నిప్పుల్లా పప్పులు
కిలోకు రూ.50 పెరుగుదల
జిల్లా ప్రజలపై నెలకు రూ.25కోట్ల భారం
యలమంచిలి : జిల్లాలో పప్పుల ధరలు నిప్పుల్లా మండుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనిరీతిలో వాటి ధరలు నింగిని తాకుతున్నాయి. ఒక పక్క బియ్యం ధరలు పెరుగుతుండగా పప్పుల ధరలు అట్టుడుకుతుండటంతో వినియోగదారులకు దిక్కుతోచడం లేదు. కంది, మినుము, పెసర తదితర రకాల పప్పులు రెండు నెలల ముందు ధరలతో పోలిస్తే కిలోకు రూ.50 వంతున పెరిగాయి. ప్రస్తుతం కిలో కందిపప్పు రూ.140 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. మినప పప్పు రూ.130, పెసర పప్పు రూ.120, శనగపప్పు రూ.70కు పెరిగింది. ఇంత ధరలు ఎప్పుడూ చూడలేదని వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా ప్రజలకు అన్ని రకాల పప్పులు కలిపి నెలకు 60వేల క్వింటాళ్లు వినియోగిస్తుంటారు. కంది, మినప పప్పుల ధరలు కిలోకు రూ.50, పెసరపప్పుకు రూ.40, శనగపప్పుకు రూ.20 వంతున పెరగడం వలన జిల్లా ప్రజలపై నెలకు రూ.25కోట్ల భారం పెరుగుతోంది. ధరలు పెరిగిపోతుండటంతో పప్పుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. సామాన్యులైతే పప్పులను కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు.
నిద్రావస్థలో పర్యవేక్షణ కమిటీ...
నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నప్పుడు వాటిని కట్టడి చేయాల్సిన ‘పర్యవేక్షణ కమిటీ’ నిద్రావస్థలో ఉందనే విమర్శలు ఉంటున్నాయి. నల్లబజారుకు తరలే వస్తువుల నిరోధానికి ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుని దాడులు చేయడానికి చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందుకు విజిలెన్స్, వాణిజ్య పన్నులు, తూనికలు, కొలతల శాఖాధికారులతో టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసి అక్రమ నిల్వలను బయటకు తీయాల్సి ఉంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన కమిటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నందువల్లే అక్రమార్కుల ఆటలు కొనసాగుతున్నాయి. అవసరమైనపుడు ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి సరుకులను దిగుమతి చేసుకుని మార్కెట్లో ధరలను క్రమబద్ధీకరించడానికి వీలుపడుతుంది. ప్రభుత్వం కిలో రూ.50కు కందిపప్పును సరఫరా చేస్తున్నా జిల్లా ప్రజల అవసరాలను తీర్చడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగాలు, పాలకులు పప్పులను తక్షణమే రాయితీ ధరలకు విక్రయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
పెరుగుదలకు ఇదీ కారణం.
దేశంలో పప్పుల ఉత్పత్తి తగ్గడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఉన్న నిల్వలను ముందుగానే వ్యాపారులు నల్లబజారుకు తరలించడంతో పప్పుల లభ్యత తగ్గించి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమ నిల్వలను బయటకు తీయాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.