 24న సాధారణ చార్జీలను 9.5 శాతం పెంచారు.
 ఆర్డినరీ( పల్లెవెలుగు) బస్‌లకు కిలోమీటర్‌కు 5 పైసలు, ఎక్స్‌ప్రెస్‌కు, డీలక్స్‌కు 10 పైసలు, సూపర్ లగ్జరీకి 12 పైసలు పెంచి చుక్కలు చూపించింది. జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 739 సర్వీలు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. చార్జీల పెంపుతో ప్రయాణికులపై *రెండు కోట్ల భారం  పడింది.
 
 సర్‌ర్‌ర్... షాక్
 విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలకు సర్కారు షాకిచ్చింది. మార్చిలో చార్జీలను సగటున 15 శాతం పెంచి ఏప్రిల్ నుంచి అమలులోకి తెచ్చింది. సర్‌చార్జీల పేరుతో పెనుభారం మోపింది. పాన్‌డబ్బా నుంచి మొదలుకుని పరిశ్రమల వరకు అన్ని కేటగిరీల వినియోగదారులకూ వడ్డించింది. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకునే కుటుంబాలను సైతం వదిలిపెట్టలేదు. ఈ ఏడాది జిల్లా ప్రజలపై విద్యుత్ సర్‌చార్జీల రూపంలో అదనంగా సుమారు రూ 130 కోట్ల భారం పడిందని అంచనా.

ఓ వైపు విద్యుత్ కోత లు పెడుతూనే.. మరోవైపు బిల్లుల రూపంలో వాతలు పెట్టింది. గత వేసవిలో చిన్న చిన్న పరిశ్రమలు అధిక సంఖ్యలో మూతబడ్డాయి. ఏప్రిల్ లో చార్జీలు పెంచి పదిశాతం అదనపు ఆదాయాన్ని  రాబట్టేందుకు కార్యాచరణను అమలు చేసింది. ఇందులో భాగంగా గృ హ వినియోగ విద్యుత్‌కు యూనిట్‌పై 50 పైసల నుంచి రూ 1 వరకు పెంచింది. ఇంకా ఎల్‌టీ వినియోగంపై 58 పైసలు, హెచ్‌టీ వినియోగదారులపై రూ 1.12 యూనిట్‌పై అదనపు భారాన్ని మోపింది.
 
 పప్పు, బియ్యం ధర పైపైకి..
 పప్పు, బియ్యం ధరలు ఈ ఏడాది పాడవునా పెరుగుతూనే వచ్చాయి. పెసరపప్పు రూ 70 నుంచి రూ 92, పల్లి నూనె రూ 90 నుంచి రూ 110 పలికింది. బియ్యం ధరలు అడ్డగోలుగా ఎగబాకాయి. సన్న బియ్యం ధరలైతే ఓ మోస్తరు సంపాదన ఉన్నవారు కూడా కొనలేనంతగా పెరిగాయి. బీపీటీ రకం రూ 30 నుంచి ఏకంగా రూ 37కి చేరింది. ఫలితంగా మధ్యతరగతివారికి కుటుంబం గడవడం కష్టంగా మారింది.
 
 అన్నదాత అతలాకుతలం..
 పుడమి బిడ్డలపై ప్రకృతి కత్తి కట్టింది. ఖరీఫ్‌లో వచ్చిన పై-లీన్ తుపాను జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బకొట్టింది. తీరని నష్టాన్ని మిగిల్చింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐదు రోజుల పాటు ఏకధాటిగా వర్షం విరిసిన పంజాకు అన్నదాత విలవిలలాడిపోయాడు. దిగుబడి చేతికి వచ్చే దశలో పంటలన్నీ కొట్టుకుపోయాయి. పొలాలు జలసంద్రమయ్యాయి. 3.80 లక్షల ఎకరాల్లో పత్తి, 91,865 ఎకరాల్లో వరి పైరు పనికిరాకుండా పోయింది. అంతేగాక 15 వేల ఎకరాల మిరప, 5060 ఎకరాల కంది, 1035 ఎకరాల వేరుశనగ, 930 ఎకరాల మొక్కజొన్న, 256 ఎకరాల ఆముదం పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు.

దాదాపు రూ 900 కోట్ల మేర రైతులు నష్టపోయారని గుర్తించారు. అయితే పూర్తి స్థాయి సర్వే చేపట్టిన తర్వాత అధికారులు వెల్లడించిన వివరాలను చూసి రైతులు నిర్ఘాంతపోయారు. 50 శాతం, ఆపై పంట నష్టపోయిన వాటినే పరిగణనలోకి తీసుకోవడం శోచనీయం. జిల్లాలో పత్తి, వరి, ఇతర అన్ని పంటలు కలిపి 1.20 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. మొత్తం 1,35,603 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. వీరిని ఆదుకునేందుకు రూ 54.07 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వానికి నివేదిక పంపడం గమనార్హం. భారీ వర్షాల కారణంగా 15 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. బాధితుల్లో 95 శాతం పేదలే ఉన్నారు. మొత్తం రూ 60 కోట్ల నష్టం సంభవించిందని అధికారులు లెక్కలుగట్టారు. దీనికితోడు మత్స్య కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement